బాల గేయాలు 5
టేకుమళ్ళ వెంకటప్పయ్య
మనకు ఒక్కో చేతికి ఐదువేళ్ళున్నాయి. ఏ వేలికి ఏ పేరో చిన్నపిల్లలకి నేర్పించడానికి పనికివచ్చే ఒక గేయం. పిల్లలకు చేతివేళ్ళు ఆడిస్తూ ఒక్కొక్క వేలి గురించీ చెప్పేవారు చిన్నప్పుడు పెద్దవాళ్ళు. అలాగే ఒకటి రెండూ అని అంకెలు నేర్పడానికీ ఉపయోగించే వారు పెద్దవాళ్ళు. ఆ ఆటలన్నీ క్రమేణా కనుమరుగవుతున్నా.. భావి తరాల వారికోసం ఆ గేయాలను కాపాడుకోవలసిన బాధ్యత తెలుగు వారికి ఉంది. ఆ గేయం చూద్దాం.
అయిదు వ్రేళ్ళు
చుట్టాలసురభి - బొటన వ్రేలు
కొండేల కొరివి - చూపుడు వ్రేలు
పుట్టు సన్యాసి - మధ్య వ్రేలు
ఉంగరాలభోగి - ఉంగరపు వ్రేలు
పెళ్ళికి పెద్ద - చిటికిన వ్రేలు
తిందాం తిందాం - ఒక వేలు!
ఎట్లా తిందాం - ఒక వేలు
అప్పుచేసి తిందాం - ఒక వేలు
అప్పెట్టా తీరుతుంది - ఒక వేలు
ఉన్నాగదా నేను అన్నింటికీ
పొట్టివాణ్ణి - గట్టివాణ్ణీ - బొటనవేలు!
సంస్కృతంలో అంగుష్టం, తర్జని, మధ్యమం, అనామిక, కనిష్టిక అంటారు. ఈవిధంగా ఆటలాగా నేర్పిస్తే పిల్లలకు సులభంగా గుర్తుండిపోతాయి అని పెద్ద వాళ్ళు తయారు చేసిన గేయం ఇది. చిటికెన వేలికి పక్కన ఉన్న ఉంగరపువేలు అని మనం అంటున్న వేలికి "అనామిక" అని పేరు. పురాణాల ప్రకారం శివుడు ఈ వేలితోనే బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించాడట. అందుకని అది అపవిత్రం అయిపోయింది అని హిందూ పురాణాలు చెపుతున్నాయి. కాబట్టే యజ్ఞాది కార్యక్రమాలలో దీనిని పవిత్ర పరచటానికి దర్భల పవిత్రంని ఈ వేలికి చుడతారు. ఈ వేలు పేరు కూడా ఎత్తకూడదు, అది అశుభం అని హిందువుల విశ్వాసం. పేరు లేనిది కాబట్టి అనామిక అయ్యింది.
అలాగే ఇంకో కధ కూడా ప్రచారం లో ఉంది. మనుషుల చేతి వేళ్లు ఐదింటిలో చిటికెన వేలుకు కనిష్ఠిక అని పేరు. దాని తరువాతి వేలుకు అనామిక అని పేరు రావటానికి ఒక కవి చమత్కారంగా ఒక శ్లోకంలో యిలా సమర్థిస్తున్నాడు.
శ్లో. పురాకవీనాంగణ నాప్రసంగే కనిష్ఠి కాదిష్టిత కాళిదాసః |
ఆద్యాపితత్తుల్యక వేరభావా దనామిసార్థబతీబభూవా||
దీని భావం మనం గమనిస్తే ఏ వస్తువునైనా మనం లెక్కించేటప్పుడు ఎడమ చేతి వేళ్లు చాపి కుడిచేతి చూపుడు వేలుతో ఒకటి, అని ఎడమచేతి చిటికెన వేలు మడిచి, రెండు అని దాని తరువాతి ఉంగరపు వేలును మడిచి క్రమంగా లెక్కపెడతాము. పూర్వకాలమందు కవులను లెక్క పెట్టవలసి వచ్చినప్పుడు కాళిదాసు పేరు మొదట చెప్పి చిటికెన వేలును ముడుస్తూ వచ్చారు. అది మొదలుకొని నేటి వరకు కాళిదాసుతో సమానుడైన కవీశ్వరుడు రెండవవాడు లేకపోవుటచే చిటికెన వేలు తరువాత ఉన్న వేలును మడిచి లెక్క చెప్పుటకు కవి దొరకలేదు. ఆ వేలుకు "నామకుడు" ఎవ్వడూ దొరకలేదు కాబట్టే ఆ వేలుకు "అనామిక" అనే పేరు సార్థకమైనదని ఒక కవి చమత్కారంగా చెప్పాడు.
-0o0-
No comments:
Post a Comment