నాట్యమే ఊపిరి - కళాశ్రీ రుచి గుప్తా - అచ్చంగా తెలుగు

నాట్యమే ఊపిరి - కళాశ్రీ రుచి గుప్తా

Share This

నాట్యమే ఊపిరి - కళాశ్రీ రుచి గుప్తా 

భావరాజు పద్మిని 


సంప్రదాయ ఉత్తరభారత కుటుంబంలో పుట్టింది ఆమె. కూతుర్ని మంచి చదువు చదివించి, ఉన్నతాధికారిణిగా చూడాలన్న తండ్రి కలను తిరస్కరించింది. ఎందుకంటే, నాట్యం ఆమె నరనరాల్లో ప్రవహిస్తోంది. జన్మతః వచ్చిన నాట్యాన్ని వృత్తిగా స్వీకరించి,  నాట్యాభ్యాసంలో తన్ను తాను మరిచిపోయి, కళతో మమేకమైపోయే ఆ అద్భుత నర్తకీమణి - కళాశ్రీ రుచి గుప్తాతో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం...
 మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. 
మాది ఉత్తర భారత దేశానికి చెందిన సంప్రదాయ కుటుంబం. మా నాన్నగారు అడ్వకేట్, మా అమ్మ గృహిణి, కాని ఆమె  భజన పాటలు అద్భుతంగా పాడేవారు.
నాట్యం నేర్చుకోవడం మీరు ఏ వయసులో మొదలుపెట్టారు ? నాట్యం పట్ల ఆసక్తి మీకు ఎలా కలిగింది?
బాల్యంలోనే నేనెప్పుడూ నాట్యం చేస్తూ ఉండేదాన్నని మా అమ్మగారు చెప్పేవారు. ఆ రోజుల్లో DD నేషనల్ లో వచ్చే సత్యం శివం సుందరం ఛానెల్ చూసాకా ఆ అభిరుచి బాగా పెరిగింది. ఆ సమయంలో అందమైన భరతనాట్యం దుస్తులను, ఆభరణాలను ధరించి అద్భుతంగా నాట్యం చేస్తున్న ఒక స్త్రీని నేను టీవీ లో చూసాను. ముఖ్యంగా నాట్యం చేసేవారి  అందమైన భంగిమలను నేను చూసి వెంటనే చేసేదాన్ని, నాకు 4-5 ఏళ్ళ వయసున్నప్పుడే చేసేదాన్ని. డాన్స్, క్రీడలు అంటే నాకు ఎంతో ఇష్టం. ఇదంతా చూసి నా తల్లిదండ్రులు నన్ను దగ్గరలో ఉన్న ‘రుక్మిణి దేవి లలిత కళా కేంద్రానికి’ తీసుకువెళ్ళారు. అదృష్టవశాత్తూ నాకక్కడ అడ్మిషన్ దొరికింది.
మీ విద్యాభ్యాసం ఎంతవరకు కొనసాగింది? ఆ తర్వాత మీరు స్వీకరించిన వృత్తి ఏమిటి?
నేను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నాను. ఇది కాక ఇందిరా కళా విశ్వవిద్యాలయ, ఖైరాగర్ యూనివర్సిటీ నుంచి, భరతనాట్యంలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నాను. భరతనాట్యమే నా ప్రపంచం కనుక, దాన్నే వృత్తిగా స్వీకరించాను.
 మీ దృష్టిలో నాట్యం యొక్క ప్రాధాన్యత ఏమిటి ?
నాట్యం అనేది భాషకు అందని కళ. జీవాత్మను పరమాత్మతో నేరుగా కలిపే కళ. రసం, భావం అనే గంగా ప్రవాహంతో
మీనుంచి ఎంతోమందికి ప్రవహించి, అందరినీ ఒకటిగా కలిపే జీవనవాహిని నాట్యం.
మీ నాట్య గురువులు ఎవరు ? మీ అభిమాన నృత్యకారులు ఎవరు ?
మొదట ప్రాధమిక శిక్షణ తీసుకున్నాకా, నేను శ్రీమతి సుజాత దినేషి గారు, శర్మిష్ఠ మల్లికి గారి వద్ద పందనల్లుర్
పద్ధతిలో నాట్యం నేర్చుకున్నాను. తర్వాత మరింత ప్రగతిని సాధించి గురు డా. సరోజ వైద్యనాధన్ గారి వద్ద నాకున్న మెళకువలకు  మరింత సాన పెట్టుకున్నాను. ఆ తర్వాత బెంగుళూరు వెళ్లి, శ్రీకిరణ్ సర్, సంధ్యా సుబ్రహ్మణ్యం గార్ల వద్ద నాట్యం నేర్చుకున్నాను.
ఈ వృత్తిని స్వీకరించాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు ?
నేను చదువును వదిలేసి, UPSC పరీక్షలను వదిలేసి, నాట్యాన్నే వృత్తిగా స్వీకరించి స్థిరపడడం మా ఇంట్లోని వారికి ఒకింత బాధను కలిగించింది. నన్నూ, నాకు దైవదత్తమైన కళనీ అర్ధం చేసుకుని, ప్రేమించే సరైన జోడీ నాకు లభించలేదు. అందుకే ఒంటరిగా పోరాడుతూ, ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని, పట్టుసడలని సంకల్పబలంతో నా దారిలో నర్తకిగా సాగిపోతున్నాను.
మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
నాకు HRD,భారత ప్రభుత్వం నుంచి సీనియర్ స్కాలర్షిప్ వచ్చింది. సలాం ఢిల్లీ నుంచి రోహిణి గౌరవ పురస్కారం, గణేశ నాట్యాలయ నుంచి కళాశ్రీ పురస్కారం, ఢిల్లీ యూనివర్సిటీ NCWEB నుంచి బెస్ట్ డాన్సర్ అండ్ డైరెక్టర్ అవార్డు లభించాయి. ఢిల్లీ లోని ప్రతిష్టాత్మకమైన DRDO సంస్థ నుంచి రెండు సార్లు అవార్డులు అందుకున్నాను.
థాయిలాండ్ నుంచి బెస్ట్ డాన్సర్ అవార్డును అందుకున్నాను. ఈ మధ్యనే భారత ప్రభుతం వారి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కు చెందిన ‘రూట్స్’ అనే సంస్థ భరతనాట్యంలో నా విశిష్టమైన సేవలకు గాను నన్ను సత్కరించింది. నేను అందుకున్న వాటిలో ఇవి కొన్ని అవార్డులు.
మీ జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన గురించి చెప్పండి.
నేను నాట్యాన్ని వృత్తిగా స్వీకరించడం అనేది నా కుటుంబానికి మర్చిపోలేని అంశం. ఇది చదువును వదిలేసినందుకు మొదట వారిని నిరాశ పరచినా, నాలోని  కళా ప్రతిభను చూసి, వారు ఆశ్చర్యపోయేలా చేసింది.
మీకు స్వంత డాన్స్ స్కూల్ ఏదైనా ఉందా ? నాట్యంలో మీరు ఎవరికైనా శిక్షణ ఇచ్చారా ?
ఢిల్లీ లోపల, వెలుపల ఉన్న ప్రతిష్టాత్మకమైన స్కూల్స్ లో, వివిధ సంస్థల్లో నేను పనిచేస్తూ, నా కళకు ఊతం అందించుకునేందుకు చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నేను నా స్వంత సంస్థ ద్వారా చిన్న పిల్లలకు, యువతకు శిక్షణ ఇచ్చి, వారిని ప్రొఫెషనల్ డాన్సర్ లుగా మార్చాను. ఢిల్లీ లోని రోహిణి లో నీకు ‘కీర్తి నాట్య నికేతన్’ అనే స్వంత సంస్థ ఉంది.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
దైవం ఇచ్చిన ఈ ‘డాన్స్’ అనే అందమైన వరంతో నేను గత 30 ఏళ్ళుగా ఈ రంగంలో నా ప్రయాణం కొనసాగిస్తున్నాను.
ఈ విశాల విశ్వంలోని ప్రకృతితో, అనంత ప్రాణికోటితో, మొత్తం ప్రపంచంతో నన్ను నేను అనుసంధానం చేసుకునే ఈ
నాట్యాన్ని నేను సాధన చేస్తూనే ఉంటాను. ఆ విధంగా నాట్యంతో నా జీవితం కొనసాగించేందుకు తగిన శక్తిని, ప్రజ్ఞను, ఆరోగ్యాన్ని ఇచ్చి  దీవించమని వినాయకుడిని, శివశక్తి అమ్మవారిని ప్రార్ధిస్తున్నాను. కొన ఊపిరి ఉన్నంతవరకూ నాట్యం చెయ్యాలన్నదే నా భవిష్యత్ ప్రణాళిక.
నర్తకి రుచి గుప్తాను క్రింది చిరునామాలో సంప్రదించవచ్చు.
Ruchi Gupta, Artistic Director
Kirti Natya Niketan(R)
H-5/53,Sector-11
Rohini,Delhi-85.
www.ruchikagupta.com
Mobile-9999600584

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నమ్ముకున్న కళను వదలకుండా దీక్షతో ముందుకు సాగిపోతున్న రుచి గుప్తాకు మరిన్ని విజయాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు  సమకూరాలని, మనసారా కోరుకుంటోంది ‘అచ్చంగా తెలుగు’.

ఈమె నాట్యాన్ని క్రింది లింక్ లలో చూడండి.  

No comments:

Post a Comment

Pages