కార్టూనిస్ట్ రామకృష్ణతో ఇంటర్వ్యూ
భావరాజు పద్మిని
నాయనమ్మ, తాతయ్య, నాన్నగారు.. అంతా కవిపండితులయిన కారణంగా ఆయనకు సహజంగానే చిన్నవయసులోనే పద్యకవిత్వం పట్టుబడింది. అలా సమస్యాపూరణలు, పద్యరచన, వచన కవిత్వాలలో పట్టు సాధించారు. డ్రాయింగ్, కార్టూన్స్ వెయ్యడం కూడా ఆయన హాబీలు. ఇక గీత, రాత రెండూ అలవాడ్డాకా, రెంటినీ కలిపి వినూత్నమైన ‘కార్టూన్ పద్యాలు’ అనే ప్రక్రియను సృష్టించారు – కార్టూనిస్ట్ రామకృష్ణ గారు. వీరితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం...
- మీ బాల్యం, కుటుంబ నేపథ్యం గురించి క్లుప్తంగా చెప్పండి.
- మీ ఇంట్లో చిత్రకారులు ఎవరైనా ఉన్నారా?
చిత్రకారులు ఎవరూ లేరండీ. నాయనమ్మ, తాతయ్య, నాన్నగారు.. అంతా కవిపండితులయిన కారణంగా సహజంగానే చిన్నవయసులోనే పద్యకవిత్వం పట్టుబడింది. అలా సమస్యాపూరణలు, పద్యరచన, వచన కవిత్వాలతో కుస్తీ పడుతుండే వాణ్ణి. అప్పుడప్పుడూ కాలేజిలో, బ్యాంక్‌లో మిత్రులతో కలిసి నాటకాలూ వేస్తుండేవాణ్ణి!
- మీరు చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది?
నాకు స్కూల్ రోజులనుంచీ డ్రాయింగ్ అభిరుచి… ఏవో రేఖాచిత్రాలు గీస్తుండేవాణ్ణి. చదువైపోయాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగంలో చేరిన కొత్తలో ఆంధ్రపత్రిక, జ్యోతి, యువ పత్రికలలో బాపు గారి బాణసంచాల్లాంటి కార్టూన్లు చూస్తుండేవాణ్ణి. ఉదాహరణకి కృష్ణాష్టమికనుకుంటా.. ఆయనో కార్టూన్ వేశారు: కృష్ణుడు తలుపు తీసి ఎదురుగా తంబూరాతో నిలబడ్డ స్త్రీమూర్తిని చూసి "మీరా?" అంటాడు. దానికామె "మీరా కాదు స్వామీ, సక్కుబాయిని!" అంటుంది. ఆకట్టుకునే ఆ బొమ్మలు, హావభావాలు, నవ్వొచ్చే క్యాప్షన్లు నన్నెంతగానో ప్రభావితుణ్ణి చేశాయి! అప్పుడే ఈ కార్టూన్ బగ్ కుట్టింది!
- మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు?
నిస్సందేహంగా, ఇన్‌స్పిరేషనిచ్చిన బాపు గారే నాకు గురువు! ఈనాటి ఎందరో ప్రముఖ చిత్రకారుల్లాగానే నేనూ వారి ఏకలవ్య శిష్యుణ్ణే! వారి మాటల్లోనే మాకెన్నో సూచనలు, సలహాలు దొరికేవి! ఆ తరువాతికాలంలో ఆర్కే లక్ష్మణ్, మారియో, గోపులు, సుధీర్‌దార్, ... ఇలా ఎందరెందరో మహానుభావుల రేఖల్ని ఆరాధించాను.
- మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది?
అలా బాపుగారి కార్టూన్లు చూసి బోలెడు ఇన్‌స్పైరైపోయి, ఈ ప్రక్రియేదో బాగుంది, పైగా బొమ్మలు వేసే ఇంటరెస్టు కూడా ఉంది కనుక, ఈ రంగంలో ఎందుకు కృషి చేయకూడదు అనుకున్నా. మన సమాజంలో చాలామంది చదువురానివారు; వచ్చినవాళ్ళలో చాలామందికి చదవటానికి బద్ధకం - ఈ రెండు వర్గాలకూ భావవ్యక్తీకరణ చేయగలిగింది కార్టూన్! మహారచయితలు మరిన్ని పేజీల్లో చెప్పలేనిది, కార్టూనిస్ట్ చిన్న వ్యంగ్యచిత్రం ద్వారా
సూటిగా మెదడుకెక్కేలా చెప్పగలుగుతాడు! వ్యవస్థలోని లోపాలపై మనకుండే అసహనాన్నీ, ఏవగింపునీ కొద్దిపాటి పదునైన గీతలతో కార్టూన్ ద్వారా పాఠకుడికి ఇఫెక్టివ్‌గా తెలియచెప్పొచ్చని అర్థమైంది. సరిగ్గా అదే సమయంలో (1968) ఆంధ్రప్రభవారపత్రికవారు తెలుగుసామెత మీద కార్టూన్ వేసేలా "లోకోక్తి చిత్రిక" కార్టూన్ పోటీ పెట్టారు. ఆ పోటీకి నేను పంపిన నా మొట్టమొదటి కార్టూన్‌కి మొదటి బహుమతి వచ్చింది. ప్రముఖంగా హాఫ్‌పేజీలో అచ్చయిన ఆ మొట్టమొదటి కార్టూన్, ఆ మొదటి బహుమతి - ఇచ్చిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది!

- కార్టూన్లు ఎప్పటినుంచి వేస్తున్నారు? ఈ రంగంలో మీ సుదీర్ఘ ప్రయాణం గురించి చెప్పండి.
కార్టూనిస్టుగా 1968లో మొదలైన నా ఐదు దశాబ్దాల ప్రయాణంలో తెలుగులోని వివిధ దిన, వార, మాస పత్రికలకు పాకెట్ కార్టూన్లు, కామిక్ ఫీచర్లు, బొమ్మలకథలుతో పాటు తమిళ, కన్నడ, హిందీ పత్రికలకు కూడా వేశాను. ఇంగ్లీష్‌లో శంకర్స్ వీక్లీ, కారవాన్, విమన్స్ ఇరా, వైజ్‌క్రాక్, న్యూస్‌టైమ్, యూత్‌టైమ్స్, సన్, వగైరా ప్రముఖ పత్రికలకు చాలా కాలం వేశాను. ముఖ్యంగా నాకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టినవి - 'కారవాన్', 'విమన్స్ ఇరా' లకు దశాబ్దం పైగా వేసిన "హబ్బీ", "రజిత" కలర్ కార్టూన్ ఫీచర్లు! ప్రొఫెసర్ సుఖ్‌బీర్ సింగ్ రాసిన "హ్యూమర్ ఫ్రమ్ హైదరాబాద్" వంటి పుస్తకాలకు చిత్రరచన చేశాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటప్పుడు ఓ దశాబ్దంపాటు బ్యాంక్ హౌస్‌జర్నల్ ఇన్‌ఛార్జి గాను, ప్రతి ఏడాది బ్యాంక్ రూపొందించే తెలుగు క్యాలెండర్‌లో బ్యాంక్ స్కీమ్స్‌పై పబ్లిసిటీ కార్టూన్లు వేయడం చేశాను. అవి ఎంతో మెప్పు పొంది ఇప్పటికీ మిత్రులు వాటిని గుర్తు చేసుకుంటుంటారు! నాగార్జున ఫైనాన్స్ కోసం వేసిన వేమనపద్యాల కార్టూన్‌ఫీచర్ స్వాతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి వీక్లీలలో ఏడాదికి పైగా ప్రచురితమైంది. దీనితోపాటు స్మాల్‌సేవింగ్స్, టెలిఫోన్స్, హిందూస్థాన్ లేటెక్స్‌లకు చేసిన కార్టూన్లు కూడా పుస్తకరూపంలో వెలువడ్డాయి. శాటలైట్‌బేస్డ్ ఇంటరాక్టివ్ లెక్చర్ల కోసం "స్త్రెస్ మేనేజ్‌మెంట్" పై వేసిన మల్టీకలర్ కార్టూన్లు అహమ్మదాబాద్ ఇస్రో స్టూడియోస్ నుండి ప్రసారం అయ్యాయి. ప్రముఖ అంతర్జాతీయ కార్టూనిస్ట్ అబూ అబ్రహాం తాను ఎడిట్ చేసిన పెంగ్విన్ బుక్ "ద ఇండియన్ కార్టూన్స్" లో సుప్రసిద్ధ దేశీయకార్టూనిస్టుల సరసన నాకూ చోటిచ్చారు. నాగార్జున సిమెంట్స్, విష్ణు సిమెంట్స్, సోషల్ ఫారెస్ట్రీ, మిడాస్ మెన్స్‌వేర్, వగైరాలకు కార్టూన్-యాడ్స్ చేశాను. జెమినీ టీవీ, హైదరాబాద్ దూరదర్శన్‌లు నా ఇంటర్వ్యూలు ప్రసారం చేశాయి.
- ఈ మధ్య మీరు హాస్య వ్యంగ్య కార్టూన్ పద్యాలు రాశారు కదా! అసలా ఆలోచన ఎలా కలిగింది?
చరిత్రలో హాస్యానికి, వ్యంగ్యానికి ప్రతీక తెనాలి రామకృష్ణుడు! ఈ రామకృష్ణుడూ తెనాలి వాడే! కనుక, ఆ మహాకవిని మనసులో నిలుపుకుని హాస్యం, వ్యంగ్యం మేళవిస్తూ కార్టూనిస్టు అవతారానికి ముందు గతంలో "రంగ! పాండురంగ! రామలింగ!!" అనే మకుటంతో కొన్ని ఆటవెలది పద్యాలు రాశాను. ఓసారి పెద్దలు బాపు-రమణ గారలకి మాటల సందర్భం లో ఎప్పుడో రాసిన ఈ పద్యాలు కొన్ని వినిపించాను. ఇద్దరూ చాలాచాలా మెచ్చుకున్నారు. ప్రత్యేకించి రమణ గారయితే "ఆరుద్ర ఇంటింటి పద్యాలకి బాపు వేసినట్టుగా, వాటికి చిన్న విజువల్స్ జోడించండి.. మీరెటూ కార్టూనిస్టు కదా.. మరింత బాగుంటాయి" అన్నారు. ఆ ఆలోచన నాకెంతో నచ్చి ఆచరణలో పెట్టాను.
- ఈ రంగాన్ని ఎంచుకున్నాక ఎటువంటి ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు?
నా వృత్తి అయిన ఉద్యోగంలో ఇబ్బందులొస్తాయి కనుక పూర్తిస్థాయి పొలిటికల్ కార్టూన్ల జోలికి వెళ్ళలేదు. కాబట్టి బయటిశక్తుల నుండీ ఏ ఇబ్బందులూ లేవు. ఇక పగలంతా బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ వివిధ భాషల్లోని దేశీయ, అంతర్జాతీయ స్థాయి పత్రికలకి కార్టూన్లు - అందునా రెగ్యులర్ ఫీచర్ కార్టూన్లు - సకాలంలో అందించటానికే ఒడుదుడుకులు! రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళటంలోనే ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చేది.
- మీరు ఎక్కువగా ఎటువంటి కార్టూన్లను ఇష్టపడతారు?
కేవలం హాస్యప్రధానమైన కార్టూన్లే కాక, సమాజం లోని అన్యాయాల్నీ అక్రమాల్నీ వ్యంగ్యంగా ఎత్తిచూపుతూ ఛెళ్ళుమనిపించే కార్టూన్లంటే నాకెక్కువ ఇష్టం. కార్టూన్‌లో సామాజిక ప్రయోజనం ఉండి, చూసేవారికి చురుక్కుమనిపించాలి, ఆలోచింపజేయగలగాలి. అప్పుడే కార్టూన్‌కి సార్ధకత! పురాణంగారన్నట్టు.. కార్టూన్లు ఏనుగు ఘీంకారం లాగా, కుప్పించి ఎగసిన కృష్ణపరమాత్మ చేతిలోని చక్రధ్వనిలాగా ఉండాలి. ఇంటిప్లాను శాంక్షన్ చేయించుకోడానికి వచ్చిన వ్యక్తితో మునిసిపల్ ఉద్యోగి, "మీ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకోవచ్చో, కూడదో ఇప్పుడే ఎలా చెప్పగలను? ముందు మీరు కట్టేసుకోండి, అంతగా రూల్స్ అనుమతించకపోతే, మేమేవచ్చి కట్టిన బిల్డింగ్ కూలగొడతాం; లేదా ఎల్లారెస్ ఎటూ ఉండనే ఉంది!" అంటున్న కార్టూను ఆ శాఖలోని అవినీతికీ, అసమర్ధతకూ అద్దం పడుతుంది కదా! అందుకే కార్టూనిస్ట్ సోషల్ రిఫార్మర్ కావాలంటాను!
1 0. మీరు వేసిన కార్టూన్లలో బాగా పాపులర్ అయిన కార్టూన్ గురించి, దాని నేపథ్యం గురించి చెప్పండి.
సుమారు పాతికేళ్ళనాటి మాట!... బ్యాంక్ స్కీమ్స్ మీద మా బ్యాంక్ క్యాలెండర్‌లో కార్టూన్స్ వేసే క్రమంలో్ "మనం
కస్టమర్లకి కల్పించే 'చెక్‌బుక్' సదుపాయం మీద కూడా ఓ కార్టూన్ వేయండి" అన్నారు మా సీజీయం. ఏ సబ్జెక్ట్ మీదైనా నెగెటివ్ కార్టూన్ వేయడం సులభం, కాని పాజిటివ్ కార్టూన్ వేసి మెప్పించాలంటే కష్టమే! అందుకే చెక్‌బుక్ సదుపాయం మీద కార్టూననేసరికి కొంచెం భయపడ్డాను. ఆఫీస్‌నుండి ఇంటికొచ్చి ఏమీ తోచక టీవీ ఆన్ చేస్తే ఆమధ్యే ప్రారంభించిన జీటీవీ ఛానెల్‌లో ఓ సాంగ్‌సీక్వెన్స్ వస్తోంది. అది కొత్తగా రిలీజైన 'జెంటిల్‌మన్' సినిమాలో పాట!.. " చికుబుకు చికుబుకు రైలే! అదిరెను దీని స్తైలే! చక్కనైన చిక్కనైన ఫిగరే! అది ఓకే అంటే గుబులే!!" సాంగ్‌లోని ట్రైన్ రనింగ్ రిథమ్‌నీ, డాన్స్‌నీ, లిరిక్‌నీ ఎంజాయ్ చేస్తున్నాను. సడెన్‌గా స్ట్రైక్ అయింది - చికుబుకు.. చెక్కుబుక్కు...! లింక్ దొరికింది! వెంటనే పారడీ రాసేశాను.. "చెక్కుబుక్కు చెక్కుబుక్కు మేలే! ఉంటే ఎంతో వీలే! చెక్కుతాను చక్కనైన ఫిగరే(amount)! అది ఓకే అంటే(cheque pass చేస్తే) డబ్బులే!!" అంటూ! దాన్ని బేస్ చేసుకుని కార్టూన్ గీశాను. చెక్‌బుక్ సౌలభ్యం తెలిసిన ఓ కస్టమరు కౌంటర్ దగ్గర నిల్చుని ర్యాప్ డాన్స్ చేస్తూ పాడుతున్నట్టు! ఆ కార్టూన్ ఎంతో పాపులర్ అయింది. అప్పట్లో US లోని మా కస్టమర్స్ నుంచి మామూలుగా ఓ ఇరవై ముప్పై వేలకు మించి తెలుగు క్యాలెండర్ల డిమాండ్ ఉండేది కాదు. ఈ పబ్లిసిటీ కార్టూన్లు మొదలెట్టాక రీప్రింట్‌ల డిమాండ్‌తో ఆర్డరు రెండు లక్షలకు పైగా ఉండేది!!

- మీరు పొందిన అవార్డులు లేదా మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
కార్టూన్లూ, అవార్డులూ... వాటి జోలికి నేనెప్పుడూ పోలేదండీ! పోతే, ప్రశంసలంటారా.. ఎన్నో వేదికలలో ఎందరో పాఠకులు, పెద్దలు, ప్రముఖులు నా కార్టూన్లు చూసి వాటిలోని వ్యంగ్యాన్ని హాస్యాన్ని అస్వాదించి మెచ్చుకున్నారు; అవే నాకు పెద్ద అవార్డులు!!
- మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది?
ఏ కళాకారునికైనా తాను ఎంచుకున్న రంగంలో అభివృద్ధి సాధించాలంటే కుటుంబసభ్యుల ప్రోత్సాహం చాలా అవసరం. అలా కార్టూనిస్ట్‌గా నా క్రియేటివిటీకి సహజంగానే మావాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంది... అప్పుడప్పుడూ సలహాలూ, విమర్శలూ కూడా!
- భావి కార్టూనిస్టులకు మీరిచ్చే సందేశం ఏమిటి?
సందేశాలు ఇచ్చేటంత పెద్దవాడిని కాదు గానీండీ... బాపు గారు తరచూ అంటుండేవారు, "కార్టూనిస్టులు మంచిమంచి ఐడియాలతో పాటు, బొమ్మలు అందంగా గీయడానికి కృషి చేస్తే బాగుంటుంది" అని! పొందికతో అందం జతకలిసిన అతివలాగా, చక్కని ఐడియాతో పాటు చూడచక్కని బొమ్మలతో నిండిన కార్టూన్ పాఠకుడిని మరింత బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడీ రంగంలోకి వస్తున్న కార్టూనిస్టులు అప్టుడేట్ టాపిక్‌లు ఎంచుకుంటూ మంచి ఐడియాలు ప్రెజెంట్ చేస్తున్నారు. కాని, బొమ్మల విషయంలో కృషి లోపిస్తోంది. నాలుగు కార్టూన్లు ప్రచురణ అవ్వగానే లేదా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చెయ్యగానే నేను కార్టూనిస్టుగా స్థిరపడినట్టే అనే భావన మానేసి, ముందుగా బొమ్మలలో.. ముఖ్యంగా రకరకాల పాత్రలు, ఎక్స్‌ప్రెషన్స్, యాక్షన్, చక్కని బ్యాక్‌గ్రౌండ్ క్రియేషన్ వంటి వాటిపై దృష్టి పెట్టి కృషి చేస్తే బాగుంటుంది. ఇది కేవలం ఓ సీనియర్ కార్టూనిస్ట్‌గా నా సలహా మాత్రమే!
శ్రీ రామకృష్ణ గారు తెలుగింట మరిన్ని నవ్వుల పువ్వులు పూయిస్తూ, విజయపధంలో పయనించాలని మనసారా కోరుకుంటోంది 'అచ్చంగా తెలుగు.'
****
No comments:
Post a Comment