జీవితంలో అతి ముఖ్యమైన విషయం?
బి.వి.సత్య నాగేష్ (ప్రముఖ మానసిక నిపుణులు )
“అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని” అనే సామెతలా కొందరికి అన్నీ వున్నా.. వారి జీవితం సంతోషంగాని, చెప్పుకోదగ్గ సుఖం గాని ఏమీ ఉండవూ. కానీ కొందరికి అన్ని సౌకర్యాలూ లేకపోయినా ఉత్సాహంగా, సంతోషంగా కన్పిస్తారు. దీనికి కారణం ఏమిటంటే “అదృష్టం “ అంటాడు సగటు మనిషి. కానీ సైకాలజిస్టులు ఈ అభిప్రాయాన్ని ఒప్పుకోరు. మన జయాపజయాలు, సుఖసంతోషాలు మన మనోవైఖరి మీద మాత్రమే ఆధారపడి ఉంటాయంటున్నారు సైకాలజిస్టులు. ఈ విషయాన్ని ఒక కోణంలో విశ్లేషిద్దాం.
ఈ క్రింది బొమ్మలోని వృత్తంలో నాలుగు భాగాలు వున్నాయి. ఈ వృత్తం మన జీవితం అనుకుందాం. ఈ వృత్తంలో ఒక్కొక్క అంశానికి సంబంధించినది. మన జీవితాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుందాం.
సమయం 2. శరీరం 3. వనరులు 4. అదే రహస్యం .. అదేంటో చూద్దాం
మొదటి అంశం - సమయం. ఈ ప్రపంచంలో అతి పేదవాడి దగ్గరినుండి అత్యంత ధనికునికి దొరికేది కేవలం రోజుకు 24 గంటలే! సమయం విషయంలో బీద, బక్క, గొప్ప అనే తేడా లేదు. రెండవ భాగం - శరీరం. మన శరీరం లోని అన్ని భాగాలు కనీస ఆరోగ్యంతో వుంది పని చేసుకోడానికి వీలుగా ఉన్నాయా లేదా అన్నది ఇక్కడ ముఖ్యాంశం. ఇక మూడవ భాగం - మనకున్న వనరులు. (resources ) గురించి వివరించేది. ఈ మూడు అంశాలు మనకు పుట్టుకతోనే సంక్రమించాయి అని అనడంలో సందేహం లేదు. ఈ మూడు అంశాల విషయంలో ఏ లోపం లేకుండా, అన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ ఎటువంటి విజయాలను సాధించలేని వారూ ఉన్నారు. అలాగే ఈ మూడు అంశాల విషయంలో కొంత లోపం లేదా కొరత ఉన్నప్పటికీ విజయాలను సాధించిన వారూ వున్నారు. ఈ రెండు రకాల మనుషుల్లో వుండే తేడా ఏమిటని గమనిస్తే మనకు నాలుగవ భాగం గురించి తెలుస్తుంది. అదే మన జీవితాన్ని నడిపించేది, నిర్ణయించేది. ఈ భాగం పేరు మానసిక దృక్పథం (ATTITUDE )
మొదటి మూడు భాగాల్లో వున్నా అంశాల్ని సమర్ధవంతంగా వాడుకోవడమనేది నాలుగవ భాగంలో వున్నా మానసిక దృక్పథం పై ఆధారపడి ఉంటుంది. మొదటి మూడు భాగాల్లోని అంశాల విషయంలో కొంత కొరత వున్నా గొప్ప విజయాలను సాధించిన వారూ వున్నారు. దానికి కారణం వారి మానసిక దృక్పథమే. వివరాల్లోకి వెళ్దాము.
మొదటిభాగమైన సమయం అందరికీ సమానమే. సమయం విషయంలో కొందరికి కొరత వుండే అవకాశముంటుందా అనే సందేహం కలుగుతుంది. అందరికీ రోజుకు 24 గంటలు మాత్రమే ఉన్నప్పటికీ ఆ సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవడమనేది నాలుగవ భాగం పైనే ఆధారపడివుంటుంది. ఒక ప్రక్క గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తూ… మొరొక ప్రక్క పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కళాకారులు, నవలా రచయితలూ, సాహితీవేత్తలూ ఎందరో వున్నారు మన సమాజంలో. రోజుకు నాలుగు గంటల చొప్పున ట్యూషన్లు చెప్పుకుంటూ కుటుంబానికి ఆర్ధిక సహాయాన్ని అందజేస్తూ, మిగిలిన సమయంలో శ్రద్ధగా చదువుకుంటూ ఇంజనీరింగ్ కాలేజ్ లో టాపర్ గా తన స్థానాన్ని ప్రతీ సెమిష్టర్ లో నిలబెట్టుకుంటున్న ఒక స్టూడెంట్ నాలుగవ భాగమైన మానసిక దృక్పథాన్ని సరియైన పద్దతిలో వాడుకోవడం వల్లనే సాధ్యం చెయ్యగలిగేడు.
సురేష్ అనే విద్యార్ధి ఆటో డ్రైవర్ కుమారుడు. ఎదో కారణాల వాళ్ళ సురేష్ తండ్రి ఇల్లు వదిలి ఏటో వెళ్ళిపోయేడు. సురేష్ ఇంటర్ మీడియేట్ చదువుతూ సంపాదన కొరకు “చిప్స్ “ తయారీ అంగడిలో ప్యాకింగ్ పనిచేస్తూ మిగిలిన సమయంలో చదువుకొని ఫైనల్ పరీక్షల్లో 470 మార్కులకు 456 మార్కులను సాధించుకున్నాడు. ఈ వార్త ప్రముఖ దినపత్రిలలో చోటు చేసుకుంది.
రెండవ భాగం - శరీరం. అంగవైకల్యం వున్నా వారు కూడా ఎన్నో విజయాలు సాధిస్తున్న రోజుల్లో అన్నీ వున్నా వారు విజయం సాధించకపోవడానికి కారణం దృక్పథం మాత్రమే. సగటు మనిషి “దురదృష్టం “అంటాడు. మరి అంగవైకల్యం పుట్టుకతోనే వున్నవారు అలా అనుకోవట్లేదు కదా! అదే మానసిక దృక్పథం. ‘NICK VIJUSIC’ అనే వ్యక్తి అంగవైకల్యంతో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో ‘వ్యక్తిత్వ వికాస నిపుణుడు ‘ గా గుర్తింపును సాధించుకున్నాడు. NICK VIJUSIC’, JESSICA COX అనే ఇద్దరినీ ఇంటర్నెట్ ద్వారా చూస్తే నాలుగవ భాగమైన మానసిక దృక్పథం పాత్ర ఎంత ముఖ్యమైనదో అర్ధమౌతుంది.
మూడవ భాగం - వనరులు. అన్ని వనరులూ ఉంటే విజయాలు సాదించగలననేది ఒక భ్రమ. గ్రామీణ ప్రాంతంలో నివసించే వారికి , చదువుకునే విద్యార్థులకు పట్టణ వాసులతో పోల్చుకుంటే వనరులు తక్కువే ఉంటాయి. కానీ ఏంటో మంది గ్రామీణ ప్రజలు ఎన్నెన్నో విజయాలు సాధించి ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారు. ‘భాష ‘పైన పట్టు సంపాదించి నైపుణ్యతలను, జ్ఞానాన్ని సానపెడితే మానసిక దృక్పథం తో విజయాన్ని సాధించగలం అని ఎంతోమంది నిరూపిస్తున్నారు.
నాలుగువభాగం - మానసిక దృక్పథం. దిక్సూచి ఎప్పుడూ ‘ఉత్తరం దిశనే చూపిస్తుంది. అలాగే మనోదృక్పథం ఎప్పుడూ లక్ష్యం వైపు గురిపెట్టి ఉండాలి. సాధన చేస్తూ ఉండాలి. కృషి చేస్తూ ఉండాలి. కృషికి తగిన ఫలితం వచ్చిన తరువాత సుఖసంతోషాలు సులువుగా సంపాదించుకోవచ్చు. నిత్యా విద్యార్థిలా ఉండాలి. తనను తానూ ప్రోత్సహించుకుంటూ ఉండాలి. తన మీద తానూ జాలి పడకూడదు. సమస్యలను సవాలుగా తీసుకోవాలి. బలహీనతల్ని దూరం చేయాలి. అవకాశాలను కల్పించుకోవాలి. అడ్డంకుల్ని తొలగించుకోవాలి. సామర్ధ్యాలను పెంచుకోవాలి. విమర్శలను సలహాలుగా తీసుకోవాలి. ఈ విధంగా మానసిక దృక్పథాన్ని తీర్చిదిద్దుకుంటే సుఖసంతోషాలను న్యాయపరంగా,చట్టపరంగా సాధించుకోగలుగుతాము.
***
No comments:
Post a Comment