నాకు నచ్చిన కధ-చీరకు రంగు--శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు
టీవీయస్.శాస్త్రి(శారదాప్రసాద్)
శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు చక్కటి హాస్యం పండించడంలో సిద్దహస్తులు .ఇపుడు వారు వ్రాసిన కథ "చీరకు రంగు" ను చదవగలరు! లోగడ ఈ కథ అంధ్ర భారతి సాహిత్యం మాస పత్రికలో ప్రచురణ అయ్యింది.మునిమాణిక్యం గారిని గురించి ఇప్పటికే మీకు చాలా వివరంగా చెప్పాను.మళ్ళీ చెప్పనవసరం లేదను కుంటాను.భార్యలకు(ఎవరి భార్యకు వాళ్ళు అని అర్ధం) మంచి చతురత ఎక్కువ.భర్తలను గమ్మత్తుగా చిత్తుచేస్తారు!పండగకు మిమ్మల్నే చీరను తెమ్మంటారు.మీ సెలక్షన్ బాగుంటుంది అంటారు .అంటే మీరు ఆవిడను పెళ్లి చేసుకోవటం మీ అదృష్టమనే ధ్వని అందులో ఉంది. "నాకే సెలక్షన్ చేతకాదు" అనటంలో, మిమ్మల్ని చవటగా లెక్క వేసిందని మళ్ళీ చెప్పనవసరం లేదనుకుంటాను.అదేమిటో మీరు స్వంతగా బజారు నుంచి ఏమైనా తెచ్చారనుకోండి,"బాగా లేదు తిరిగి ఇచ్చి రండి!" అని చెప్పటం వారి నైజం!నేను ఆ మధ్య నా భార్యకు జన్మదిన కానుకగా మంచి చీరను తెచ్చాను ,చీర రంగు కాషాయ రంగు. ఆ చీరను ఆమె చూసి "ఇదేమి రంగండి? ఈ సన్యాసి (సన్నాసి) రంగు తప్ప మరి మీకేమీ కనిపించలేదా?"అని అంది .ఇక నుంచి ఆమెను తీసుకోనిపోయే చీరలు తేవాలని నిశ్చయించుకున్నాను. అదే రంగు చీర ఆమె తెచ్చుకుంటే ,దాన్ని saffron రంగు అంటుంది. తేడా ఏమిటని అడిగితే విషయం ఎక్కడికో పోతుంది. నేను చీర తెచ్చిన సందర్భంలో నాకు ఈ కధ గుర్తుకు వచ్చి మీతో పంచుకుంటున్నాను!
****
"మీరు ఏమీ పనిలేకుండా కూర్చున్నట్లున్నారు,ఇలా వచ్చి ఈ నిచ్చన కొద్దిగా పట్టుకోండి, ఆ చీర ఆరేస్తాను!" అన్నది కాంతం. అప్పుడే ఏదో రాయాలని కలం కాగితం తీసుకొని కూర్చున్నాను. ఇంతలోనే ఈ సమను!తొందర పనుల మీద పోతున్న సమయంలో ఇటువంటి పనులు వస్తుంటాయి. బి.ఎ.పరీక్ష రోజున తొమ్మిదిన్నర వరకూ పుస్తకాలను తిరగేసి,పది నిముషాల్లో భోజనం చేసి,కాలేజీకి హడావిడిగా పరుగెత్తవలెనని వీధి గుమ్మంలోకి కాలు పెట్టేసరికి వెనకనించి, "ఏమండోయ్ మాట "అని పిలుపు వచ్చింది.అది పెడచెవినిపెట్టి పోతుంటే,"మిమ్మల్నే ఏమిటా వెళ్ళటం" అని మృదువైన చివాట్లు వినిపించేవి. ఏదైనా పుస్తకం కానీ, కలం కానీ మరచిపోయానేమోనని వెనకకు తిరిగి చూసేసరికి,"పిల్లకు రెండు రోజులనుంచి ఒంట్లో సరిగా లేదు.దుంప రాష్ట్రం,వాము,జీలకర్ర......" అని ఏవేవో చెప్పింది."చెప్పటానికి ఇదా నీకు మంచి సమయం" అని విసుక్కొని వెళ్ళిపోయాను.అట్టి విషయంలో ఏదో రాసుకోవాలని కాగితాలను ముందు వేసుకోగానే,కాంతం నన్ను పిలిచింది అనటంలో విపరీతం ఏమీ లేదు.నేను ఈ రోజు వినిపించుకోనట్లు నటించాను.ఈ ఉపాయం నీకెట్లా తోచింది అని అడుగుతారేమో!ఆంగ్ల సాంఘీక జీవనం గురించి చెప్పే కధల వల్ల ఈ రహస్యం గ్రహించాను. "ఈ గోలంతా ఎందుకండీ ,ఈ నిచ్చన పట్టుకుంటే చీర ఆరేస్తాను" అంది కాంతం."ఇది పోయిన సంవత్సరం కొనుక్కున్న చీర,దీనితో పాటు కొనుక్కున్న మా అమ్మ చీర అప్పుడే చినిగిపోయింది.నేను కాబట్టి జాగ్రత్తగా వాడుకుంటున్నాను" అని సణుగుతుంది కాంతం! "అదా నీ గొడవ రేపు పండగకు కొత్త చీర కొంటానుగా" అన్నాను.మరుసటి రోజు బజారుకెళ్ళి ఒక కొత్త పచ్చ చీర కొన్నాను.పచ్చరంగు కంటికి ఇంపైన రంగని నా అభిప్రాయం.నాటకాలలో కూడా సీత,శకుంతల,దమయంతి పాత్రధారులు పచ్చ రంగు చీరెలే కట్టుకుంటారు.రంగుల తత్వాలను గురించి పాశ్చాత్యులు కూడా పసుపు పచ్చ ,ఆకు పచ్చ రంగులు కంటికి ఇంపుగా ఉంటాయని ,నరాలకు బలాన్ని ఇస్తాయని రాసారు. ఇవన్నీ ఆలోచించి కొద్దిగా ధర ఎక్కువైనా పది రూపాయలు పెట్టి పచ్చ చీర పట్టుకొచ్చాను."చీర కొన్నారా అంటూ ,ఆ చీరను అటూ ఇటూ చూస్తూ,పది రూపాయలకు ఈ చీర కొన్నారా? మళ్ళీ తిరిగి ఇస్తే తీసుకుంటారా? "అంది కాంతం. "అంటే నీ ఉద్దేశ్యం చీర నచ్చలేదనేగా?" అన్నాను."రోజారంగు చీర అయితే బాగుండేది కదా!పోనీ లెండి ఎలాగో సద్దుకుంటాను!" అంది కాంతం. ఆ చీర మళ్ళీ షాప్ వాడు తీసుకోడు!బాగా ఆలోచించి ,ఆ చీరకు రంగేసి కాంతాన్ని తృప్తి పరచాలని నిశ్చయించి ,బజారుకు వెళ్లి వెలిసిపోని జర్మనీ రంగులు తెచ్చాను! కాంతం రంగులు తాను వేసుకుంటానని చెప్పింది .ఆవిడకు శ్రమ కలిగించటం ఇష్టం లేక,'రంగులు ఎలా వేయాలి' అనే పుస్తకాన్ని మరీ చదివి ఆ చీరకు రంగులు వేయటానికి ఉపక్రమించాను. ఆ పుస్తకంలో చెప్పినట్లే తొట్టిలో వేడి నీళ్ళు పోసాను.నీళ్ళు రక్తం లాగా ఎర్రపడ్డాయి.' బట్ట పూర్తిగా రంగులో మునగాలి,ఏ భాగమైతే మునగదో ఆ భాగానికి రంగు అంటుకోదు' అని ఆ పుస్తకంలో ఉంది.అందుచేత బట్టంతా మునగాలని ప్రయత్నం చేశా! ఎంత ప్రయత్నం చేసినా బుడగలతోటి బట్ట పైకి లేస్తూనే ఉంది. ఏమిటిరా ఈ అవస్థ కాంతాన్ని వేసుకోమంటే సరిపోయేది కదా అని చింతించాను. ఇక లాభం లేదనుకొని ధోతిని పైకి కట్టుకొని నేనే తోట్టిలోని ఆ బట్టమీద పడుకోవాలనిపించి రంగంలోకి దిగాను! బట్ట పూర్తిగా మునిగింది.అయితే నేను లేస్తే మళ్ళీ అది పైకి లేస్తూనే ఉంది.ప్రాణాలు బిగబట్టుకొని అక్కడే పడుకున్నాను.ఇంతలోనే ఎక్కడినుంచో మా కాంతం వచ్చి ,నా అవస్థ చూసి పకపకా నవ్వుతుంది."బట్ట ముందర మంచి నీళ్ళలో తడిపిన తర్వాత రంగు నీళ్ళల్లో వెయ్యకపొయ్యారా "అని అంది కొంచం నవ్వు ఆపుకొని. ఆ మాత్రం నాకు తెలియకపోయెనే అని చింతించి, ఆ భావాన్ని కనపడనీయకుండా, "అంత మాత్రం తెలియక కాదు,అవన్నీ పాతకాలపు పద్ధతులు,నేను కొత్త పద్ధతులతో చేస్తున్నాను"అని అన్నాను. ఆ తర్వాత రెండు మూడు రోజుల వరకూ ఆ రంగు నా వంటి మీదే ఉంది.సోడా ఉప్పుతో కడిగి నలుగుపెట్టినా ఆ రంగు పోలేదు. ఎవరైనా వంటి మీద నా రంగును చూసి నవ్వితే ,కాంతం," కొత్త పధ్ధతి ప్రకారం రంగులు వేయటం వలన ఫలితం లేండి!"అని వేళాకోళం చేస్తుండేది!
శ్రీ మునిమాణిక్యం వారికి స్మృత్యంజలితో!
****
No comments:
Post a Comment