నీకు నేనున్నా - 6
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com
(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు మనోహర్. అతని అక్క కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. మధురిమకు పెళ్ళైపోయిందని అబద్ధమాడి, అతని అక్క కూతురైన పద్మతో అతని వివాహం జరిపిస్తుంది అతని తల్లి. అనుకోకుండా మళ్ళీ కలిసిన మనోహర్, మధురిమ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. ఇక చదవండి.)
నేనేమి చూడదలచుకోలేదు. అదేమిటో చెప్పండి వింటాను అంది పద్మ. రాత్రి టైంలో తనని బయటికి రమ్మన్నాడని కోపంతో కాస్త గట్టిగానే అంది.
“మీ భర్త మంచివారు కాదు. అతనికో కీప్ ఉంది.ఇపుడు మీరు అలర్ట్ అయ్యి దాన్ని మీరీవూరి నుండి తరిమెయ్యకపోతే ముందు, ముందు మీరు చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతారు".
“చూడండీ! మీరెవరో నాకు తెలియదు. నా భర్త ఎలాంటి మనిషో కూడా తెలుసు. మీమీదకన్నా నా భర్తమీదనే నాకు నమ్మకం వుంది. మీరంటున్నారే కీప్ అని ఆ కీప్ గురించి అంతగా అవసరం అయితే మీ మీరే ఆలోచించుకోండి! ఆ కీప్ మీద మీకేదైనా కక్షలాంటిది వుంటే మీరే ఈ వూరి నుండి తరిమెయ్యండి! లేదంటే ఈ లోకం నుండే తరిమెయ్యండి! నాకు మాత్రం అవసరం లేదు? అంటూ ఫోన్ పెట్టేసింది పద్మ.
పద్మ ఫోన్లో మాట్లాడి, ఫోన్ పెట్టేశాక నిజంగానే మధురిమను ఈ లోకం నుండి తరిమెయ్యాలన్న ఆలోచన వచ్చింది హరికి.
****
"శంకరన్నా! నన్ను మీ వూరెప్పడు తీసికెళతావ్? నాకు మీ ఊరిని, మీ వాళ్ళని చూడాలని వుంది" అంటూ శంకర్ వచ్చినపుడు అడుగుతుంటుంది సుజాత. సుజాత శంకర్ని తన సొంత అన్నయ్యను చూసినట్లే చూస్తుంది.
ఎస్పైగారి భార్య నిన్నంత బాగా చూసుకుంటుంది కదా! ఆవిడగారిని మన ఊరెప్పడు తీసుకొస్తావ్ శంకర్! మా చేతివంటలు ఎప్పడు తినిపిస్తావ్!ఆవిడగారిని మాకు చూడాలని వుంది. త్వరగా తీసుకురా!" అంటూ శంకర్ ఇంట్లోవాళ్లు, సుజాత పై అభిమానంతో అప్పుడప్పుడు అంటుంటూరు శంకర్తో.
శంకర్ కి కూడా సుజాతాను బనగానపల్లి తీసుకెళ్ళి చూపించాలని ఉంది.
తగిన సమయం చూసి రాజారాంని అడిగాడు శంకర్.రాజారాంకి శంకర్ అంటే అభిమానం.సుజాతను బనగానపల్లి తీసుకెళ్లేందుకు పర్మీషన్ ఇచ్చాడు.రాజారం ఆరోజు ఏదో పని ఉండి పులివెందల వెళ్ళాడు.
శంకర్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని కూడా ఊళ్ళో లేడు. కారును బనగానపల్లి తీసుకెళ్ళడానికి ముందుగానే పర్మిషన్ తీసుకున్నాడు శంకర్.శంకర్ మాటను కాదనదు వాల్ల యజమాని.
సుజాతను చూడగానే శంకర్ తల్లి సావిత్రమ్మ అక్కయ్య రాజ్యం చాలా సంతోషించారు. చుట్టుపక్కల ఆడవాళ్ల ఎస్పైగారి భార్య ఎలావుంటుందో చూడాలని శంకర్ వాళ్లయింటికి వచ్చారు. బయట కారు చుట్టూ చిన్నపిల్లలు చేరి, ఆసక్తిగా ఆ కారును తాకి, తాకి మరీ చూస్తున్నారు. సుజాతకి ఆ వాతావరణం చూడముచ్చటగా వుంది. సుజాత ఏమాత్రం గర్వం లేకుండా అందరితో కలసిపోయి మాట్లాడుతోంది. వాళ్ల మాటలు వింటూ, మధ్యలో ఆ ఊరి ప్రత్యేకతను గురించి సావిత్రమ్మని అడిగింది సుజాత.
"మా బనగానిపల్లికి గొప్ప చరిత్రే ఉందమ్మా! ఒకానొకప్పుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఈ ఊరిని సందర్శించి వెళ్లారట. ఆ స్వామివారే సిద్దయ్యను పూలు తెమ్మని పంపినప్పుడు సిద్ధయ్య పూలకోసం వెదుకుతూ వచ్చి మా బనగానిపల్లిలోనే దేవదారు పూలని కోసుకొని వెళ్ళాడట అంటూ ఊరి చరిత్రను సావిత్రమ్మ చెబుతుంటే ఆసక్తిగా వింటూ కూర్చుంది సుజాత.
"శంకర్! వీళ్లకి యాగంటి, రవ్వలకొండ చూయించు. అలాగే మారెమ్మ తత్వబోధ చేసిన స్థలం కూడా చూయించు. ఇంకా వీలైతే బ్రహ్మంగారి మఠం." అంటూ సావిత్రమ్మ ఏదో చెప్పబోతుంటే సుజాత మధ్యలో ఆపింది.
“నేను త్వరగా వెళ్ళాలమ్మ. ఆయన పులివెందుల వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఉండాలి" అంది సుజాత.
“సరే!" అంది సావిత్రమ్మ
అందర్ని కూర్చోబెట్టి రాజ్యం భోజనం వడ్డించింది. తృప్తిగా తిన్నారు. సుజాతకి ఇష్టమైన వంటకాలే చేయించాడు శంకర్. వాళ్ల అభిమానం చూస్తుంటేసుజాతకి వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఊరు గుర్తిచ్చింది.
భోజనాలు చేస్తున్నంత సేపు అందరు చాలా సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
హరి మనసు మాత్రం ఆ పరిసరాల్లో లేదు. ఎక్కడో వున్న మధురిమ చుట్టూ తిరుగుతూ ఏదో ప్లాన్ గీసుకుంటోంది. మధురిమ గురించి పద్మతో చెప్పలేదని సుజాతంటే కోపంగా వుంది హరికి అందుకే ఈ మధ్యన సుజాతతో మాటలు లేవు హరికి. పద్మ కూడా హరి చెప్పినట్లు వినలేదు. విన్నాకూడా పరిష్కారం హరికీ వదిలేసింది.
హరిమనసు రగిలిపోతోంది. కళ్లముందు కావలసినంత తప్పు జరిగిపోతుంటే అందరూ పట్టనట్టు వుండటం సహించలేక పోతున్నాడు. నైతిక విలువలకి విరుద్దంగా బ్రతుకుతున్న మధురిమ బ్రతకటానికి అర్హురాలు కాదు. మధురిమను బ్రతకనిస్తే సమాజం పతనమై పోతుంది. మధురిమను ఎవరైనాఆదర్శంగా తీసుకుంటే జరిగే ఘోరం అంతా ఇంతకాదు. అందుకే పరిష్కారం కోసం ఆలోచిస్తున్న హరికి తను ఎన్నుకున్న దారే సరైనదిగా అన్పించింది.
సుజాత, హరి, శంకర్ కర్నూల్ బయలుదేరారు. దారిలో చూడదగినవి కన్పించినప్పుడు కారు ఆపుకుంటూ తీసుకొచ్చాడు శంకర్. హాపీగా ఫీలయింది సుజట.
సుజాతను ఇంటిదగ్గర దింపి, తిరిగి భేతంచర్ల బయలుదేరారు హరి,శంకర్.
కర్నూల్ దాటకముందే ఓ ఇంటిముందు కారు ఆపమని శంకర్కి చెప్పాడు హరి. హరి చెప్పిన ఇంటిముందే కారు ఆపాడు శంకర్.
కారు దిగి ఆ ఇంట్లోకి వెళ్లాడు హరి. కాలింగ్ బెల్ కొట్టకుండా ప్రక్కనేబాల్కనీలో వుండే ద్వారం నుండి లోపలకి ప్రవేశించాడు.
శంకర్ కారులోనే తన సీట్లో కూర్చుని రిలాక్స్గా వెనక్కి అనుకొనిరోడ్డు మీదకి చూస్తున్నాడు.
హరి నేరుగా వంట ఇంట్లోకి వెళ్లాడు. స్టవ్ మీద పాలు పొంగుతుంటేగిన్నెను పట్టకారతో పట్టుకొని దింపిక్రింద పెట్టబోతూ కెవ్వన కేకవేసింది మధురిమ.
హరి, మధురిమను వెనకనుండి కత్తితో పొడిచాడు. వెంటనే క్రింద పడిపోయింది మధురిమ. అప్పుడే లోపలికి వస్తున్నరాజీ మధురిమ పెట్టిన కేక విని భుజం మీద వున్న నీళ్ళ బిందెను క్రింద పడేసింది. ఆ చప్పుడు విని, మళ్ళీ పొడవాలని కత్తిని లాగిన హరి అలాగే ఆ కత్తిని చేతితో పట్టుకొని, కారు దగ్గరకి పరిగెత్తి కారులో కూర్చున్నాడు.
నెత్తురుతో వున్న కత్తిని హరి చేతిలో చూసి కంగారు పడ్డాడు శంకర్.
“కారు పోనీయ్ శంకర్!” అని అంటున్న హరిలో అంతవరకు ఎంతో కాలంగా వున్న కసి, అసూయ చల్లబడ్డట్లు అనిపించింది.
కారు కదిలింది. కారుని వేగంగా పోనిస్తున్నాడు శంకర్.
“మధురిమను చంపేశాను శంకర్!”
“మధురిమను చంపావా! ఆమె నిన్ను ఏం చేసింది హరీ! ఎందుకీపని చేశావు? ఈ ఇల్లు మధురిమదా?” అంటూ నిర్ధాంతపోయాడు శంకర్.
“మంచిపని చేశాను శంకర్! ఇప్పుడు నాకు హాయిగా వుంది”
“చంపటం మంచిపనా! మానవత్వం వుండే మాట్లాడుతున్నావా?
"మంచివాళ్లపట్లే మానవత్వం చూపాలి శంకర్ ఇలా తప్పులు చేస్తూ బ్రతుక్రుతున్నవాళ్లు బ్రతికినా వేస్టే!అది నాకళ్ల ముందు తిరుగుతుంటే తట్టుకోలేక పోతున్నాను. అందుకే ఈ పని చేశాను? అన్నాడు హరి.
“తప్పోప్పల్ని నిర్ణయించాల్సింది మనం కాదు హరీ ఆపైవాడు" అంటూ రోడ్డు మీదనే దృష్టిపెట్టికారు నడుపుతున్నాడు శంకర్. శంకర్ యింకేం మాట్లాడలేదు.
హరి కత్తిని సీటుమీద పెట్టుకొని అలాగే పట్టుకొని వున్నాడు. రక్తం అంటిన సీటుకవరు, ఆ కత్తి, నువ్విప్పడు హంతకుడివి అని గుర్తుచేశాయి.
హరిలో ఏదో కలవరం మొదలైంది. వెన్నులో జలదరింపు పుట్టింది. మనిషంతా భయంతో వణుకుతున్నాడు.
శంకర్, హరి వైపు చూడటం లేదు. రోడ్డువైపే చూస్తున్నాడు.
"శంకర్! నన్ను. నన్ను వాళ్ల పనిపిల్ల చూసింది” అంటూ వెనక సీట్లో కూర్చుని వున్న హరి, శంకర్ వైపు చూస్తూ మెల్లగా అన్నాడు.
నిన్ను వాళ్ల పనిపిల్ల చూసిందా?" అంటూ సడన్ బ్రేక్ వేసికారు ఆపాడు శంకర్..
శంకర్ కారు ఆపగానే హడలిపోయాడు హరి, ఒళ్లంతా చెమటపట్టింది తనని రోడ్డు మీద వదిలి శంకర్ వెళ్లిపోతాడేమోనని హరి భయం.
"నాకు భయంగా వుంది శంకర్! ఆ పనిపిల్ల నన్ను ఎక్కడ చూసినా గుర్తు పడుంది. ఇప్పదు నేనెలా తప్పించుకోవాలి? నన్ను నువ్వే కాపాడాలి శంకర్ అంటూ ప్రాధేయపడ్డాడు హరి.
హరిని చూస్తుంటే జాలిపడాలో, కోప్పడాలో అర్థం కాలేదు శంకర్కి నిర్ధాక్షిణ్యంగా ఒక ఆడమనిషిని చంపిన హరిని క్షమించలేకపోతున్నాడు. వెంటనే సుజాత గుర్తొచ్చింది శంకర్కి. ఆమె చూపే అభిమానం గుర్తాచ్చింది. ఆ అభిమానంముందు శంకర్ తలవంచక తప్పటం లేదు.
కారుని రోడ్డు మీద నుండి ప్రక్కకి లాగాడు శంకర్. కొద్దిదూరం కారునిపోనిచ్చి అక్కడ ఆపాడు.అక్కడంతా ముళ్లపొదలు దట్టంగా వున్నాయి.
మళ్లీ కారెందుకు ఆపాడో అర్థం కాక హరి గుండె వేగంగా కొట్టుకొంది.
"ఎలా కాపాడాలి హరీ నిన్ను! నువ్వు చేసిన తప్పుచిన్నదా? ఏదీ ఆ కత్తి యిలా ఇవ్వు" అంటూ కారు దిగాడు శంకర్.
అక్కడ ముళ్లపొదల మధ్యన వున్న పాడుబడిన బావిలోకి ఆ కత్తిని విసిరేశాడు శంకర్. తిరిగి కారెక్కి కారుని రోడ్డుమీదకి పోనిచ్చాడు.హరికి ఏం అర్థం కావటం లేదు.భయం ఎక్కువై మెదడు మొద్దుబారిపోయేలా వుంది. భయంతో వణికిపోతున్న హరిని అద్దంలోంచి గమనించాడు.
"భయపడకు హరీ! ధైర్యంగా వుండు" అన్నాడు శంకర్.
మాట్లాడలేదు హరి, మాట్లాడదామన్నా హరికి నోట మాటలు రావటం లేదు.
కొద్ది దూరం పోగానే చెక్ పోస్ట్ గుర్తొచ్చింది శంకర్ కి. వెంటనే వెనక్కి తిరిగి హరి కూర్చున్న సీటువైపు చూశాడు. ఆ సీటు కవరుపై రక్తం మరకలు అంటి వున్నాయి. అవి చూడగానే బెదిరిపోయాడు శంకర్.
హరీ! చెక్ పోస్ట్ వస్తోంది. నువ్వు వెంటనే ఆ సీటు కవరు తీసి, సీటు క్రింద నేట్టేయ్యి త్వరగా” అంటూ తొందర పెట్టాడు శంకర్.
శంకర్ చెప్పినట్లే చేశాడు హరి.
చెక్ పోస్ట్ క్లోజ్ చేసివుంది. అక్కడికి రాగానే కారు ఆగింది. కారు దిగాడు శంకర్.
"డిక్కీ ఓపెన్ చెయ్యి" అంటూ చెక్ పోస్ట్ స్టాపులో ఒకతను కారు దగ్గరకివచ్చి శంకర్తో అన్నాడు.
కారు డిక్కీలో ఏమీ కన్పించలేదు. కారు అద్దాలు మూసివున్నాయి.అనుమానంగా కారువైపు చూశాడు.
"కారులో ఎవరున్నారు?అనుమానంగా శంకర్ వైపు చూస్తూ అడిగాడు.శంకర్కి ఏం చెప్పాలో ఓ క్షణం తోచలేదు. హరికి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయేలా వున్నాయి.
“మన సి.పి. రెడ్డిగారు వున్నారు" అంటూ చెప్పాడు శంకర్. శంకర్ చెప్పే విధానం చూసి, వెంటనే సి.పిరెడ్డి గారికి, కారు అద్దాల బయటనుండే సెల్యూట్ చేశాడు చెక్పోస్ట్ స్టాపులో ఒకతను.
'లోపల రెడ్డిగారున్నట్లు, డిక్కీ ఓపెన్ చెయ్యమన్నప్పడే చెప్పొద్దా. సారీ బాబు! కారుపోనియ్!" అని శంకర్తో అతను అనగానే మెరుపులా కారు ఎక్కాడు శంకర్.
గండం గడిచి, తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు శంకర్.
హరికి మాత్రం వూపిరి ఆగిపోయేలావుంది.
కారు నేరుగా బనగానిపల్లి వెళ్లింది.
ఇంటిముందు కారు ఆగగానే శంకర్ తల్లి, అక్కయ్య గబగబ బయటకివచ్చారు.
“ఏం తమ్ముడూ మళ్ళీ వచ్చావ్! సుజాతమ్మగారు ఏరి?” అడిగింది కారువైపు చూస్తూ సావిత్రమ్మ.
ఏం లేదక్కయ్యా! ఓ చిన్నపని వుంది వచ్చాను సుజాతను ఇంటి దగ్గర దింపాను. అంటూ కారులోంచి సీటు కవరు బయటకు తీసి అక్కయ్య చేతికి యిచ్చాడు శంకర్.
“దీన్ని వెంటనే శుభ్రంగా ఉతికి ఎండలో వెయ్యి అక్కయ్యా! నేను ఓ గంటలో బయలుదేరాలి” అన్నాడు శంకర్.
తమ్ముదిచ్చిన సీటుకవరు తీసుకొని, వెంటనే ఉతికి,ఎండలో వేసింది రాజ్యం. తమ్ముడు ఎలా చెబితే అలా చేస్తుంది రాజ్యం. ఎదురు ప్రశ్నలు వేయదు. రాజ్యమే కాదు. ఆ ఇంట్లో ఎవరు కూడా శంకర్ కి ఎదురు చెప్పారు.శంకరం అంటే అందరికీ గౌరవమే.
హరికి కూల్ డ్రింక్ త్రాపి, ఓ చోట కూర్చోబెట్టాడు. శంకర్.
“హరీ! ఇప్పుడెం చెయ్యాలనుకుంటున్నావు?” అంటూ నెమ్మదిగా అడిగాడు శంకర్.
“ఇక నేను బేతంచెర్ల రాను శంకర్! సుజాత దగ్గరకి కూడా ఇప్పట్లో రాలేను. కొంతకాలం ఎటైనా వెళ్ళిపోతాను”.
“సరే హరీ! ఎటు వెళ్తావో నీ ఇష్టం. ఈ డబ్బులు నీ దగ్గర ఉంచుకో. దారి ఖర్చులకి వుంటాయి” అంటూ అంతకుముందు రోజు తీసుకున్న తన జీతం డబ్బులు తీసి హరి జేబులో పెట్టాడు శంకర్. ఆ డబ్బు చూడగానే కదిలిపోయాడు హరి. అభిమానంగా శంకర్ వైపు చూశాడు.
“శంకర్! కన్నీటి చుక్క క్రిందపడ్డప్పుడు అయ్యే చప్పుడును వినగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. అలా వినగలిగే స్నేహితులు వున్నారో లేరో తెలియదు కాని, నువ్వు నిజంగానే ఆ చప్పుడును వినగలవు. నిజమైన స్నేహానికి అర్దానివి నువ్వు” అన్నాడు హరి.
మాట్లాడలేదు. శంకర్. విని మౌనంగా వున్నాడు.
హరిని కారులో తీసికెళ్లి బస్టాండ్ లో దింపాడు శంకర్.
ఎండకు ఎండి, కొంగరెక్కలా మెరుస్తున్న సీటుకవరును, కారులో సీటుపై వేసుకొని అదేకారులో కర్నూల్ వెళ్లి సుజాతను కలిశాడు శంకర్.
ఒక్కడే వచ్చిన శంకర్ని చూసి, హరి గురించి అడిగింది సుజాత.సుజాతతో మాట్లాడలేకపోయినా, సుజాత ఇంటికి వస్తుంటాడు హరి.
సుజాతకి హరి గురించి చెప్పొద్దనుకున్నాడు శంకర్. తనిప్పడు చెబితే ఎస్పై రాజారాంకి తెలిస్తే! బావమరిది అని కూడా చూడకుండా హరికి శిక్షపడుతుంది. ఆ శిక్ష నుండి తప్పించాలని తనిప్పడు చెప్పకపోతే! ఎప్పటికైనా తెలుస్తుంది. అలా తెలిసినప్పడు ఆ నేరమేదో తన మీదకి వస్తుంది. చివరకు తను దోషిగా నిలబడాలి. ఎస్పై రాజారాంకి తెలిస్తే ఏమవుతుందన్న సంగతి సుజాత చూసుకుంటుంది. అందులో తనకి ఎలాంటి బాధ్యత లేదు.
ఆలోచిస్తూ కూర్చున్న శంకర్ని చూసి
"అన్నయ్య ఏడి, శంకరన్నా!" అని మళ్లీ అడిగింది సుజాత. ఇక చెప్పక తప్పలేదు శంకర్కి, జరిగింది వివరంగా చెప్పాడు శంకర్.
మధురిమ చనిపోయిందని తెలియగానే సుజాత గుండెనెవరో పిండినట్లే, కళ్లనీళ్లు పెట్టుకొంది సుజాత.
హరిని శంకర్ ఎలా కాపాడినాడో విన్నాక, శంకర్ పట్ల కృతజ్ఞతతోసుజాత నోటమాట రాలేదు.
*****
బస్స్టాండ్లో కూర్చుని వున్న హరికి ఎటువెళ్లాలో తోచడం లేదు. ఏదో ఒక బస్సు ఎక్కక తప్పదన్నట్లు కడప బస్సు ఎక్కబోయే ముందు పద్మకి ఫోన్ చేశాడు హరి.
మధురిమ చనిపోయిందన్న వార్త వినగానే పద్మ ఆశ్చర్యపోయింది.
****
మధురిమ పెట్టిన కేక వినగానే, నీళ్ల బిందె క్రింద పడేసి లోపలకి వచ్చిన రాజీ, హంతుకుడ్ని స్పష్టంగా చూసింది. క్రింద పడివున్న మధురిమను చూసి షాకయింది. ఒక్క వుదుటున మధురిమ దగ్గరకి పరిగెత్తి…..
“అమ్మగారు!అమ్మగారు!” అంటూ పిలిచింది రాజీ
మధురిమ పలకలేదు. రాజీకి ఏడుపు ఆగలేదు.
వెంటనే మనోహర్కి ఫోన్ చెయ్యాలన్న విషయం గుర్తొచ్చింది రాజీకి. మధురిమ నిండుగర్భిణి అయినందువల్ల ఏదైనా అవసరమైనపుడు తనకి ఫోన్ చెయ్యమని రాజీకి తన ఫోన్ నెంబరిచ్చి ఎలా డయల్ చెయ్యాలో నేర్పాడు మనోహర్. మనోహర్ చెప్పినట్లే చేసింది రాజీ.
రాజీ ఫోన్లో చెప్పింది విని నిర్ధాంతపోయాడు మనోహర్.
వెంటనే కార్లో ఇంటికి వచ్చాడు మనోహర్.
కారు దిగి పరిగెత్తుతున్నట్లే లోపలకెళ్లాడు.
రక్తపు మడుగులో సృహ లేకుండా పడివున్న మధురిమను చూడగానే మనోహర్ నవనాడులు క్రుంగిపోయాయి. కుప్పకూలినట్లు ఆమె ప్రక్కనే మోకాళ్లపై కూర్చున్నాడు. క్షణంలో ఆమెను తన చేతుల్లోకి తీసుకొని, కారు దగ్గరకి వెళ్లి, కారులో మెల్లగా పడుకోబెట్టాడు. రాజీ టక్కున కారెక్కి మధురిమ తలను తన ఒల్లో పెట్టుకొంది.
మధురిమను హాస్పిటల్లో జాయిన్ చేశాడు మనోహర్.
మధురిమకు కత్తిపోటు ఎక్కడ దిగిందో అర్థం కాలేదు. రక్తం ధారగా కారుతోంది. ఆమెనలా చూస్తోంటే మనోహర్ కి ఏం చేయాలోతోచలేదు.
'మధూ! మధూ!” అంటూ ఆమె ముఖంమ్మీదకి వంగి పిలిచాడు మనోహర్.
మధురిమ పలకలేదు. మనోహర్ గుండె జారిపోయింది.
డాక్టర్ ఎమ్. రామచంద్రారెడ్డి మనోహర్ కి బాగా తెలుసు. ఆయన మంచి సర్జన్
మధురిమను ఆపరేషన్ థియేటర్లోకి తీసికెళ్లారు. కత్తి దిగినచోట కుట్లువేసి, బ్లెడ్ ఎక్కించారు. ఇన్ఫెక్షన్ రాకుండా మెడిసిన్ ఇచ్చారు. కారుతున్న రక్తం ఆగిపోయింది. ఐ.సి.యు. లో పెట్టారు మధురిమను.
మనోహర్కి టెన్షన్ గా వుంది.
మధురిమ మామూలు మనిషి కాదు. నిండు గర్భిణి. చిన్న దెబ్బకూడా తట్టుకోలేని పరిస్థితి ఆమెది. అలాంటిది ఈ కత్తిపోట్లను తట్టుకోగలదా? మధురిమకు ఏమైనా జరిగితే?
మధురిమ లేని జీవితాన్ని వూహించుకోలేకపోతున్నాడు. దొరకదను కున్న పెన్నిధి దొరికినట్లే దొరికి జారిపోతుందేమోనని ఆందోళన పడుతున్నాడు మనోహర్
ఐ.సి.యు. లో వుంచిన మధురిమను బయటనుండే గ్లాసుల్లోంచి గమనిస్తూ, అక్కడే వున్నాడు మనోహర్.
మధురిమ కళ్లు తెరిస్తే చూడాలని వుంది మనోహర్కి.
లోపలకి ఎవరినీ రానివ్వటం లేదు డాక్టర్లు.
డాక్టర్ ఎమ్.ఆర్.రెడ్డి వెంటనే గైనకాలజిస్ట్ను పిలిపించారు. గైనకాలజిస్ట్ లోపలకెళ్లి మధురిమను టెస్ట్ చేసింది. టస్ట్ చేశాక డాక్టర్ రెడ్డిగారితో ఏదో మాట్లాడింది. డాక్టర్లిద్దరు బయటకు రాగానే వాళ్లను కలిశాడు మనోహర్.
“ఆమెకు డెలివరీ టైం దగ్గర పడింది మనోహర్! ఆమెకు వెంటనే ఆపరేషన్ చెయ్యాలి" అంది డాక్టర్.
"ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుందా డాక్టర్?" అంటూ వెంటనే అడిగాడుమనోహర్.
చెప్పలేం మనోహర్! మా ప్రయత్నం మేం చేస్తున్నాం. ఆపరేషన్ చేసేముందు మాత్రం మీరు సంతకం పెట్టాలి" అంది డాక్టర్.
గుండె జల్లు మంది మనోహర్కి.
“సరే డాక్టర్" అని మాత్రం అనగలిగాడు మనోహర్.
మధురిమ బ్రతుకుతుందన్న నమ్మకం పూర్తిగా చచ్చిపోయిందిమనోహర్ లో. కానీ ఏదో చిన్నఆశమిగిలివుంది.
అప్పటికి నాలుగు రోజులైంది మధురిమను హాస్పిటల్లో జూయిన్ చేసి.
అప్పటి నుండి మనోహర్ ఇంటి వెళ్ళలేదు. సరిగ్గా నిద్రపోలేదు.
“ఆమె కోలుకుందో లేదో కాని, ముందు మీరు సిక్ అయ్యేట్టు ఉన్నారు సార్” నాలుగురోజుల నుండి మనోహర్ ని గమనిస్తున్న నర్స్ అటువైపు వైపు వెళుతూ.
మనోహర్ మాట్లాడలేదు.
దారి తెలియక అడవిలో తప్పిపోయిన చిన్న పిల్లాడిలా అక్కడే కూర్చున్నాడు మనోహర్.
మనోహర్ సంతకం పెట్టగానే ఆపరేషన్ చేశారు డాక్టర్స్.
“ఆపరేషన్ సక్సెస్ అయింది మనోహర్. కట్టి ఇంకొంచెం లోపలికి దిగిఉంటే ఆమె నీకు దక్కేది కాదు. బాబు పుట్టాడు. ఇక మీరు వెళ్ళి చూడవచ్చు అన్నాడు డాక్టర్ రామచంద్రారెడ్డి గారు.
“థాంక్స్ డాక్టర్!” అంటూ సంతోషంగా లోపలికి వెళ్ళి మధురిమను బాబును చూశాడు మనోహర్.
వేళకి తిండి నిద్ర లేక మనోహర్ ముఖం వాడిపోయి ఉంది. భర్తను అలా చూడగానే కరిగిపోయింది మధురిమ.
బాబులో తన పోలికలు స్పష్టంగా కనిపిస్తుంటే మురిసిపోతూ బాబును చూస్తున్నాడు మనోహర్.
“బాబు అచ్చం అయ్యగారి పోలికే అమ్మగారు “ అంటూ రాజీ ముందే మధురిమకు చెప్పింది.
“మిమ్మల్ని మీరేం చూసుకుంటారు లెండి”, కాస్త మమ్మల్ని కూడా చూడండి! అంది నవ్వుతూ మధురిమ. చావుతో పోరాడి బయటపడ్డ మధురిమలో ఏదో అంతు తెలియని తృప్తి కనిపిస్తుంది.
“మిమ్మల్ని చూడబట్టే కదా మేడం”, ఇప్పుడు మమ్మల్ని మేము చూడగలుగుతున్నాం. మిమ్మల్ని చూడకపోతే మాకు ఈ భాగ్యం దక్కేది కాదు అంటూ బాబుని చూస్తూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చునాడు మనోహర్.
“మధూ!” ఆమెనే చూస్తూ పిలిచాడు మనోహర్. ఆ పిలుపు ప్రేమను త్రాగి ఒలికినట్లుంది.
'ఊ!" అంటూ పలికింది మధురిమ, ఎప్పడు పిలిచినా వెంటనే పలుకుతుంది మధురిమ. ఆ పలకతంలో కూడా అదో ప్రత్యేకత వినిపిస్తుంది. ఆ ప్రత్యేకతే అతడ్ని కట్టిపడేసింది.
ఆమె చేతిని అపురూపంగా తన చేతిలోకి తీసుకున్నాడు.
మధూ! నువ్వు నాకోసం, నాకు తోడుగా వుండటం కోసం, నా సంతోషం కోసం, మళ్లీ పుట్టావు" అన్నాడు మనోహర్.
వాళ్లు అలా సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో రాజీ అక్కడికివచ్చింది. తన మనసులోని మాటను చెప్పకుండా ఆపలేకపోతోంది.
"అయ్యగారు! అమ్మగారిని పొడిచిన వాడ్ని నేను చూశాను. మళ్లీ ఇప్పడు చూస్తే నేను గుర్తుపడతాను” అంది రాజీ.
మనోహర్ ముఖం లో నవ్వు ఎగిరిపోయింది. కోపంతో అతని దవడ ఎముక బిగుసుకొంది.
భర్తనలా చూడగానే రాజీ మీద కోపం వచ్చింది మధురిమకు
"మళ్లీ కన్పిస్తే నువ్వు గుర్తు పట్టటానికి - నన్ను మళ్లీ పొడిపించుకో మంటావా ఏంటి రాజీ అదేదో యాక్సిడెంటల్గా జరిగింది. ఎవరినో పొడవబోయి నన్ను పొడిచి వెళ్లాడు. ఇంకెప్పుడూ ఆ ప్రసక్తి తీసుకురాకు. సరేనా?” అంది మధురిమ. సరేనన్నట్లు తలవూపి బయటకెళ్లింది రాజీ.
తనని హరి పొడిచాడన్న విషయం మధురిమకు తెలుసు. అది మనోహర్కి తెలిస్తే డిస్టర్స్ అవుతాడు. ఈ విషయంలో మనోహర్ని డిస్టర్స్ చెయ్యటంమధురిమకు ఇష్టం లేదు. ఇప్పటికే తనవల్ల ఆఫీసు పనులన్నీ ఆగిపోయి వుంటాయి. కక్షలతో, పొడుచుకోవటాలతో వున్న టైమంతా సరిపోతే యింక బ్రతకటానికి టైమెక్కడ మిగులుతుంది? మనోహర్ని అలా చూడటం మధురిమకి ఇష్టం లేదు.
"బాబెలా వున్నాడో నాకు చెప్పనేలేదు మీరు?" అంటూ నవ్వుతూమనోహర్ వైపు చూసూ టాపిక్ను మార్చి మాట్లాడింది మధురిమ.
“బాబుకేం మధూ! అచ్చం నాలాగే ఉన్నాడు. కానీ నువ్వే కష్ట పడ్డావ్! అది తలుచుకుంటే నాకు బాధగా వుంది” అన్నాడు మనోహర్.
“అదంతా మరచిపోండి!” అంటూ మళ్ళీ నవ్వింది మధురిమ.
బాబు చేతిని తన చేతిలోకి తీసుకొని పెదవులకి తాకిచ్చు కునాడు మనోహర్.
*****
రాత్రి పదిగంటలయింది.
మనోహర్ కోసం ఎదురుచూస్తుంది పద్మ.
మనోహర్ ఇంటికి రాక వారం రోజులైంది. ఒంటరిగా ఇంట్లో వుండాలంటే భయంగా వంది. ఇదే విషయం తండ్రితో చెప్పింది పద్మ.
“అల్లుడుగారు ఇప్పడు ఫీల్డ్ ఆఫీసర్ పద్మా! ఇంత చిన్న వయసులో ఫీల్డ్ ఆఫీసర్ కావటం గొప్ప విషయం. ఆయనకి ఫీల్డ్ వర్క్ ఎక్కువగా వుంటుంది.అంటే క్యాంపు లెక్కువగా వుంటాయి. నీకో బాబో, పాపో పుట్టేంత వరకు ఈ ఒంటరితనం తప్పదుమరి. ఆయన్ని మాత్రం విసిగించకు" అన్నాడు కరుణాకర్ అప్పటి నుండి మనోహర్ని అర్థం చేసుకొంది పద్మ.
కానీ ఫోన్లో హరి గొంతు విన్నప్పటినుండి భయంగా వుంది పద్మకి,
మనోహర్ ఇంటికి వచ్చాడు.
“ఇదేనా ఇంటికి వచ్చే టైం?అంటూ మనోహర్ని గుమ్మంలోనే నిలదీసింది పద్మ.
పోనీ వెనక్కి వెళ్లి యింకోగంట ఆగిరానా!" అన్నాడు నవ్వుతూ మనోహర్
“ఇదో సరసం మళ్లీ!మీరెళ్ళి వారం రోజులైంది. చెప్పివెళితే నాకేం అన్స్టించదు. ఎక్కడో వుంటారు. వస్తారులే అనుకుంటాను. ఈ వారం రోజుల నుండి నేను సరిగ్గా తిండికూడా తినలేదు తెలుసా!" అంటూ మనోహర్ లోపలకి రావటానికి దారి ఇచ్చింది పద్మ.
“నీతో ఇదే తలనొప్పి! అదేమంటే టక్కున తిండి మానేస్తావు. నేనెక్కడికి పోతాను చెప్పు! నన్ను, చూస్తుంటే, నేనెక్కడైనా తప్పిపోయేవాడిలా కనిపిస్తున్నానా? నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తారనిపిస్తుండా? అసలేంటి నీ భయం? అంటూ లోపలికి వచ్చాడు మనోహర్.
“మీరు లేని టైం లో నాకో ఫోన్ వచ్చింది తెలుసా?” అంది పద్మ.
మాట్లాడకండా మౌనంగా డ్రెస్ మార్చుకుంటున్నాడు మనోహర్.
“మాట్లాడరేంటి? నాకు ఫోన్ వచ్చిందని చెబుతుంటే!” అంటూ కోపంగా భర్త వైపుచూసింది.
“నీకు ఫోన్ వస్తే నువ్వు మాట్లాడతావు కాని నేను ఎందుకు మాట్లాడతాను” అన్నాడు మనోహర్.
“మీకేమో జోక్ లాగా ఉంది.నేనేమో ఆ ఫోన్ విని హడాలిపోయాను.
“అంతగా హడాలిపోయే మ్యాటర్ ఎంతో ! చెప్పు వింటాను. తిరిగి తిరిగి చాలా ఓపిగ్గా ఉన్నాను” అన్నాడు మనోహర్ వ్యంగంగా.
“వాడెవడో ఫోన్లో మీగురించి, మధురిమ గురించి బ్యాడ్ గా చెప్పారండీ!”
“వాడి పేరేమిటో కనుక్కోలేక పోయావా కేసు వేసేవాడిని”
“తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా? మధురిమను చంపేశా అన్నాడు” అంది పద్మ. మంచినీళ్ళు తాగుతున్న మనోహర్ కి పొలమారింది. పద్మ వచ్చేలోపల తన చేత్తో తనే తల మీద కొట్టుకున్నాడు.
“ ఆ గొంతు వింటే నువ్వు గుర్తుపట్టగలవా?” వెంటనే అడిగాడు మనోహర్. మధురిమను పొడిచింది ఎవరో తెలుసుకోవాలని ఉంది మనోహర్ కి.
“వద్దు బాబోయ్! ఆ గొంతును మళ్ళీ నేను వినలేను. ఆ గొంతు అంటేనే భయంగా ఉంది. ఆ గొంతు వినాలంటే, వాడు ఇంకేవరిననినా చంపాలి. అప్పుడు వాడు మళ్ళీ నాకే చేస్తాడు. అందుకే అప్పటినుండి ఫోన్ రిసీవర్ని కూడా పక్కన పడేశాను అంది పద్మ భయపడుతున్న దానిలా గుండెలమీద చేయివేసుకొని.
“అందుకేనా నేనెన్ని సారులు చేసినా ఫోన్ ఎంగేజ్ లో వుంది” అన్నాడు మనోహర్.
“అవును ఆ ఫోనంటేనే నాకు భయంగా ఉంది” అంది పద్మ.
ఆలోచిస్తున్నాడు మనోహర్. మధురిమను ఎవరు పోడిచివుంటారు? ఆ విషయం పద్మ కెందుకు ఫోన్ చేసి చెప్పి ఉంటారు.
“ ఆటను చెప్పింది నిజమేనా అండీ?” అడిగింది పద్మ.
“ఏమో నాకెలా తెలుస్తుంది అన్నాడు మనోహర్.
“అవున్లే! ఆవిడెవరో,మీరెవరో, కాకపోతే వాడెవడో తిక్కతిక్కగా వాగాడనే కానీ, మధురిమ చచ్చిపోతే మీకెలా తెలుస్తుంది.
“పద్మా! మాటిమాటికి మధురిమ చచ్చిపోయింది అని నా ముందు అనకు వినబుద్ధి కావడం లేదు” అన్నాడు కోపంగా మనోహర్.
వింతగా చూసింది పద్మ . ఆ తర్వాత తన చేత్తో తన తలమీద టకీమని ఒకటి కొట్టుకొని.
“అయ్యో! నా మతిమరపు మండిపోనూ అమ్మమ్మ అప్పుడప్పుడు అంటూవుండేది.ఇలాంటి కబుర్లు వేళకాని వేళ చెప్పొద్దని” అంటూ అని తనలో తానే అనుకుంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న మనోహర్ కి వడ్డిస్తూ కూర్చుంది పద్మ.
****
No comments:
Post a Comment