సామ్రాజ్ఞి – 6
భావరాజు పద్మిని
సౌగంధిక మాటలకు ఒక్కసారిగా ముసిరిన సిగ్గుతో తలదించుకుని, కాసేపటికి ఇలా చెప్పసాగింది ప్రమీల.
“చెలీ ! నా మనసును సరిగ్గానే కనిపెట్టావు. ఏ స్త్రీ అయినా కులంలో, గుణంలో, రూపంలో, వయసులో, అంతస్తులో, విద్యలో తనతో సరిసమానమైన వారిని వరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. లోకంలో
అర్జునుడిని మించిన విలుకాడు లేడని ప్రతీతి. చిన్నప్పటి నుంచి అతని విలువిద్యా కౌశలం, ప్రజ్ఞా పాటవాలు విని ఉన్నాను. అజ్ఞాత వాసంలో బృహన్నల రూపంలో అతను ప్రదర్శించిన నృత్య గాన కౌశలాన్ని విన్నాను. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని గురించి తెలుసుకున్నాను. నాకు తెలియకుండానే నా మనసులో అర్జునుడి పట్ల చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది. అతనిని చూడాలని నాకు ఎప్పటినుంచో ఉంది. ఇన్నాళ్ళకు యాగాశ్వానికి కావలిగా అర్జునుడు వచ్చాడన్న వార్త వినగానే ఇన్నాళ్ళుగా మనసులో ఉన్న ఆశలన్నీ ఒక్కసారిగా చిగురించినట్లు అనిపిస్తోంది.”
“ఆహా ! అదన్నమాట సంగతి ! మా సామ్రాజ్ఞి హృదయ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టారా అర్జునుల వారు. మీ చిన్ననాటి నెచ్చెలిగా మీ కలలు, ఆశలు నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. బాగు బాగు, ఇక ఈ కధను శ్రీకృష్ణ పరమాత్ముడే నడపాలి. సరే ఇక కాలవిలంబన అవుతోంది, విశ్రమించండి. నేను వెళ్లొస్తాను,” అంటూ బయలుదేరింది సౌగంధిక.
చెప్పకుండానే తన మనసు తెలుసుకున్నఆమెనే చూస్తూ, తన హంస తూలికా తల్పం కేసి నడిచింది సామ్రాజ్ఞి.
***
ఉదయాన్నే నిద్ర లేచి, పడమటి కనుమలలో ఉదయిస్తున్న సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, సంధ్యావందనం చేసాడు అర్జునుడు. మనోజ్ఞమైన ప్రకృతి శోభ పడమటి కనుమల్లో కానవస్తోంది. మంచు తెరల్ని ఛేదించుకుని వస్తున్న బాలభానుడి కిరణాలు సమీప సరోవర తలంపై బంగారు వన్నెలు పరుస్తున్నాయి. సమీప వనాలలో పక్షుల కిలకిలలు, వన్య మృగాల అలికిడులు మధ్య మధ్య వినవస్తున్నాయి. తమ డేరాల వద్ద గల కాలిబాటలో నడుస్తున్న అర్జునుడి భుజంపై వాలింది ఒక పంచ వన్నెల రామచిలుక. ప్రేమగా దాన్ని నిమురుతూ చేతుల్లోకి తీసుకున్నాడు అర్జునుడు. దాన్ని తన డేరా వద్దకు తీసుకుని వెళ్లి, జామపండు ముక్కలు కోసి దాని ముందు ఉంచాడు. ఆత్రంగా తింటున్న దాన్నే చూస్తూ ఉండగా వచ్చాడో భటుడు.
“జయము జయము సవ్యసాచీ ! సమీప సీమంతినీ నగరం నుంచి ఒక స్త్రీ వేగు అరుదెంచింది. సామ్రాజ్ఞి మీకు ఏదో లేఖను పంపారట ! ప్రవేశ పెట్టమంటారా ?” వినయంగా వంగి నమస్కరిస్తూ అభ్యర్ధించాడు.
“అవశ్యం, తక్షణమే ఆమెను ప్రవేశ పెట్టండి.” ఆజ్ఞాపించాడు అర్జునుడు.
“అర్జున మహారాజులకు వందనం !” తలపై కిరీటం, మొలలో కత్తి, భుజానికి డాలు ధరించి, చేతిలో ఒక లేఖను కలిగిఉన్న నడివయసు స్త్రీ అర్జునుడి డేరాలోకి ప్రవేశించింది.
“కుసుమ కోమలులైన స్త్రీలను మేము ఇటువంటి ఆహార్యంలో ఎప్పుడూ చూసి ఉండలేదు. వందనం తల్లీ. ఎవరు మీరు ?ఏ కార్యార్దమై విచ్చేశారు? మేము మీకు ఏ విధంగా నైనా సహాయపడగలమా ?” మన్ననతో అన్నాడు అర్జునుడు.
“ మహారాజా ! నేను సీమంతినీ నగర దండనాయకిని. నా పేరు వీరవల్లి. సీమంతినీ నగర స్త్రీలంతా, సుశిక్షితులు, సర్వ సమర్ధులు. వారు పురుషుల సాయాన్ని జన్మలో అర్ధించరు. ఇక నేను వచ్చిన కార్యం ఏమిటంటే, మా సామ్రాజ్ఞి ప్రమీల గారు మీకోసం ఒక వర్తమాన లేఖను పంపారు. మీ అన్నగారైన ధర్మరాజుగారు విడిచిన యాగాశ్వాన్ని మేము బంధించాము. దాని గురించే ఇందులో ఉంది, స్వీకరించండి.” అంటూ ముందుకు వచ్చి, జామపండును చిలుకను, ఆర్జునుడిని మార్చిమార్చి చూస్తూ, లేఖను అతనికి అప్పగించింది ఆమె. ఆమె ఆహార్యం, మాటల్లో మగతనం తప్ప, స్త్రీల తాలూకు లాలిత్యం కనబడలేదు అర్జునుడికి. ఆమె వైఖరికి ఆశ్చర్యపోతూనే లేఖను స్వీకరించాడు.
“ఓహో, మా యాగాశ్వం అటుగా వచ్చిందా ? ఉదయం నుంచి మావాళ్ళు వెతుకుతున్నారు. తెల్లగా ముద్దుగా, సర్వాభరణాలతోను మెరుస్తున్న శ్వేతాశ్వాన్ని చూసి, మీరు ముచ్చటపడి ఉంటారు. ఆడుకుని, మళ్ళీ జాగ్రత్తగా పంపెయ్యమని మీ సామ్రాజ్ఞికి చెప్పండి. “ లేఖను చదవకుండానే అన్నాడు అర్జునుడు.
“మహారాజా ! మీరు పొరబడుతున్నారు. మా స్త్రీ సామ్రాజ్య వాసులను మీ రాజ్యంలోని మామూలు స్త్రీలలాగా అంచనా వేస్తున్నట్లు ఉన్నారు. చాలా పొరబడుతున్నారు. మేము ఆడుకునేందుకు యాగాశ్వాన్ని బంధించలేదు. లేఖ చదివి, మాట్లాడితే బాగుంటుంది,” బింకంగా వీరత్వాన్ని ఒలకబోస్తూ అంది వీరవల్లి.
చటుక్కున ఈమెకు మీసాలు ఉంటే ఎలా ఉండేదా, అన్న ఆలోచన కలిగింది అర్జునుడికి. ఆ ఆలోచనకు అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. అతను నవ్వడం చూసి, మరింత కటువుగా మొహం పెట్టుకుని, ఒరలో ఉన్న కత్తి మీద చెయ్యేసి నిల్చుంది వీరవల్లి.
“అబ్బే, మీరు కత్తి దుయ్యనవసరం లేదు వీరవల్లీ దండనాయకీ ! మేము తక్షణమే మీ లేఖను చదువుతాము. ఈ కిరీటికి బాణాలు వెయ్యటం తప్ప, కత్తులు దుయ్యటం రాదు, కాస్త నెమ్మదించండి, శాంతించండి, “ అని ఆమెను ఆటపట్టిస్తూ, లేఖకు ఉన్న దారాన్ని విప్పసాగాడు పార్ధుడు. ఆమెను పొగడడంతో వీరవల్లి ఆనందించడం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.
“పాండవ మధ్యమా ! మంగిడీలు.
మిమ్ము ఎదుర్కునే సత్తా ఉన్న ఏ వీరుడైనా ఈ యాగాశ్వాన్ని బంధించవచ్చునని యాగాశ్వం నుదుటిపై ఉన్న ఫలకంలో చదివాము. వీరత్వం, శూరత్వం కేవలం మగవారి సొత్తే కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. నిజానికి హస్తినాపురంలోని వీరాధివీరుల కెదురొడ్డి నిలువగల సత్తా మా స్త్రీ సామ్రాజ్య వాసులకు ఉంది. అంతెందుకు, సవ్యసాచిగా పేరు గాంచిన మీరు కేవలం ధనుర్విద్య లోనే నిపుణులేమో ! కాని, మా స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీలా దేవి, సకల యుద్ధ విద్యలలోనూ సుశిక్షితురాలు. ఆమెతో తలపడే శక్తియుక్తులు మీకు ఉంటే, యుద్ధంలో మమ్ము ఓడించి, మీ యాగాశ్వాన్ని కైవసం చేసుకోవాల్సిందిగా మిమ్ములను సవాలు చేస్తున్నాము. వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీలు ఉన్నప్పుడే ఆ పోరులో అసలు సిసలు పస తెలుస్తుంది. స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల బాణాల ధాటిని రుచిచూసి, మీ విలువిద్యా నైపుణ్యాన్ని మరొక్కసారి పరీక్షించుకోండి ! తక్షణమే యుద్ధసన్నాహాలు మొదలుపెట్టుకుని, మా వేగు ద్వారా తిరిగి లేఖను పంపగలరు.
ఇట్లు
స్త్రీ సామ్రాజ్య గుర్విణి
శక్తిసేన. “
క్రింద ఆమె సంతకం, రాజముద్ర వేసి ఉన్నాయి. లేఖను చదువుతూ ఉండగానే అర్జునుడి కనుబొమలు ముడిపడ్డాయి. ‘ఏమిటీ విచిత్రం, ఇక్కడి స్త్రీలంతా ఈ వీరవల్లి లాగే గడ్డాలు మీసాలు లేని మగరాయళ్ళ లాగే ఉంటారా ? కురుక్షేత్ర సంగ్రామంలో మహామహులను మట్టుపెట్టిన తమను, యాగాశ్వంతో ఉత్తర భారత దేశ యాత్ర దిగ్విజయంగా ముగించుకుని, ఎందరో వీరాధివీరులను ఓడించి, వెనక్కు లాగి విడిచిన బాణంలా ముందుకు దూసుకుపోతున్న తమను, కేవలం ఒక స్త్రీ సవాలు చెయ్యటమా? కురుక్షేత్ర సంగ్రామంలో అయిన రక్తపాతం చాలనీ, వీలైనంతవరకూ శాంతియుతంగానే యాగాశ్వ పరిరక్షణ చెయ్యమని, స్త్రీలతోనూ, వృద్ధులతోనూ యుద్ధం చెయ్యవద్దనీ, కదా అన్నగారి ఆజ్ఞ. ఇప్పుడు ఏమిటి చెయ్యడం, అసలేమిటి వీళ్ళ ధీమా ? అసలీ సామ్రాజ్ఞి ఎవరు, ఆమె బలాబలాలు, వెనుక ఉన్న బలగం ఎలాంటిది? వివరాలు కనుక్కోకుండా తొందరపడి మాట్లాడకూడదు, సమగ్రమైన సమాచారం సేకరించాలి,’ తనలో తనే అనుకున్నాడు అర్జునుడు.
‘దండనాయకీ, తమరు ఎంతో దూరం నుంచి డస్సిపోయి వచ్చారు. మా ఆతిధ్యం స్వీకరించకుండా వెళ్ళడం భావ్యం కాదు. దూతలను వట్టి చేతులతో పంపే అలవాటు మాకు లేదు. తగిన బహుమతులు, సత్కారాలు సిద్ధం చేయిస్తాము. దయుంచి, మీరు మా హస్తినాపుర సామ్రాజ్య మన్ననలను స్వీకరించి, కొంత తడవు విశ్రమించండి, ఈలోగా లేఖను సిద్ధం చేయిస్తాను. ‘ స్త్రీలతో మాట్లాడేటప్పుడు వాడే నెమ్మదైన స్వరాన్ని ప్రయోగిస్తూ అన్నాడు అర్జునుడు.
‘తప్పకుండా మహారాజా ! మీ ఔదార్యానికి కృతఙ్ఞతలు, మీరు కోరినట్లే కొంతదనుక విశ్రమిస్తాను. ’ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీరవల్లి. అర్జునుడు తన అనుచరులను పిలిచి, ఆమెకు అన్ని ఏర్పాట్లు చూడమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత చిలుకను తన డేరాకు ఉన్న గవాక్షం నుంచి బయటకు విడిచి, అది కనుమరుగు అయ్యేదాకా చూస్తూ ఉండిపోయాడు. తనతో వచ్చిన సర్వసేనానికి కబురు పెట్టి, అతనికై వేచి చూడసాగాడు.
(సశేషం )
No comments:
Post a Comment