శ్రీధరమాధురి – 35
(గురువు గొప్పతనం గురించి పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )
గురువు – జీవన నౌకకు నౌకాధిపతి
చాలా మందిని సముద్రం దాటించే ఒక పెద్ద ఓడ ఉంది. అందులోని వారు ఆనందంగా ఉన్నారు, నాట్యం చేస్తున్నారు, బహుమతులు పంచుకుంటున్నారు, ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటున్నారు. వేడుకలలో, వినోదాలలో తేలియాడుతున్నారు. కొంతమంది ఓడ పైకప్పు మీద డాన్స్ చేస్తున్నారు. కొంతమంది ఓడ పైభాగంలో టెన్నిస్ ఆడుతున్నారు. కొంతమంది అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఈదుతున్నారు. కొంతమంది అద్భుతమైన వంటకాలను రుచి చూస్తున్నారు. కంట్రోల్ రూమ్ లో ఉన్న నౌకాధిపతి ఇదంతా చూసి నవ్వుతున్నారు. ఆయన సముద్రాన్ని దాటించేందుకు ఓడ చక్రం తిప్పుతున్నారు.
ఈ సమయంలో అనుకోకుండా ఒక గొప్ప తుఫాను వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున కెరటాలు ఎగసి పడసాగాయి.ఉరుములు, మెరుపులు, హోరున వాన రాసాగాయి. అంతటా చీకటి మబ్బులు కమ్ముకున్నాయి. వీటి ధాటికి ఓడ ఊగిపోసాగింది. అంతా భయపడి, కంట్రోల్ రూమ్ లో ఉన్న నౌకాధిపతి వద్దకు పరిగెత్తారు.
అతను చక్రం వద్ద లేడు. అతను హాయిగా ఒక ఈజీ చైర్ లో (పాశ్చాత్య దేశాల్లో ఇలా కూర్చునే వారిని ‘లేజీ బాయ్’ అంటారు) కూర్చున్నాడు. అతను సిగరెట్ కాల్చి చాలాకాలం అయింది. కాబట్టి, అది తీసుకుని, వెలిగించి, పొగను పీల్చసాగాడు.
అతని వైఖరిని చూసి ప్రయాణీకులు అవాక్కయ్యారు. అతన్ని ఇలా అడిగారు, “ఓ కెప్టెన్, ఏమైనా చెయ్యండి. తుఫాను వస్తోంది. మేమంతా మా భద్రత గురించి భయపడుతున్నాము.’
కాప్టైన్ నవ్వి, ఇలా అన్నారు, ‘ అన్నీ బాగానే ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉన్నారు, నన్ను చక్రం వద్ద నౌకను నియంత్రిస్తూ చూసారు. నిజానికి అదంతా ఒక డ్రామానే. నేను నియంత్రిస్తూ ఉన్నట్లు కనిపించాను, అంతే. అన్నీ బాగానే ఉన్నప్పుడు, సవ్యంగా నడుస్తున్నప్పుడు, నేనే నియంత్రిస్తున్నట్లుగా కనిపించింది. కాని నిజం ఏమిటంటే, దైవమే మీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు, నాకు చేసేందుకు ఏమీ లేదు. ఇప్పుడు ఓడ తుఫానులో చిక్కుకున్నప్పుడు కూడా, నేను ఓడను నియంత్రించలేదు, దైవమే జాగ్రత్త తీసుకుంటారు. సవ్యంగా ఏది నడిచినా నడవకపోయినా నా చేతుల్లో ఏమీ లేదు. అన్ని స్థితిగాతుల్లోనూ, దైవమే ఓడ గురించి జాగ్రత్త తీసుకుంటున్నారు, యాదృచ్చికంగా నేను కాప్టైన్ గా నియమించబడ్డాను. ఈ సముద్రం గుండా నేను అనేక ప్రయాణాలు చేసాను. దైవం యొక్క దయవల్ల నేను మన నియంత్రణలో ఏదీ ఉండదని, అన్నింటినీ దైవమే నియంత్రిస్తారని తెలుసుకున్నాను. మీలో ఎవరికైనా సిగరెట్లు కావాలంటే, నా దగ్గర చాలా ఉన్నాయి. మీరూ తీసుకుని, హాయిగా తాగండి. ప్రార్ధిస్తూ ఉండండి. ఈ ఓడ మీద ప్రయాణం జీవనయానం వంటిది. అన్నీ బాగున్నప్పుడు నేను అమితానందం పొందను, బాగోనప్పుడు బాగా దిగులుపడను. దైవానుగ్రహం వలన ఈ రెండిటికీ మధ్య సమతుల్యతను నేను సాధించాను. అలౌకికమైన ఆనందం మధ్యలో ఉండడం వల్లనే కలుగుతుందని నేను తెలుసుకున్నాను. అందుకే నమ్మకాన్ని కలిగి ఉండి సాగిపొండి. త్వరలోనే స్పష్టత కలుగుతుంది. ‘
ఆ కెప్టెన్ ఇలా అనగానే సముద్రం మళ్ళీ మామూలుగా మారిపోయింది, తుఫాను దాటిపోయింది.
ఆ నావకు నౌకాధిపతి ... ఒక గొప్ప గురువు. అంతా దైవానుగ్రహం.
****
హృదయంతో పనిచేస్తున్నప్పుడు గురువు చెప్పేదంతా మీరు అర్ధం చేసుకోవచ్చు, అదే తెలివితేటలతో పనిచేస్తూ ఉంటే, సందేహాలు తప్పవు.
***
గురువు పనిలో ఉంటే ఒక ఆటలో ఉన్నట్లే, కాని ఆటాడుతూ ఉన్నట్లు మాత్రం కాదు.
***
బుద్ధి మిమ్మల్ని అనేక ముసుగులు ధరించేలా చేస్తుంది. మీ భార్య కోసం మీరొక ముసుగు వేసుకుంటారు, మీ భర్త కోసం మీరొక ముసుగు వేసుకుంటారు. మీ పిల్లల ముందు పూర్తిగా విభిన్నమైన ముసుగు ధరిస్తారు. మీ తల్లిదండ్రుల ముందు మీరొక ముసుగు వేసుకుంటారు, స్నేహితుల ముందు మరొకటి, కాబట్టి, బుద్ధికి ఉన్న ఈ లక్షణం మీరు అనేక ముసుగులను ధరించేలా చేస్తుంది. మీరు గురువు వద్దకు వెళ్ళినప్పుడు, మీరొక ముసుగు ధరించగానే ఆయన మిమ్మల్ని చూసి నవ్వుతారు. మిమ్మల్ని చూసి ఆయన ఆనందిస్తున్నారని మీకు అనిపిస్తుంది. కాని, గురువు మీరు తొడుక్కుని వచ్చిన ముసుగును చూసి, నవ్వుతారు. ఆయనకు మీ అసలు రంగు తెలుసు. కాబట్టి, కనీసం గురువు వద్దకు వెళ్లినప్పుడైనా ,ముసుగును ధరించకండి. బుద్ధితో కప్పుకుని కాకుండా, నిండు మనసుతో వెళ్ళండి. గురువే సత్యం.
***
గురువుకు చాలా సహనం ఉంటుంది. ఆయన అన్నింటినీ శ్రద్ధగా విని, గుర్తుంచుకుంటారు. అలాగని మీరు ఆయనను చెత్త బుట్టలా భావించకూడదు, పనికిమాలిన విషయాలు ఆయనతో ప్రస్తావించకూడదు.
***
మనం తల్లిదండ్రులతో చెప్పుకోదగ్గ కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి.
మనం భార్య/భర్తతో చెప్పుకోదగ్గ కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి.
మనం స్నేహితులతో చెప్పుకోదగ్గ కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి.
కాని గురువులతో మనం ఏదైనా చెప్పుకోవచ్చు, ప్రతీదీ చెప్పవచ్చు. అలా చెప్పేందుకు మీకేమైనా అభ్యంతరం ఉన్నట్లయితే, ఆయన మీ గురువు కాదు.
***
ఒక సన్యాసి (Monk)మిమ్మల్ని చూసి నవ్వారు అంటే, ఆయనకు ఒకప్పుడు తను కూడా ఒక కోతిలా (Monkey) అల్లరి చేసేవాడినని తెలుసు. తర్వాత, బుద్ధిని వదిలేసినప్పుడు ఆయన సన్యాసి అయ్యారు. కోతులు సన్యాసుల లాగా మారడమన్న ప్రక్రియకు కేవలం కాస్తంత సమయం పడుతుందని వారికి తెలుసు.
***
మనమంతా ఒక విధంగా కోతులమే (Monkeys). కొందరి విషయంలో బుద్ధి అనే తాళంచెవి(Key) పడిపోగానే వారు సన్యాసులు (Monks) గా మారతారు.
***
బౌద్ధ మఠం ... సన్యాసి... దయ...
అప్పుడే అందరు సన్యాసులు తమ ధ్యానాన్ని ముగించారు. మఠాధిపతి విశ్రాంతి తీసుకునేందుకు తన గదికి వెళ్లనున్నారు.
సన్యాసి – గురువర్యా, మీ పరీక్ష కోసం ఎవరో తలుపువద్ద నిరీక్షిస్తున్నారు,
మఠాధిపతి –అతన్ని నా గది వద్దకు తీసుకుని రండి.
ఆయన గదిలోకి ప్రవేశించగానే, మఠాధిపతి ఒక 20 ఏళ్ళ వయసున్న యువకుడు తనకోసం నిరీక్షించడాన్నిచూసారు.
మఠాధిపతి – ఎవరునువ్వు ? నీకేమి కావాలి ?
సందర్శకుడు – నాకు సన్యాసి కావాలని ఉంది. నాకు ఎటువంటి విద్యా పరిజ్ఞానం లేదు. మా నాన్నగారు నాకు చెస్ ఆడడం నేర్పారు, అదొక్కటే బాగా ఆడగలను.మఠాధిపతి – పర్వాలేదు, మేము నిన్ను చేర్చుకుని, సన్యాసం ఇప్పించగలము. కాని, ప్రస్తుతం మఠం నిండుగా ఉంది. అయినా నీకొక అవకాశం ఉంది.
మఠాధిపతి తన శిష్యులతో : ఈ సందర్శకుడు మఠంలో చేరాలని అనుకుంటున్నాడు, అతనికి చదరంగం తప్ప ఏమీ తెలీదు. అందుకే సన్యాసి ‘బాషో’ ఈ కుర్రవాడితో చదరంగం ఆడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒకవేళ బాషో గెలిస్తే, అతను మఠం వదిలి వెళ్ళాలి, అతని బదులు ఈ సందర్శకుడు మఠంలో చేరతాడు. సందర్శకుడు ఓడిపోతే, అతనికి మనతో ఉండే అవకాశం ఉండదు.
మఠాధిపతి ముందుకు ఒక చదరంగం బోర్డు తీసుకుని రాబడింది. ఆట మొదలైంది. సందర్శకుడు బాగా ఆడుతున్నాడు, కాని బాషో అతనితో పోటీ పడలేకపోతున్నాడు. సందర్శకుడు హఠాత్తుగా బాషో ముఖం వంక చూసాడు. అతను చాలా పవిత్రంగా, మౌనంగా ఉన్నాడు. అతని కళ్ళలో ఎంతో శాంతి ద్యోతకమవుతుంది. సందర్శకుడు ఇలా అనుకున్నాడు,’ఈ సన్యాసి మఠంలో ఉంటే, అది ప్రపంచానికి మంచిది. ఈ విషయం తాను సన్యాసి కావడం కంటే గొప్ప విషయమని అతనికి అనిపించింది.
అందుకే సందర్శకుడు, కావాలనే ఒక్కొక్క అడుగులో ఆటను ఓడిపోవడం మొదలుపెట్టాడు. అతనికి సన్యాసి ఓడిపోవడం ఇష్టం లేదు. మఠాధిపతి ఇది గమనించి, వెంటనే అక్కడికి వచ్చి, ఆట చెక్కను తీసి విసిరేశారు.
మఠాధిపతి – నీకు ఈ ఆటను గెలిచేందుకు తగిన నైపుణ్యం, సామర్ధ్యం ఉన్నాయి. కాని, నీలోని దయ నీవీ ఆటలో ఓడిపోయేలా చేస్తోంది. ఈ సన్యాసి ఓడిపోతే బయటకు వెళ్లిపోతాడని నువ్వు భయపడ్డావు. ఇదే నేను తెలుసుకోవాలని అనుకున్నది. మా మఠానికి స్వాగతం. పిల్లలూ, ఇతని తలను గొరిగి, స్నానం చేయించి, కొత్త దుస్తులు తొడిగి, ఇతన్ని ధ్యాన మందిరానికి తీసుకుని రండి. ఈ దయగల వ్యక్తికి మనం సన్యాసం ఇవ్వాలి.
***
శిష్యుడు వక్ర బుద్ధితో ఆడే ఆటలకు గురువు లోబడరు. ఒకవేళ శిష్యుడు గురువు వంక తెలివితేటలు ప్రదర్శిస్తూ చూస్తే, గురువు శిష్యుడు ఊహించనిది ఏదో చేసి, అతని బుద్ధి నశించేలా చేస్తారు. ఈ విధంగా ఆయన శిష్యుడి బుద్ధిని విశ్రమించే ప్రక్రియలో పెడతారు.
***
No comments:
Post a Comment