శ్రీ రామకర్ణామృతం - 15 - అచ్చంగా తెలుగు

శ్రీ రామకర్ణామృతం - 15

Share This

 శ్రీ రామకర్ణామృతం - 15 

(ద్వితీయాశ్వాసము)

 డా.బల్లూరి ఉమాదేవి



41.శ్లో:సత్యజ్ఞాన మనంత మచ్యుత మజం చావ్యాకృతం తత్పరం
కూటస్థాది సమస్త సాక్షిమనఘం సాక్షాద్విరాట్తత్త్వదమ్
  వేద్యం విశ్వమయం స్వలీన భువనః స్వారాజ్య సౌఖ్యప్రదం
 పూర్ణం పూర్ణతరం పురాణపురుషం రావం భజే తారకమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:అనఘున్ బూర్ణు ననంతు నచ్యుతుని సత్యజ్ఞానమూర్తిన్ విరా
 ట్తను విశ్వాత్ము జగన్మయున్ వరదు గూటస్థాయి సాక్షిన్ సనా
 తను నవ్యాకృతు జీవతత్త్వపరు సుత్రామాది భోగవ్రతున్
 ఘనునిన్ వేద్యు బురాణపూరుషు నజున్ గాకుత్స్థు సేవించెదన్.
భావము:
సత్యజ్ఞాన రూపుడును నాశము లేనట్టి సర్వత్ర ఎడబాయనట్టి పుట్టుకలేని వికారములేని ప్రధానుడైనట్టి కూటస్థరూపుడు మొదలగు సమస్థమునకు సాక్షియైనట్టి దోషములేనట్టి కేవల విరాట్స్వరూపుడైనట్టి  తెలియదగినట్టి ప్రపంచరూపుడై దనయందణిగిన లోకములు గలవాడై మోక్షసౌఖ్యము నిచ్చునట్టి సర్వత్ర నిండియున్నట్టి  పూర్వికుడైనట్టి తారకరాముని సేవించుచున్నాను.
42.శ్లో:రామం రాక్షసవంశ నాశనకరం రాకేందు బింబాననం
 రక్షోరిం రఘువంశవర్ధనకరం రక్తాధరం రాఘవమ్
 రాధాయాత్మనివాసినం రవినిభం రమ్యం రమానాయకం
రంధ్రాతర్గత శేషశాయిన మహం రామం భజే తారకమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:అమరద్వేషి కులాటవీదహను రంధ్రాంతర్గతా హీంద్రత
 ల్పు మహాత్మున్ బరిపూర్ణ చంద్రముఖు రామున్ శ్రీరమా నాయకున్
  గమలాప్తోజ్జ్వలు బల్లవాధరు జగత్కళ్యాణు శ్రీరాఘవున్
  రమణీయున్ రఘువంశ దీప్తు గొలుతున్ రాధాత్మసంస్థాయినిన్.
భావము:
రాక్షసవంశమును నశింప చేసినట్టి పూర్ణచంద్రుని వంటి మొగము గలిగినట్టి రాక్షస శత్రువైనట్టి రఘువంశమును వృద్ధి చేయునట్టి యెర్రని యధరోష్ఠము కలిగినట్టి రఘువంశమందు పుట్టినట్టి రాధాదేవియొక్క శుభావహ దైవముగల హృదయమందు నివసించినట్టి సూర్యునితో తుల్యుడైనట్టి సుందరుడైనట్టి లక్ష్మీనాథుడైనట్టి హృదయరంధ్రమందున్నట్టి కుండలి యందున్నట్టి తారకరాముని సేవించుచున్నాను.
43శ్లో:తారాకారం నిఖిల నిలయం తత్త్వమస్యాది లక్ష్యం
  శబ్దవాచ్యం త్రిగుణ రహితం వ్యోమ మంగుష్ఠమాత్రం
  నిర్వాణాఖ్యం సగుణమగుణం వ్యోమ రంధ్రాంతరాస్థం
సౌషుమ్నాంతః ప్రణవసహితం రామచంద్రం భజేహమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:ప్రకటవ్యోమ బిలాంతరస్థు సగుణున్ రమాధిపున్ లోకనా
 యకు దారాకృతి ముక్తి సంజకు సుషుమ్నాంతః స్థితోంకార వ
 ర్ణకరాహిత్యు నశబ్దు నిత్యు బుధులెన్నన్ తత్వమస్యాది ల
 క్ష్యు గళాస్థాను భజింతు నిర్గుణుని నంగుష్ఠ ప్రమాణున్ హరిన్.
భావము:
తరింపచేయు స్వరూపము కలిగినట్టి సమస్తమునకు స్థానమైనట్టి తత్త్వమస్యాది వాక్యములకు గురియైనట్టిరశబ్దములచే చెప్పదగినట్టి సత్త్వ రజస్తమో గుణశూన్యుడైనట్టి ఆకాశరూపుడైనట్టి బొటన వ్రేలియంత ప్రమాణము కలిగినట్టి మోక్షశోభకలిగినట్టి సగుణనిర్గుణరూపుడైనట్టి ఆకాశరంధ్రమధ్యమందుండువాడై సుషుమ్నానాడియందు నాదాలీనుడై యున్నట్టి శ్రీరాముని సేవించుచున్నాను.
44.శ్లో:ముక్తేర్మూలం మునివర హృదానందకందం ముకుందం
  కూటస్థాఖ్యం సకలవరదం సర్వచైతన్యరూపమ్
  నాదాతీతం కమలనిలయం నాదనాదాంత తత్త్వం
  నాదాతీతం ప్రకృతిరహితం రామచంద్రం భజేహం
తెలుగు అనువాద పద్యము:
మ:మునిహృత్తోషకరున్ ప్రధానరహితున్ మోక్షాధి నాథున్ సనా
 తను గూటస్థుని సర్వవిశ్వమయు జైతన్యాకృతిన్ గృత్స్న నం
 దను సర్వాత్ము ముకుందు లోకవరదున్ నాదాంత తత్త్వాత్ము న
త్యనఘున్ రాము ధరాసుతాధిపతి నాదాతీతు భావించెదన్.
భావము:
మోక్షకారణమైనట్టి మునులమనస్సు నందానందమునకు హేతువైనట్టి ముకుందనామము కలిగినట్టి కూటస్థ చైతన్యరూపుడైనట్టి అందరికి వరముల నిచ్చునట్టి సర్వప్రాణిరూపుడైనట్టి శబ్దబ్రహ్మము నతిక్రమించినట్టి సహస్రార పద్మమునందు స్థానము కలిగినట్టి ఓంకార ధ్వనియొక్క వాస్తవ రూపడైనట్టి ప్రకృతి శూన్యుడైన రామచంద్రుని సేవించుచున్నాను.
45.శ్లో:నిజానందాకారం నిగమ తురగారాధితపదం
  పరబ్రహ్మానందం పరమపదగం పాపహరణం
  కృపాపారావారం పరమపురుషం పద్మనిలయం
  భజే రామం శ్యామం ప్రకృతిరహితం నిర్గుణ మహమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:పరమామ్నాయ తురంగ సేవిత లసత్పాదాంబుజ ద్వంద్వు బం
 కరుహా స్థాను గృపాబ్ధి నిర్గుణు నఘౌఘధ్వంసు
రమ్యుం బరా
త్పరమంబున్ బురుషోత్తమున్ బరు బరబ్రహ్ము న్నిజానందు శ్రీ
హరి శ్రీరాము ప్రధాన వర్జితుఘనశ్యామాంగు భావించెదన్.
భావము:
తనయానందమే తానైనట్టి  శివునిచే పూజింపబడు పాదములు కలిగినట్టి పరబ్రహ్మరూపమున రమించదగినట్టి మోక్షస్థానమును పొందినట్టి పాపములను హరించునట్టి దయకు సముద్రుడైనట్టి ప్రధాన పురుషుడైనట్టి సహస్రారమందు నివసించిన్నట్టి నల్లనైనట్టి పఅరకృతిశూన్యుడు నిర్గుణుడు నైనట్టి రాముని నేను సేవించుచున్నాను.
46.శ్లో:శ్రీమద్వైకుంఠ నాథం సురముని మకుట ద్యోతిత స్వర్ణపీఠం
నీలాంగం చంద్రవక్త్రం మణిమయమకుటం బాణకోదండ హస్తం
పద్మాక్షం పాపనాశం ప్రణవమయ మహారత్న సింహాసనస్థం
శ్రీసీతా వామభాగం శ్రితజనవరదం రామచంద్రం భజేహమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:తతవైకుంఠ విభున్ మణిమకుటు గోదండాస్త్రహస్తున్ సమా
 గత గీర్వాణ కిరీట రత్నరుచిరాక్రాంతాంఘ్రి యుగ్మున్ శత
 క్రతు నీలాంగు శశాంక వక్త్రు లసదోంకారాసనున్ జానకీ
 యుతు గంజేక్షణు రాము బాపహరు నాద్యుం దారకుం గొల్చెదన్.
భావము:
శోభాయుక్తమగు వైకుంఠమునకధిపతియైనట్టి దేవతల యొక్క మునులయొక్క కిరీటములచే ప్రకాశింపచేయబడిన బంగారు పాదపీఠము కలిగినట్టి నల్లని శరీరము కలిగినట్టి చంద్రునివంటి మోము కలిగినట్టి మాణిక్యకిరీటము కలిగినట్టి ధనుర్బాణములు హస్తమందు కలిగినట్టి పద్మములవంటి నేత్రములు కలిగినట్టి పాపములను నశింపచేయునట్టి ఓంకారరూప రత్నపీఠమునందున్నట్టి వామభాగమందు సీను కలిగినట్టి ఆశ్రయించువారికి వరములనిచ్చునట్టి రామచంద్రుని సేవించుచున్నాను.
47.శ్లో:సాకేత మణిమంటపే  సురతరుప్రాంతే విమానాంతరే
  పద్మేచాష్టదళోజ్జ్వలేనుతమహా సౌధే సుధామాన్వితే
సత్యం సూర్యజ రావణానుజ మరుత్పుత్రానుజై సేవితం
 మధ్యే వాసవ నీలకోమల నిభం రామం భజే తారకమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:ప్రకటాయోధ్యను గల్పమూలముల హర్మ్యంబందు విభ్రాజ పు
ష్పక మధ్యాష్టదళాబ్జమధ్యమున భాస్వద్గేహమందున్ సుర
ప్రకరంబుల్ రవిపుత్ర ముఖ్యు లనుజుల్ భావింప దన్మధ్యమం
 దకలంకుండగు నీలరత్ననిభు రామాధీశు బ్రార్థించెదన్.
భావము:
అయోధ్య యందు రత్నమంటపమందు కల్పవృక్షసమీపమున విమానమధ్యమందు అష్టదళపద్మమందు మంచికాంతిగల ఎన్నికెక్కిన గొప్పమేడయందు సత్యస్వరూపుడై సుగ్రీవ విభీషణాంజనేయులచే సేవించబడుచున్నట్టి వారిమధ్యమందు యింద్రనీలమాణిక్యములతో తుల్యుడైనట్టి తారకరాముని సేవించుచున్నాను.
48.శ్లో:హృదయకుహర మధ్యద్యోతి తన్మంత్రసారం
   నిగమ నియమ గమ్యం వేదశాస్త్రే రచింత్యమ్
  హరిహర విధివంద్యం హంసమంత్రాంతరస్థం
  దశరథసుతమీళే దైవతం దేవతానామ్.
తెలుగు అనువాద పద్యము:
మ:హరి భర్గాబ్జభవాది వంద్యు హృదయాబ్జాభ్యంతర జ్యోతి సు
స్థిర మంత్ర ప్రకటార్థ సారతరు రాజీవాక్షు శాస్త్రాగమ
స్ఫురదాకారు నచింత్యు వేదమయు సంపూర్ణున్ వచోగమ్యు వే
మరు రామప్రభు దేవదేవు గొలుతున్ మంత్రాంతరాంతర్గతున్.
భావము:
హృదయాకాశమధ్యమందు ప్రకాశించు 'తత్' అను మంత్రమునకు సారమైనట్టి వేదనియమముచే పొందదగినట్టి వేదశాస్త్రములచే చింతింప శక్యముగానట్టి బ్రహ్మ విష్ణు శివులకు నమస్కరించదగినట్టి హంసమంత్రమధ్యమందున్నట్టి దేవదలకు దేవుడై దశరథ పుత్రుడైనట్టి రాముని స్తుతించుచున్నాను.
49.శ్లో:దేవేంద్రనీల నవమేఘ వినిర్జితాంగం
 పూర్ణేందు బింబ వదనం శరచాపహస్తమ్
 సీతాసమేత మనిశం శరణం శరణ్యం
చేతో మదీయ మభివాంఛతి రామచంద్రమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:హరి నీలోత్పల మేఘసంపద పహారాంగున్ ధరా పుత్రికా
వరు గోదండ శరోజ్జ్వలోత్కర కరున్ భద్రాసనాసీను దా
శరథిన్  పూర్ణ శశాంక బింబ వదనున్ సర్వాత్ము శ్రీరాము శ్రీ
 కర భక్తాంగణ కల్పకంబు మనమాకాంక్షించి  సేవింపుమా.
భావము:
జయించబడిన యింద్రనీలములు క్రొత్తమేఘముగలదేహము గలిగినట్టి పూర్ణచంద్రబింబము వంటి మోము కలిగినట్టి ధనుర్బాణములు హస్తమందు కలిగినట్టి సీతతోకూడినట్టి రక్షకుడైనట్టి రామచంద్రుని నాచిత్తము శరణుగోరుచున్నది.
50:శ్లో:ఓతప్రోత సమస్త వస్తునిచయం చోంకార బీజాక్షరం
   ఓంకారప్రకృతిం షడక్షరహితం హ్యోంకారకందాంకురమ్
  ఓంకారస్ఫుట భూర్భువస్సువరితం త్వోఘత్రయారాధితం
 ఓంకారోజ్జ్వల సింహపీఠ నిలయం రామంభజే తారకమ్.
తెలుగు అనువాద పద్యము:
శా:ఓంకార ప్రకృతిన్ షడక్షరహితున్ ఓంకారకందాంకురున్
ఓంకార స్ఫుట భూర్భువస్సువరితం త్వోఘత్రయారాధితం
ఓంకారోజ్జ్వల సింహపీఠనిలయం రామం భజే తారకమ్.
భావము:
బట్ట నిలువుగాను అడ్డముగానూ నేసినట్లు సమస్తవస్తు సముదాయములో ప్రవేశించియున్నట్టి ఓంకారమను బీజాక్షరము కలిగి ఓంకారము ప్రధానముగా కలిగిన షడక్షరమంత్రము యిష్టముగా కలిగినట్టి ఓంకారమనెడి దుంపకు మొలకయైనట్టి ఓంకారముచేత స్ఫుటమైన భూర్భువ శబ్దములచేత పొందబడినట్టి త్రివేణులచేత నారాధింపబడినట్టి ప్రణవముచే ప్రకాశించుచున్న సింహాసనము స్థానము గలట్టి తారకరాముని సేవించుచున్నాను.

No comments:

Post a Comment

Pages