శ్రీసతికరుణే దిక్కు జీవుల కెల్లా - అచ్చంగా తెలుగు

శ్రీసతికరుణే దిక్కు జీవుల కెల్లా

Share This

శ్రీసతికరుణే దిక్కు జీవుల కెల్లా

డా.తాడేపల్లి పతంజలి 


తాళ్ళపాక సాహిత్యంలో శ్రీతో మొదలయ్యే 19  కీర్తనలు ఇవి
1        155     అన్నమాచార్య            శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
1        264    అన్నమాచార్య            శ్రీశోఽయం సుస్థిరోఽయం
1        406    అన్నమాచార్య            శ్రీహరి సేసిన చిహ్నలివి యీ
1        425    అన్నమాచార్య            శ్రీవేంకటేశుఁడు శ్రీపతియు నితఁడే
2        107    అన్నమాచార్య            శ్రీవేంకటేశ్వరుఁడు చేరి విజయము
2        147     అన్నమాచార్య            శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో
2        221     అన్నమాచార్య            శ్రీవేంకటేశ్వరుని సింగారము
2        258    అన్నమాచార్య             శ్రీపతి నీవు సిద్ధించుటే సిద్ధులన్నియు
3        169     అన్నమాచార్య            శ్రీపతి యీతఁడుండగాఁ జిక్కినవారి
3        527    అన్నమాచార్య            శ్రీహరి నిత్యశేషగిరీశ
3        573    అన్నమాచార్య            శ్రీపతి యొకఁడే శరణము మాకును
4        107    అన్నమాచార్య            శ్రీపతి నీ సేవ చిత్తము గోరదు
4        427    అన్నమాచార్య            శ్రీపతి నీ కెదురుచూచే నాకు నిట్లనే
4        479    అన్నమాచార్య            శ్రీసతీశ బహుజీవచైతన్యుఁడవు నీవు
7        198     అన్నమాచార్య            శ్రీ వేంకటేశ్వరునికి చెలి
10      51      చినతిరుమలాచార్య       శ్రీపతిపురనాయకా
14      240    అన్నమాచార్య            శ్రీవేంకటేశ్వరుఁడు శ్రీయలమేల్మంగ
15      138     పెదతిరుమలాచార్య       శ్రీపతియె రక్షించుఁ గాక
15      269    పెదతిరుమలాచార్య       శ్రీసతికరుణే దిక్కు జీవుల
ఇందులో శ్రీసతికరుణే దిక్కు జీవుల కెల్లా అను కీర్తన పూర్వాపరాలు చూద్దాం
అయ్య వేంకటేశుని దయ కావాలంటే అలమేలుమంగ దయ ముందుగా కావాలని , ఆమె పక్కనుండగా విష్ణు స్వరూపియయిన వేంకటేశుడు అందరిని సంహరించాడు కాని, ఆమె పక్కనుండగ  కొద్ది పాటి శిక్ష లేదా అసలు శిక్ష లేకుండానే  విష్ణు స్వరూపియయిన వేంకటేశుడు క్షమించి వదిలివేసాడని తాళ్ళపాక వారు ఈ కీర్తనలో చెబుతున్నారు.
శ్రీసతికరుణే దిక్కు/  జీవుల కెల్లా
వాసుదేవుఁడా రమణీ/వశమై యుండఁగను        ॥పల్లవి॥
 సీతవద్దనుండ రాము/చేఁ గాకాసురునకు
నాతలఁ బ్రాణము నిల్చె/ నపరాధియైనాను
యేతుల రావణాసురుఁ /డిటువంటివాఁడే కాఁడా
కాతరాన నొంటిఁ జిక్కి /పిండతుండా లాయెను    ॥శ్రీసతి॥
కదిసి రుక్మిణి యుండఁ/గాఁ గృష్ణునిచే రుక్మికి
అదన బ్రదుకు గల్గె /నతిద్రోహి యైనాను
యెదుటనే శిశుపాలుఁ /డీరీతివాఁడే కాఁడా
తుద సభలో వదరి /తునకలై పడెను     ॥శ్రీసతి॥
సిరితొడ పైనుండఁగ/ శ్రీనరసింహుచే దైత్య
గురుపుత్రులు నిలిచిరి/ క్రూరకర్ము లైనాను
పరగ శ్రీవేంకటేశు/పగ గాఁడా హిరణ్యుఁడు
గరిమ నదరిపాటు/గాఁగాఁ బొలిసెను      ॥శ్రీసతి॥
(అధ్యాత్మ సంకీర్తన రేకు: 48-1సంపుటము: 15-269)
తాత్పర్యము
పల్లవి
2.శ్రీసతికరుణే దిక్కు/  జీవుల కెల్లా
1.వాసుదేవుఁడా రమణీ/వశమై యుండఁగను
2.వసుదేవుని కొడుకయిన శ్రీ కృష్ణుడు ( వాసుదేవుడు) ఆ సుందరమైన స్త్రీ లక్ష్మీదేవి వశమై ఉండగా -
1.సమస్త (ఎల్లా) జీవులకు శోభతో కూడిన లక్ష్మీదేవి కరుణే దిక్కు.
01 వచరణం
 సీతవద్దనుండ రాము/చేఁ గాకాసురునకు
నాతలఁ బ్రాణము నిల్చె/ నపరాధియైనాను
సీతరూపంలో లక్ష్మి దగ్గరగా ఉండగా విష్ణు స్వరూపుడైన  రాముని చేత
కాకాసురుడను రాక్షసునకు –
నేరము చేసినవాడైనప్పటికి ( అపరాధియైనాను) తర్వాత కాలములో (ఆతల) అతని ప్రాణము నిలబడింది.
యేతుల రావణాసురుఁ /డిటువంటివాఁడే కాఁడా
కాతరాన నొంటిఁ జిక్కి /పిండతుండా లాయెను    ॥శ్రీసతి॥
బడాయి మాటలు (ఏతులు) మాట్లాడిన రావణాసురుడు కూడా కాకాసురుని వంటి వాడే కదా( ఇటువంటి వాడే కాడా)
కాని పిరికితనంతో  (కాతరాన) పక్కన  సీతమ్మ లేకుండా ఉన్న రామునికి చిక్కి   రావణుడు రాముని  బాణములతో అనేక ముక్కలు ముక్కలు అయ్యాడు (పిండతుండా లాయెను)
విశేషము
చంపదగినవాడైనప్పటికీ కాకాసురుడిని  రాముడు దయతో కాపాడాడు.
రావణాసురుడు, కాకాసురుడు ఈ ఇద్దరూ సీతమ్మ విషయంలో సమానంగానే అపరాధం చేసినా సీతమ్మ పక్కన ఉన్నందు వల్ల కాకాసురుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
నిజానికి సీతమ్మతల్లి వక్షాన్ని గాయపరిచి కాకాసురుడే ఇంకా పెద్ద తప్పు చేశాడు.
 అయినప్పటికీ ఆ తల్లి బిడ్డ తప్పును మన్నించి, కాపాడింది.
రాముడు దర్భతో ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కాకాసురుని వెంటబడిందే తప్ప వధించలేదు.
 కాకాసురుడు ముల్లోకాలూ తిరిగి చివరికి రాముని ఎదుటకే వచ్చి పడ్డాడు.
రాముని అస్త్రాన్ని అడ్డుకోగలవారెవరు? ఇంకెవరు….అమ్మయే.
బిడ్డ తప్పు చేస్తే తల్లి చంపుకుంటుందా?
అయ్యో పిల్లివాడు ఏమవుతాడోనని సీతమ్మ దృష్టి అంతా కాకాసురుని పైనే ఉంది.
 అంటే బ్రహ్మాస్త్రానికీ కాకాసురునికీ మధ్య అమ్మ చూపూ అడ్డుగా నిలిచింది.
అమ్మకు అమృతదృక్‌, అమృతా అని పేర్లున్నాయి.
 అమ్మవారి చూపులు అమృతం చిలకరిస్తాయని అర్థం.
అమ్మవారి స్పర్శ అమృతం చిలకరిస్తుంది.
అసలు అమ్మవారే అమృతం.
కాని సీతమ్మ లేకుండా ఉన్న రామునికి చిక్కి   రావణుడు రాముని  బాణములతో అనేక ముక్కలు ముక్కలు అయ్యాడని కవి వాక్కు.
2 వచరనం
కదిసి రుక్మిణి యుండఁ/గాఁ గృష్ణునిచే రుక్మికి
అదన బ్రదుకు గల్గె /నతిద్రోహి యైనాను
విదర్భదేశపు రాజు అగు భీష్మకుని పెద్దకొడుకు  మరియూ రుక్మిణి అన్నఅయిన రుక్మి –  అతిద్రోహి . అయినప్పటికీ  సోదరి రుక్మిణి దేవితో
కృష్ణుడు కలిసి ఉన్న సమయములో యుధ్ధ ద్రోహము చేసాడు కనుక –
అవకాశం లభించి(అదన) బతికాడు.
యెదుటనే శిశుపాలుఁ /డీరీతివాఁడే కాఁడా
తుద సభలో వదరి /తునకలై పడెను     ॥శ్రీసతి॥
శ్రీ కృష్ణునకు ఎదురుగా (ఎదుటనే) ఉండి  నిందించిన శిశుపాలుడు రుక్మి లాంటి దుర్మార్గుడే కదా !(ఇటువంటివాడే కదా ! )
కాని అమ్మ పక్కనలేదు కాబట్టి – నిండు సభలో అనవసరముగ మాటలు పేలి(వదరి)  శ్రీ కృష్ణుని చేతి చక్రముతో ముక్కలయ్యాడు. (తునకలై పడెను)
విశేషము
రుక్మి విదర్భ దేశాన్ని పరిపాలించే భీష్మకుడు అనే రాజు యొక్క పెద్ద కుమారుడు. ఇతనికి రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే నలుగురు సోదరులు మరియు రుక్మిణి అనే సోదరి ఉంది.
శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి దేవి ఒకరినొకరు ఇష్టపడతారు. రుక్మి మాత్రం తన సోదరిని శిశుపాలుడు కిచ్చి చేయాలని తీర్మానిస్తాడు. ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. వివాహ సమయంలో అనుకున్న ప్రకారము రుక్మిణీ దేవి నగర పొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది. అందరు చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు. రుక్మి తన సేనతో వెళ్ళి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలస్తుంటే రుక్మిణీ దేవి శ్రీకృష్ణుడి కాళ్ళపై పడి తన సోదరుడిని క్షమించి విడిచి పెట్టమంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించి సన్మానం చేస్తాడు.
రుక్మిణీదేవి అంటే లక్ష్మీదేవి. ఆమె పక్కన ఉంది కాబట్టి శ్రీకృష్ణుడు
రుక్మిని చంపలేదని కవి భావం.
శిశుపాలుడు చేది దేశపు రాజు.
దమఘోషునకు వసుదేవుని చెల్లెలు అయిన  అయిన శ్రుతశ్రవకు  పుట్టిన కొడుకు.
వీడు  నాలుగు భుజాలు లలాటనేత్రములతో పుట్టి పుట్టినతోడనే గాడిద గొంతుతో  ఏడుస్తుమ్టే  ఉండఁగా తల్లిదండ్రులు భయమును విస్మయమును కలవారై ఏమి తోచక ఉన్నారు.
 అప్పుడు అశరీరవాణి ఎవడు ఎత్తుకొనునపుడు వీని నుదుటి కన్ను రెండుచేతులును అడగిపోతాయో  వాఁడు వీనిని చంపును. కనుక మీరు ఇందులకు విచారపడక నెమ్మదిని ఉండుడు అని పలికింది.
అంతట వీని తల్లిదండ్రులు తమను చూడవచ్చిన వారికెల్ల వానిని ఎత్తుకొన ఇస్తుండేవారు.
 ఒకప్పుడు బలరామకృష్ణులు తమ మేనత్తను చూడటానికి వస్తే  వారిచేతికిని ఇచ్చి యెత్తుకొమ్మన్నారు.
అప్పుడు కృష్ణుఁడు ఎత్తుకోగానే వీని నొసటికన్నును రెండుచేతులును అణగిపోయాయి.
అంతటవారు ఆశ్చర్యపడి తమ కొడుకును నూఱు నేరములు చేయునంతవఱకు మన్నించునట్లు కృష్ణుని ప్రార్థించి వరము పొందారు.. పిమ్మట  చాలాకాలమునకు ధర్మరాజు రాజసూయ యాగము చేయుచు ఉండగా అచ్చటికి వచ్చి కృష్ణుని  అనేకరకాలుగా నిందించి అతనిచేతనే శిశు పాలుడు చనిపోయాడు.
కృష్ణుని పక్కన అమ్మ లేదు కనుక శిశు పాలుడు చనిపోయాడని కవి చమత్కారము.
సిరితొడ పైనుండఁగ/ శ్రీనరసింహుచే దైత్య
గురుపుత్రులు నిలిచిరి/ క్రూరకర్ము లైనాను
దుర్మార్గమైన పనులు చేసినప్పటికి – రాక్షస గురువయిన శుక్రాచార్యుడు, అతని పుత్రులు ప్రాణాలతో లోకములో నిలబడ్డారు. ఎందుకంటే నరసింహావతారములో ఉన్న మహావిష్ణువు తొడపై లక్ష్మి దేవి ఉంది కాబట్టి.
పరగ శ్రీవేంకటేశు/పగ గాఁడా హిరణ్యుఁడు
గరిమ నదరిపాటు/గాఁగాఁ బొలిసెను      ॥శ్రీసతి॥
కాని   వరాహావతారంలో  అమ్మ పక్కన లేదు కనుక వేంకటేశునికి (విష్ణువుకి) హిరణ్యాక్షుడు శత్రువయ్యాడు. గొప్పతనంతో (గరిమ) గర్వంతో ఎగిరాడు కనుక( అదరిపాటు గాగా)  హిరణ్యాక్షుడు వరాహావతారంలో   ఉన్న వేంకటేశుని చేతిలో చనిపోయాడు.
  1. హిరణ్యకశిపుని తమ్ముఁడు. తండ్రి కశ్యపప్రజాపతి. తల్లి దితి. ఇతఁడును ఇతని అన్నయును సనకసనందనుల శాపముచే రాక్షసులు అయి పుట్టిన విష్ణుద్వారపాలకులు అగు జయవిజయులు. వీరు మహత్తరము అగు తపము సలిపి బ్రహ్మరుద్రుల వలన అనేక వరములను పడసి దేవతలకును మనుష్యులకును పెక్కు బాధలు ఒనరించిరి. వీరిలో హిరణ్యాక్షుఁడు అనఁబరఁగిన వీనిని విష్ణువు సూకరాకారమున అవతరించియు, హిరణ్యకశిపుని నరసింహావతారమున అవతరించియు సంహరించెను.
అయ్యను సంతోష పరిచే అమ్మ దయ మనకు లభ్యమగుగాక ! స్వస్తి.

No comments:

Post a Comment

Pages