“తెలుగు మాధ్యమం ఉంటేనే తెలుగు మనగలుగుతుందా?” - అచ్చంగా తెలుగు

“తెలుగు మాధ్యమం ఉంటేనే తెలుగు మనగలుగుతుందా?”

Share This

“తెలుగు మాధ్యమం ఉంటేనే తెలుగు మనగలుగుతుందా?”

                                                       మంథా భానుమతి.



  “మునిసిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నాము.” అనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. అల్లకల్లోలాన్ని రేపింది. నేను కూడా మొదట్లో అయ్యో ఇటువంటి నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రంలో, తెలుగు ప్రభుత్వం ఏవిధంగా తీసుకుందీ అని బాధ పడ్డాను. అదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించాను కూడా.
  కానీ.. కాస్త నిదానంగా ఆలోచిస్తే కొన్ని వాస్తవాలు కళ్ల ముందు మెదిలాయి.
  దాదాపు ఇరవై సంవత్సరాలు పైగా తెలుగు మాధ్యమంలో, రసాయన శాస్త్రం బి.యెస్సీ విద్యార్ధులకి బోధించిన అనుభవంతో ఆలోచించాను.
  తెలుగు మాధ్యమంలో డిగ్రీ స్థాయిలో చదివే విద్యార్ధులు సాధారణంగా పల్లెలనుంచి వచ్చిన వారే. నలభైమంది పైగా విద్యార్ధులున్న తరగతిలో పదిమంది లోపే చురుకుగా ఉండేవారు. తొందరగా పదిమందిలో కలిసిపోవడానికి సంకోచిస్తూ, వేదిక మీదికి వచ్చి మాట్లాడడానికి బెదురుతూ ఉండేవారు. తెలుగు మాధ్యమంలో చదువుతే పాఠ్యాంశాలు బాగా అర్ధమవుతాయి.. త్వరగా అర్ధంచేసుకోవడానికి వీలవుతుంది అని అనుకుంటాము. అది కొంత వరకూ నిజమే. కానీ ఏ మాధ్యమం అయినా విద్యార్ధులకి అభిరుచి, ఆసక్తి, అవగాహనా శక్తి ఉండాలి.
  ఈ విద్యాభ్యాస మాధ్యమాల విషయానికి వస్తే రెండు వేర్వేరు ముఖ్య అంశాలున్నాయి.
  1. మాధ్యమాల ప్రభావం పాఠ్యాంశాల అవగాహన మీద ఎంత వరకూ ఉంటుంది?
  మాతృభాషలో బోధన ప్రభావం తప్పకుండా విద్యార్ధుల మీద ఉంటుంది. విషయంమంతా సులభగ్రాహ్యం అవుతుందనడంలో సందేహం లేదు. అయితే సాంకేతిక పదాలను ఏ మాతృభాషలోనైనా అర్ధం చేసుకోవడం ఎంత వరకూ సులభం? కర్త, కర్మ, క్రియ వంటివి సరే.. ఒకటికి రెండుసార్లు వివరించక్కర్లేకుండా అర్ధమవుతుంది. కానీ.. రేడియో ధార్మికశక్తి, రసాయన చర్యా విధానాలు వంటి అంశాలను (ఇంకా చాలా క్లిష్టమయిన అంశాలున్నాయి) తెలుగు సాంకేతిక పదాలనుపయోగించి చెపుతుంటే, విద్యార్ధులు కాస్త తికమక పడేవారన్న మాట వాస్తవం. వాళ్లే ఇంగ్లీష్ పదాలలో చెప్పమనే వారు.
  అదృష్టవశాత్తూ, పరీక్షలలో ఇంగ్లీషు మాటలను వాడినా..(రసాయన బంధం బదులు కెమికల్ బాండ్) మార్కులు వేస్తాము. అందుకని పిల్లలు, “ఫొటో సింథసిస్ అనే అనండిమేడమ్.. కిరణజన్యసంయోజన క్రియ కంటే అదే సులువుగా ఉంది” అనేవారు. అలా ముందు తెలుగులో తరువాత ఆంగ్లంలో చెప్పుకుంటూ పోయే వాళ్లం. మిగిలిన అన్ని సబ్జెక్ట్ లూ కూడా ఇంచుమించు అంతే. మరీ లోతుగా అధ్యయనంచేస్తుంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ మాటలు వాడాలిసిందే.
  పరీక్షల విషయానికి వస్తే, డిగ్రీ పరీక్షలే కాదు, అన్ని ప్రవేశ పరీక్షలూ తెలుగు మాధ్యమంలో కూడా ఉంటాయి. అందుకని ఎటువంటి అసౌకర్యమూ లేదు. కానీ.. విదేశాలకు వెళ్లాలంటే, జిఆర్.ఇ, జిమాట్ వంటివన్నీ ఇంగ్లీష్ లోనే. అంటే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్ధులు విదేశాలకు వెళ్లే అవకాశాన్ని వినియోగించుకోలేక పోతున్నారనే చెప్పాలి. వెళ్లాలనుకుంటే.. చాలా కష్టపడాలి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, తెలుగు మీడియం పిల్లలకు ఉచితంగా ఆంగ్ల బోధన, టాఫిల్ వంటి పరీక్షలకు శిక్షణ ఇవ్వడం చేసేవి. ఇప్పుడు కూడా చేస్తూన్నాయనుకుంటాను.
  మేము ఎంట్రెన్స్ (యమ్మెస్సీ) పరీక్ష రాసినప్పుడు తెలుగు మీడియమ్ విద్యార్ధి రామయ్య మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. ఆ తరువాత గ్రూప్ వన్ పాసయి, ఐఏయస్ అయి కలెక్టర్ గా రిటైర్ అయ్యాడు. అటువంటివారు కూడా ఉంటారు. కానీ అరుదుగా!
  అందరం ఏమనుకున్నా తెలుగు మాధ్యమం విద్యార్ధులకి, ఆంగ్ల మాధ్యమంతో పోలుస్తే పోటీ పరీక్షలు, గ్రూపు చర్చలు, ఇంటర్వ్యూలు కష్టమనే చెప్పాలి. కొంత న్యూనతా భావం కొందరికైనా తప్పదు.
  స్వీయ అనుభవం తో తెలుసుకున్నదేమిటంటే, తెలుగు అకాడమీవారు తెలుగించిన పదాలకన్నా, ఆంగ్ల సాంకేతికపదాలనుపయోగించి, తెలుగులో బోధిస్తే కొంచెం ప్రయోజనం సాధించ వచ్చని.
  1. తెలుగు మాధ్యమంలో బోధన ప్రభావం తెలుగు భాష వ్యావహారికం మీద, తెలుగు సాహిత్యం మరుగున పడిపోవడం లేదా తెలుగు సాహిత్యాభివృద్ధి మీద ఎంత వరకూ ఉంది?
  తెలుగు మాధ్యమంలో బోధించడం మానేస్తే తెలుగు సాహిత్యం ఉనికి కోల్పోతుందా?
  బోధనా మాధ్యమ ప్రభావం భాషాభి వృద్ధిమీద అంతగా ఉండదనే అనిపిస్తుంది.
  ఆంగ్ల భాషా మాధ్యమం తీసుకుంటే.. అందులో చదివిన వారు కానీ చదువుతున్నవారిలో కానీ ఆంగ్ల సాహిత్యం మీద ఎంత మంది ఆసక్తి కనపరుస్తున్నారు? ఆ భాషలోని పదాలు ఎన్ని వ్యావహారికంగా వాడుతున్నారు? ఎంత మంది షేక్స్ పియర్ని, మిల్టన్ నీ, సోమర్ సెట్ మామ్ నీ, ఇతర సాహిత్యం విలువలున్న పుస్తకాలని చదువుతున్నారు? ఎంతమంది రచనలు చేస్తున్నారు? ప్రపంచ వ్యాప్తంగా అధిక జనాభా ఆంగ్ల భాషనే వాడినా సాహిత్యం మీద ఆసక్తి కనపర్చే వారి శాతం తక్కువనే చెప్పాలి.
  అదే విధంగా, ప్రస్తుతం తెలుగు భాష మీద మక్కువ, ఆసక్తి చూపిస్తున్నవారు అందరూ తెలుగు మీడియమ్ లో చదివినవారే అనుకోనక్కర్లేదు. మేమందరం పాఠశాలల్లో తెలుగులో చదివినా కళాశాలల్లో ఇంగ్లీషే. అప్పట్లో కళాశాలల్లో తెలుగు మాధ్యమం లేదు. మరి మాకెవరికీ తెలుగు భాష మీద మక్కువ పోలేదు.
  తెలుగు మాధ్యమంలో చదివినవారందరికీ సాహిత్యం మీద ఆసక్తి ఉండాలని లేదు. వారికి ఎంతమందికి తెలుగు కవులు తెలుసూ అన్నది ప్రశ్నార్ధకమే.
  తెలుగు భాష నిలవాలంటే ఏం చెయ్యాలి? ఇంగ్లీష్ మీడియం బళ్లలో, ఆర్ధిక కారణాలవల్ల చదువుకోలేనివారిచే వారికిష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా తెలుగు మాధ్యమంలో చదివించడమా? ఆ తరువాత ఉద్యోగావకాశాలు తక్కువయి వారు నిస్పృహలోకి వెళ్తే చూస్తూ ఊరుకోవడమా?
  అది కాదు పరిష్కారం. విద్యార్ధులకు తల్లిదండ్రులకు ఇష్టమయిన మాధ్యమంలోనే చదివే అవకాశాలు కల్పించాలి.
  తెలుగు రాష్ట్రాలలో డిగ్రీ స్థాయి వరకూ తెలుగు భాషని తప్పనిసరిగా నేర్చుకునేలా చెయ్యాలి. సంస్కృతం, ఫ్రెంచ్ వంటి భాషలని నేర్చుకున్నా.. ఇంగ్లీష్ కంటే ముందు తెలుగు భాషకి మొదటి స్థానం ఇవ్వాలి. సిలబస్ లో మార్పులు తేవాలి. ప్రాచీన ఆధునిక కవిత్వాలు, వచనాలు, వ్యాకరణం మొదలైనవి క్షుణ్ణంగా నేర్పించాలి. ఏవో పాస్ మార్కులు రాకపోయినా ఫరవాలేదనుకోకుండా మిగిలిన పాఠ్యాంశాల్లాగే నిర్బంధంగా ఉత్తీర్ణులు అయితేనే పై తరగతికి పంపించాలి.
  కవిత్వం, కథా రచన, వక్తృత్వం మొదలుగాగల తెలుగు భాషలోని వివిధ ప్రక్రియల్లోనూ పాఠశాలల స్థాయిలోనూ, జిల్లా రాష్ట్ర స్థాయిల్లోనూ పోటీలు నిర్వహించాలి. గెలుపొందినవారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. ప్రసార మాధ్యమాల్లో, పత్రికలలో ఉద్యోగావకాశాలు కల్పించే సదుపాయం ఏర్పరచాలి. తెలుగు పద్యాలలోని తీయదనాన్ని ఆస్వాదించేలాగ ప్రతీ పాఠశాలలో, కళాశాలలో పద్యాలు నేర్పిస్తూ, త్యాగరాజు, అన్నమయ్యవంటి వాగ్గేయకారుల కీర్తనల్లోని కవిత్వాన్ని అవగాహన చేసుకోగలిగే స్థాయికి తీసుకెళ్లాలి.
  ముఖ్యంగా, పరీక్షలలో ప్రశ్నా పత్రాల విధానాన్ని, మార్కులు తెచ్చుకోగలిగే అవకాశం ఉండేట్లుగా తీర్చి దిద్దాలి. మార్కులకోసమే విద్యార్ధులు ఫ్రెంచ్ వంటి భాషలవైపు మొగ్గు చూపుతున్నారు. తెలుగు తరగతిలో తెలుగులోనే మాట్లాడాలనే నియమాన్ని పెట్టాలి.
  తెలుగువారు తమ పిల్లలతో తెలుగులోనే మాట్లాడించాలి. పద్యాలు, పాటలు, కథలూ తెలుగులోనే చెప్పాలి. తెలుగువారు ఎదురైనప్పుడు తెలుగులోనే మాట్లాడాలి. తెలుగు పుస్తకాలు చదవాలి, చదివించాలి. తమకు నచ్చిన దానిని పక్కవారితో పంచుకోవాలి.
  పేదరికం తోనే తెలుగుకి మనుగడ అనుకోకూడదు. సమిష్ఠిగా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు అమ్మభాషని స్వంతం చేసుకుంటేనే తెలుగు పాళీభాషలా అంతరించ కుండా ఉంటుంది.
  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం సరైనదా కాదా అని చర్చించటానికి ఈ వ్యాసం రాయలేదు. తెలుగు మాధ్యమంలో ఉండే సాధకబాధకాలు విశ్లేషించటానికే రాశాను. తెలుగు భాష తెలుగువారి చేతినుండి జారిపోకుండా ఉండడానికి నాకు తోచిన సూచనలనిచ్చాను.
 *———————————*

No comments:

Post a Comment

Pages