అమ్మా వందనం
గొల్లమూడి సంధ్య
" నిన్ను యేమని పిలవాలి "
"అమిజాచి. అదుచే బారి ఫఠవొ (అమ్మా, నేను వెళ్ళిపోతాను, నన్ను ఇంటికి పంపించెయ్యండి )"
"సరే"
"అమి జాచి"
"సరే. పంపిస్తాను. బిస్కట్ తిన్నావా ? చాయ్ తాగావా?"
ఆమాటలను విన్న లోకబంథు, ప్రత్యక్ష సాక్షి, అయిన సూర్యుడి ముఖం మరింత ఎఱ్ఱ బడింది. బాదంచెట్టును చాటుచేసుకుని కిందకి జారాడు. మతి స్థిమితం లేని స్త్రీకి ఓపిగ్గా సమాధానం చెప్పుతున్న ఆ తల్లి పాదాలని తాకాలని ప్రయత్నించి, అందుకో లేక పడమటదిక్కుకి కుంగిపొయాడు. ఇదంతా తమ గూళ్ళకు చేరిన పక్షులు ,కుటుంబ సమేతంగా ఆరాధనగా చూస్తున్నాయి. ఆక్కడ అసలు ఏమి జరుగుతోందో మనం కూడ ఒక్కసారి వెళ్ళి చూసి వద్దాము.
***
ఇది 2003 సంవత్సరం నాటి మాట...
గేటు లొంచి లోపలికి వెళ్ళాను. అక్కడవున్న ఆమెకు నా వివరాలు ఇచ్చి, పరిసరాలు పరికించసాగాను. సువిశాల మైన రెండుఎకరాల స్ధలంలో,ఎత్తుగా యెదిగిన బాదం, మఱ్ఱి,కొబ్బరి, పున్నాగ చెట్ల మధ్య 1952నాటి రేకులు వేసిన షెడ్లు, అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్న ఆడపిల్లలు. పసి బిడ్డలను ఎత్తుకొని దిగులగా కూర్చున్న అమ్మలు. అందరూ వుండి ఎవరూ లేనివారిగా బతుకుతున్న చిన్నారులు, అమ్మలు, అమ్మమ్మలు. అక్కడే మరొ షెడ్ లోంచి కొన్ని నిప్పులాంటి నిజలు వినపడుతున్నాయు. సభ్య సమాజము ముసుగులో వున్న మనలాంటి వారం “ఛ ఏంటా మాటలు?” అంటాము.
కొద్దిగా దగ్గరకు వెళ్ళి విన్నాను . "మీరు తప్పు అనే పని మేమొక్కరమే చేయలేముగదా మేడం. వాళ్ళ అడ్రస్సులు ,ఫోన్నంబర్లు ఇస్తాము . ఆ కొడుకులను కూడ తెమ్మనండి, ఆ పోలీసు గాళ్ళను. అప్పుడు తెలుసుద్ది ఆ కొడుకులకు ,ఇంట్లో అమ్మ,అయ్య, పిల్లలకు దూరంగా వుంచే ఇటువంటి శిక్ష వేస్తే ఎంత బాధో. వాళ్ళకు కూడుగుడ్డలేక ఎట్ట అల్లాడుతున్నారో..."ఆగని ఆవేదన అంతా వార్డెన్ రుక్మిణి తో చెపుతోంది ఒకామె.
అన్నివైపుల కలయతిరిగి చూస్తున్న నాకు ఈ మాటలు, విన్నాకా, కాసేపు ఏమి చెయాలోతెలీలేదు. ఇక అక్కడ వుండ లేక పొయాను.
"మళ్ళి వస్తాను శ్రీనివాస్ గారు. పద్మావతిగారి సెల్ నంబరు ఇవ్వండి,” అని అడిగాను.
"తప్పకుండ మేడం, కొద్దిగ టీతాగి వెళ్ళండి. నేనూ అటేవస్తాను. మిమ్మల్ని ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాను. "
అన్నాడు పరచ శ్రీనివాస్, అక్కడి మేనెజర్.
"వద్దు. మీరు మీపని చేసుకోండి. మావారికి ఫొన్చేస్తాను. మావారు కారు తెస్తారు,” అన్నాను.
"పని ఏమీ లేదు మేడం. సాయంత్రం ఏడు దాటాకా మా మగ స్టాఫ్ ఇక్కడ వుండకూడదు .మిమ్మల్ని ఇంటిదగ్గర దింపుతాను. సార్ ని ఇబ్బంది పెట్టకండి,"అన్నాడు.
అతని కారులో ఇంటికి వస్తూ పద్మవతి పామర్తి గారి ఫోన్ నంబరు తీసుకున్నాను. రాత్రి నిద్రపట్టలేదు. ఇంత ప్రపంచంలో ఎన్నో చూసాను, చూస్తున్నాను. అక్కడ వున్న వాతావరణం ,మనుషుల వంటి వారిని విడివిడి గా చుసాను కానీ ..,.
కానీ.. !? ఏంటి ఇది?
ఇక్కడ ఏమవుతోంది?
ఒకవైపు పసిపిల్లలు!
భయంలేకుండా ఆ పిచ్చివాళ్ళ దగ్గరకు వెళ్ళి," ఏడవకు. అమ్మ వత్తుంది. అన్నం తిన్నావా?" అని ఓదార్చడం!!
"రానాయన, నీకు బువ్వ నే తినిపిస్తాను" అని మేనత్త కన్నప్రేమగా చేరదీయడం!
"పాటలమ్మమ్మ! ఓ పాట నేర్పవా మాకు. బడిలోపాడలి .” ఓ అభాగ్య, సంగీత సరస్వతిని పిల్లలు అడగడం.
ఏంటి ఇదంతా? జీవితంలో దెబ్బతిన్న వేర్వేరు వయసుల వారు ఒకే ఆశ్రమంలో ఉంటూ సొంత కుటుంబ సభ్యుల్లా ఉండడం సాధ్యమేనా?
నా కళ్ళతొ చూసినా నమ్మలేని స్థితి నాది. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తున్న నాకు మాగన్నుగా నిద్ర పట్టింది. పొద్దున్న నిద్ర లేచిన నేను, మరో పనిలొ పడకుండా సమయా సమయాలు పాటించకుండా
పద్మవాతి గారికి ఫోన్ చేసాను.
సంక్షిప్తంగా చెప్పాలి అంటే "మిమ్మల్ని కలవాలి. ఎప్పుడూ, ఎక్కడ, ఎన్ని గంటలకు " అని అడిగాను
నాపేరు, ఊరు కూడ చెప్పకుండా.
" తప్పకుండా .ఆశ్రమానికి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు వస్తాను. స్కూల్లో పనివున్నది.” అన్నారు.
అంతే ఫోన్ పెట్టేసాను.
ఠంచనుగ మధ్యాహ్నం రెండుగంటలకు ఆశ్రమానికి చేరాను. అటుఇటుగా ఆమె కూడా వచ్చారు.
‘మేడం, ఒక ప్రక్క ఆశ్రమం చూస్తున్నారు, మరో ప్రక్క స్కూల్ అంటున్నారు. ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి చెబుతారా?’ ఆతృత ఆపుకోలేక అడిగాను నేను.
ఆమె లంకల్లో పున్నమి వెన్నెల కాసినట్టు నవ్వి, ఇలా చెప్పసాగింది.
“నా పేరు పద్మావతి. నేను 1960,అక్టొబరు 15 న విశాఖపట్నం లో పుట్టాను. పశ్చిమ గొదావరి జిల్లా తణుకు మా స్వస్థలం. మా నాన్నగారు వెంపటి శేషగారి రావు గారు ఇంజనీరు. వారి గారాల పట్టిగా, అల్లారు ముద్దుగా పెరిగాను. అన్న- తమ్ముడు మధ్య గొప్పగా పెరిగిన 'ఆడపిల్ల' ను నేను.
నాన్నగారి బదిలీలతో అనేక ఊళ్ళలో సాగింది నా చదువు. పెండ్లికి ముందు డిగ్రీ వరకు చదివాను. అల్లారు ముద్దుగా అమ్మా నాన్నల ఒడిలో పెరుగుతున్నా, ఏదో తెలియని వెల్తి.
"నాన్నారు సినిమా" అనగానే “పదమ్మ ,వెళ్దాం,” అని వెంట పెట్టుకు తీసుకొని వెళ్ళేవారే కాని, “వద్దు, ఇప్పుడు కాదు”, అనేవారు కాదు.
"నేనూ ,అన్నయ్యలా ఒక చోటే వుండి, హాస్టల్లో చదువుకుంటానని" అడిగే దాన్ని.
"వద్దమ్మ. నిన్ను వదలివుండలేము" అమ్మ గాఢమైన ప్రేమ పలుకులు.
అమ్మమాటలలో నాకు కనుపించినది ప్రేమకంటే ఏదో తెలియని భావన. చదువుతో పాటు NCC, NSS లాంటి వాటిలో చేరాను. వాటిలో చేరినా నన్ను వద్దనలేదు. నావెంట వుండేవారు. ప్రతిక్షణం నాతోనే వుండేవారు. ఎంతో ప్రేమని, విఙ్ఞనాన్ని పొందాను. కానీ! చాలా కోల్పోయాను. బాల్య మిత్రులు లేరు. స్వేచ్చ లేదు.
డిగ్రి అవగానే పామర్తి కాశి విశ్వనాథ్ గారితో పెళ్ళి అయ్యింది. పెళ్ళి తరువాత పిల్లలు,చదువులు. పిల్లల చదువులకు సరియైన విద్య అందుబాటులో లేక పొవడంతో సొంతగా బడి పెట్టాలని అనుకున్నాను. బడికోసం స్థలాలు ,బిల్డింగ్ లు చూస్తుండగా ,ఒక అలోచన వచ్చింది. ‘స్లమ్ ఏరియాలో పెట్టాలి’ అని. చదువుకున్న నాకే పిల్లల చదువులు ఇంత కష్టంగా ఉంటే ,మరి వారికో!! అనిపించింది.
“ఎవరైనా పిల్లలు అంటే పిల్లలే కదా! నాపిల్లల లాంటి వారేకదా ? “అన్న ఆలోచనతో స్లమ్ ఏరియాలోనే బడి మొదలు పెట్టాను. నా పిల్లలని కూడ అందులోనే చేర్చాను. మంచి చదువుల బడిగా పేరు వచ్చింది. కానీ, ఏడవ తరగతి కామన్ పరీక్ష అయ్యాక, ఆడ పిల్లల సంఖ్య గణనీయంగా పడిపోయేది! ఎందుకు అలా? ఏమైంది? అని తెలుసుకోడానికి పిల్లల ఇళ్ళకు వెళ్ళి కనుక్కున్నాను. ఒకరకమైన షాక్ . ఆ షాక్ నుంచి తేరుకోడానికి చాల సమయం పట్టింది. పైతరగతులని చదివించలేక పెళ్ళి చెసేసేవారు. బాల్య వివాహం ! నేను ఎంత సాంప్రదాయ కుటుంబంలోపుట్టిన, చాందస భావలు కలిగిన కలవారి ఇంట పెరిగినా, బాల్య, వివాహల గురించి అలనాటి కధలు వినడమూ, చదవడమే కానీ నిజజీవితంలో చూడలేదు. నెమ్మదిగా తల్లి తండ్రులను ఒప్పించి, నాబడిలో సగం ఫీజులతో చదివించేదాన్ని. అలా కొద్దిగా మార్పు తేగలిగాను.ఎవరి ఇంట అయినా బాల్యవివాహమనగానే, ముందగా వెళ్ళి, నయానో, భయానో ఆపేదాన్ని.అలా నా ప్రస్తానం కొనసాగి, మీరందరూ అనుకునే సేవలోకి అడుగు పెట్టాను. ఈ సేవ లోకి అడుగు పెట్టేముందు నా ఆలోచన,"అమ్మ, నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచినా 'ఆడపిల్ల' అన్న భావంతోనే పెంచారు. తెలియకుండానే లింగ వివక్షత చూపారు. దానివల్ల బాల్యంలోవుండే స్నేహాలను , సరదాలను నేను కోల్పోయాను. నాకు మదనపల్లి మెడికల్ కాలేజీ లో సీట్ వచ్చినా హాస్టల్లో వుంచాలని పంపలేదు. అవన్ని అప్పుడు నాకు తెలియదు . నాపైవున్న ప్రేమ కన్నా , లింగ వివక్షత వారిని డామినేట్ చేసింది. "అంటూ కాసేపు ఆగారు పద్మావతి .
"సంధ్య గారు ఆడపిల్ల పుట్టిందీ అనగానే పెళ్ళి ఎప్పుడు చేసి వదిలించుకుందామన్న భావనతోనే ఆడపిల్లని పెంచుతున్నారని అనిపిస్తుంది. పైకి చెప్పరుగాని ప్రతి ఇంటానేటికీ కనబడుతోంది. ఇప్పటికీ ఆ వివక్షత ఖచ్చితంగా వున్నది. పెళ్ళి అనేదే జీవితపరమార్థం అన్న ఆలోచనలోంచి బైటికి రాలేకపోతున్నారు. నా నేటి పనులకి మీరు అనే సేవా కార్యక్రమాలకు నేచెప్పిన విషయాలన్నిగట్టి పునాది వేసాయి. ఒకానొకప్పుడు నేను కవయిత్రిని, రచయుత్రిని, కొన్ని సంస్థలకు ట్రాన్స్లేటర్ ని. వాటన్నిటినీ పక్కన పెట్టేశాను." అని మళ్ళీ ఆగారు.
నెమ్మదిగా పద్మావతి గారికి, నాకూ మధ్య చనువు ఏర్పడింది. ఎన్నో విషయాలు మనసువిప్పి మాట్లాడుకునే వాళ్ళం. ఎప్పుడైనా ఆశ్రమంలోని వారికి అత్యవసరంగా ఆహారం, ఇతర వస్తువులు కావలసినప్పుడు ఆవిడ నాకు ఫోన్ చేసేవారు. నేను సాయం అందించేదాన్ని. క్రమంగా షెడ్ల బదులు పక్కా భవంతి అక్కడ చోటు చేసుకుంది.
“స్కూల్ గురించి ఇదివరలో చెప్పారు కాని, ఆశ్రమ బాధ్యతలు ఎప్పటినుంచి స్వీకరించారు?” అడిగాను. తన దైన నవ్వుతో మళ్ళీ పద్మావతమ్మ చెప్పడం మొదలెట్టింది.
"కస్తూరిబా గాంధీ నేషనల్ మెమొరియల్ ట్రస్టు, తెలంగాణ’ కు నేను ప్రతినిథిని. 2002లో భాధ్యతలు స్వీకరించాను. అక్కడ అనాధలు కాకున్నా అనాధలనబడే పిల్లలు ఎందరో. 'ఆడ' అనగానే ఆ"కష్టాలపెట్టె" కుట్టు మిషనులు తోడుగా బ్రతికే స్థితి. ఒక పూట తిండి వుంటే, రెండో పూటకు వెతుక్కునే దీనస్థితి,.ఎలా? దీనిని ఎలా ఒక దారికి తేవాలీ ?పిల్లల చుదువులు ఎట్లా? నిరంతరమూ అదే ఆలోచన. చాల శ్రమించాను. మీలాటి వారు ఎందరో, ఎందరెందరో!! మహానుభావుల సహాయంతో, గుండెబలంతో ముందుకు సాగాను. ఎప్పుడు ఎవరిని డబ్బుఇవ్వమని అడగలేదు, ఒక్కసారి వచ్చి ట్రస్ట్ ని చూడమని అడిగేదాన్ని. చూసిన ప్రతి వారి హృదయము ద్రవించి వారికి వారు సహాయ పడేవారు. ఒక్కొక్కసారి పసుపుతాడు మేడలో వేసుకొని , బ్యాంకు లో లోన్ తెచ్చే దాన్ని.మీకళ్ళతో మీరేచూసారుగా ఆరోజులు.
“ఇక ఇక్కడి ఇన్ మేట్సు సంగతి చెపుతాను. ఇక్కడ వున్నవారు ఎవ్వరూ అనాధలు కాదు. ఈ సంఘంచే బహిష్కరింపబడినవారే. ఒక కులాన్ని బట్టి ఆరోజులలో బహిష్కరించేవారు. ఆ కులవివక్షత ను నిర్మూలించారు. కానీప్రతీ మనిషిలోనువున్న లింగ వివక్షతను ఎవరూ రూపుమాపలేక పోతున్నారు.
నేను మగజాతికి వ్యతిరేకినికాను.కానీ సంధ్య గారు, వ్యవస్థలో వున్న లింగవివక్షతకు నేను వ్యతిరేకిని.
కొంతమంది ఆడవారు కూడా స్వజాతి మీద ఈ వివక్షత చూపుతుంటారు. ఇక్కడవున్న పిల్లలు, పెద్దలుకూడ చాల కష్ట నష్టాలను ఎదుర్కొని వచ్చిన వారే. చిన్న చిన్న కుటుంబాలలో ఆర్ధికంగా వెనుకబడినవారు ఇంకా భారతదేశంలోని గిరిజన ప్రాంతాలలో,కొన్ని తండాలలోఅమ్మేసిన ఆడ పిల్లలు, లేదా సవతి తల్లులు/ తండ్రులు కానీ, పడుపువృత్తిలోకి దింపిన పిల్లలు లేదా వేశ్యావాటికలకు అమ్మిన పిల్లలు ఇలా ఎందరో ఇక్కడికి వస్తుంటారు. కొందరు పుష్పవతి అయిన పిల్లలు పొలంగట్ల మీద రేప్కి గురి అవుతుంటారు. లేదా సినిమాల ప్రభావమువల్ల ఎవరో ఒకడితో, వయసుతో నిమిత్తములేకుండా తిరగడం లేదా వారితో వెళ్ళిపోవడం జరుగుతుంది. వారిని అయినవారు కానీ,తల్లితండ్రులు కానీ తిరిగి వారి దగ్గరకు రానియ్యరు.
అటువంటివారిని,ఈ అమాయక ప్రాణులను కూడా అక్కున చేర్చుకుంటుంది మన సంస్థ. వారందరికీ కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. "అది ఒక ప్రమాదము మాత్రమే" అని ఆ పసి పిల్లలకు చెప్పి, వారి మనసును మళ్ళించి చక్కని చదువులు చెప్పిస్తాము. వారి అభిరుచిని బట్టి ,చేతిపనులు నేర్పిస్తాము. ఆంగ్ల ,తెలుగు మాధ్యమాలలో చదివిస్తాము. మాకు స్టేట్ బ్యాంకు వారు ఇచ్చిన బండ్ల లోనే పిల్లలను వారి వారి బడులలో దింపి తీసుకొని వస్తాము. వారు ఎంత వరకు చదువుకుంటే అంత వరకూ చదువులు చెప్పిస్తాము. వారి కాళ్ళమీద నిలబడటానికి వరకూ అండగా వుంటాము. ఊపిరి పీల్చుకున్నది పద్మావతి.
ఊపిరి ఆగింది సంధ్య కు. “చిన్నపిల్లలు ! వారిని ఇంత ఇబ్బంది పెట్టినవారు మనుషులా? మరి ఇంక ఏమైనా నా? “ మనసులో ఆలోచనలు...
"ఏంటి సంధ్య గారు ,ఆలోచనలో పడ్డారు."అన్న పద్మావతి మాటలకు ఆలోచనకు చుక్కపెట్టాను.
"ఏం లేదండి, చెప్పండి " అన్నాను.
"మన ఆశ్రమ వాసులు పెండ్లి చేసుకుంటాము అంటే సంతోషంగా చేస్తాము. చెయ్యమంటే మంచి వరుడుని, వెతికి చేస్తాము. అయితే ముందు పోలీసు వారి సహకారముతో, పిల్లవాడి మంచి చెడ్డలు విచారణ చేయిస్తాము. కానీ, సంధ్య గారు, పెళ్లి చేసి పంపేటప్పుడు మాత్రం చాలా ఏడుపు వస్తుంది. ఆడపిల్ల మాకు దూరము అవుతున్నదన్న బాధ ఆవరిస్తుంది. తన జీవితాన్ని చక్కగా మలచుకునే ధైర్య స్తైర్యాలను ముందే ఇచ్చినా, ప్రాక్టికల్గా ఎలా నిలబడుతుందో అని. అన్నాళ్ళు మన పిల్లగా పెంచి ,పంపిస్తుంటే, చాల బెంగగా వుంటుంది."
పద్మావతి మాటలకు నిజంగా ఆనందమేసింది. ఇదే కదా ''అమ్మతనం” అంటే. ఈమె 'నిజమైన 'మనీషీ' అని ఆరాధనగా చూసాను. కన్నవారు కఠినాత్ములై కని పారేస్తుంటే, వ్యాపార వస్తువుగా భావిస్తే వారిని అపురూపంగా,ఆత్మీయ అనుబంధంగా చూసే "ఈ అమ్మే కదా 'ముగ్గురమ్మలకు 'మూలపుటమ్మ.
"ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు, మరి ఈ పిల్లలకు ఎయిడ్స్..."అంత కంటే ఎక్కువ అనలేక ఆగి పోయాను. అర్ధంచేసుకుంది ఆ బంగారమ్మ.
"పరిక్షలు చేయుస్తాము, ముందుగానే. అటువంటివారిని వేరే చోట వుంచి మరీ శ్రద్ధగా, ఆరోగ్యంగా తయారు చేస్తాము. చదివిస్తాము.
"మరి ఈ పిచ్చివారు...?” అడిగాను.
"అట్లా అనకండీ. వారు ఎంత మానసిక, శారీరక క్షొభ అనుభవించారో! మెంటల్లీ ఛాలెంజడ్ గా మిగిలారో!
మీతో ఇదివరలో బెంగాలీలో మాట్లాడిన ఆమె సంగతే వినండి. బంగారు బొమ్మల్లే ఉంది. ఎక్కడో రేప్కు గురి అయ్యి ,గర్భిణిగా వచ్చింది ఇక్కడకు. పోలీసువారు రైల్వే స్టెషన్ లో ఆమె దొరికితే మాకు అప్ప చెప్పారు. అన్ని రాష్ట్రాలకు తెలియ చేసాము. 10 సంవత్సరాలు అయింది ,తను ఇక్కడకు వచ్చి. ఎవ్వరూ రాలేదు.
పురుడు పోశాము..బంగారు బొమ్మ లాంటి ఆడపిల్ల పుట్టింది.
పిల్లని , పిల్లల పెంపక సంస్ధకు అప్ప చెప్పాము. పాప ఎక్కడో మంచి తల్లి తండ్రులదగ్గర ఆనందంగా పెరుగు తోంది. ఈ పిచ్చి తల్లికి ఎఱ్ఱగడ్డ ఆసుపత్రి వారిచే వైద్యం చేయిస్తున్నాము. మానవప్రయత్నం చేస్తునే వున్నాము. దేవుడే కరుణించాలి. “అంటూ తన కంటినీరు నాకు కనపడకుండా, కాదు ప్రపంచానికే కనపడకుండా, తుడుచుకుని, మళ్ళీ చిరునవ్వు తెచ్చుకుంది ,నిస్వార్ధంగా సేవ చేస్తున్న "అమ్మ" పద్మావతి.
“రేప్ కు గురి అయిన వారిని ఎవ్వరు వచ్చి చూడరు. తీసుకెళ్ళరు. మరి వీరిని అనాధలు అనాలా? చెప్పండి.
అర్ధరాత్రి, అపరాత్రీ అరుపులు కేకలు, కూడ వుంటాయి. అందరి సహాకారాలు ఒక ఎత్తు . ఈ చుట్టు పక్కలవారి సహాకారము ఒక ఎత్తు.”
"ఆ రోజులలో పిల్లలకి అన్నంకావాలి అంటే, మీ వంటి వారికి ఫొన్లు చేసిన రోజులు ఉన్నాయి. ఆ ఆకలి బాధలు తప్పాయి సంధ్య గారు. పెండ్లీ, పేరంటాలకు, పుట్టీనరోజులు, అలా మంచీ చెడులకు కూడా ఇక్కడ వారికి మృష్టాన్న భోజనం పెడుతున్నారు దాతలు.. అన్నిరకాలా అందరూ సహాయ పడుతున్నారు. "
ఒక్క ఆడపిల్ల ఉన్నవారే ‘గుండెల మీద కుంపటిగా’ ఆమె తమకు భారంగా భావించే రోజులివి! అటువంటిది తనకు ఏమీకాని ఇంత మంది బాధ్యత వహించడం అంటే మాటలా ?
"పద్మావతీ! రాత్రిపూట నిద్ర పోతున్నావా?" ఉద్వేగం ఆపుకోలేక అడిగాను.
హహహహహహహహహహ.
మళ్ళీఅదే నవ్వు."ఆ నిద్రపోకపోతే, నిశాచరిలా వుంటానా" హాస్యంగా అన్నారు పద్మావతి.
"మీ ప్రశ్న అర్ధమయింది. 2002-2010 దాకా నేను నిద్ర పోలేదు. తెల్లవారితే పిల్లల, భోజనం, స్కూల్ ఫీజులు, పుస్తకాలు,రవాణా ఖర్చులు ఎలాగన్న బెంగ. సామాన్య కుటుంబంలో,’తల్లి, తెల్లారనీకు’ అని వేడుకునే వారిలా వుండేది నా స్థితి. నా సర్కిల్ను పెంచుకున్నాను. ఆ నోట,ఈ నోట ఆశ్రమం గురించి తెలిసింది. నాకు కాస్త నిద్రకు అవకాశం ఇచ్చింది . ‘అడగందే అమ్మ అయినా పెట్టదని’ గుర్తు తెచ్చుకొని మరీ పని చేసాను.
"కూలి పోవటానికి సిధ్ధంగా వున్న షెడ్ లను ఇంత అధునాతన భవనాలుగా ఎలా మార్చారు?" అడిగాను.
"పెద్ద వాన పడ్డా, ఉరుము ఉరిమినా కూలడానికి సిథ్థంగావున్న 1952 నాటి రేకుల షెడ్లు ఇవి. పిల్లలు జీవ సమాధి అవుతారన్న బెంగ. అసలు ఆ మానసిక ఆందోళన చెప్పలేను. ‘ఎంత శ్రమ అయినా సరే నాపిల్లలని కాపాడుకోవాలి.’ అదే నాలక్ష్యం .శ్రీనివాస్ పరచా, రామకృష్ణ ,రుక్మిణి ,లక్ష్మీ, మూర్తీ లను పిలిచి, పిల్లలను చూస్తుండమని అప్పగించి, నేను ‘ఎక్కే గుమ్మం దిగే గుమ్మం’ గా తిరిగాను. అనేక మంది సహకారం ,అనేక సంస్థల సహాయ సహకారాలను పొందగలిగాను. అధునాతన భవనాలను, వంటశాలను నిర్మించాము. ప్రాట్ & విట్నీ అనే అమెరికా టెక్నికల్ కంపెనివారు ,యునైటెడ్ టెక్నాలజీస్, బెల్కాన్, క్వెస్ట్ బోర్న్ టు ఇంజనీర్, జైస్రా వంటి సంస్థల సహకారంతో ఒక బిల్డింగ్ పూర్తి నిర్మాణం జరిగింది. ఇంక మన హైదర్షాకోట్ వారు ,కాంట్రాక్టర్-బిల్డర్ శ్రీ కమ్మరి కృష్ణ గారు మరో బిల్డింగ్ కట్టేందుకు సహకరించారు. ఇప్పుడు నడుస్తున్న నిర్మాణం జపాన్ అంబసీ వారి సహకారంతో పూర్తి కావస్తోంది. అందుకే ఇప్పుడిప్పుడు కంటి నిండా నిద్ర పోతున్నాను. "
“ఏసంస్థని ముందుగా ఏమీ అడగను. ఒక్కసారి చూడమని అడుగుతాను. వారికి మనసు కరిగితే సహాయం చేస్తున్నారు. దాతలు అందరికీ మా మనః పూర్వక నమస్కారాలు. అయినా నేను పడ్డ శ్రమ అంతా పిల్లల మధ్య,ఈ చెట్ల కింద కూర్చుంటే,వారి కబుర్లు వింటుంటే హుష్ కాకి " అంటూ నవ్వింది పద్మావతి.
"ఈమె మనిషేనా? అటు ఆర్ధింకగా పెద్ద స్ధితిమంతురాలు కాదు! మనో నిబ్బరము,తెగువా, వీటన్నిటినీ మించి "ఆడ పిల్ల ఆటవస్తువు కాదు, అంగడి బొమ్మ అసలేకాదు. పెళ్ళి మాత్రమే జీవిత పరమార్ధం కాదు, బతుకంటే తిని పడుకోడం కాదు’ అనే నాలుగు వేదాలను సృజించిన "వేద మాత" మన పద్మావతమ్మ.
ఒక కథో కవితో రాస్తే పద్మశ్రీ కి అర్హులవుతారు. ఒక కలం కదపడం నేర్పితే గురువవుతారు. అన్నార్తులకు అన్నంపెడితే "అన్నపూర్ణమ్మ” అవుతారు. మరి ఒక విద్యార్ధికి చదువుకు వెసులు బాటు చేస్తే, ఒక పిల్లకు పెండ్లి చేస్తే, ఇలా ఎన్నో ,ఎన్నెన్నో అన్నీ కలిపి ఒక్క "స్త్రీ " స్వరూపిణి చేస్తున్నది.
అమ్మా పద్మావతీ! నిన్ను ఏమని పిలవాలీ ? నీకు పూర్తి సహ కారం ఇస్తున్న నీ భర్త శ్రీ పామర్తి కాశివిశ్వనాథుడినిఎలా అభినందించాలి ?నీకు చిన్న పిల్లలప్పటి నుంచి ఈక్షణం వరకు ‘అమ్మా! మేము వున్నమంటూ’ అన్ని విధాల సహకరిస్తున్న నీ పిల్లలు పామర్తి ఫణి(లండన్)Dr.సాహితి భమిడిపాటి (USA) ఏమని దీవించాలి?
అమ్మా ! పద్మావతి , అసలు నిన్ను ఏమని పిలవను ?
"అమ్మ ! అమ్మ ! అమ్మా వందనం!"
అలా ఆమెను కలసిన నేను, ఆశ్రమంలో 'ఆ అమ్మ' కు దగ్గరయ్యాను. పిల్లలకు అమ్మమ్మ నయ్యాను.
***
No comments:
Post a Comment