" బి పాజిటివ్ "
మీనాక్షి శ్రీనివాస్
"అమ్మాయ్ ... ఈ సూరమ్మ ఇంకా రాలేదే? కడుపుబ్బిపోతోంది..." అప్పటికి అత్తగారు అలా అడగడం ఎన్నో సారో.
"వచ్చేస్తుందత్తయ్యా... పోనీ నేను సాయం చేస్తా ...కొంచెం ఓపిక చేసుకు లేవగలరా? "ఆవిడ అడిగినప్పుడల్లా తనూ అదే ప్రశ్న అడుగుతోంది మనస్విని.
"అబ్బే నువ్వెక్కడ లేపగలవ్? "నిస్సహాయంగా అందావిడ.
మనస్విని బాధగా,జాలిగా చూసిందావిడ కేసి... ఎలాంటావిడ ఎలా అయిపోయారు, వృద్దాప్యం ఎలాటివారినైనా ఎలా లొంగదీసుకుంటుందో కదా.
అయ్యో పెద్దావిడ పాపం ఎంత ఇబ్బంది పడి, బాధపడుతోందో కదా అనుకుంటూ...ఇంట్లోకీ బయటకీ కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది సూరమ్మ కోసం.
ఎనభైయ్యో పడిలో పడే దాకా తన పని తను చేసుకుంటూ , తనకూ కాస్త సాయంగా ఉండే అత్తగారు యిలా జబ్బు పడి మంచంలో పడడం మనస్వినికి చాలా బాధ కలిగించడమే కాదు, అయ్యో ఆమెని సరిగా చూసుకోలేకపోతున్నామే అన్న చింత కూడా కలుగుతోంది. అయినా ఉద్యోగస్తురాలు కావడంతో ఆదరాబాదరా కాస్త వండి అక్కడపెట్టి వెళ్ళడం కంటే ఏమీ చెయ్యలేకపోతున్నందుకు బాధ పడడం మినహా ఏమీ చెయ్యలేని నిస్సహాయత., సమయానికి ఆమెకు మందులు వేసి, అన్నంపెట్టి ఆవిడ ఆలనా పాలనా చూడడానికి నర్సుని పెట్టినా ,నర్సుతో బాటు తమ స్వంత మనిషిలాంటి సూరమ్మని కూడా ఆవిడను చూసుకోడానికి , కనిపెట్టుకు ఉండడానికి పెట్టుకున్నాకా కాస్త నిశ్చింతగా ఉంటోంది... తాము భయపడినట్లే ఆ నర్స్ ఓ పూట వస్తే ఓ పూట రాక ఏడిపిస్తుంటే, సూరమ్మే తనే చూసుకుంటాననీ నర్స్ ని మానిపించెయ్యమనీ చెప్పి అన్నట్లుగానే బాధ్యతగా , ఓపికగా చూసుకుంటోంది. సూరమ్మే లేకపోతే తమ పరిస్థితి ఎలా ఉండేదో? ఉదయం పోతే రాత్రికి కానీ ఇల్లు చేరలేని ఉద్యోగం తనదీ.... ఆయనకేమో బిజినెస్ టూర్స్... పిల్లలా చిన్న వాళ్ళు......
ఆలోచనలో ఉన్న ఆమె గేటు చప్పుడవడంతో ఈ లోకం లోకి వచ్చింది...సూరమ్మే, చమటలు కక్కుతూ గబగబా వచ్చింది...ఎర్రటి ఎండలో నెత్తిమీద చీర కొంగు వేసుకుని ఆదరాబాదరా వచ్చిన ఆమెని చూస్తూ ఏమీ అనలేకపోయింది
" అమ్మగారూ ఆ మార్వాడీ వోళ్ళింట్లో ఆలీసంఅయినాది.. పాపం పెద్దమ్మగోరికి ఇబ్బంది అయిపోనాదో ఏటో..." సంజాయిషీగా అంది.
"ఇదిగో సూరమ్మా... ముందు నువ్వు అలా పెరట్లోకి వెళ్ళి కాళ్ళూ చేతులూ ముఖం కడుక్కుని రా ఎండన పడి వచ్చావ్ పాపం ... " మాటలో ఎక్కడా అసహనం, అసహ్యం బయటపడకుండా జాగ్రత్త పడింది.
" పర్లేదమ్మా... పనీ పాటూ సేసుకు బతికేటోల్లం ... మాకు ఎండా... కొండా ఏటి ?" అంటూనే ఆవిడ దగ్గరకెళ్ళింది.
అప్పుడప్పుడు అతికష్టం మీద లేస్తున్నా , ఎండకో ఏమో పగలు ఎండవేళ మరీ నీరసంగా ఉండి లేవలేకపోవడంతో సాధారణంగా బెడ్ పేన్ పెట్టేస్తోంది సూరమ్మ, ఇప్పుడూ అలాగే బెడ్ పేన్ పెట్టింది.
"ఏమయిపోయావే ఇంతసేపూ...చస్తున్నా.... " అంటున్న ఆవిడ మాటలు పట్టించుకోకుండా.
"అమ్మయ్యా... " బాధ తీరిన ఆవిడ తీరుబడిగా సూరమ్మ ముఖం చూస్తూనే కెవ్వుమని అరచినంత పని చేసారు...
"ఏమిటే ఆ చెమటలూ..అసహ్యంగా...వెళ్ళు,వెళ్ళి ముఖం కాళ్ళూ చేతులూ కడుక్కురా...కాస్త కాళ్ళు నొక్కుదూగాని" అంతులేని అసహ్యం ఆవిడ మాటలో.
" పనీ .. పాటా సేసుకు బతికేటోల్లం... సెమట కాకపోతే సెంటు.. పన్నీరు వత్తదామ్మా...మీలా ఏ.సీ ల్లో కూకుంటే ఎన్ని కబుర్లయినా సెప్పచ్చు.." చిన్నబుచ్చుకుంటూ అంది.
" అది కాదు సూరమ్మా... ఎండలో వచ్చావు కదా కాస్త చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటే హాయిగా ఉంటుందనీ.."
కొంచెం సర్ది చెప్పబోయింది మనస్విని.
"ఎందుకులే అమ్మా ... మీలా సదూకోకపోయినా నాకాపాటి తెల్దేటి... మీ మలమూత్రాలు ఎత్తటానికి మావ్ పనికొస్తాం కానీ... మా ముకాలంటే మీకు ఎగటే ..మీ సెమటైతే పన్నీరూ ... అత్తరూనా ,మాది కాపోయిందా?.." దులిపేసింది సూరమ్మ.విస విసా వెళ్ళిపోయింది.
దాని మనసెంత మంచిదో... తేడా వస్తే మాటంత కటువు.
" ఏదీ... పోయిందా ఈ .... ,తినడానికి లేపోయినా పౌరుషానికి లోటు లేదు..కాస్త కాళ్ళు నొక్కవే అంటే... "
" అత్తయ్యా... ఎందుకలా మాట్లాడతారు... కష్టం చేసుకు, వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు... ఇదివరకటి రోజులు కావు మీరేమన్నా చెల్లడానికి... తిరిగి అది ఒక్క మాట అంటే? అయినా మనం ప్రతీ పనికీ వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాము.కష్టం చేసుకునే వాళ్ళకు ... మనిల్లు కాకపోతే ఇంకో ఇల్లు. కానీ ఎంత డబ్బిచ్చినా మనకు అంత త్వరగా మనుషులు దొరకరు... దొరికినా అందరూ ఇంత మంచిగా ,విశ్వాసంగా ఉండరు... రోజులు మారాయి... వాటితో బాటు మనమూ మారాలి... చా... ఇప్పుడిది ఇంక వస్తుందో రాదో... అది రాకపోతే మీకూ... నాకూ క్షణం గడవదు... జరగదు..."కోపాన్ని నొక్కిపెట్టి... చెప్పింది మనస్విని.
"ఇప్పుడు నేనేమన్నాననీ.... అది అంతలా చెమటలు కక్కుతూంటే కాస్త కడుక్కు రమ్మన్నా...అదీ తప్పేనా? ఆ దేముడు నన్నెందుకు తీసుకుపోడో? " ఏడవడం మొదలుపెట్టిందావిడ.
" ఇప్పుడు నేను మాత్రం మిమ్మల్ని ఏమన్నాననీ ? ... కాస్త లోకం తీరు అర్ధం చేసుకోండి... మారే కాలంతో బాటు మనమూ మారాలి... నిజమే మీరు చెప్పింది, అదలా చెమటోడుతూ ఉంటే చిరాకే, అసహ్యమే... అయినా మెల్లిగా చెప్పాలి... వాళ్ళు మనలా చదువుకోలేదు...శుచీ, శుభ్రం తెలియవు... అందుకే మెల్లిగా అర్ధమయ్యేలా చెప్పాలి ఇంకోమాట... ఒకరకంగా వాళ్ళకి శుచీ, శుభ్రం...అసహ్యం అన్నవి తెలియవు కనకే ఈ పనులు చేస్తున్నారు...చెయ్యగలుగుతున్నారు... ఒక్కమాట ఆలోచించండి... నిలువెత్తు ధనం ఇచ్చినా మనం ఈ పనులు చెయ్యగలమా ? పసివాళ్ళ పనులే చెయ్యలేక అసహ్యించుకుంటామే... అర్ధం చేసుకోండి... “
కోడలి మాటలకి ముఖం మాడ్చుకుందావిడ.
నిజమే చిన్నప్పుడు తన పిల్లలకి సైతం తను అలాంటి అవసరాలు తీర్చలేదు ... ఎప్పుడూ ఇంట్లో నౌకర్లూ... చాకర్లూ ఉండేవారు. కన్నతల్లిగా పసివాళ్ళప్పుడు పాలివ్వడం మినహా వాళ్ళు నౌకర్ల దగ్గరే పెరిగారు. అది తన హోదా అనుకుందే తప్ప అప్పుడూ ... ఇప్పుడూ అంతకుమించి ఆలోచించలేదు
అయినా వాళ్ళు తెలివిమీరారు...దానికి తన కోడళ్ళలాంటి వాళ్ళ సమర్ధన... ఎంతైనా ఉల్లి ఉల్లే... కాని మల్లవుతుందా? అన్నది ఆవిడ వాదన.
నిజమే ఉల్లి ఉల్లే... మల్లి మల్లే... మల్లి లేకపోయినా బతకచ్చు కానీ ఉల్లి లేకపోతే... అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్నారే కానీ మల్లి గురించి ఎవరూ అలా అనలేదే. మనస్విని ఎంత విడమరచి చెప్పినా ఆవిడ అర్ధం చేసుకోదు...
ఏదో పెద్దావిడ... పాత కాలం మనిషి , ఆవిడేమన్నా నువ్వు పట్టించుకోకు అని సూరమ్మకి సర్ది చెప్పడం తప్ప ఏమీ చెయ్యలేకపోతోంది మనస్విని.
ఎంత సర్దుకు పోయినా అప్పుడప్పుడు దానికీ మనసు బాధపడి కోపం వస్తోంది...అదీ మనిషే కదా మరి. నిట్టూరుస్తూ లేచింది మనస్విని.
మనస్విని భయపడినంతా అయింది... సూరమ్మ మధ్యాహ్నం పనిలోకి రాలేదు..ఆ రోజు ఆదివారం అవడంతో ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం నాలుగు రకాల వంటలతో తడిసి మోపెడు గిన్నెలయ్యాయి.. ఇల్లంతా ఎలాపడితే అలా ఉంది... సాయంత్రం దాకా చూసి ఇక రాదని నిర్ధారించుకు ఉసూరుమంటూ పనిలో దిగింది మనస్విని.
మళ్ళీ తెల్లవారితే ఆఫీసు... రెవెన్యూ అఫీసులో అధికారిణిగా ఉన్నమనస్వినికి తెల్లారితే ఊపిరి సలపని పని... ఉదయం తొమ్మిదింటికి పోతే మళ్ళీ రాత్రి ఎనిమిదింటికి కానీ ఇంటి ముఖం చూడదు... భర్త బిజినెస్ పనులమీద ఎప్పుడూ ఇంటి పట్టున ఉండడూ...కొడుకు పదో తరగతీ... కూతురు ఎనిమిదో తరగతీ చదువుతున్నా ఇల్లు పీకి పందిర వెయ్యడమే కానీ ఇంట్లో ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టరు... అందుకే ఆమె పూర్తిగా సూరమ్మ మీదే ఆధార పడిపోయింది... తను ఒక్కరోజు రాకపోతే జరగదు, అది తెలిసీ... తనను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునే మనస్విని ఇల్లు ఒక్క రోజు కూడా నాగా పెట్టదు సూరమ్మ... ఇదిగో అప్పుడప్పుడిలా...
***
" మాం... ఆకలి... తినడానికి ఏమైనా పెట్టు... " అప్పటి దాకా గ్రౌండ్ లో క్రికెట్ ఆడి అలసిపోయి ఇంట్లోకి వస్తూనే షూ ఓ మూలకీ...బేటూ...బాలూ ఓ మూలకీ విసిరేసి వీధిలోంచే అరుస్తూ వచ్చేడు కొడుకు అవినాష్.
"నన్ను తిను... " పళ్ళు బిగించి స్వగతంగా అనుకుంది ... మళ్ళీ పైకి అంటే ఓ గోల.
" అబ్బా... ఎక్కడున్నావ్? పిలుస్తుంటే పలకవేం? " అరుస్తూ పెరట్లోకి వచ్చాడు.
" చూడు అవీ... నాకింకా పని తెమల్లేదు, నేనిప్పుడేం చెయ్యలేను వెళ్ళి మీ నాన్ననడిగి డబ్బులు తీసుకుని ఏదైనా కొని తెచ్చుకో...చూడు వాళ్ళకి కూడా ఏం కావాలో అడిగి, అందరికీ తెచ్చుకోండి... " ముఖంలోకి శాంతం, సౌమ్యతా తెచ్చుకుంటూ అంది.
" అబ్బా ... ఇప్పుడు బయటకు వెళ్ళాలా? ఏంటి అమ్మా నాకు ఓపిక లేదు, అయినా ఆదివారం సెలవేగా చెయ్యచ్చుగా ... ఏం చేస్తున్నావ్? " సగం గారం సగం విసుగు కలగలిపి అంటున్న వాడిని చూస్తూ నిభాయించుకోవడం మనస్విని వల్ల కాలేదు.
" కళ్ళున్నాయిగా, చూస్తూనే ఏం చేస్తున్నావంటే ఏం చెప్పను? నాకూ ఆదివారమే అయినా ఖర్మ , తప్పడం లేదు." ఇంట్లో ఉన్న సామానంతా అక్కడే ఉండి తననే కసిగా చూస్తున్న ఫీలింగ్ ఆమెలో.
"ఓ సూరమ్మ రాలేదా? అందుకేనా ఆ కోపం సర్లే ఏం చేస్తాం? నాన్నతో చెప్పి తెప్పించుకుంటా " సుపుత్రుడికి అప్పటికి జ్ఞానోదయం అయినట్లుంది ... అయినా ఆడడానికీ, ఎగరడానికీ ఉన్న ఓపిక చిన్న పని చెయ్యడానికి ఎందుకుండదో?
పాపం నాలుగు రోజులుగా తిరిగి తిరిగి ఈ మధ్యాహ్నమే వచ్చి స్నానం , భోజనం చేసి పడుకున్నారాయన ఇప్పుడు వీడెళ్ళి లేపేస్తాడు కాబోలు బాధతో మూలిగింది ఆమె మనసు...
కానీ ఏం చేస్తాం ... ' చేసుకున్నవాడికి చేసుకున్నత మహాదేవా ' అనీ అస్తమానం పిల్లలని వెనకేసుకొచ్చి బడితెల్లా ఎదిగినా వాళ్ళకే పనీ చెప్పకా, నన్నూ చెప్పనీయకపోతే అంతే మరి అనుభవించాలి " అయ్యో అంటున్న మనసు పీక నొక్కేసి గిన్నెలు బరబరా తోమడం మొదలుపెట్టింది.
" అరే మనూ , ఏమయిందీ సూరమ్మ రాలేదా? సాధారణంగా మానదే, పోనీ అలా ఉంచెయ్యి రేపు వస్తుందిగా " జాలిగా చూస్తూ అన్నారు శ్రీవారు అప్పుడే లేచి ఫ్రెష్ అవడానికి బయటకొచ్చి.
" మరే … రాత్రికి ఏం చేద్దాం? అయినా నా తంటాలేవో నే పడతాను ,తమరెక్కడికి బయలుదేరుతున్నారు? ఏం వాడిని వెళ్ళి తెచ్చుకోమనలేకపోయారా? గాడిదలా పెరిగాడు " కోపంగా అంది.
"పోనీలే మనూ, పిల్లలు మనల్ని కాక ఎవరిని అడుగుతారు? పోనీ కావలసినవి తోముకుని మిగతావి వదిలెయ్ ... " మళ్ళీ చిన్న సలహా పారేసి బాత్ రూం లో దూరారు.
" ఏమో రేపటికైనా దాని కోపం తగ్గి వస్తుందో రాదో... అసలే రేపు త్వరగా వెళ్ళాలి , పొద్దున్నే వళ్ళు విరుచుకునే కన్నా ఆ ఏడుపేదో ఇప్పుడే ఏడిస్తే పోలా " స్వగతంలా వినీ వినబడకుండా అంది మెల్లిగా.
" ఏమయిందీ? అమ్మ మళ్ళా ఏమయినా అందా? ఎంత చెప్పినా ఈవిడ చాదస్తం తగ్గడం లేదు, ఏమైనా అంటే ఇలా మూలనబడి అందరికీ బరువైపోయాను అంటూ ఏడుస్తుంది ..." బాత్ రూం లోంచే అన్నాడు .
" మీ పేరు రామకృష్ణ అని కాదు ' శాంతారాం' అని పెట్టుండాల్సింది అంత శాంతంగా ఎలా ఉండగలరో." మళ్ళీ స్వగతం.
"అరే ,లెండమ్మగారూ ... కూతంత ఆలీసమైంది తోమేసుకుంతన్నారా? లెగండి లెగండి ... " శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన చీర కట్టుకు వచ్చింది, మధ్యాహ్నం జరిగినదేదీ దానికి గుర్తున్నట్లు లేదు ... ఎంత అదృష్టవంతురాలు...
లేవబోయి నడుం కలుక్కుమనడంతో అలా కూర్చుండిపోయింది మనస్విని.
" అయ్యయ్యో మళ్ళీ నడుం పట్టుకుపోయిందా? అయినా అన్నిటికీ తొందరే మీకు నానొస్తాగదా ఈలోగానే కంగారుగా తోమీసుకోవాలా? బాధ పడుతూ చెయ్యి సాయంతో నింపాదిగా లేపింది.
"అది కాదే ,నీకు బాగా కోపం వచ్చింది కదా రావేమో అనుకున్నా " మెల్లిగా అంది.
" నాకూ పెద్దమ్మగోరికీ మామూలే కదా , ఎందుకు రానూ? " జరిగిందేదీ మనసులో పెట్టుకోకుండా నవ్వుతూ అంది. దాని కోపం తాటాకు మంట లాంటిది.
" అమ్మయ్యా వచ్చేసావా? మీ అమ్మగారికి పనిభారం కంటే , నీకు కోపం వచ్చింది ఇక రావేమో అన్న శిరోభారమే ఎక్కువైంది... “ సూరమ్మతో అంటూ,…
“మనూ… పదినిముషాల్లో రెడీ అవు , పాపం బాగా అలసిపోయినట్లున్నావ్ , కాసేపలా తిరిగి ఈ పూటకి బయటే తినేసి వద్దాం. వస్తూ వస్తూ అమ్మకీ టిఫిన్ తెచ్చేద్దాం... రేపు సూరమ్మకీ కాస్త పని తగ్గుతుంది. " నవ్వుతూ అన్నారాయన.
"అయినా మా అమ్మ మాటలేం పట్టించుకోకు సూరమ్మా ,ఆవిడకు చాదస్తం ఎక్కువ, తన మాటల వలన అవతలి వాళ్ళకి బాధ కలుగుతుందేమో అన్న ఆలోచన ఉండదు, నోటికి ఎంత వస్తే అంత అనేస్తుంది...బాధ పడడం, పట్టించుకోవడం లాంటివి చెయ్యకు ... నిన్ను నేనయినా మీ అమ్మగారైనా ఏమైనా అంటామా? చెప్పు " మెల్లిగా దానికి హితబోధ చేసారు.
" కాదులే అయ్యా , మనిషిని సూస్తానే సిరాకు పడిపోతే ఎట్టుంటది సెప్పూ , నాలిగిళ్ళలో పని సేసుకునేటోల్లకి ఫెష్ గా కడిగిన ముత్తెం లా ఎప్పుడూ ఉండాలంటే ఎట్టవుతదీ? అక్కడకీ ఇక్కడకి వచ్చేతప్పుడు శుబ్రంగా తానవాడి ఉతికిన సీరే కట్టుకోని వత్తా, కానీ రోజుకి పదిసార్లు వచ్చేతప్పుడు అన్నిమార్లూ అట్టా రావాలంటే ఎట్టాగవుతదీ? " దాని మాటల్లో కాదనలేని నిజం ఉంది.
"నిజమే సూరమ్మా ... అందుకే నీకు నేను మరీ మరీ చెబుతున్నా ఆవిడ మాటలేం పట్టించుకోవద్దనీ, బాధపడద్దనీ..." మరోమారు సున్నితంగా చెప్పాడు.
" సరేలే అయ్యా , ఓ పాలి బాధనిపించినా ఆమె మాటలెవురు పట్టించుకోవాలేం... మీరు అమ్మా మమ్మల్ని సొంత మనుషుల్లా సూసుకుంతారు , అందుకే మీ పని మానాలన్నా మానలేం... దానికేం గాని అమ్మగోరు రెడీ అయిపోనారు , బయటకు పోయిరండీ.. మీరూ పిల్లలూ. మీరు వచ్చేదాకా పెద్దమ్మగోరి కాడ నేనుంటాలెండి..." అదేమరి సూరమ్మ మంచితనం, మంచి మనసూ.
" నే రెడీ బాస్... " రాత్రి వంటలేదనగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది మనస్విని గొంతులో.
"మీ పిల్ల రాక్షసులు రెడీనా? "సరదాగా నవ్వుతూ అన్నాడు.
"మేం రెడీ రాక్షస పితా " అస్సలు మాట మీద ఉంచుకోరు... వెంటనే తండ్రిని రాక్షసుడిని చేసేసారు.
" ఆ .. యిందులో ఉన్న చురుకు కాస్త పని చెయ్యడంలో కూడా ఉంటే సంతోషిస్తాం ..." నవ్వుతూనే పిల్లలకి కాస్త హితవు చెప్పింది.
" పో మాం నువ్వు ఎప్పుడూ ఇంతే, అయినా పెద్దయ్యాకా ఎలాగూ చెయ్యాలిగా మీలాగే, మరి ఇప్పుడైనా కాస్త హాయిగా ఉండనీ.. " అవినాష్ విసుక్కున్నాడు.
" మేం మీలా అనుకోలేదురా...చిన్నప్పుడూ మా అమ్మకి పనిలో సాయం చేసేవాళ్ళం " మనస్వినీ ఊరుకోలేదు.
" పోనీలెండమ్మా ... అయినా అప్పటి రోజులు వేరు, యిప్పటి రోజులు వేరు.." వాళ్ళ మీద ఈగ వాలనీయదు సూరమ్మ.
" అలాగే అంతా కలసి వాళ్ళని పనీ పాటా రాని మొద్దులు చెయ్యండి , రేపు పెద్దయ్యాకా అప్పుడు తెలుస్తుంది." తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది మనస్విని.
" మమ్మీ నాకు పాటొచ్చు... పాడనా ...’ హూ లెట్ ద డాగ్జ్ ఔట్ ‘ ...పెద్దగా అరుస్తూ పాడడం మొదలు పెట్టాడు అసలే వాడిది బొంగురు గొంతు.
"ఒరే నాయనా ఆపరా నీకు పుణ్యం ఉంటుంది... " గాభరాగా అంది మనస్విని.
" మరదే... ఇంకెప్పుడూ నాతో పెట్టుకోకు మరి..."
"సరే... మరి ఇంక బయలుదేరండి... సూరమ్మా, జాగ్రత్త మేం మరీ ఆలస్యం చెయ్యంలే... నీకూ టిఫిన్ తెచ్చేస్తాం
" అమ్మా ... మేం అలా బయటకు వెళ్ళి వస్తాం , నీ దగ్గర సూరమ్మ ఉంటుంది...టీ వీ పెట్టి వెడతా ...చూస్తూండండి... నీకు టిఫిన్ ఏం తేను? " నెమ్మదిగా ఆవిడ దగ్గర నుంచుని అడిగాడు.
"నాకాకలిగా లేదు... నాకేం వద్దు " ఇంకా కోపంగానే ఉంది ఆవిడ గొంతు.
"సరేలే మేం ఇంకా వెళ్ళనే లేదు... ఈ మహా నగరంలో వెళ్ళాలి ... రావాలి అప్పటికి ఆకలి వేస్తుందిలే ...నీకు వడా సాంబార్ ఇష్టం కదా అదే తెస్తాను...పిల్లలు గొడవచేస్తున్నారు కాసేపలా తిరిగి వస్తాం.... మనూ పదండి."
" అత్తయ్యా... అలా వెళ్ళి వస్తాం...త్వరగానే వచ్చేస్తాం " ఆవిడ కోపం గ్రహించి మెల్లిగా చెప్పి బయటకు వచ్చేసింది మనస్విని.
కొంచెం సేపు టాంక్ బండ్ మీద గడిపి , తరువాత చట్నీస్ కి వెళ్ళి భోజనాలు చేసి, తల్లికీ, సూరమ్మకీ టిఫిన్స్ పేక్ చేయించుకుని ఇంటికి వచ్చేసరికి ఇద్దరూ చక్కగా నవ్వుకుంటూ టీ వీ సీరియల్ చూస్తూండడంతో ' అమ్మయ్య ' అని ఊపిరి పీల్చుకున్నారు రామకృష్ణా , మనస్వినీ.
టిఫిన్ తల్లికి పెట్టి మందులు వేసి గదిలోకి వచ్చిన రామకృష్ణ అప్పటికే అలసిపోయి ఆదమరచి నిద్రపోతున్న మనస్వినిని చూసి పాపం బాగా అలసి పోతోంది అనుకున్నాడు.
***
" బాబోయ్ చచ్చిపోయాన్రోయ్ " అన్న గావుకేకతో బాటు దబ్బున పడ్డ శబ్దానికి మెలుకువ వచ్చి కంగారుగా పరిగెట్టుకొచ్చాడు రామకృష్ణ... ఆ వెనకే నిద్ర కళ్ళతో ఏం జరిగిందో అని కంగారుగా వచ్చింది మనస్విని.
అర్ధరాత్రి వేళ బాత్ రూం అవసరంతో లేచి ఈ పూట కాస్త ఓపికగా ఉండడంతో, పాపం పగలంతా కష్టపడి , ఆదమరచి నిద్రపోతున్న సూరమ్మని లేపడం దేనికీ అనుకుని మెల్లిగా లేచి బాత్ రూం కి వచ్చిన శారదమ్మ తూలి ఆపుకోలేక పడిపోవడం ,కొళాయి తలకి తగిలి గట్టి దెబ్బే తగిలి రక్తం బాగా పోవడం, అప్పటికప్పుడు కారులో కేర్ హాస్పిటల్ కు తీసుకెళ్ళి జాయిన్ చెయ్యడం జరిగి పోయాయి.
అప్పటికప్పుడు ఏదో ట్రీట్మెంట్ చేసినా, రక్తం బాగా పోయిందనీ, అసలే రక్తహీనతతో ఉన్న ఆమెకు వెంటనే రక్తం ఎక్కించడం చాలా అవసరం అన్న డాక్టర్స్ మాటతో చాలా కంగారు పడ్డారు రామకృష్ణా, మనస్వినీ.
ఎంత ప్రయత్నించినా సమయానికి' బి పాజిటివ్ ' రక్తం దొరకకపోయి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నంతలో సూరమ్మ తనది అదే గ్రూప్ అనీ , క్రితం ఏడాది రోడ్డు ప్రమాదం జరిగి తనకు రక్తం అవసర పడినప్పుడు తనకు ఆ సంగతి తెలిసిందనీ చెప్పి , నువ్వు పెద్దదానివి రక్తం ఇస్తే కష్టం అని చెబుతున్నా వినక తన రక్తం శారదమ్మకు ఇచ్చి ఆమెకు సరైన సమయంలో సరైన సాయం చేసి తనకు ఆ కుటుంబం పట్ల ఉన్న విశ్వాసాన్ని చాటుకుంది సూరమ్మ.
సూరమ్మ రక్తం టెస్ట్ చేసి సరిపోతుందని డాక్టర్స్ చెప్పగానే వందన అభ్యంతరం చెప్పబోయింది.
" అమ్మకు అసలే చాదస్తం ... సూరమ్మ రక్తం ఎక్కించారని తరువాత తెలిస్తే గొడవచేస్తుందేమోరా అన్నయ్యా” అన్న చెల్లెలు వందన మాటలు కొట్టిపడేసాడు రామకృష్ణ.
" నువ్వూరుకోవే , మనకు బ్లడ్ బేంక్ లో దొరికే రక్తం ఎవరిదో మనకు తెలుసా?, పంచభూతాలకూ లేనట్లే కులం గోత్రం మనిషి పంచప్రాణాలూ నిలబెట్టే రక్తానికి కూడా లేవ్... అయినా మీరంతా అలా పెంచి పోషించబట్టే ఆవిడ అలా తయారయింది. మొదలే ఆ చాదస్తాన్ని కంట్రోల్ చేస్తే ఆవిడ ఇలా తయారయ్యేది కాదు.
"అది కాదురా ... మరీ చూస్తూ చూస్తూ .... " ఇంకా ఏదో అనబోతున్న చెల్లెల్ని గట్టిగా కసురుకున్నాడు.
" పోనీ మీ ఆయనదీ ' బి పోజిటివ్ ' కదా ఆయనను రమ్మని ఫోన్ చేద్దాం, రేపు వస్తే అప్పుడు అదే ఎక్కిద్దాం.
" అదెలాగరా ఆయనకసలే షుగరూ, బీ పీ ... అయినా ఆఫీస్ కి సెలవు ... “ ఏదో చెప్పబోతున్న చెల్లెలిని ఆగమని సైగ చేసాడు.
" కదా … మనకి ఇవ్వడానికి వంద అభ్యంతరాలున్నప్పుడు... అవతల ఎవరో పుణ్యాత్ములు ఇస్తుంటే అడ్డుపడడం మంచిది కాదు ..." మాట నెమ్మదిగానే ఉన్నా చాలా పదునుగా అన్నాడు.
వందన ఇంక నోరెత్తలేదు.
నాలుగు రోజులు హాస్పటల్ లో ఉంచి నుదుటన పడ్డ నాలుగు కుట్లూ కాస్త తగ్గుముఖం పట్టాకా, కొత్త రక్తం ఇచ్చిన ఉత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చిన శారదమ్మలో పశ్చాత్తాపం ...
హాస్పటల్ లోనూ ఇంటికి వచ్చాకా కూడా క్షణం ఏమరక కూడా కూడా ఉంటూ అయిన వాళ్ళకంటే ఎక్కువగా కంటికి రెప్పలా చూసుకుంటున్న సూరమ్మతో
" సూరమ్మా ... నిన్ను ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా విసుక్కున్నానో ... కసిరికొట్టానో అయినా తోడబుట్టినదానిలా మంచిమనసుతో నాకు రక్తం ఇవ్వడమే కాక ఎంత సేవ చేస్తున్నావు .. నీ ఋణం ఎలా తీర్చుకోనే ... నన్ను ......................
" అమ్మగోరూ తమరు పెద్దోరు అలా మాతాడకండి... నాకు మీ మీద ఎప్పుడూ కోపమేనేదు ... తమరు తొరతొరగా లెగిసి తిరగండి ... మాకంతే సాలు. " ఆప్యాయంగా కాళ్ళు వత్తుతూ అంది సూరమ్మ.
"మొత్తానికి‘ బి-పోజిటివ్ ‘ గా మార్చేసింది నానమ్మని సూరమ్మ రక్తం " గట్టిగా క్లేప్స్ కొడుతూ అన్నాడు అవినాష్.
***
No comments:
Post a Comment