బహుమతి విలువ ఎంత?
ఆండ్ర లలిత
అనగనగా వీరాపురమనే ఊరు. ఆ ఊరిలో షిరిడి సాయి బాబా గుడి ప్రక్కన ఒక చిన్న పెంకుటిల్లు.ఆ ఇంటికి ఆనుకుని, ఒక చిన్న పూల తోట. ఆ ఇంట్లో చంద్రశేఖరుడు, పార్వతి అనే దంపతులు ఉండేవారు. చంద్రశేఖరుడు వృత్తిరీత్యా వడ్రంగి. తన భార్య పార్వతిది పూల వ్యాపారం. వారిద్దరూ కష్టపడి, వాళ్ళ పనియే దైవం అనుకుని నిజాయితీగా ధనం సంపాదించేవారు. సంతృప్తితో ఉండేవారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళ పేర్లు సీత మరియు రమా. సీత పెద్ద అమ్మాయి, రమా చిన్న అమ్మాయి. ఇద్దరు చాలా బుద్ధిమంతులు. వీధి చివర ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవారు. చదివేది ఐదవ తరగతి మరియు నాలుగవ తరగతులైనా, చక్కగా శ్రద్దతో చదువుకునేవారు. పెద్దలు మరియు ఉపాధ్యాయులంటే చాలా గౌరవం. ఎదురు చెప్పేవారు కాదు. వినయ విధేయతలతో చదువు అభ్యసించేవారు. ఒక రోజు సీతా రమా ఘర్షణపడుతూ సమాధానము దొరకక పూలమాలలు కట్తున్న తల్లి పార్వతి దగ్గరకు వచ్చి “ఎవరైనా ఏదైనా బహుమతి ఇస్తే దాని విలువ ఎలాతెలుసు కోవాలి? సరిగా విలువ కట్టాలంటే దాని విలువ ఎంత?” అని అడిగారు. తల్లి పార్వతి రెండు నిమిషములు ఆలోచించి, సీత రమాల కేసి పార్వతి తిరిగి “అనంతం, ఊహించనంత, అపారం!” అంది చిరునవ్వుతో. మళ్ళీ అందుకుంటూ పార్వతి “సీతా కాస్త వంటగదిలో బల్ల కింద గులాబీల బుట్ట ఉంటుంది. కాస్త తెచ్చిపెట్టమ్మా”
“ఊ..హు నేను తేను. రమాకి చెప్పు. కాళ్లు లాగుతున్నాయమ్మా. బడిలో బాగా పరుగెట్టి ఆడాను”అంటు కాళ్లు చాపుకుని చతికిలపడింది సీత.
ఇంతలో రమా “పోనిలే నేను తెచ్చి పెట్తాను” అని ఒక పరుగున వెళ్ళి తెచ్చిపెట్టి. అమ్మ పక్కన కూర్చొని, అమ్మకి పూలు అందిస్తూ, మధ్యలో “అమ్మా మరువము తీసుకో, అది మాల మధ్యలో కట్టు. అందంగా ఉంటుంది” అని పురమాయిస్తూ..“అమ్మా! నేను కట్టనా మాలలు కొద్ది సేపు”అంది రమా.
“అమ్మా మరి నేను! రమా మాలలు కట్తుంది. నేను పూల గుచ్చలు తయారుచేస్తా”అంది సీత పార్వతి మొహం తన కేసి తిప్పుకుని.
పార్వతి తన పిల్లలి చేష్టలకి లోలోపల మురిసిపోతూ, వాళ్ళ తలలమీద చేయి వేసి, చెమర్చిన కళ్ళతో “వద్దు రా! నేను చేసుకుంటాను. మీరు చదువుకుని గొప్ప వాళ్ళు కావాలి. అంటే పది మందికి మన చదువు, సంస్కారం ఉపయోగపడాలి. చదువు మనకు వినయ విధేయతలను నేర్పాలి. సాటి మనిషిని గౌరవించాలి. ఈ రోజు మనము పై మెట్టు మీద ఉన్నామని, కింద మెట్టు మీద ఉన్నవారిని కించపరచకూడదు. ఆ మెట్టు ఎక్కే మనము ఇక్కడికి ఎలా వచ్చామని మరవకూడదు”
“అమ్మా బహుమతి విలువ ఎంతమ్మా?” అని మళ్ళీ అడిగింది సీత. అమ్మ ఇచ్చిన సమాధానముతో ఏకీభవించనట్లు.
“మనము ఆశించనంత, సీతా ” అంది పార్వతి మాలలు కట్తూ.
“ఏమిటోనమ్మ ఏదో మాట్లాడతావు!” అని సీత వెళ్ళిపోతుంటే ....నిరుత్సాహంతో వెళ్తునట్లు గమనించి...”ఆగండి మీకు కుచేలుడి కథలో ఒక సంఘటన చెప్తాను వినండి” అంది పార్వతి మందహాసముతో.
“చెప్పు.”అంది సీత ఒక నిట్టూర్పుతో
“చెప్పు మరీ” అంది రమా ఉత్సాహముగా.
“కుచేలుడు తన చిన్ననాటి నేస్తముతో మధుర సంభాషణలలో ఉన్నపుడు, శ్రీకృష్ణుడు తన నేస్తము కుచేలుడి చేతిలో ఉన్న చిన్న అటుకుల మూటను గమనించి, ఆ మూట లాక్కుని గబగబా తింటున్నప్పుడు, కృష్ణుని కళ్ళలో ఆనందము చూసి కుచేలుడి కళ్ళు చెమర్చుతాయి సంతృప్తితో. కుచేలుడు అటుకులు తీసుకు వెళ్ళాడు కాని, ఇంద్రభవనంలో నివసించే కృష్ణుడు, నిరుపేద కుచేలుడు తెచ్చిన అటుకులు తింటాడనుకోలేదు. అనుకోని ఊహించని సంఘటనలు ఒకొక్కసారి మరుపురాని బహుమానాలు తెస్తాయి. అయినా ఏ బహుమతియైనా, ఎదుటి వాళ్ళ ప్రేమకి ప్రతిరూపం. కొలమానం లేదు. మనకి దాని విలువ అపురూపమే. ఇచ్చిన వాళ్ళకి సంతృప్తి. పుచ్చుకున్న వాళ్ళకి ఆనందం కలిగించేదే బహుమతిరా! ఇంక మీకు నిద్దరలు వస్తున్నాయి. పుస్తకాలు సద్దేసుకుని పడుకోండి. నా పని అయింది. ఇంతలో వంటగది సవరించుకుని వస్తాను. ఒక్క పది నిమిషాలు. మళ్ళి రేపు పెంద్రాళే గుడి దగ్గర కూర్చోవాలి నేను. షిరిడి బాబా గుడి హడావిడిగా ఉంటుంది. గురువారం కదా” అంది పిల్లలిని దగ్గరికి తీసుకుని పార్వతి.
“సరేనమ్మా” అని ఇద్దరూ పుస్తకాలు సద్దుకుంటునప్పుడు సీతకీ రమాకి పుస్తకాలు కావాలని గుర్తువచ్చి, “నాన్నా రేపు మేము పుస్తకాలు కొనుక్కోవాలి, మేమిద్దరము” అని సీత నాన్న చంద్రశేఖరుడితో అంది.
లక్ష్మీ దేవి ప్రతిమని చెక్కుతున్న చంద్రశేఖరుడు, పిల్లలికేసి తిరిగి “ఎంత కావాలి?” అని అడిగాడు.
“ఒంద రూపాయలు” అంది రమా.
“సోమవారం కల్లా ఇస్తాను”అన్నాడు చంద్రశేఖరుడు.
“లేదు నాన్నా. రేపటికే కావాలి” అంది సీత.
“చూస్తానురా! నెలాఖరు కూడాను. ఇవాళ రాత్రికూర్చుని అమ్మవారి చీర కుచ్చుళ్ళు చెక్కేస్తే, అమ్మ వారు తయారౌతారు రామకృష్ణగారికి కావాల్సినట్లు. ఆ భగవంతుడు కనికరిస్తే రేపు పొద్దునే, రామకృష్ణగారి ఇంటికెళ్ళి అందించి, డబ్బు తెస్తా తల్లి. మీరు బడి నుంచి వచ్చేటప్పటికి మీకు ఇస్తానర్రా”అన్నాడు చంద్రశేఖరుడు పిల్లలిని చెంతచేర్చుకుని.
రమా వాళ్ళ నాన్న చేయి తన చెతులోకి తీసుకుని “ఉఫ్ ఉఫ్” అని ఊదుతుంటే, సీత “అయ్యో. బొబ్బలెక్కింది. చూసుకోవు. ఇంక చాలు నాన్నా పడుకో” అంది.
“పడుకుంటా నమ్మా. నిద్ర వచ్చినప్పుడు” అన్నాడు చంద్రశేఖరుడు
పిల్లలూ పార్వతి నిద్రలో జారుకున్నారు. చంద్రశేఖరుడు అలసిపోయి, లక్మీదేవి ప్రతిమని చెక్కుతూ నిద్రలోకి జారుకున్నాడు. పొద్దున్నే లేచి ఎవరి పనులలో వారు పడ్డారు. రమా అమ్మవారి ప్రతిమ పూర్తి కాలేదని గమనించి “అక్కా మన పుస్తకాలు?”అని తన దుఃఖము వ్యక్త పరచినప్పుడు, సీత “చూద్దాము” అంది చిరునవ్వుతో. ఇద్దరు గబగబా తయారై, రోజూ సమయం కన్నా ముందు అమ్మ దగ్గరకు వెళ్ళారు.
“అదేంటమ్మా అప్పుడే అన్ని పూలు అమ్మేసావు!” అంది సీత.
“అవునురా! అంతా బాబాగారి దయ” అంటూ పార్వతి, డబ్బుల భరణి లోంచి ఒంద రూపాయలు తీస్తుంటే, “వద్దమ్మా సాయంత్రానికి ఎక్కువ పూలు కొనుక్కో. అమ్ముడుపోతాయి ” అని రమా అంటుంటే, హడావిడిగా కారు దిగి మధ్య వయస్సు దంపతులు వచ్చి, పార్వతి బుట్టకేసి చూసి “అయ్యో పువ్వులు లేవా. చాలా దూరం నుంచి వచ్చాము. గుడి తలుపులు ఇంకొక పది నిమిషాలలో మూసేస్తారు. ఎలాగా అని ఆలోచిస్తుంటే....సీత ఆ దంపతులు కేసి చూసి ఒక్క నిమిషం అని రమా కేసి చూస్తూ ”రమా రా ! మనము ఇప్పుడే వద్దాము” అని ఇద్దరూ పరుగున వెళ్ళి వాళ్ళ పెరట్లో పూలు కోసి, మందారాలు,చేమంతులు,మరువం,దవనం, గులాబీలనూ చక్కగా అమర్చి, అరటి నారతో కట్టి అందమైన పూలగుచ్చగా చేసి , ఆ దంపతులకు అందించారు. వాళ్ళు ఆనందపరవసులై, రమాకి సీతకి చెరోక యాభై రూపాయలు నోట్ ఇస్తుంటే “వద్దు” అని రమా మరియు సీతా అన్నారు.
ఆ దంపతులు “మీ పూలకి ఖరీదు కాదు. పోని మీరు పూలగుచ్చ చేసినందుకని అనుకంటుంన్నారా! కానే కాదు. మీ సున్నితమైన చేతులతో అతి చురుకైన మెదడులతో పూలగుచ్చలని కట్టిన వినూత్న ప్రతిభకు వెల కట్టలేము. ఇది మా చిరు కానుక మిమ్మలని దీవిస్తూ” అని అన్నారు.
అది విన్న తల్లి కళ్ళునుంచి ఆనందబాష్పాలు రాలాయి. “అది చాలండి బాబుగారు మా పిల్లలికి. మీ దీవెనలు చాలు” అంది పార్వతి కళ్ళు తుడుచుకుంటూ.
“అలా కాదమ్మా . ఇది మా సంతోషంతో ఇచ్చే కానుక. నిరాకరించవద్దు. మీ పిల్లలు మా మది దోచారమ్మా. గొప్పవారు అవుతారు” అన్నారు ఆ దంపతులు.
“తీసుకోండర్రా” అని దంపతులు అన్నప్పుడు సీతా రమా తల్లి కేసి చూసారు.
“తీసుకోండి” అని సైగ చేసింది పార్వతి పిల్లలితో.
రమా, సీతా ఆ నోట్లని అటు తిప్పి,ఇటు తిప్పీ సంభరపడిపోయి, ఎంతో సంతోషముగా తల్లి కేసి తిరిగి అమ్మా”ఇవాళ పుస్తకాలు కొనుక్కుంటాం”అంటూ పరుగన వెళ్తూ, ఒక్కసారి ఆగి సీత “అమ్మా బహుమతి విలువ ఇప్పుడు నేను ఊహించనంత” అంటూ ఆనందసాగరంలో తేలిపోతుంటే
“ఇది మీకు అమూల్యమైన బహుమతర్రా సీతా రమా. సంతోషముగా పుస్తకాలు కొనుక్కుని చదువుల తల్లికి నమస్కరించి, మీ చదువులకు శ్రీకారం చుట్టండి”అంది పార్వతి.
ఇది చూసిన ఆదంపతులకి అపరిమితమైన సంతృప్తి కలిగింది. ఆ పిల్లల ఆనందం వాళ్ళకి కూడా ఒక విధమైన ఆహ్లదం కలిగించింది.
*****
No comments:
Post a Comment