భుక్తాయాసం
(జ)వరాలి కధలు - 14
గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి (సోమసుధ)
వెనకటికి ఏదో సినిమాలో " ముక్కోటి దేవతలు ఒక్కటైనారు " అంటూ కవి ఒక పాట వ్రాశాడు. ఆ రోజుల్లో తెలుగువారి సంఖ్య మూడుకోట్లు అనేవారు. ఆ లెక్కన ముక్కోటి తెలుగువారికి ముక్కోటి దేవతలు అంటే మనిషికో దేవుడు క్రింద లెక్కవేసి చెప్పారన్నమాట. అయితే నాకు తెలిసిన దేవుళ్ళు నలుగురే! "మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిధిదేవోభవ" అని మన పూర్వీకులు చెప్పిన ప్రకారం నలుగురే దేవుళ్ళని నా విశ్వాసం. మాతాపితలు ఎవ్వరికైనా ఒక్కొక్కరే ఉంటారు. కాని గురువుగారి దగ్గరకొచ్చేసరికి సంఖ్య పదుల్లో ఉంటుంది. ఇక అతిధులసంఖ్య లెక్కచెప్పలేము. మన గడపదాటి యింట్లోకొచ్చే ప్రతి మనిషి అతిధిదేవుళ్ళ కోవలోకే వస్తారు. మన పూర్వీకులు అతిధి, అభ్యాగతులను సేవాభావంతో చూసుకొని, వారి మనసు నొచ్చుకోకుండా సేవ చేసి పంపాలని, అలా చేస్తే మనకు స్వర్గంలో సీటు ఖాయమని చెప్పేవారు. అయితే అతిధికి, అభ్యాగతుడికి తేడా ఉంది. అభ్యాగతి మన యింటి సింహద్వారానికి అవతలే ఉండి మనం పెట్టిందేదో తిని మనకో నమస్కారాన్ని, వీలైతే కన్నీళ్ళతో పారేసి వెళ్ళిపొతాడు. అతిధి అలా కాదు. మన యింటి సింహద్వారం దాటి లోపలికొచ్చి, మన ప్రక్కనే భోజనానికి కూర్చుని, తనకి కావలసినదేదో అడిగి పెట్టించుకొని, కబుర్లు చెబుతూ లాగించి ఒక ఆశీర్వచనం పడేస్తాడు. అభ్యాగతి జీవితంలో మనకి ఒక్కసారే కనిపిస్తాడు. అతనికి వీలైతే యింత ముద్ద పడేస్తాం లేదా చెయ్యి ఖాళీలేదు బాబూ అని పంపేస్తాం. కానీ అతిధిని అలా పంపలేము. కారణం అతిధి మనకు బాగా కావలసినవాడు, పదేపదే కలిసేవాడు కావటం వల్ల మొహమాటం వల్లనైనా ఆతిధ్యం యివ్వక తప్పదు. ఇంకా. . ." "ఏమోయి! బాగున్నావా?" అన్న మాట వినిపించి వ్రాస్తున్న పుస్తకం మూసేసి తలెత్తి చూశాను. అతన్ని ఎక్కడో చూసినట్లు ఉంది. కానీ ఎక్కడో గుర్తు రావటం లేదు. "మర్చిపోయావ్! డైబ్భై ఏళ్ళు దాటినవాణ్ణి, నేను మరిచిపోయానంటే అర్ధం ఉంది. కానీ నాకు గుర్తున్నావే! ఈ మధ్యనే పెళ్ళిచేసుకొన్న యువకుడివి, నువ్వు మర్చిపోవడమేంటయ్యా!" అని భళ్ళున నవ్వాడు. అనవసరమైన మాటలాపి తనెవడో చెప్పొచ్చు కదా! నాలోనే సణుక్కున్నాను. "నీకు గుర్తు రాదయ్యా! నీ పెళ్ళిలో పదిమందిలో చూశావేమో! నీకు గుర్తురాదు. నేనయ్యా! మీ ఆవిడకి వేలు విడిచిన బాబయ్యని. నన్ను భజగోవిందం అంటార్లే!" ఆయన మాటలకు గుర్తొచ్చినట్లు నటించి యింట్లోకి ఆహ్వానిస్తూ " వరాలూ!" అని పిలిచాను. "వరాలా? అయితే యిది మా అమ్మాయి యిల్లుకాదా? అందుకే గుర్తు పట్టలేదు. సారీ!" అని వీధిలోకి వెళ్ళబోయాడు. " వరాలంటే నేనే బాబాయి!నువ్వు సరియైన అడ్రెస్సుకే వచ్చావు" వరాలి గొంతు విని వెనుదిరిగాడాయన. "అదికాదమ్మా! మీ నాన్న నీకు మీ నాయనమ్మ పేరు పెట్టాడనుకొంటా! ఇతను వరాలూ అని పిలుస్తాడేంటి?" భజగోవిందం ప్రశ్నకు నాకైతే ఏం చెప్పాలో తోచలేదు. కానీ అవతలవాళ్ళ మనసు నొచ్చుకోకుండా బదులివ్వటంలో ఆడవారిది అందె వేసిన చెయ్యి అని ఎక్కడో చదివిన గుర్తు. "పెళ్ళికి ముందు మా జాతకాలు పోల్చి చూసినప్పుడు నా పేరు వ అన్న అక్షరంతో మొదలవ్వాలని వాళ్ళ సిద్ధాంతి చెప్పాట్ట. ఆ విషయం ఆయన మొదటిరాత్రి చెప్పినప్పుడు ఆలోచించాను. అసలు మీ భర్తలంతా పెళ్ళానికి ఏదో ముద్దు పేరుతో పిలవటమే కానీ మా అసలు పేరుతో పిలుస్తారా? అయినా ఆయన మారుస్తానన్నది పేరే గాని పెళ్ళాన్ని కాదుగదా! అందుకే సరేనన్నాను. అదిసరే! పిన్ని, సాంబుడు బాగున్నారా?" అని విషయాన్ని దారి మళ్ళించింది. "బాగున్నారమ్మా! సాంబుడు అక్కని చూట్టానికి వస్తానన్నాడు. దగ్గరలో పరీక్షలు ఉన్నాయి కదా! అవయ్యాక తీసుకెడతానని ఒప్పించి వచ్చాను" చెబుతున్న భజగోవిందాన్ని కబుర్లు చెబుతూ వంటింట్లోకి లాక్కుపోయింది. నాకు కాస్త తీరిక చిక్కింది కదాని మళ్ళి కధారచనలో పడ్డాను. కబుర్ల మధ్యలో భజగోవిందం గారి భీకరమైన నవ్వు వినిపించి కధాభంగమవుతున్నా, తిరిగి మనసుని పట్టాలమీదకి లాక్కొస్తూ కధారచన ముగించాను. ఈ లోపున లోపలినుంచి భోజనానికి పిలుపు రావటంతో డైరీని భజగోవిందంగారి కంటపడకుండా పదిలంగా అలమరలో దాచి వంటింట్లోకెళ్ళాను. "రావయ్యా! మీ ఆవిడకి వేలు విడిచిన చుట్టాన్నైనా, స్కూలుకి సెలవులిస్తే చాలు మా ఊరొచ్చేసేది. మా వెంకుకి యిదంటే పంచప్రాణాలనుకో! ఇంట్లో ఆడపిల్లలు లేరేమో! ఇదే మా యింటి మహాలక్ష్మి అన్నట్లు చూస్తుంది" హుషారుగా చెప్పుకుపోతున్న ఆయన నా ప్రశ్నతో ఒకింత ఆగారు. " వెంకు ఎవరండి?" ఆయన బదులిచ్చేలోపే వరాలు అందుకొంది. " మా పిన్ని పేరు వెంకాయమ్మ. మీరు నన్ను వరాలు అని పిలిచినట్లే ఆయన భార్యని వెంకూ అని పిలుస్తారు" తన పేరు మార్చినందుకు వరాలు నాపై చెణుకులు విసురుతున్నట్లు అనిపించింది. అయినా ఆయన ముందు ఏమనగలను? వరాలు మా యిద్దరికి భోజనం వడ్డించింది. " ఏంటమ్మా? అతనికి మరీ కొంచెమే వడ్డించావు. మరికాస్త వడ్డించు" ఆయన మాటలకు వరాలెక్కడ వడ్డిస్తుందోనని కంగారుపడ్డాను. " తరువాత అడిగి వేయించుకొంటాను. మీకేం కావాలో అడగండి" అన్నాను.
" అదేంటయ్యా? మూడు పదుల వయసులో గుండ్రాయినన్న తిని అరగించుకోవాలి గాని యిలా పెళ్ళి కాని ఆడపిల్లలా నాజూగ్గా తింటే ఎలా? నీ వయసులో నేను ఎంతో తినేవాణ్ణి. డైబ్భై ఏళ్ళ వయసొచ్చినా ఇప్పటికీ కడుపునిండా తిని బ్రేవుమని త్రేనుస్తాను" తన తిండి పుష్టి గురించి భజగోవిందంగారు బాజా వాయించటం మొదలెట్టారు.
"మీకాలం వేరు బాబాయి! పళ్ళు తింటే ఒంటికి మంచిదంటారు. కానీ యీ కాలంలో నిఖార్సయిన పళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి? అన్నీ రసాయనాలతో మాగబెట్టే పళ్ళే కదా! వాటిని తింటే కాన్సర్ వంటి మొండిరోగాలు వస్తాయని అసలు పళ్ళు తినటమే మానేశారు యీకాలం జనాలు. దానివల్లే మన ఆయుర్వేదాన్ని అభిమానించేవాళ్ళు తగ్గిపోయారు" నన్ను వెనకేసుకొస్తూ వరాలు అందుకొంది. మనదేశంలో భార్యల తీరే అంత! ఏదన్నా క్లాసు తీసుకోవాలంటే వారే తీసుకోవాలి. బయటవాళ్ళెవరన్నా భర్త తప్పు చేస్తున్నాడని అంటే భలే వెనకేసుకొస్తారు.
"బాగుందమ్మా! అన్నం తింటే అజీర్తి చేస్తుందని అసలు తిండే మానుకొంటే ఎలా? శ్రీకృష్ణదేవరాయలు తెలుసా నీకు?" హఠాత్తుగా ఆయన వేసిన ప్రశ్నకి తెలీదన్నాను.
" భలేవాడివయ్యా! ఎన్ని డిగ్రీలు తీసుకొన్నా, మన సంస్కృతి, చరిత్ర గూర్చి కనీసమైనా తెలుసుకోవాలి. కర్ణాటకలో హంపీ విజయనగరం ఉందిలే! మన విశాఖపట్టణం ప్రక్కది కాదు. ఆ హంపీవిజయనగరాన్ని పాలించిన కృష్ణదేవరాయలు ప్రతిరోజూ గుప్పిళ్ళతో నువ్వులు పిండి ఆ నూనెను తాగేవాట్ట. తరువాత ఆ నూనె చెమట రూపంలో బయటకొచ్చేవరకూ 2,3 గంటలు వ్యాయామం, గుర్రపుస్వారీ చేసేవాట్ట. యుద్ధభూమిలో ఆయనకు అపజయమన్నదే లేదు. అందుకే కడుపుని ఎండబెట్టకూడదు. పుష్టిగా తినాలి. బాగా కష్టపడి పనిచేయాలి " అని ఆయాసపడుతూ ప్రక్కనున్న చెంబులోని నీళ్ళు త్రాగారు.
"అదే రాయలవారు మంత్రి తిమ్మరుసుకు అన్యాయంగా కళ్ళుపీకించానన్న బెంగతో పోయాడు. అందుకని పుష్టిగా తింటే చాలదు, మనసులో ఏ చీకూచింతా లేకుండా చూసుకోవాలని మా హిస్టరీమాస్టారు చెప్పారండీ" అంటున్న నన్ను గంభీరంగా చూశారు. లేకపోతే నాకు క్లాసు పీకుతాడా? "అమ్మా! అబ్బాయి అలా అంటాడే గానీ కొంచెం పప్పు వడ్డించమ్మా! ఆ చేత్తోనే నాక్కూడా.. " అంటున్న ఆయనకు పప్పు వడ్డించింది. వద్దని చెప్పటంతో నాకు వేయలేదు. ఇంత క్లాసుపీకినా యింతేనా అన్నట్లు చూశారాయన. వరాలికి యిబ్బంది అనిపించినా ఆయన అడిగినవన్నీ మారాడకుండా వడ్డించేస్తోంది. వడ్డించకపోతే వరాలు తనకి సరిగా తిండి పెట్టలేదని బంధువుల్లో ఏకుతాడని భయపడినట్లుంది లేదా అతిధిమర్యాద సూత్రాలు గుర్తు వచ్చినట్లున్నాయి.
అడిగానని నాకు మజ్జిగ వడ్డిస్తూంటే మళ్ళీ అందుకొన్నారు.
"అబ్బే! ఈకాలం పిల్లలకి మరీ నాజూకు తిళ్ళయిపోయాయి. బ్రతికుండగానే తినాలయ్యా! పోయాక మనం తినగలమా? మన పేరుతో కాకులూ, బ్రాహ్మలూ తినిపోతారుగానీ " అన్నారు..
"బాబాయి! నీకు మన సంప్రదాయాల మీద గౌరవం లేకపోతే పాటించవద్దు. అంతేగానీ నీ కమ్యూనిజం భావాలతో వాటిని విమర్శిస్తే నేను ఊరుకోను" సెభాష్! వరాలు తన బాబాయికేదో క్లాసు పీకబోతోంది. అదేంటో వినాలని అనుకొంటూ తలవంచి మజ్జిగలో అన్నాన్ని పిండుతూ కూర్చున్నాను. "ఇప్పుడు నేనేమన్నానే! చనిపోతే మనం తినగలమా? కాకులు. . ." అతని మాటలను మధ్యలోనే ఖండించింది. "నీ భావం అర్ధమైంది. కానీ భోజనం దగ్గర తద్దినాల మాట ఎందుకని? అసలు పెద్దవాళ్ళు చనిపోయిన రోజు తద్దినం ఎందుకు చేస్తారో తెలుసా బాబాయి?"
భజగోవిందం గారికే కాదు నాకు తెలియదు. ఆరోజు కాకి ముద్ద పెడితే పితృదేవతల ఆత్మలు వచ్చి తినిపోతాయనటమే తెలుసు.
"తమ కడుపు కట్టుకొని మనకు తిండి పెట్టి పోషించిన పెద్దలకు మనం చూపించే కృతజ్ఞతే తద్దినం. ధనవంతుల యిళ్ళల్లో తమ పెద్దలపేరుతో బంధువులను, ఊళ్ళో పదిమందిని పిలిచి ఆరోజు అన్నదానం చేస్తారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. అందుకే పక్షులలో మానవశ్లేష్మాన్ని కూడా తినే అధమజాతి పక్షి కాకికి, మనుషుల్లో శాస్త్రాలు చదివిన బ్రాహ్మడికి, జంతువులలో ఉత్తమమైన ఆవుకి, చెరువులో బ్రతికే చేపలకి తిండి పెడితే పెద్దల పేరుతో ఆ ఊరందరికీ అన్నదానం చేసిన ఫలితం దక్కుతుందని మన పూర్వీకులు సిద్ధాంతీకరించారు. ఆ సిద్ధాంతాన్ని చెబితే కొంతమంది వితండవాదులు వినరని కాకి రూపంలో పితృదేవతలు వస్తారని చెప్పారు. నగరంలో వీలు గాక ఆవులు, చేపలకు పెట్టటం లేదు గాని, పెద్దల కష్టంతో పెరిగిన మనం వారు పోయినరోజునైనా ఏడాదికి ఒక్కసారి తలచుకొని తద్దినం పేరుతో అన్నదానం చేస్తే తప్పేముంది బాబాయి?" వరాలు క్లాసుకి భజగోవిందం గారి నరాలు పట్టేసినట్లున్నాయి మరోమాట మాట్లాడకుండా మౌనంగా భోజనం ముగించారు.
ఆరోజు అర్ధరాత్రి భజగోవిందంగారి మూలుగు విని కంగారుపడి లేచాం. ఆయన పొట్టపట్టుకొని మెలికలు తిరిగిపోతుంటే భయపడి ఆటోలో దగ్గరలోనున్న ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చాం.
అక్కడ డాక్టరు ఆయన పరిస్థితికి పెదవి విరవటంతో దగ్గరలో ఉన్న కార్పోరేట్ ఆసుపత్రికి లాక్కుపోయాం. అర్ధరాత్రి కావటంతో వీలు పడదంటే వాళ్ళని బ్రతిమాలగా, ఆయన్ని ఐ.సి.యూ.లో చేర్చారు. మేమిద్దరం దేవుళ్ళకి దండాలెడుతూ రాత్రంతా ఆసుపత్రి వసారాలోనే గడిపాం. తెల్లవారాక రక్తపరీక్షలన్నీ చేసి, ఆయన తిండి వివరాలు అడిగారు. మేము చెప్పినది విన్నాక విషయం బయటపెట్టారు. ఆయనకు బి.పి., సుగరు వంటి చిన్నాచితకా రోగాలు పదిరకాలున్నాయి. వాటికి తగ్గ మందులు వాడకపోవటమే గాక, తినకూడని పదార్ధాలు తినటంతో ఫుడ్ పోయిజనై యిబ్బంది పెట్టింది. " చదువుకున్న మీరు కూడా యిలా చేస్తే ఎలాగండీ? పెద్దాయన చపలత్వంతో ఏది తింటానంటే అది పెట్టేయక కొంచెం జాగ్రత్తగా ఉండాలండీ! ఆయన చెప్పినదాన్ని బట్టి పదేళ్ళుగా మందులు వాడుతున్నారు. అలాంటి క్రానిక్ పేషెంటుకి ఒక్కరోజు మందు మానేసినా యిబ్బంది పడాల్సొస్తుంది. పెద్దాయన మరిచిపోతే మీరు గుర్తు చేసి ఆయనకి మందులు వేస్తుండాలి " అంటూ వైద్యుడు నాకు క్లాసు పీకుతుంటే, మౌనంగా అన్నీ భరించాను. నా వాలకం చూసి వరాలు కూడా లోలోపల బాధపడింది. మరునాడు సాయంత్రానికి ఆసుపత్రినుంచి ఆయన్ని డిశ్చార్జ్ చేసారు. ఆయనకు ఆతిధ్యమిచ్చిన ఫలితంగా సుమారు అయిదువేలు ఫీజు చెల్లించి, ఆ ఆసుపత్రినుంచి బయటపడ్డాం. కృష్ణదేవరాయలు, నువ్వుల నూనె కధ చెప్పిన అతను మా చేత అలా చేతి చమురు వదిలించి, నాలుగురోజుల తరువాత తన ఊరికి వెళ్ళిపోయాడు.
"భజగోవిందం బాబాయి వల్ల మీరు మాట పడాల్సి వచ్చింది. అయినా నాదే తప్పు. బాబాయి నా యింటికి మొదటిసారి వచ్చాడు కదాని పిండివంటలు చేసి పెట్టాను. బాబాయికి గుట్టు ఎక్కువ. అందువల్ల రోజూ వాడే మందులు కూడా మన ముందు వాడక యిలా చేశాడు. క్షమించండి" వరాలి మాటలకు తేలిగ్గా నవ్వేశాను.
"ఇందులో నీ తప్పేముందిలే! అతిధికి మర్యాద చేయటం తప్పేమీ కాదు. ఆయన సంగతి ఆయన చూసుకోవాలి. మీ బాబాయి లాంటి అతిధులు అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు. వాళ్ళింట్లో వాళ్ళకి ఆయన గురించి పూర్తిగా తెలుసు గనుక, ఆయన చపలత్వంతో ఏది తింటానన్నా వారిస్తారు. అలాంటివాళ్ళు యిదిగో. . . . యిలా పొరుగూరికెళ్ళినప్పుడే తమ జిహ్వచాపల్యాలు తీర్చుకోవాలని తాపత్రయపడుతారు. వాళ్ళు చేసే పనులకు మనలా ఆతిధ్యమిచ్చిన వాళ్ళు యిబ్బంది పడాల్సి వస్తుంది. బిచ్చగాడయితే చేయి ఖాళీ లేదని పంపేస్తాం. కానీ అతిధిని అలా పంపేయలేం కదా! ఆనసూయ గురించి తెలుసా నీకు?" అడిగాను.
"ఆవిడెవరండీ? మీ ఆఫీసులో సహోద్యోగా?" అడిగిన వరాలికి కాదన్నట్లు తలూపాను.
"అనసూయ అని పురాణకాలంలో మహా పతివ్రత. ఆమెను పరీక్షించాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అతిధులుగా మారువేషాల్లో వచ్చారు. ఆమె గృహస్థాశ్రమ ధర్మంగా వారిని ఆహ్వానించి మర్యాద చేసింది. వాళ్ళు ఆమెను నగ్నంగా వచ్చి వడ్డించమన్నారు. వెంటనే ఆమె వారిని పసిపాపలుగా మార్చేసి, నగ్నంగానే ఊయలూపి జోల పాడింది. విషయం తెలుసుకొన్న వారి భార్యలు వచ్చి లబోదిబోమని బ్రతిమాలాక, వాళ్ళని మళ్ళీ మామూలుగా చేసింది. ఈ కధ మనకేం చెబుతోంది?" అడిగిన నన్ను వరాలు అయోమయంగా చూసింది.
" ఆతిధ్యం యివ్వటం తప్పు కాదు. కానీ గృహస్తు అతిధి ఆడించినట్లల్లా ఆడి, వాళ్ళ చెప్పుచేతల్లోకి పోకూడదు. వాళ్ళు తన అదుపాజ్ఞల్లో ఉండేలా చూసుకోవాలి. అతిగౌరవాలతో అతిగా మర్యాద చేయకుండా తమ యింట్లో రోజూ చేసుకొన్నట్లుగానే చేయాలి. అలా చేయకపోతే మనకు జరిగినట్లే జరుగుతుంది" అని వరాలికి చిన్నగా క్లాసు పీకి, తను కోలుకొనే లోపే మరోగదిలోకి మెల్లిగా జారుకొన్నాను.
అతిధి మర్యాద మంచిదే! కానీ మరీ యింత ఖరీదైన అతిధిమర్యాద మంచిదంటారా? ఆయన కోలుకున్నాడు గనుక సరిపోయింది గానీ జరగకూడనిది జరిగితే ఆయన "వెంకూ"కి వరాలేం సమాధానం చెప్పాల్సివచ్చేదో?
*****
No comments:
Post a Comment