“వృద్ధుల, అనాధల సేవలో గురజాడ శోభా పేరిందేవి”
మంథా భానుమతి.
మన మధ్యనే తిరుగుతూ, ఏమీ ఎరగనట్లుంటూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సహృదయులు ఎందరో ఉన్నారు. ప్యూర్ సంస్థలో సంధ్యా గోళ్లమూడి, కట్టుపల్లి ప్రసాద్ , స్వామి; ఆసరా సంస్థలో మాలతీ దేశిరాజు, నండూరి సుందరీ నాగమణి, ఉమాదేవి కల్వకోట; స్వలాభాపేక్ష లేని సంస్థల ద్వారానే కాక, పలువురు వ్యక్తిగతంగా కూడా తమ సమయాన్నీ, ధనాన్నీ వెచ్చించి సమాజ సేవలు చేస్తున్నారు. వారిలో మనం చెప్పుకోదగిన మహిళ శోభా పేరిందేవి.
పిన్న వయసు నుంచే పెద్దల పట్ల ప్రేమాభిమానాలను పెంచుకొని వారి బాగోగుల కోసం శ్రమించే శోభా పేరిందేవి ఆధునిక యువతకి ఆదర్శం అని చెప్పవచ్చు.
ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే కథల పోటీల్లో ప్రధమంగా గెలుచుకున్న డబ్బును తన పెద్దనాన్నగారు స్థాపించిన వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వడం ఎన్న దగిన విశేషం. ఆ వయసులో ఎవరైనా గుర్తుగా ఏదైనా కొనుక్కోవడమో, విందు చేసుకోవడమో చేస్తారు. కానీ, పువ్వు పుట్టగానే పరిమళాన్నిస్తుందన్నట్లు, మన శోభ తీరే వేరు.
ఆ వృద్ధాశ్రమ ప్రారంభోత్సవ సమయంలో శోభా పేరిందేవిని పరిచయం చేస్తే, అక్కడున్న 60, 70 సంవత్సరాల వృద్ధులు అందరూ ఆశీర్వదించారు. వాళ్ళల్లో కొందరు చిన్నబోయిన ముఖాలతో తమ సమస్యలు విప్పి కన్నీళ్లపర్యంతమవుతూ చెప్పడం శోభని కదిలించింది. పింఛన్లు లేవు. పిల్లలు చూడడం లేదు . అనారోగ్యాలతో వున్నా మందులులేవు సరే పట్టెడన్నం పెట్టేవారూలేరు. అడుక్కు తింటూ కొందరు, వున్నవే అమ్ముకుంటూ రోజులు గడుపుతూ ఇంకొందరు, ఇలాఎందరి కన్నీటి కథలో..
శోభకు చిన్నతనం నుంచీ తండ్రితో చాలా చనువు. తన వూరెళ్ళగానే ఆయనతో వృద్ధాశ్రమం సంగతులు చెప్పగానే, ''నువ్వు సమాజం కోసం అంకితమవ్వాలి తల్లీ! మొదటి ప్రాధాన్యం కరసేవకి తర్వాతే కలం సేవకి .... అర్ధమయ్యిందా? రాసేవాళ్ళు ఎందరో వుంటారు కానీ సేవ చేసేవారు వెయ్యిలో ఒక్కరూ వుండరు అది నువ్వే కావాలి''అన్నారు శ్రీ గురజాడ భుజంగరావుగారు.
ఆ మాటలు శోభ మీద చాలా ప్రభావం చూపించాయి. ఎక్కడ సేవ అవసరముంటే అక్కడికి సాగేలా ఆ వయసులోనే అలవాటయ్యింది. ఒక రోజు భయంకరమయిన రోడ్ యాక్సిడెంట్ చూసింది. ఒక చిన్న పాప చనిపోయింది. కారణం రక్తం సమయానికి అందక పోవడమేనని తెలిసింది. రక్తం విలువను గూర్చి ఎందరినో అడిగి తెలుసుకుని, తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా కాలేజీకి దగ్గరలో వున్న బ్లడ్ బ్యాంకు కి వెళ్లి 18ఏళ్ళు అని చెప్పి మొదటిసారి రక్తదానం చేసింది. అప్పుడే రిక్షా వాళ్ళు రక్తం అమ్ముకోవడమూ చూసింది. ఇన్ఫెక్షన్స్ వస్తాయని కానీ ఇంకా ఆ వయసు రాలేదని కానీ తట్టలేదు. ఇంటికి వెళ్లి గొప్పగా చెప్పి బాగా చివాట్లు తిని, ఇంకెప్పుడూ రక్తం ఇవ్వొద్దు అంటే సరేనంది. కానీ ఇస్తూనే ఉంది, తనకు 50 సంవత్సరాలు వచ్చి, ఇంక డాక్టర్లు ఇవ్వద్దనే వరకూ.
వృధ్ధులు, వికలాంగులకు ఫించన్లివ్వడం, వారికోసం మందులు కొనడం వైద్యంచేయించడం, ఎయిడ్స్, కాన్సర్, కుష్టురోగులకి సేవ సహకారాలందించడం, పేదపిల్లలని చదివించడం ఇలా ఉచిత సేవలు చేస్తూ వున్న శోభకి సియ్యే చదివిన వాడు భర్త అయితే, ధనం సహాయం తేలికనుకుని, అర్ధం చేసుకునే వాడుండాలని ఏరి కోరి ఛార్టెడ్ అకౌంటెంట్, సి.యస్ పాణిగారితో వివాహం చేశారు తల్లిదండ్రులు. ఎన్నో మంచి ఉద్యోగావకాశాలు వస్తే, కొన్నాళ్లు చేసినా మధ్యలో ఎవరికో సాయం అవసరం అయ్యి మానెయ్యడం.. అలా గడిచింది. టీచర్, లెక్చరర్, జర్నలిస్ట్ వగైరా ఉద్యోగాలు చేశారు. ఫొటోలు, సర్టిఫికెట్స్ ఇలాంటివేవీ లేకున్నా శోభ పేరు సేవా రంగాల్లో పదిమందికీ తెలిసింది.
వృద్దులు ఎవరైనా ఆసుపత్రుల్లో వున్నా, ఆశ్రమ పెద్దల ఆరోగ్యం బాగుండకున్నా సహాయం చేస్తూ ఉండడం వారిని ప్రోత్సాహపరుస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో, ఆచార్య తురగా సోమసుందరంగారనే వృధ్ద బంధువైన పెద్దాయన శోభని పెద్దల మీద పరిశోధన చెయ్యమన్నారు. శోభ లాంటి వారు చేస్తే ఉపయోగం అని బలవంత పెట్టి చేయించారు. అప్పటికే శోభ పెద్దల మీద రాసిన 60 కధల సంపుటి (అందులోని కధలన్నీ వివిధ పత్రికలలో వెలుగు చూశాయి.) ‘స్వీట్ 60’ చదివి రెండు పుస్తకాలలో సమీక్షలు రాసిన డాక్టర్ బి. జయరాములుగారు ఉస్మానియాలో చెయ్యమని ప్రోత్సహించారు. అయన ఓరియంటల్ ఫ్యాకల్టీకి చైర్మన్‍గా ఉండేవారు. రోజంతా కౌన్సిలింగ్, ఆశ్రమానికెళ్లి సేవ చెయ్యడం ఫోన్లో ఓదార్చడం అనాధ పిల్లలకి, పేద పిల్లా, పెద్దలకి ఉచితంగా చదువు చెప్పడం, శుభ్రత నేర్పడం, వైద్య ఆహార అవసరాలు అందించడం, ఆడపిల్లల సమస్యలు పరిష్కరించే దిశగా సాగడం వారిలోని ప్రతిభని గమనించి ప్రోత్సహించడం, ఆత్మహత్యకి పాల్బడేవారిని అరికట్టే కార్యక్రమాలు.. ఇది అది అని లేదు, ఏ సమస్య ఎదురైతే అక్కడ శోభ ప్రత్యక్షం.
సత్యహరిశ్చంద్రవారి 'నింగినేల' పత్రికలో అసోసియేట్ ఎడిటర్‍గా వుంటూ, దిక్కులేని తప్పిపోయిన వృద్దులకు సాయపడడం, ఆసుపత్రిలో పిల్లలు వొదిలిపోయిన పెద్దలను ఆశ్రమంలో చేర్చడం, దిక్కులేని జీవాలకు అంత్యక్రియలు చెయ్యడం వగైరా చేసే ఆ సంస్థతో అనుబంధం తనకి గర్వకారణం అంటారు శోభా గురజాడ.
అంతే కాదు, శోభ రాసిన ఎన్నో నాటకాలు ప్రబోధాత్మకమై, తాను దర్శకత్వం వహించినవి చాలామందికి ఉపకరించాయి. మొన్ననే సావిత్రిబై ఫ్యూలే అవార్డూ, యూఎన్ వారి సౌజన్యంతో కర్మవీరచక్ర పురస్కారమూ లభించాయి. గైడింగ్ లైట్ ఫౌండేషన్ సెక్రెటరీగా అంధురాళ్ళకి అమ్మగా చేయూతనిస్తూ వారికి అన్నివిధాలా తోడ్పడుతున్నారు శోభా పేరిందేవి. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ పెద్దలందరూ తన వాళ్ళే అంటారు.
వృద్ధులకి అన్న పానీయాలు అమరుతే చాలనుకుంటారు చాలా మంది. కానీ వారిలో ఎన్నెన్ని ప్రతిభలున్నా, ఇంట్లో వారు కానీ, ఆశ్రమాలలో కానీ పట్టించుకోరు సాధారణంగా. శ్రీమతి శోభ వారిలోని ప్రతిభలన్నీ వెలికి తీసేలాగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. నాటకాలలో, పాటలలో, వక్తృత్వంలో వారికి పోటీలు పెట్టడం, అప్పుడప్పుడు పిక్నిక్ లకి తీసుకెళ్లడం, ఆటలు ఆడించడం వంటివి మచ్చుకు కొన్ని.
వృద్ధాప్య సమస్యల మీద పి.హెచ్ డి చేసిన మొట్ట మొదటి తెలుగు మహిళ శోభా పేరిందేవి అని చెప్పవచ్చు.
రచయిత్రిగా పలు అంశాల మీద 11 పుస్తకాలు ముద్రించారు.
పాత్రికేయురాలిగా అరడజనుపైగా పత్రికలకి సబ్ ఎడిటర్ గా, అసోసియేట్ ఎడిటర్ గా, సంపాదకురాలిగా పని చేశారు.
సంఘసేవికురాలిగా..
- 80 సంవత్సరాలు దాటిన వృద్ధురాళ్లు నలుగురు, ఒక వికలాంగుడు.. 5 మందికి నెలకు 500 చొప్పున ఫించన్ అందిస్తున్నారు.
- ఒక బాలుడు, ఒక బాలిక.. ఇద్దర్ని చదివిస్తున్నారు.
- ఒక అంధ బాలిక బాధ్యత పూర్తిగా తీసుకుని చదివిస్తున్నారు.
- సృద్ధుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు చేయిస్తున్నారు.
- వికలాంగులకు ఒక వెబ్ సైట్ ప్రారంభించి, విద్య, వైద్య, ఉద్యోగ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇవి కాక బాలానందం, అభినందన, సత్యసాయి మహిళా విభాగం, శాంతి ఓల్డ్ ఏజ్ హోమ్ మొదలైన సంస్థలలో సభ్యురాలిగా ఉంటూ సేవలు అందిస్తున్నారు.
ఇంక రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పురస్కారాలు పాతిక పైగా ఉన్నాయి. స్థలాభావం వలన అవన్నీ ఇక్కడ పొందు పరచలేక పోతున్నాను.
శ్రీమతి డాక్టర్ శోభా గురజాడ మన జంటనగరాల నివాసియైనందుకు మనం అందరం గర్వ పడదాం. ఎఁదరికో స్ఫూర్తి కలిగించి పలువురు సామాజిక సేవ చేసేట్లు ప్రోత్సహిస్తున్నందుకు వారిని మనసారా అభినందిద్దాం.
****
No comments:
Post a Comment