గువ్వలచెన్న శతకము - గువ్వలచెన్నడు - అచ్చంగా తెలుగు

గువ్వలచెన్న శతకము - గువ్వలచెన్నడు

Share This

గువ్వలచెన్న శతకము - గువ్వలచెన్నడు 

పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం 



కవి పరిచయం: 
గువ్వలచెన్న శతక కర్తృత్వము గురించి కానీ, కవి కాలాదుల గురించి కానీ చరిత్రకారులలో నిర్ధుష్టమైన అభిప్రాయం లేదు. శతకకవుల చరిత్రము  రచించిన శ్రీవంగూరి సుబ్బారావుగారి అభిప్రాయం మేరకు ఈ శతకం క్రీ.శ. 1600 ప్రాంతమువాడైన పట్టాభిరామ కవి కృతమని నిర్ణయించినారు. అయితే ఈశతకము పట్టాభిరామ కృతమనుటకు స్పష్టమైన ఆధారాలు ఏవియూ మనకు కనుపించవు. శతకనామము ననుసరించి మాత్రము గువ్వలచెన్నడు ఈశతకము రచించినట్లు లేదా అతనిపేర రచింపబడినట్లు ఊహించవచ్చును. శతకమునందు ఊదాహరించిన పాశ్చ్యాత్య సంస్కృతి తెలుగువారిపై దాని ప్రభావము పరిసీలించిన ఈశతకము బహుశా 18వ శతాబ్ధినాటిదని భావించవచ్చును.
శతకపరిచయం:
గువ్వలచెన్న శతకపద్యములు నూటికి మించి యున్నవి. వినిలో అదికము కందపద్యములు. కందపద్యములన్నిటికి గువ్వలచెన్న అనే మకుటమే కలదు. ఒకదానిలో బిజనవేములచెన్నా అని మకుటము యున్నది. కొన్నిపద్యాలకు పాఠాంతరాలు కూడా కలవు. కొన్ని పద్యములలో కవిచౌడప్ప శతక పద్య పాదములు చేరినవి.
పాశ్చాత్య నాగరికత అప్పుడప్పుడే తెలుగుదేశముపై ముద్రవేసిన కాలమునాటి శతకమిది. చౌడప్ప వేమనలను అనుసరించి ఈశతకకర్త కూడా సమకాలిక వ్యవస్థ సమీక్షించి రాజకీయ, మత సాంఘీక, ఆచారవ్యవహారములను గూర్చి తనకుతోచిన మార్గమున విమర్శించినాడు. క్రింది పద్యాలను చూడండి.
క. ఇరుగుపొరుగువా రందఱుఁ
గరమబ్బురపడుచు నవ్వఁగా వేషములన్
మఱిమఱి మార్చిన దొరలకు
గురువగునా బ్రాహ్మణుండు గువ్వలచెన్నా.
క. తెలుపైన మొగముగలదని
తిలకము జుట్టును ద్యజించి తెల్ల యిజారున్
దలటోపిఁగొనఁగ శ్వేత ము
ఖులలో నొకఁడగునె ద్విజుడు గువ్వలచెన్నా!
కుక్కల పెంపకం పై ఈ కవి విమర్శ చూడండి.
క. పక్కల నిడి ముద్దాడుచుఁ
జక్కఁగఁ గడుగుచును దినము సబ్బు జలముచే
నక్కఱదని యస్పృశ్యపుఁ
గుక్కలఁ బెంచుదురు ద్విజులు గువ్వలచెన్నా!
కులస్త్రీలు నృత్య నాట్య సంగీత విద్యలను కులవిద్యలుగా అబ్యసించటం, వకీళ్ళ దుర్వర్తనం మొదలైన వానిని వస్తువుగా స్వీకరించటంలో శతకకర్త దనదైన శైలైలో క్రొత్తదనం చూపించాడు.
క. సంగీతము నాట్యము గణి
కాంగనలవి గాని యవి కులాంగనలవియా?
పొంగుచు వాద్యము రచ్చల
కుం గొని చని పాడగలరె గువ్వలచెన్నా!
వెలకాంత లెందరైనను
గులకాంతకు సాటిరారు కువలయమందున్
బలువిద్య లెన్ని నేర్చిన
గులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా!
క. ప్లీడరులమని వకిళ్ళీ
వాడుక చెడ స్వేచ్చఁ దిరిగి పాడు మొగములన్
గూడనివారిం గూడుచు
గూడెముల జరింత్రు ముందు గువ్వలచెన్నా!
క. విను మున్నీల శిఫార్సున
దనునమ్మిన వాని పనులు ధ్వంసించు వకీ
ల్తన మున్నవాఁడు తిరిపెముఁ
గొనునాతడు చల్లవాడు గువ్వలచెన్నా!
చౌడప్ప "పస" గల అంశములన్నిటిని ఒకచోట చేర్చి చెప్పినట్లు ఈశతకకారుడు వివిధ ధ్వనులను వాటి ఆధారస్థానములను పదముల కన్వయించి విపులముగా వివరించెను. కసకస, రుసరుస, కరకర, పరపర, గుడగుడ, బుడబుడ, లొడలొడ మొదలగునవి. కొన్ని అటువంటి పద్యాలు చూడండి.
క. కస కసలు కాయగూరల
బుస బుసలగు ఱొంపనుండు బుడుతల యందున్
రుసరుసలు కోపియందును
గుసగుసలు రహస్యమందు గువ్వలచెన్నా!
క. కరకర నమలుటయందును
బరపర యగునెపుడు చుఱుకు వ్రాతలయందున్
జురచుర కాలుటయందును
గొరకొర యగు కోపదృష్టి గువ్వలచెన్నా!
క. తడ తడ భీతహృదయముల
బెడ బెడయగుఁ బట్టు బట్ట విడఁగట్టునెడున్
బడ బడ బాదుట యందును
గుడగుడ యన్న ముడుకందు గువ్వలచెన్నా!
క. లొడలొడయగు వదులందును
బుడబుడ నీళ్ళందుబుడ్డీ మునుఁగుటయందున్
గడగడ చెవిబాధయడన్
గొడగొడ లప్రస్తుతోక్తి గువ్వలచెన్నా!
సూక్తిప్రాయమైన నీతులు అధిఖేప అర్థాంతరన్యాస అన్యాపదేశ దృష్టాంతరరీతిలో కనిపిస్తాయి.
క. పందిరి మందిరమగునా?
వందిజనంబాప్తమిత్రవర్గంబౌనా?
తుందిలుఁడు సుఖముగనునా?
గొంది నృపతిమార్గమగునా? గువ్వలచెన్నా!
అన్యకవుల అనుకరణలు కొన్ని ఈ శతకంలో చూడవచ్చును. ఈ వెల్లుల్లిపద్యం చౌడప్పగారి వంకాయపద్యాన్ని గుర్తుకు తేక మానదు. చౌడప్ప లాగానే ఈకవి కూడా కొన్ని పద్యాలలో బూతుపదప్రయోగం కూడా చేసాడు.
క. వెల్లుఁల్లి బెట్టి పొగిచిన
పుల్లని గోంగూరరుచిని బొగడఁగవశమా?
మొల్లముగ నూనివేసుక
కొల్లగ భుజియింపవలయు గువ్వలచెన్నా!
చివరిగా ఈ కవి చెప్పిన ఈ క్రిందిపద్యం చాలామందికి కంఠతావచ్చినదే.
గుడివడును నూయి పూడును
వడినీళ్ళకుఁ జెరువు దెగును వలమిలఖలమౌ
చెడనిది పద్యము సుమ్మీ
కుడుయెడమలు చేడకన్న గువ్వలచెన్నా!
అందుకే ఈ కవి తనకు తోచిన నీతులన్నీ ఒకచోట పద్యరూపంలో చేర్చి మనకు అందించాడు. ఎందుకో కూడా మనకు చివరి పద్యంలో తెలియచేసాడు.
క. ఇప్పద్యము లన్నిఁటిలో
జెప్పిన నీతులను మదినిఁజేర్చి తెలిసినన్
దప్పక పదుగురులోఁగడు
గొప్పగ నీతిపరుఁడగును గువ్వలచెన్నా!
ఇంత చక్కటి శతకం, ఇన్ని నీతులను మనం కూడా నేర్చుకొందాము. అందరికీ తెలియచేద్దాం. మీరు ఈశతకం చదవండి. ఇతరులచే చదివించండి.
****

No comments:

Post a Comment

Pages