ఇచ్చుటలో ఉన్నహాయి... స్వర్గమేనోయి!!.
-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి.
అంబులెన్స్ వేగంగా సైరన్ సౌండ్ చేసుకుంటూ వెళ్తుండగా దానివైపు చూసి కళ్ళుమూసుకుని రెండు చేతులూ జోడించి దణ్ణం పెట్టుకున్నాడు మాణిక్యం.
అది చూసి “సినిమాల ప్రభావం చాలా ఉంది నీమీద”!! అన్నాడు స్నేహితుడు రత్నం.
“ఈ అలవాటు కొన్ని సంవత్సరాల నుంచి నాకుంది - నన్ను చూసే సినిమాలో ఆ సీన్ పెట్టేరేమో” నవ్వేస్తూ అన్నాడు మాణిక్యం.
“నువ్వు మరీనురా... సినిమాలో ఐనా., నిజంగానే అయినా అలా దణ్ణం పెట్టేసుకుంటే అంబులెన్స్ లోని పేషెంట్స్ బతికేస్తారా”!!... అని రత్నం గేలి చేసాడు.
“నేను దణ్ణం మాత్రమే పెట్టుకోలేదు... అప్పుడప్పుడు నేను ఏదైనా పుణ్యకార్యం చేసుంటే...అందులోని ఓ పదిశాతం ఆ పేషేంటుకిచ్చి అతని ఆరోగ్యాన్ని బాగు చెయ్యమని భగవంతుణ్ణి వేడుకుంటాను. ఉత్తినే ప్రార్ధించేకన్నా మన పుణ్యాన్ని ఇచ్చి కోరితే మంచి జరుగుతుందని నా అభిప్రాయం”... నెమ్మదిగా చెప్పాడు మాణిక్యం.
“ఇది నేను ఏ సినిమాలో చూడలేదు - ఈ విషయంలో నువ్వే నాకు మొదట కళ్ళు తెరిపించావ్... అయినా నేను దణ్ణం మాత్రమే పెట్టుకుంటా!.. పుణ్యాన్ని ఉత్తపుణ్యానికి ఎవరు ఇస్తారు??...”
“నీ ఇష్టం... !!
అలా వాళ్లిద్దారూ ఆ రోడ్డుమీద జనప్రవాహంతో పాటు ముందుకు కదిలారు. ఇంటికొచ్చాడన్నే మాటే కానీ., రత్నం మనసు మాణిక్యం దగ్గర నుంచీ ఇంకారాలేదు. ఇలా పుణ్యాన్ని ధారపోస్తే నిజంగా దాని ప్రభావం నుంచి అంబులెన్స్ పేషేంట్స్ లాభ పడతారా... ఒకవేళ అలా జరిగితే!?? ఏళ్ళతరబడి చేస్తున్న మాణిక్యం పుణ్యం కాస్తా పోయి పాపం పెరిగిపోయి అనవరసంగా పాపం నరకానికెళతాడా? ఇలా పరిపరివిధాల ఆలోచిస్తూ రత్నం అన్యమస్కకంగానే నిద్రలో జారిపోయాడు.
***
మహానగరాల్లోనేకాదు మామూలు నగరాల్లోనూ పెద్దపెద్ద ఊళ్లలోనూ అంబులెన్స్ సైరన్ చేసుకుంటూ దూసుకెళ్తునే ఉంటాయి... నిత్యం జరిగే ప్రమాదాల వల్ల అంబులెన్స్ లు కూతపెడుతూ పరిగెడుతూనే ఉంటాయి. కాకపోతే వాటి వేగం అనేది అక్కడి జనం సివిక్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుందంతే. కొంతమంది వాటికి దారి ఇస్తారు. కొంతమంది సెల్లులో సొల్లు మాట్లాడుతూ అంబులెన్స్ కూతనే పట్టించుకోరు. ఇలాంటి రోజుల్లో మాణిక్యం ప్రవర్తన కొంచెం విచిత్రంగా విభిన్నంగా రత్నానికి అనిపించడం వింత కాదు కదా! మాణిక్యం., రత్నం ఎప్పుడు కలిసి నడుస్తూ బజారుకెళుతున్నా అంబులెన్స్ కనిపించినప్పుడల్లా మాణిక్యం నమస్కారం పెడుతూ కాసేపు మౌనంగా ఉండటం రత్నం చూస్తూనే ఉన్నాడు. అతను తనని అలా గమనిస్తున్నా తన పని తాను చేసుకుంటూనే ఉన్నాడు మాణిక్యం . రోడ్డు మీద యాక్సిడెంట్ చూస్తే పోలిసులకు ఫోన్ చేయడం., బాధితులకి ఆస్పత్రి వరకూ తీసుకువెళ్ళి రక్తసంబంధీకులకు బంధువులకి ఆ వార్త తెలియజేయడం చేస్తూ కాలనీవాసులకి ఓ ఆదర్శప్రాయుడిలా… ఎన్నో స్వచ్ఛందసేవాసంస్దలకు తల్లో నాలుకలా మాణిక్యం ఉంటాడు. అనాధ శవాలని శ్మశానానికి తీసుకెళ్లడం కూడా విద్యుక్తధర్మంగా భావిస్తాడతను. అప్పుడప్పుడూ అతనికి జతకలుస్తాడు రత్నం. కాలనీలో వాళ్ళిద్దర్నీ ‘రత్నమాణిక్యా’లంటారు.
***
సంవత్సరాలను చక్రాల్లా మలచుకుని కాలం ముందుకుపోతోంది. ఆరోజు - బంగాళాఖాతంలో అల్పపీడనం. అప్పటికే తుపాను విజృంభణ పెరుగుతోందని వార్తలొస్తూనే ఉన్నాయి. గాలివాన జోరు పెరుగుతునే ఉంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. దాదాపు నిరవధిక కర్ఫ్యూ విధించినట్లుంది ఆ ప్రాంతం. సాయంత్రం పేరుకే గాని అప్పుడే మబ్బుల దొంతరలకి రాత్రిగా మారిపోయింది. రత్నం మనవరాలు ఆరోజు తెగ ఏడుస్తుంటే., ఫోన్లేవీ పనిచెయ్యకపోతుంటే దగ్గర్లోని ఆస్పత్రి ఏదైనాతెరిచి ఉందేమోనని రత్నానికి సాయంగా మాణిక్యం కూడా బయలుదేరాడు.
కాటేసే కాలనాగులా … కరంట్ వైర్ తెగి నీళ్ళలో పడింది. అది గమనించని స్నేహితులిద్దరూ సరిగా అదే నీటిలో కాలు పెట్టారు. వెనువెంటనే కేకలు పెడుతూ.,చుట్టుపక్కలవాళ్లకి పరిస్థితి అర్ధమైలోపు ఒకేసారి ప్రాణాలొదిలేసారు ‘ప్రాణ’స్నేహితులు.
జీవితంలోనూ జీవితానంతరం ఒకరొకరు సాయంగా ఉండాలనేమో కలిసి లోకాన్ని విడిచారు వాళ్ళిద్దరూ.
***
ఇద్దరూ మొదట స్వర్గానికెళ్ళారు. కొన్నాళ్ల తర్వాత పాపాల చిట్టా తీసి రత్నాన్ని నరకానికెళ్ళమన్నారు - స్వర్గలోక రక్షకులు. మాణిక్యానికి మరిన్ని సదుపాయాలు కలుగజేయాలని ఉత్తర్వు జారీ కూడా చేసారు. దాంతో రత్నానికి ఏడుపొచ్చినంత పనయ్యింది. తనకన్నా ఉత్తముడిగా మాణిక్యాన్ని చూసేసరికి గతజన్మ మానవరూపంలోని అసూయ ప్రజ్వరిల్లింది. వెంటనే స్వర్గలోక రక్షకుడి దగ్గరకెళ్ళి - “ మాణిక్యం తన పుణ్యాన్ని ఎప్పటికప్పుడు ధారపోసినా ఇంకెంత పుణ్యం ఉంటుందీ., నేనేం ధారపోయలేదు కదా...నా నిల్వ అయిపోయిందా !?? రత్నం ప్రశ్నించాడు. ఆమాటలకి ముసిముసిగా ప్రశాంతంగా మృదువుగా నవ్వాడు స్వర్గలోక రక్షకుడు.
“ నాయనా... పుణ్యాన్ని ధారపోస్తే తరిగిపోదు. అది ధనం కాదు. తన పుణ్యాన్ని వేరేవాళ్లకి ఇవ్వమనడం పుణ్యమే అవుతుంది కదా - ఇంత చిన్న తర్కం ఎందుకు మరిచిపోయావూ... అతను తన పుణ్యాన్ని వేరేవాళ్లకి ఇస్తే వాళ్లు ఉన్నతస్థాయికి చేరుకుంటారని ఆశపడ్డాడే తప్ప తన పుణ్యం తరిగిపోతుందని బాధ పడలేదు – భయపడలేదు!!. అందుకే మరింత పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు. తనకు లాభం ఉంటేనే మంచి అంటే ఎవరైనా మంచి చేస్తారు. ఎదుటివారికి మంచి జరగాలని ఆశించడం మామూలు మానవమాత్రులకి సాధ్యం కాదు. కేవలం నీ మిత్రుడు మాణిక్యాల్లాంటివారికే అది చేతనవుతుంది. పరలోక సౌఖ్యాన్ని ధారపోసి సాటి వారికి సాయం చేయడం అంటే అదే పుణ్యం - అప్పుడే జీవితం ధన్యం”... అంటూ నిష్క్రమించాడా రక్షకుడు.
మాణిక్యం వల్ల ఉత్తమగతులు పొందిన అక్కడివారికి అతని విశాల హృదయం తెలిసి ఉచితరీతిన సత్కరిస్తున్నారక్కడి వాళ్ళు. మళ్ళీ మానవజన్మ ఎత్తి ఇతరులకి సహాయం చెయ్యాలి అని మనసులో (అప్పుడు మనసుంటుందా!?) అనుకుంటూ నరకానికి విచారంగా తరిలివెళ్ళాడు రత్నం.
****
No comments:
Post a Comment