జీతే రహో శ్రీనివాస్! - అచ్చంగా తెలుగు

జీతే రహో శ్రీనివాస్!

-ప్రతాప వెంకట సుబ్బారాయుడు


అందరికీ జీవితం వడ్డించిన విస్తరి కాదు, ప్రణాళిక ప్రకారమూ సాగిపోదు...
ఇది నా అరవయ్యో ఏట తెలుసుకున్న విషయం. ఎలా తెలిసిందంటే శ్రీనివాస్ వల్ల. అదెలాగో చెబుతాను.
*****
మా నాన్నగారు డిఫెన్స్ లో పని చేయడం వల్ల మా ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణమే ఉండేది. దేనికీ లోటుండేది కాదు. మరీ రాజసంగా కాకపోయినా, కావలసినవి సమకూర్చుకునేవాళ్లం. మంచి చదువులు చదువుకుని పైకొచ్చాను. చిన్నప్పట్నుంచి బాధ్యతాయుతంగా ఉంటానని నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఎయిర్ ఫోర్స్ కు సెలెక్ట్ అయ్యాను. ట్రాన్స్ఫర్స్ మీద అన్ని ఊళ్లూ తిరిగేవాడిని. ఎక్కడున్నా మాకంటూ అన్ని ఫెసిలిటీస్ తో ఉన్న కాలనీలు, క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి, బయటి ప్రపంచంతో మాకు సంబంధ బాంధవ్యాలు తక్కువే! సమస్యలూ తక్కువే. మాదో పోరూపొక్కు లేని ప్రపంచం. ఆఖరికి రిటైరై హైద్రాబాదులోని డిఫెన్స్ కాలనీలో ఇల్లు కట్టుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను. ఇక్కడందరం డిఫెన్స్ తో సంబంధం ఉండేవాళ్లమే కాబట్టి కాలనీని చక్కటి రోడ్లతో, సెక్యూరిటీతో అచ్చం సర్వీస్ లో ఉన్నప్పుడు మా కాలనీలు ఎలా ఉండేవో అలా రూపొందించుకున్నాం. ఎప్పట్లానే బయటి ప్రపంచంతో మాకు సంబంధం ఉండదు. జస్ట్ ఐసోలేటేడ్. పెన్షన్, మెడికల్, క్యాంటిన్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మా జీవితం హాయిగా ఆనందంగా ఏచీకూ చింతా లేకుండా నల్లేరు మీద బండి నడకలా సాగిపోతోంది. బయటి ప్రపంచం కూడా అలాగే ఉంటుందనుకుంటాను. నాది బ్లెస్స్డ్ లైఫ్. ఇద్దరు మగ పిల్లలు. చక్కగా చదివించాను. ఆర్మీకి ఒకరు, ఎయిర్ ఫోర్స్ కు మరొకరూ సెలెక్ట్ అయ్యారు. పెళ్లిళ్లయిపోయాయి కాబట్టి పూనాలో పెద్దాడు, కోల్కతాలో రెండోవాడూ వాళ్ల ఫ్యామిలీస్ తో సంతోషంగా ఉన్నారు. ఇహ నేనూ లక్ష్మీ జీవిత చివరి ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నాం.
మా కాలనీలో అన్ని షాపులూ ఉన్నప్పటికీ ఎప్పుడైనా అలా బయటకొచ్చి కూరలూ అవీ కొనుక్కుంటుంటాం. కానీ ఆ ట్రాఫిక్ రణగొణధ్వనులు, అరుపులు కేకలు మాకు చాలా చిరాగ్గా ఉంటాయి. పైగా రోడ్లు కూడా గుంతలతో నీళ్లు నిండి చెత్తగా ఉంటాయి. అందుచేత మాకు కాలనీ నుంచి బయటకు రాబుద్ధి కాదు. రాంకూడా.
పొద్దుటే లేవడం, మా కాలనీలోనే వాకింగ్ చేయడం, ఇంటికొచ్చి పేపర్ చదవడం, కాసేపు గార్డెనింగ్, స్నానం చేసి దేవుడికి రెండు పూలేయ్యడం, మధ్యాహ్నం భోజనం చేసి ఓ అరగంట, గంట పడుకోవడం, సాయంత్రం నేనూ లక్ష్మీ కాలనీలో సరదాగా నడవడం, ఈవెనింగ్ బాత్ చేసి అర్లీగా రెండు పుల్కాలు తిని పడుకోవడం ఇది మా రొటీన్. ఎప్పుడన్నా శుభాశుభాలకి బంధువుల ఇళ్లకి వెళ్లినా ఒకటి రెండు రోజులే. అక్కడి ఇన్కన్వీనియెన్స్ లో ఎక్కువ సమయం ఉండలేము. ఇలా కాగితం మీదా స్ట్రెయిట్ గీతలా ఉన్న జీవితం ఆరోజు సాయంత్రం మలుపు తిరిగింది.
నేను బయటకి వెళ్లబోతుంటే, లక్ష్మి ‘మామిడి కాయలు దొరికితే తీసుకు రండీ, పప్పు తినాలనుంది’ అనడంతో అవి మా కాలనీ కూరల షాపులో లేకపోవడం మూలాన్న, బయటకొచ్చి అక్కడి దుకాణంలో కొంటుంటే "ఒరే బాబులూ" అని ఎవరో వీపు మీద చరిచారు. నేను విసుగ్గా చూశాను. ఆ వ్యక్తికి నా వయసే ఉంటుంది. "సారీ మీరు అచ్చం నా స్నేహితుడు బలవంతరావులా ఉన్నారు. అందరం బాబులూ అంటాం. నేనూ వాడూ నర్సాపురంలో కలిసి చదువుకున్నాం. అప్పుడప్పుడు ఊరెళ్లినప్పుడు కలుస్తాం. వాడు హైద్రాబాదుకొచ్చి ఇక్కడే ఎక్కడో ఉంటున్నవిషయం తెలిసింది కాని. ఖచ్చితంగా ఎక్కడనేది తెలియదు. పొరపాట్న మిమ్మల్ని వాడనుకున్నాను. మీకున్నంత దట్టమైన మీసాలు వాడికుండవు. కాస్త ఛాయ తక్కువ. మిగతా ఒడ్డూ పొడవు అంతా దాదాపు మీలాగానే ఉంటాడు! అందుకనే పొరబడ్డాను. ఏవనుకోవద్దు" నొచ్చుకుంటూ అన్నాడు.
"ఫర్వాలేదండీ. పొరబాట్లు జరుగుతూనే ఉంటాయి’ అన్నాను తేలిగ్గా నవ్వేస్తూ.
"మీరేమనుకోనంటే, ఈ పక్కనే మా ఇల్లు. వచ్చి కాఫీ తాగిపోండి. పొరబాటు చేసిన నా మనసు కాస్త శాంతిస్తుంది" అన్నాడు.
"ఫర్వాలేదన్నాను కదా.."
"మీరు రావలసిందే..జస్ట్ టెన్ మినిట్స్ అంతే"
ఇక తప్పదనుకుని బయల్దేరాను.
శ్రీనివాస్ తలుపుకొట్టాక, తలుపు తీసిందొకావిడ. "ఈయన శ్రీనివాస్ దమయంతీ..ఈమే నా భార్య" అని పరిచయాలు చేస్తూ లోపలికి దారితీశాడు.
రెండు చిన్న గదులున్న ఇల్లది. నన్ను కుర్చీలో కూర్చోబెట్టి, వాళ్లావిడకు కాఫీ పురమాయించి, "సార్, నేను ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాను. మీరు డిఫెన్స్ పర్సన్ అని చూడంగానే తెలిసిపోతోంది. నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడూ ప్రైవేట్ లోనే పనిచేస్తున్నాడు" అన్నాడు ఉపోద్ఘాతంగా.
"నా పేరు శ్రీనివాస్ అండీ.." అంటూ క్లుప్తంగా నా గురించి చెప్పుకున్నాను.
కాఫీ వచ్చింది. తాగుతున్నాను. అంతలో ఒకావిడ "సార్.." అంటూ వచ్చి, నేనున్నానని సంకోచిస్తూ మాట పూర్తి చేయలేదు. "ఈయన మన గెస్ట్, చెప్పు ఏంటి శాంతమ్మా" అన్నాడు నేనున్నా ఫర్వాలేదు చెప్పమన్నట్టు.
"బాబుకు బాలేదయ్యా..ఓ ఐదొందలిస్తే.."అంది నసుగుతూ.
"బాబుకు బాలేదంటున్నావు..మందులకు..డాక్టరుకూ ఐదొందలేం సరిపోతుంది. ఇందా వెయ్యి తీసుకో అని" జేబులోంచి తీసిచ్చాడు.
ఆమె తీసుకుని నవ్వు ముఖంతో వెళ్లిపోయాక "మా ఇంట్లో పనిసేస్తుందండీ..చూశారా ఆమె ముఖం ఎంత కళ కళ్లాడి పోతోందో" అన్నాడు ఆనందంగా.
"ఈ ఇంట్లో పనా?" అనుమానం ఆశ్చర్యం కలగలుపుగా అడిగాను.
"ఈ చిన్న ఇంటిని చూస్తే అలా మీకనిపించడం సహజమే సార్..కానీ అంట్లు కడిగి.. వాకిలి ఊడవడానికి, బట్టలుతకడానికి మేమే పని మనుషులను పెట్టుకున్నాం ఎందుకో తెలుసా.. సార్. వాళ్లనీ బతికించడానికి. నిజానికి నాకొచ్చే జీతానికి అది బరువే! కానీ అలా అనుకుంటే వాళ్లనాదుకునేదెవరు?" బాధగా అన్నాడు.
నాకు విచిత్రంగా ఉంది. ఇలాంటి మనుషులుంటారా? అనిపిస్తోంది. ప్రైవేట్ కంపెనీలో పనంటున్నాడు. ఇంటిని చూస్తే జీతాన్ని అంచనా వేయవచ్చు. ఈ వయసులో గవర్నమెంట్ ఉద్యోగం నుంచి రిటైరయి..నాలా హాయిగా పెన్షన్ తో ప్రశాంతంగా గడపాలి. ఆ అవకాశం ఎలాగూ లేదు. కనీసం ఇప్పుడన్నా, వచ్చింది రేపటి అవసరాల కోసం దాచుకోవాలి కదా. అదీలేదు ఏంటో ఈమనిషి అనిపించింది.
కొద్దిసేపు మాట్లాడాక శ్రీనివాస్ కొద్ది కొద్దిగా అర్థమయ్యాడు. ఆయన అందరిలాంటివాడు కాదు. చుట్టూవున్న వాళ్లగురించి కూడా ఆలోచిస్తాడు. వాళ్ల సమస్యలకు స్పందిస్తాడు. ప్రథమ పరిచయంలోనే నా మనసుకెందుకో దగ్గరయ్యాడు. "ఇహ వెళతానండీ..కానీ మిమ్మల్ని తప్పక మళ్లీ కలుస్తాను" అన్నాను.
"సార్..మీరు ఇబ్బందిగా భావించకపోతే, ఫ్రీగా ఉంటే.. ఆదివారం పొద్దుట ఏడు గంటలకు నాతో ఒకచోటికి రాగలరా" అభ్యర్థించాడు.
"వస్తానండీ.."అసంకల్పితంగా అని బయటపడ్డాను.
దారంతా శ్రీనివాస్ ను గురించిన ఆలోచనలే. ‘కొంపదీసి ఏ డబ్బు సాయమో అడగడు కదా, లేదు లేదు ఆయనలాంటి వాడు కాదు’మనసు కాసేపు ఊగిసలాడింది.
ఇంటికొచ్చాక జరిగింది మా ఆవిడతో కూడా చెప్పాను. ఆయన గురించి ఇద్దరం చర్చించుకున్నాం.
ఆదివారం.
నేను శ్రీనివాస్ ఇంటికి వెళ్లాను.
ఇంటిబయట ఉన్న మారుతి వ్యాన్లో ఏవో సంచులు పెడుతూ "వచ్చారా సార్..రండి. రారేమో అనుకున్నాను." అన్నాడు తనకొచ్చిన ఆలోచనకు సిగ్గుపడుతూ.
నేను చిన్నగా నవ్వాను.
నన్ను డ్రైవర్ పక్క సీట్లో కూర్చోబెట్టి తను లోపల కూర్చుని డ్రైవర్తో "పోనీయ్" అన్నాడు.
వ్యాన్ ఓ అనాథ శరణాలయం ముందు ఆగింది.
డ్రైవర్ తో శ్రీనివాస్ సంచులు లోపలికి మోస్తూ "పదండి సార్" అన్నాడు. నేనూ బరువందుకుని సహాయం చెయ్యబోతే సున్నితంగా తిరస్కరించాడు.
లోపల పిల్లలు ప్రార్థన చేస్తున్నారు.
అది పూర్తయింతర్వాత "పిల్లలూ ఈసారి మీకు పుస్తకాలు, బట్టలూ ఎవరిస్తారో తెలుసా? శ్రీనివాస్ గారు. ఈయనెవరో తెలుసా? మనదేశాన్ని రక్షించే ఉద్యోగం చేశారు. ఈయన చేతులతో మీరు తీసుకుంటే చక్కగా చదువుకుని మీరూ గొప్పవాళ్లు అవుతారు. సార్ కు అందరూ శాల్యూట్ చెయ్యండి." అన్నాడు.
అందరూ తమ చిన్న చిన్న చేతులతో శాల్యూట్ చేశారు. వాళ్లని చూస్తుంటే నాకెంతో ముచ్చటేసింది. కళ్లు అప్రయత్నంగా నీళ్లతో మసకబారాయి. పిల్లలకు అందిస్తున్న వాటిలో.. నా కంట్రీబ్యూషన్ లేనందుకు బాధ కలిగింది. తర్వాత కాసేపు పిల్లల్తో మాట్లాడాను. ‘అభం శుభం ఎరుగని బాల్యం. తల్లిదండ్రుల చాటున పెరగవలసిన పిల్లలు ఎవరెవరో ఇచ్చిన వాటితో..ప్చ్..’ గుండె తరుక్కుపోతోంది.
కార్యక్రమం పూర్తయి బయటకొస్తున్నప్పుడు "శ్రీనివాస్, ఇంతమంచి పని చేస్తున్నప్పుడు..నన్నూ సహాయం చేయమని అడగొచ్చుకదా’ అన్నాను.
"మీ చేతుల మీదుగా ఇవ్వడమే గొప్ప సహాయం సార్. మీ మాటలతో వాళ్లకు స్ఫూర్తి కలగాలని మిమ్మల్ని రమ్మన్నాను."అన్నాడు.
ఆ తర్వాత ఆయనా నేనూ కలిసి అనేక కర్యక్రమాలు నిర్వహించాము. డబ్బు ఇస్తే ముట్టేవాడు కాదు. నాచేతే సహాయం చేయించేవాడు. వృద్ధులకు బట్టలూ, పళ్ళూ పంచాము. బిచ్చగాళ్లకు ప్రభుత్వ సహాయం అందేలా చేశాం. భూకంపాలు, వరదల్లాంటి ప్రకృతి వైపరిత్యాలెక్కడ సంభవించినా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అన్నదానాలు, రక్తదానాలు, అవయవదానాలు ప్రోత్సహిస్తున్నాం. నన్ను చూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. ఒక పద్ధతి ప్రకారం, చుట్టూ పరిథి గీసుకుని ప్రశాంతంగా జీవించే నేను అది చెరిపేశాను. జనానికి దగ్గరవుతున్నాను. సహాయం చేయడంలో ఇంత ఆనందం ఉంటుందని తెలియదు. ఉద్యోగ, సంసారబాధ్యతలతో నేనూ, నా అనే ఆలోచనతో ఉన్న నేను దానికే అలవాటు పడిపోయాను. రిటైరయ్యాక  ఎండిన ఆకులా రాలిపోయే సమయం కోసం ఎదురు చూస్తున్న నా జీవితానికి పత్రహరితం అద్దాడు శ్రీనివాస్. బాధ్యతలు తీరిన ఈ వయసులో నా జీవితాన్ని పదిమంది కోసం వినియోగించడంలో ఆనందం అనుభవంలోకొస్తోంది.
ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలతో ఎంతోమంది ఆసరా కోసం ఎదురుచూస్తుంటారు. మనం బాగుంటే అంతా బాగున్నట్టు కాదు. పదిమందికి సాయం చెయ్యడానికి పదవులు కోరుకోనక్కర్లేదు. స్వాములు, బాబాలు కానక్కర్లేదు. మన చుట్టూ ఉన్నవారి అక్కర తీర్చడానికి, మనసులో మానవత్వం అనే తడి ఉంటేచాలు. మామూలు మనిషైనా ఆపద్భాంధవుడవుతాడు! సహాయం చెయ్యడానికి అనేక చేతులు పొడుచుకొస్తాయి, కాళ్లు పరుగులెడతాయి. సృష్టిలో ఏ జీవీ మరో జీవికి సహాయం చేయలేదు. ఒక్క మనిషే జీవజంతుజాలం అవసరాలు తెలుసుకుని సేవ చేయగలడు. అందుకే సృష్టిలో మనిషి జన్మ మహోన్నతమైనది. భగవంతుడు కావాలని మానవుడిని అలా సృజియించాడు.
శ్రీనివాస్ పరిచయం యధృచ్ఛికమైనా స్ఫూర్తిదాయకమైంది. అలాంటి వాళ్లు సమాజంలో అక్కడక్కడున్నా చాలు..మనుషుల కష్టాలు, కన్నీళ్లు దూరమైపోతాయి. మనసుకు సాంత్వన దొరుకుతుంది.
జీతేరహో శ్రీనివాస్! జీతేరహో!!
***

No comments:

Post a Comment

Pages