మాధవసేవ
పెయ్యేటి రంగారావు
మానవసేవే మాధవసేవ ఆట! ఆ సూక్తి వింటే మాధవరావుకి ఒళ్ళు మండిపోతుంది. తన్ను మాలిన ధర్మమేమిటి? ఈ భూగోళమంతా డబ్బు చుట్టూ పరిభ్రమిస్తోంది. పశువుకి తిన్నది బలం, పురుషుడికి జేబులో ఉన్నది బలం. జేబులో పైసా లేకపోతే చివరికి భార్య కూడా మర్యాదగా చూడదు. అంతేకాదు, మనిషి బ్రతకాలన్నా లక్షల్లో డబ్బు కావాలి, చావాలన్నా ఆస్పత్రులకి లక్షలు గుమ్మరించి చావాలి. ఈ పరిస్థితుల్లో ఒత్తిళ్ళు, చికాకులు భరిస్తూ, కష్టపడి ఒక్కొక్క రక్తపుచుక్క ఓడ్చి సంపాదించిన సొమ్ము పరులకి ఎందుకు ధారపోయాలి? ఇంక బిచ్చగాళ్ళయితే మరీ అన్యాయం. వాళ్ళకి లాభసాటి వృత్తి అడుక్కోవడం. వారి రోజువారీ సంపాదనే వేలల్లో వుంటుందట. వాళ్ళకి బ్యాంకుల్లో కాతాలు, ఆస్తులు శుభ్రంగా ఉంటాయట. అటువంటప్పుడు వారి ఎడల జాలి ఎందుకు చూపించాలి? బాబూ, పైసా ధర్మం చెయ్ బాబూ అని అడుక్కునే రోజులు పోయాయి. ఇప్పుడు రూపాయి బిళ్ళ వేసినా హీనంగా చూస్తున్నారు. ఏం, వాళ్ళు కూడా కష్టపడి సంపాదించుకోలేరా?
మాధవరావు నవయువకుడు. సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఒక పేరున్న ఆఫీసులో పనిచేస్తున్నాడు. అతడి జీతం 200 K. భార్య హైమవతి కూడా ఉద్యోగం చేస్తోంది. అతడికి ఒక బాబు, ఒక పాప. బాబు పేరు అమోఘ్. పాప పేరు ఆదిత్రి. ఇద్దరూ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళ చదువుల కోసం అతడికి ఏడాదికి దాదాపు రెండు లక్షల పైచిలుకు ఖర్చు అవుతుంది. అతడికి హైటెక్ సిటీలో 3 బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ వుంది. అందులోనే అతడు నివాసముంటున్నాడు. అది కోటిన్నర పెట్టి కొన్నాడు. దాని నిమిత్తమై బ్యాంకులో అప్పు కూడా తీసుకున్నాడు. అతడి తండ్రి పేరు భూమయ్య. ఆయన ఒక సాధారణ రైతు. మాధవరావుకు ఒక అన్న ఉన్నాడు. అతడి పేరు యాదగిరి. అతడికి భూమయ్య తన తండ్రి పేరే పెట్టుకున్నాడు. తనకి వ్యవసాయం పనుల్లో చేదోడు వాదోడుగా వుండడం కోసం చిన్నప్పట్నించీ యాదగిరిని తనతో పొలానికి తీసుకుపోతుండే వాడు. అందువల్ల యాదగిరి అసలేమీ చదువుకోలేదు. ఐతే వాళ్ళూ, వీళ్ళూ కేకలేసిన మీదట రెండో కొడుకు అయిన మాధవరావుని మాత్రం బడిలో వేసి చదువు చెప్పించాడు. అదృష్టం బాగుండి, మాధవరావు కూడా కష్టపడి చదువుకునే వాడు కావడం వలన, అతడికి చదువు బాగా అబ్బి, ఎమ్.టెక్. చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. భూమయ్య తన పెద్దకొడుకుతో స్వస్థలమైన కొప్పర్రు అనే పల్లెటూర్లోనే వుంటాడు. మాధవరావుకి హైదారాబాద్ లో ఉద్యోగం. మాధవరావుతో హైదారాబాద్ రావడానికి భూమయ్య ఎటూ అంగీకరించడు. మాధవరావు కూడా ఆయనను తన దగ్గిర వుండమని ఎప్పుడూ అడగలేదు. మాధవరావుకు ఒక చెల్లి కూడా వుంది. పేరు మహలక్ష్మి. ఆమెను భూమయ్య తమ ఊరిలోనే, తమ స్థాయిలోనే ఉన్న ఒక సాధారణ రైతుకుటుంబానికి కోడలిగా పంపాడు. ఆమె భర్త పేరు రోశయ్య. భూమయ్య ఉన్నదానితోనే సంతృప్తిగా జీవించే మనిషి. అందుకని మాధవరావుని ఎప్పుడూ తనకింత డబ్బు కావాలని అడగలేదు. తన తండ్రి, అన్న, చెల్లెలు అందరూ బాగానే బతుకుతున్నారు కనక తను డబ్బు పంపడం ఎందుకులే అని మాధవరావు ఎన్నడూ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా పంపిన పాపాన పోలేదు. మాధవరావు తలిదండ్రులకి, తనవాళ్ళకే కాదు, స్నేహితులకి కూడా ఎప్పుడూ ఒక్క రూపాయి ఖర్చు పెట్టడు.అడుక్కునే వాళ్ళంటే అతడికి అసహ్యం. అందుకని ఎవరికీ బిచ్చం వెయ్యడు. దానికి అతడి కారణాలు అతడికి ఉన్నాయి. ఆవేమంటే....... ఒకసారి మాధవరావు స్నేహితుడు అయిన సుందరం మాధవరావు దగ్గరకి వచ్చి అన్నాడు, ' మాధవా, సడెన్ గా నాకో ఇబ్బంది వచ్చిపడిందిరా. నా భార్యకు సివియర్ గా బ్లీడింగ్ అవుతోంది. అర్జంటుగా ఆస్పత్రిలో జాయిన్ చెయ్యాలి. ఒక అయిదువేలుంటే సాయం చెయ్యరా. నెలాఖరున ఇచ్చేస్తాను.' మాధవరావు కాదనలేక ఇంట్లోకి వెళ్ళి ఐదువేలు తీసుకువచ్చి అతడికి ఇచ్చాడు. రెండు నెలలైనా సుందరం ఆ బాకీ తీర్చలేదు. మాధవరావుకి అడగడానికి మొహమాటం వేసింది. వాళ్ళ ఆఫీసులో ప్యూను అయిన ఫకీరయ్య మాధవరావు గంభీరంగా వుండడం చూసి, 'ఏమిటి సార్? అల్లా వున్నారు?' అని అడిగాడు. మాధవరావు జరిగింది చెప్పాడు. ఫకీరయ్య పకపకా నవ్వేశాడు. 'అయ్యో సారూ, మీరు ఎంత అమాయకులండీ? ఇలాంటి సినేమా కతలు చెప్పి ఆ సుందరం మన ఆఫీసులో అందరి దగ్గిరా డబ్బులు గుంజేసాడు. మీరొక్కరే ఆడి వలలో పడలేదనుకున్నాను. మిమ్మల్ని కూడా పడగొట్టేసాడా?' మాధవరావుకి మనసు ఉసూరుమంది. మరొకసారి స్కూటరు మీద ఆఫీసుకి వెడుతూంటే రోడ్డు మీద కుంటుకుంటూ వెళ్తున్న ఒకతను లిఫ్ట్ కావాలని చెయ్యి ఎత్తాడు. అతడిని చూసి జాలి వేసి మాధవరావు స్కూటరు ఆపి అతడిని ఎక్కించుకుని 'ఎక్కడికి వెళ్ళాలి?' అని అడిగాడు. 'మీరెక్కడ దింపేసినా సరేనండి.' అన్నాడు అతడు. 'అదేమిటయ్యా, అసలు నువ్వెక్కడికెళ్ళాలి?' అతడు జాలిగా అన్నాడు, 'ఏం చెప్పమంటారు సార్? నేను నిజామాబాద్ లో నేషనల్ సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నాను. మాది అమలాపురం. మా నాన్నగారికి చాలా సీరియస్ గా వుందని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమలాపురం వచ్చి చేరుకొమ్మని ఫోను వచ్చింది. నిజామాబాద్ నుంచి వస్తూంటే రైల్లో టాయిలెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ జేబులోంచి పర్సు జారీ కమ్మోడ్ లో పడిపోయింది. ఇప్పుడు అమలాపురం వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. ఐనా బస్ స్టాండ్ కి వెళ్తున్నాను. కండక్టర్ కి నా అడ్రస్ ఇచ్చి, ఎక్కించుకొమ్మని బతిమాలుతాను. అంతకన్నా ఏం చెయ్యనండి? చివరి చూపన్నా దక్కాలని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ వెళ్తున్నాను.' మాధవరావుకి మనసు కలుక్కుమంది. 'అమలాపురం వెళ్ళడానికి బస్ టిక్కట్టు ఎంత?' అడిగాడు. అతడు 'నాలుగువందల అరవై రూపాయలండి.' అన్నాడు. వెంటనే మాధవరావు పర్సులోంచి అతడికి నాలుగు వందల అరవై రూపాయలు ఇచ్చి బస్ స్టాండ్ దగ్గిర దిగబెట్టాడు. అతడు జేబులోంచి ఒక కాగితం తీసి దానిమీద తన చిరునామా వ్రాసి ఇచ్చాడు. అలాగే మాధవరావు చిరునామా, ఫోను నెంబరు వ్రాసుకున్నాడు. ' నేను అమలాపురం వెళ్ళగానే మీకు డబ్బు మనియార్డరు చేసేస్తానండి.' అన్నాడు. మాధవరావు జేబులోంచి మరో వంద రూపాయలు ఇచ్చి, ' దారిలో ఏమన్నా తినడానికి కూడా కావాలి కదా? ఇది వుంచు.' అన్నాడు. అతడు వంగి వంగి దణ్ణాలు పెట్టి వెళిపోయాడు. మాధవరావు ఆఫీసు పని అయింతర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తూంటే, మళ్ళీ ఆ కుంటి అతనే మరొక వ్యక్తి స్కూటరు మీద వెనకాల కూర్చుని వెళ్తూ కనిపించాడు. మాధవరావు నిర్ఘాంతపోయాడు. ఇంకా ఇలాంటివే అతడికి నాలుగైదు సంఘటనలు ఎదురయ్యాయి. అప్పటినించి ఎవరికీ సాయం చేయకూడదు. ఎవడికీ బిచ్చం కూడా వెయ్యకూడదు. అని నిశ్చయించుకున్నాడు. అలాగే తన ఆఫీసులో పని చేస్తున్న మనోహర్ అన్న వ్యక్తిని అతడి తలిదండ్రులు, అన్నలు, అప్పచెల్లెళ్ళు పీడించి పీడించి నెల నెలా అతడి జీతంలో సగభాగం ఎగరేసుకుపోవడం గమనించాక మాధవరావుకి తన తలిదండ్రులు, అన్నయ్య, చెల్లెలు కూడా ఇలాంటి వాళ్ళే కదా అనిపించి వారికి ఏవిధమైన సాయము చేయకూడదు అని నిశ్చయించుకున్నాడు. ' నేను, నా భార్య, నా పిల్లలు. బస్, ఇదే నా ప్రపంచం. ఈ ప్రపంచంలోకి మరెవ్వరినీ అడుగు పెట్టనివ్వను.' అని గాఢంగా తీర్మానించుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. నెలలు గడిచాయి. కొద్ది సంవత్సరాలు గడిచాయి. మాధవరావు తండ్రి గాని, అన్న గాని, చెల్లెలు గాని ఎప్పుడూ మాధవరావుని డబ్బు పంపమని అడగలేదు. అప్పుడప్పుడు క్షేమసమాచారాలు కనుక్కోవడానికి ఫోనులు మాత్రం చేసేవారు. ఐతే భూమయ్య మాత్రం ప్రతి సంవత్సరం తృణమో పణమో పొలం మీద వచ్చిన అయివేజు అంటూ పంపుతూ వుండేవాడు. మాధవరావుకి తన తండ్రి మీద నమ్మకం లేదు. బాగా పండించుకుని ఫలసాయం అంతా ఆయన అనుభవిస్తూ, అన్నకి, చెల్లెలికీ దోచిపెడుతూ, తనకి మాత్రం ఏదో నామమాత్రంగా పంపుతున్నాడు అని మనసులో ఊహించుకుంటూ ఉండేవాడు. మాధవరావుకి డబ్బు యావ పెరిగిపోయింది. ఒకరోజు తండ్రికి ఫోను చేసాడు, 'నాన్నగారూ, ఇక్కడ నా ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా వుంది. అపార్ట్ మెంట్ కొనుక్కోవడానికి తీసుకున్న అప్పు బాగా పెరిగిపోయింది. బ్యాంకువాళ్ళు కోర్టుకు వెళ్తామంటున్నారు. ఏం చెయ్యాలో తోచటల్లేదు. అందుకని మన పొలంలో నా వాటా అమ్మేసి అప్పు తీర్చెయ్యాలని అనుకుంటున్నాను. మీరేమంటారు?' భూమయ్య ఒక్కక్షణం మౌనంగా వున్నాడు. తరవాత అన్నాడు. ' చాలా సంతోషం నాయనా. అలాగే చెయ్యి. ఋణం వుంటే అది తీరేదాకా మనసుకు శాంతి వుండదు. నువ్వు ఎప్పుడు వస్తున్నావో చెబుతే ఈలోగా అందరికీ ఈ మాట చెవిని వేస్తాను. నువ్వు వచ్చాక అందరితో మాట్లాడి, ఎక్కడ ఎక్కువ సొమ్ము వస్తుందనుకుంటే అక్కడ బేరం సెటిల్ చేసుకుందువు గాని.' ' థాంక్స్ నాన్నగారూ. ఇవాళ సోమవారం కదా. నేను శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం ఉదయానికి కొప్పర్రు వచ్చేస్తాను.' 'వద్దు, వద్దు. నేను నలుగురికీ చెప్పాలి కదా. అందుకని నువ్వు పై శనివారం రా. ఏకంగా రిజిస్ట్రేషను చేసేసి డబ్బు పట్టుకెళ్ళిపోవచ్చు.' 'అలాగే నాన్నగారూ.' మాధవరావుకి సంతోషమేసింది. తన తండ్రి ఇంత తేలిగ్గా ఒప్పుకుంటాడనుకోలేదు. నీకు వాటా ఎందుకివ్వాలని తిపిరీ పెడితే తనకి కోర్టుకు వెళ్ళే పరిస్తితి లేదు కదా! అమ్మయ్య, బాగానే వుంది అనుకున్నాడు. నాలుగు రోజులు గడిచాయి. భూమయ్య అకస్మాత్తుగా మాధవరావుకి ఫోను చేసాడు. ' ఒరేయి బాబూ! నీ చెల్లెలు మహలక్ష్మి మొగుడికి ఇవాళ గుండెనెప్పి వచ్చిందిరా. డాక్టర్లు బైపాస్ సర్జరీ వెంటనే చెయ్యాలంటున్నారు. దానికి లక్షా యాభయి వేలవుతుందట. నాకు ఇక్కడ ఎవరిదగ్గిరా అప్పు పుట్టే పరిస్తితి లేదు. అక్కడ నువ్వే నీకు తెలిసున్నవాళ్ళ దగ్గిర ఎలాగైనా అప్పు సంపాదించి వెంటనే కొప్పర్రు వచ్చెయ్యి. ఆపరేషను టైములో నువ్వు కూడా వుంటే మా అందరికీ ధైర్యంగా కూడా వుంటుంది.' మాధవరావు మనసులో అనుకున్నాడు. 'అమ్మ ముసలోడా! ఎంత ప్లాను వేశావురా! నేను పొలం అమ్ముదామన్నానని, వెంటనే ఇలా వంక చెప్పి ఎదురు నాదగ్గర డబ్బు గుంజుదామనుకుంటున్నావు కదురా? పాపం మహలక్ష్మి మొగుడికి గుండెనెప్పి వచ్చిందని అబధ్ధమాడడానికి నీకు మనసెల్లా వచ్చిందిరా ముసలోడా?' పైకి మాత్రం తండ్రితో ఫోనులో బాధగా అన్నాడు, 'అయ్యో అలాగా నాన్నా? నాకూ ఇక్కడ అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఐనా గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఏమన్నా డబ్బు సమకూడితే కనక వెంటనే బయల్దేరి కొప్పర్రు వచ్చేస్తాను.' 'అలాగే నాయనా.' మాధవరావు అనుకున్నాడు, 'ఇంక ఇప్పుడు తండ్రితో మాట్లాడడం అనవసరం. ఓ పదిరోజులు పోయాక అప్పుడు మళ్ళీ పొలం అమ్మడం విషయం ప్రస్తావించవచ్చు.' తర్వాత మాధవరావు ఇంటికి ఫోను చెయ్యలేదు. నాలుగు రోజులు గడిచాయి. మళ్ళీ తండ్రి దగ్గరనించి ఫోను వచ్చింది. ఫోను ఎత్తనా వద్దా అని ఆలోచిస్తూనే ఫోను ఎత్తి 'హలో' అన్నాడు. భూమయ్య ఏడుస్తూ ఫోనులో అన్నాడు, ' ఒరేయ్, మీ బావ మరి లేడురా. ఆ దేముడి దగ్గరకి వెళిపోయాడు. నువ్వు వచ్చేదాకా బాడీ వుంచుతాం. వెంటనే బయలుదేరి రా.' మాధవరావు నిశ్చేష్టుడై పోయాడు. ఐతే తన తండ్రి చెప్పినది నిజమే నన్నమాట! ఎంత ఘోరం జరిగిపోయింది? వెంటనే తను డబ్బు తీసుకుని వెళ్ళివుంటే రోశయ్య బ్రతికి వుండేవాడేమో! అతడు మనసులోనే కుమిలిపోతూ ఇంటికి వెళ్ళి భార్యను, పిల్లలను తీసుకుని హడావిడిగా కొప్పర్రు బయలుదేరాడు. రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. ఐనా పన్నెండవరోజు దాకా వుండాలి కదా? మాధవరావుకు తన తండ్రికి గాని, అన్నకు గాని, చెల్లెలికి గాని మొహం చూపించాలన్నా సిగ్గేస్తోంది. పైకి మాత్రం ఏడుస్తూ, 'ఎంత పని జరిగిపోయింది నాన్నా! నేను అడ్డమైన వాడి కాళ్ళు పట్టుకుని అడుగుతూనే వున్నాను. ఎవరూ మా దగ్గర డబ్బు లేదంటే మా దగ్గర డబ్బు లేదని దాటేస్తున్నారు. ఇదిగో, నిన్ననే, ఒక ఆసామీ తను డబ్బు సర్దుతానని, ఐతే వడ్డీ నూటికి ఐదు రూపాయలు అవుతుందని అన్నాడు. అయినా తీసుకోవడానికి సిధ్ధపడ్డాను. ఇదిగో, ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది.' అని అబధ్ధాలు చెప్పాడు. భూమయ్య విచారంగా అన్నాడు, 'బాధ పడకు నాయనా. రోశయ్యకి ఆయుష్షు తీరిపోయింది. అతడు వెళిపోయాడు. మన చేతుల్లో ఏమీ లేదు నాయనా.' మహలక్ష్మి కూడా వెక్కుతూ అంది, 'నువ్వల్లా బాధ పడకు అన్నయ్యా. నా రాత ఇలా వుంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు?' మాధవరావు 'అమ్మయ్య, నా మాటలు ఇంట్లో అందరూ నమ్మేసారు.' అని స్తిమితపడ్డాడు. అయిదురోజులు గడిచాయి. రోజువారీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంతలో మాధవరావుకి తన ఆఫీసు నించి ఫోను వచ్చింది. ఒక ప్రోజక్టు వర్క్ నిమిత్తం ఒక టీమ్ ని న్యూజిలాండ్ పంపుతున్నారట. అందులో తన పేరు కూడా వుందిట. అర్జంటుగా వచ్చి వీసాకి అప్లై చెయ్యాలట. లేకపోతే తన స్థానంలో మరొకరిని పంపుతారట.' మాధవరావు వెంటనే బయలుదేరి వస్తున్నానని వాళ్ళకి ఫోనులో చెప్పి, మళ్ళీ మూడు రోజుల్లో వచ్చేస్తానని తండ్రికి చెప్పి, ఒక్కడూ హడావిడిగా హైదారాబాద్ వెళ్ళాడు. హైదారాబాద్ లో వీసాకి అప్లై చెయ్యడం సవ్యంగా జరిగిపోయింది. మాధవరావుకి చాలా ఆనందంగా వుంది అటువంటి మంచి ఆఫర్ వచ్చినందుకు. ఇంతలో మాధవరావుకి మరో ఫోను కొప్పర్రు నించి వచ్చింది. తన భార్య ఏడుస్తూ చెబుతోంది. 'ఏమండీ, మన అబ్బాయి ఇవాళ కళ్ళు తిరిగి పడిపోయాడు. డాక్టర్లు ఆపరేషను చేయాలంటున్నారు. ఇరవై వేలు అవుతుందట. వీళ్ళదగ్గర అంత డబ్బు ఉండదు. అందుకని మీరు డబ్బు తీసుకుని వెంటనే టాక్సీ చేసుకుని బయలుదేరండి. లేకపోతే మన బాబు మనకి దక్కడండీ.' మాధవరావు ఆందోళనగా అన్నాడు, 'హైమా! నువ్వు కంగారు పడకు. నేను వెంటనే టాక్సీ చేసుకుని వచ్చేస్తున్నాను.' అతడు వెంటనే టాక్సీ చేసుకుని బయలుదేరాడు. అతడికి గుండెల్లోంచి దుఖం ఎగదన్నుకు వచ్చేస్తోంది. తను చేసిన నేరానికి దేవుడు తన కొడుక్కి శిక్ష విధిస్తున్నాడన్న మాట. 'భగవాన్! నా తప్పులన్నీ మన్నించు. నా కొడుకుని నాకు దక్కించు.' మాధవరావు దేవుడిని తలుచుకుంటూ దణ్ణాలు పెట్టేసుకుంటున్నాడు. కొప్పర్రు చేరేసరికి రాత్రి పది అయింది. మాధవరావు తిన్నగా ఆస్పత్రికే వెళ్ళాడు. అక్కడ తన కొడుకు బెడ్ మీద పడుకుని నిద్ర పోతున్నాడు. పక్కన తన భార్య కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతోంది. మాధవరావు నెమ్మదిగా భార్యను తట్టి లేపాడు. హైమవతి ఉలిక్కిపడి లేచి భర్తని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. మాధవరావు గాబరాగా అడిగాడు, 'హైమా! బాబుకి ఎలా వుంది? డాక్టర్లేమన్నారు?' హైమ అంది, 'ఏమీ కంగారు పడకండి. బాబు క్షేమంగానే ఉన్నాడు. మధ్యాహ్నం ఆపరేషను చేశారు. అంతా సవ్యంగానే జరిగింది.' మాధవరావు అడిగాడు, ' మరి డబ్బు?' హైమ ఏడుస్తూ అంది, 'మనకి చేతినిండా డబ్బు వుండీ కూడా ఏమీలేని వాళ్ళలా అయిపోయాము. మీరు వచ్చేదాకా వుండడానికి కుదరదని డాక్టర్లు అన్నారు. ఆ పరిస్థితుల్లో మీ చెల్లాయి తన మంగళసూత్రం, చేతి గాజులు అమ్మించి డబ్బు సర్దుబాటు చేసిందండీ. 'ఆయనే లేకపోయాక ఈ మంగళసూత్రం, ఈ గాజులు నన్ను ఉధ్ధరిస్తాయా? నాకు అమోఘ్ ప్రాణం ముఖ్యం. ముందు అర్జంటుగా ఇవి తీసికెళ్ళి అమ్మేయ్యండి.' అంటూ అమ్మించేసిందండి.' మాధవరావుకి దుఖం ఆగలేదు. ఏడుస్తూ వుండిపోయాడు. రోశయ్య పెద్దకర్మ ముగిసింది. తండ్రి పొలం ఎప్పుడు అమ్ముదామురా?' అని మాధవరావుని అడిగితే, అతడు, 'వద్దు నాన్నా. మనం భూమితల్లిని నమ్ముకున్న వాళ్ళం. ఈ పొలం అమ్మద్దు. నేను ఎలాగో అలా నా అప్పు తీర్చేస్తాను. ఈ పొలంలో నాకు వాటా కూడా వద్దు. ఇక నించి దీనిమీద అయివేజు నాకు ఇవ్వకండి. అన్నయ్య యాదగిరి కొడుకుని, చెల్లాయి మహలక్ష్మి కొడుకుని బాగా పైచదువులు చదివించండి. దానికి అయ్యే ఖర్చు నేను ఎలాగో ఒకలాగా భరిస్తాను. ఇంకనించీ ప్రతిఏడూ ఒక పదిరోజులన్నా నేను కొప్పర్రు వచ్చి మీ యోగక్షేమాలు చూసుకుంటూ వుంటాను. ఇన్నాళ్ళూ నేను నా ఉద్యోగం గొడవల్లో పడి మిమ్మల్ని సరిగా పట్టించుకోలేకపోయాను. ఇంకనించి అల్లా జరగదు. నన్ను క్షమించండి నాన్నా.' అని ఏడిచేసాడు. ఇప్పుడు మాధవరావు జీవనవిధానం పూర్తిగా మారిపోయింది. ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ పేదలందరికీ ఆహారపు పొట్లాలు పంచిపెడతాడు. నెలకొకసారి పిల్లల అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ పిల్లలకి బట్టలు, స్కూలు పుస్తకాలు మొదలైన అవసరమైనవన్నీ కొనిపెడతాడు. వృధ్ద్ధాశ్రమాలకి వెళ్ళి అక్కడి వృధ్ధులతో కొంతసేపు గడిపి, వాళ్ళకి బట్టలో, పళ్ళో ఏవో ఒకటి తీసికెడుతూ వుంటాడు. రోడ్డు మీద ఎవరన్నా బిచ్చం అడుగుతే లేదనకుండా ఎంతోకొంత వాళ్ళ చేతిలో వేస్తాడు. 'వీళ్ళందరూ దొంగలండి. వీళ్ళదగ్గిర బోళ్ళు డబ్బు వుండి కూడా అడుక్కుంటారండి.' అని ఎవరన్నా అంటే, వీళ్ళు నాటకాలాడుతున్నారని నువ్వు వెయ్యడం మానేస్తే, ఒక్కొక్కసారి నిజంగా అవసరమున్నవాళ్ళకి నీ సహాయం అందక వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు. వందమంది అయోగ్యులకి నువ్వు బిచ్చం వేసినా పరవాలేదు. కాని ఒక్క యోగ్యుడికి నువ్వు దానం చెయ్యక, అతడు ప్రాణాలు కోల్పోతే, అప్పుడు నువ్వు భగవంతుడి దృష్టిలో అపరాధివవుతావు నాయనా.' అని వారికి హితబోధ చేస్తాడు. ఇప్పుడు అతడికి మానవసేవే మాధవసేవ అన్న సూక్తి అమృతప్రాయంగా తోస్తోంది. నలుగురికి సాయపడడంలో గల ఆనందమేమిటో అతడికి బాగా తెలిసివచ్చింది.
*****
No comments:
Post a Comment