ఒకే ఒక్కడు
పెయ్యేటి శ్రీదేవి
సునంద ఇల్లంతా చక్కగా సర్దింది. బజ్జీలు చేసింది. స్వీట్లు బయటినించి తీసుకువచ్చాడు సునంద భర్త ప్రకాష్ రావు. అతడు ఆరోజు ఆఫీసు నించి త్వరగా వచ్చేసాడు. శిరీష డిగ్రీ చదివింది. ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక కాన్వెంటులో టీచరుగా చేస్తోంది. శిరీషకి అన్నయ్య వున్నాడు. అతడి పేరు సతీష్. అతడు బెంగళూరులో ఎమ్.టెక్. చదువుతున్నాడు. అనుకోకుండా శిరీషకి మంచి సంబంధం వచ్చింది. ఆరోజు పెళ్ళిచూపులు. సాయంత్రం ఆరుగంటలకి పెళ్ళికొడుకు, అతడి స్నేహితుడు అమ్మాయిని చూడడానికి వస్తామన్నారు. ముందర అబ్బాయికి నచ్చితే తరవాత అబ్బాయి తల్లి, తండ్రి వస్తామన్నారు. సునంద స్నేహితురాలు కమల వచ్చి శిరీషకి చీర కట్టి, పొడవుగా జడవేసి, పువ్వులు పెట్టి అలంకరించింది. 'కుందనబ్బొమ్మలా వున్నావే అమ్మలూ! నీకు నా దిష్టే తగిలేలా వుంది. నాకే కొడుకుంటేనా, నిన్నే నా కోడలుగా చేసుకునుండేదాన్ని.' అంది శిరీష బుగ్గ ముద్దు పెట్టుకుంటూ. శిరీష అందంగా సిగ్గు పడింది. కమల అంది, 'ఇదుగో శిరీషా! నీ పొడవాటి జడ, నీ అందం ఎవరికీ రావు. ఇప్పటివాళ్ళలాగా నిక్షేపంలాంటి జుట్టు కత్తిరించుకుని,పిచ్చిడ్రస్సులు వేసుకుని, జుట్టు విరబోసుకుని, నీ అందాన్ని పాడు చేసుకోకు.' 'ఇదుగో కమలా! దానికి నీతిబోధలు తరవాత చేద్దూగాని. సోఫాలో ఈ కవర్లు వెయ్యి.' అంటూ బీరువాలోంచి కవర్లు తీసిచ్చింది. అన్నట్లు అల్మారాలో వున్న గాజుప్లేట్లు శుభ్భరంగా తుడిచివుంచు. మొన్న కడిగినవే అనుకో, అయినా ఓసారి తుడుస్తే నయం కదా?' 'అబ్బా, నువ్వు హడావిడి పడిపోయి అందర్నీ కంగారు పెట్టకు సునందా! వచ్చేది ఇద్దరే కదా? పెళ్ళికొడుకు, అతడి స్నేహితుడు. ఎంతోసేపు వుండరు కూడాను. పెళ్ళికొడుకు మళ్ళీ పదకొండుగంటల ఫ్లైట్ కి ఢిల్లీ ఆఫీసుపని మీద వెళ్ళాలిట కదా? వాళ్ళు సరిగ్గా ఆరుగంటలకివచ్చేస్తారు. ఈలోగా నువ్వు ప్లేట్లలో ఫలహారాలు సిధ్ధం చేసి వుంచు. 'ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ? విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ?' సెల్ ఫోన్ మోగగానే ప్రకాష్ రావు ఫోను ఎత్తాడు. అందులో పైపాట రింగ్ టోన్ గా వస్తోంది. అది పెళ్ళికొడుకు తండ్రి చేసిన ఫోను. వాళ్ళు బయలుదేరారట. ఎక్కువసేపు వుండరట. ఏమీ హడావిడి పడద్దని, టిఫినులేం పెట్టద్దని, పిల్లని చూపిస్తే చాలని చెప్పారు. అందరూ వాళ్ళకోసం ఎదురు చూస్తున్నారు. సునంద ముందరే కాఫీ కలిపివుంచింది. గడియారం ఏడుగంటలు కొట్టింది. సరిగ్గా అప్పుడే గుమ్మంలో స్కూటరు ఆగిన చప్పుడైతే ...................... 'ఏమేవ్! పెళ్ళివారొచ్చేసారు.' అంటూ గావుకేక పెట్టాడు ప్రకాష్ రావు. అసలే పెళ్ళికొడుకు ఎక్కువ సేపు వుండనన్నాడని సునంద ట్రేలో కాఫీలు, కమల మంచినీళ్ళు కంగారుగా తేవడంలో కాఫీ సునంద చీరమీద పడింది. ఇంతలో స్కూటరు మీంచి ఒక పెద్దాయన దిగి, 'ఏమండీ, ఇది జి. ప్రసాదరావు గారిల్లేనా?' అని అడిగాడు. ప్రకాష్ రావు చిరాగ్గా మొహం పెట్టి, 'కాదు. ఇది ప్రకాష్ రావు ఇల్లు. జి.ప్రసాదరావు గారిల్లు ఇటు రెండిళ్ళవతల చిన్న ఆకుపచ్చ గేటుంటుంది. ఆ ఇంటికి వెళ్ళండి.' అన్నాడు. సునంద, కమల తిట్టుకుంటూ కాఫీ, మంచినీళ్ళు లోపలికి తీసుకు వెళిపోయారు. సునంద అనవసరంగా కొత్తచీరపాడయిపోయిందనుకుంటూ కాఫీ పడ్డచోట చీర తడిపేసి ఇంకో చీర మార్చింది. 'పోన్లే సునందా! ఒక్కోసారి ఇలా జరుగుతుంటాయి. చీర పాడయిందని దిగులు పడకు.' అంది కమల తను తెచ్చిన మంచినీళ్ళు తనే తాగుతూ. ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్న శిరీష కూడా నిరాశ పడింది, అన్న టైము దాటిపోతోందే అనుకుని. నేల మీద పడ్డ కాఫీని తుడవమని పురమాయించింది పనమ్మాయి రత్తమ్మని. రత్తమ్మ అక్కడ తుడిచేసి, 'ఇంక నేను వెడతానమ్మా. ఇప్పటికే శానా టైమయి పోయింది. ఇంతసేపేం చేస్తున్నావంటూ మా ఆయన గొడవ పెడతాడు.' అని వెళిపోయింది. ఈలోగా ఎనిమిది గంటలు కూడా దాటి తొమ్మిది అయింది. ఎవరూ భోజనాలు కూడా చెయ్యకుండా కూచున్నారు. తీరా భోజనాలకి కూచుంటే, మధ్యలో వస్తారేమోనని ఎవరూ బోంచెయ్యలేదు. పదిగంటలు దాటింది. వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదో అని కంగారు పడుతున్నారు. ప్రకాష్ రావు పెళ్ళికొడుకు తండ్రికి ఫోను చేసాడు. ఆయన, 'నేనూ కంగారు పడుతున్నానండి. ఫోను చేస్తే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామని,కంగారు పడవద్దని, కొంచెం సేపట్లో మీ ఇంటికి వెళ్తున్నామని చెప్పాడండి.' అన్నాడు. చాలాసేపు ఎదురుచూసి శిరీష చీర మార్చేసి, పంజాబి డ్రస్సు వేసుకుంది. తల్లి గొడవ పెడుతుంటే భోజనానికి కూర్చోబోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. శిరీష హడావిడిగా లేచి గదిలోకి వెళ్ళింది, మళ్ళీ చీర కట్టుకోవడానికి. ప్రకాష్ రావు వెళ్ళి తలుపు తీసాడు. ఎదురుగుండా ఇద్దరు యువకులు నిల్చుని ఉన్నారు. అందులో ఒకతడి చొక్కానిండా రక్తపు మరకలు ఉన్నాయి. ప్రకాష్ రావు కంగారుగా అడిగాడు, 'మీరు.............మీరు............' అప్పుడు ఆ రెండో అతడు అన్నాడు, 'కంగారు పడకండి. మేము పెళ్ళిచూపులకనే వచ్చాము. ఇదుగో, ఇతడే పెళ్ళికొడుకు. పేరు సుధాకర్. నా పేరు మధు. మేమిద్దరం స్కూటరు మీద వస్తూంటే...........' ప్రకాష్ రావు ఒకపక్కకి తప్పుకుని వాళ్ళకి దారి ఇస్తూ అన్నాడు, 'రండి, రండి, లోపలికి వచ్చి కూర్చోండి. ముందు కాసిని మంచినీళ్ళు తాగి స్తిమితపడండి. తరవాత చెబుదురు గాని. సునందా! మంచినీళ్ళు తీసుకురా. పెళ్ళివారొచ్చారు.' సునంద హడావిడిగా మంచినీళ్ళు తీసుకువచ్చి, వాళ్ళ అవతారాలు చూసి కంగారు పడింది. వాళ్ళిద్దరూ మంచినీళ్ళు తాగారు. ప్రకాష్ రావు అడిగాడు, 'ఏం నాయనా? దారిలో ఏక్సిడెంట్ ఏమన్నా అయిందా? చొక్కా నిండా రక్తం వుంది, గట్టిగా దెబ్బలేమైనా తగిలాయా?' మధు అన్నాడు, 'మరేనండి. ఏక్సిడెంట్ అయింది. కాని మాక్కాదు. మేమిద్దరం స్కూటరు మీద వస్తూంటే దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. ఒకచోట జనం గుమిగూడి పోయివున్నారు. మేము స్కూటరు ఒక పక్క పార్క్ చేసి ఏం జరిగిందా అని ఆ గుంపులోకి వెళ్ళి చూసాము. ఒక అతనెవరో స్కూటరు మీద వేగంగా వెడుతున్నాడు. అదేసమయంలో ఒక కుర్రాడు రోడ్డు దాటుతూంటే, అతడు మోటారుసైకిలుతో ఆ కుర్రవాడిని గుద్దేసి ఆగకుండా వెళిపోయాడట. ఆ కుర్రాడు రోడ్డు మీద రక్తపు మడుగులో పడి గిలగిల కొట్టుకుంటున్నాడు. ఎవరూ ఆ కుర్రాడిని ఆస్పత్రికి తీసికెళ్ళే ప్రయత్నాలు చెయ్యటల్లేదు. మీడియా వారు కెమేరాలతో ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. జనం కూడా వాళ్ళ మొబైల్ ఫోన్లతో వీడియో తీసుకుంటున్నారు. సుధాకర్ ఆ కుర్రాడి దగ్గరకి వెళ్ళబోతుంటే, నేను ఆపాను. 'ఒరేయ్, మనకెందుకొచ్చిన గొడవరా? నువ్వు పెళ్ళిచూపులకెళ్ళి, అక్కడినించి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి. పైగా ఇది ఏక్సిడెంటాయే. పోలీసు కేసవుతుంది, అనవసరంగా లేనిపోని చిక్కుల్లో ఇరుక్కోవద్దురా. పద, వెళిపోదాం.' అన్నాను. అయినా ‘పెళ్ళిచూపులు, నా ఉద్యోగం ముఖ్యమే కానీ, అంతకన్నా ముఖ్యం, అతనెవరైనా కానీ,ఒక మనిషి చావు బతుకుల్లో వుంటే, సాటి మనిషిగా అతన్ని కాపాడాల్సిన కనీస మానవత్వ ధర్మాన్ని నేను విడలేను.’ అంటూ నామాట వినిపించుకోకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళి అతడిని చేతుల్లోకెత్తుకున్నాడు. అప్పుడు అందరూ వీడికి దారి ఇచ్చారు. అక్కడున్న అంతమంది తమకేమీ పట్టనట్టు వేడుక చూస్తుంటే ఈ ఒకేఒక్కడు అటు పోతున్న ఆటోని ఆపి అందులో ఆ కుర్రాడిని ఎక్కించి తను కూర్చున్నాడు. నేను కూడా సాయంగా వాడి పక్కన కూర్చున్నాను. దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసికెడితే వాళ్ళు డబ్బు కడితే గాని చేర్చుకోమన్నారు. అప్పుడు వీడు తన క్రెడిట్ కార్డ్ ఉపయోగించి డబ్బు కట్టి ఆస్పత్రిలో చేర్చాడు. తరవాత ఆ కుర్రాడి జేబులో ఫోను తీసుకుని, అతడి ఇంటికి ఫోను చేసాడు. కాసేపున్నాక అతడి తలిదండ్రులు లబోదిబోమంటూ ఆస్పత్రికి చేరుకున్నారు. ఏం అవసరం వుంటుందోనని మేముకూడా అక్కడే ఉండిపోయాము. ఒక గంట తర్వాత డాక్టర్లు బయటికి వచ్చి, ' సమయానికి తీసుకు వచ్చారండి. కొంచెం ఆలస్యమైతే అతడిని బ్రతికించడం కష్టమయ్యేది. ఇప్పుడింక ఏమీ పరవాలేదు. ప్రమాదం తప్పింది.' అని చెప్పారు. అప్పుడు మళ్ళీ మేము ఏక్సిడెంట్ అయిన చోటికి వెళ్ళి, అక్కడ పార్క్ చేసిన మా స్కూటరు తీసుకుని ఇలా వచ్చాము..' ప్రకాష్ రావు అన్నాడు,'అయ్యో, అలాగా నాయనా? ముందు స్నానం చేసి బట్టలు మార్చుకోండి. భోంచేసాక అప్పుడు అమ్మాయిని చూద్దురు గాని.' సుధాకర్ అన్నాడు, 'అబ్బేబ్బే, పరవాలేదండీ. మీకు అభ్యంతరం లేకపోతే ముందు అమ్మాయిని చూపించండి. నేను వెంటనే రూమ్ కి వెళ్ళి, బట్టలు మార్చుకుని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి. ఈ ఫ్లైట్ దొరకదేమో. నెక్శ్ట్ ఫ్లైట్ అయినా కేచ్ చేసి ఢిల్లీ వెళ్ళాలండి.' ఇంతలో కమల వారిద్దరికీ కాఫీలు తెచ్చి ఇచ్చింది. వాళ్ళు తాగుతున్నారు. లోపల సునంద తన కూతురితో అంది, 'అమ్మా! అబ్బాయి నల్లగా వున్నాడమ్మా. మనకీ సంబంధం వద్దు. నువ్వు కుందనం బొమ్మలా వుంటావు. ఆ కుర్రాడు నీకు జోడీ కాడు.' శిరీష నిశ్చలంగా అంది, 'అమ్మా! అతను నల్లగా వున్నా మనసు తెల్లగా స్వచ్ఛమైనది. అంతమందిలో అతనొక్కడే మానవత్వపు విలువలు, ఆపదలో ఆదుకునే సేవాగుణం కలిగిన మంచి మనిషి. ఓమూల ఓ మనిషి ఏక్సిడెంటై చావుబతుకుల్లో వుంటే అందరూ చుట్టూ గుమిగూడి, వేడుక చూస్తూ, వినోదంగా సెల్ ఫోన్లలో వీడియోలు తీసారే గాని, ఒక్కళ్ళూ అతన్ని ఆస్పత్రిలో చేర్పించడం గాని, 108కి ఫోను చెయ్యడం గాని చెయ్యలేదు. టెక్నాలజీ అభివృధ్ధి చెందింది గాని, దానివల్ల మానవ సంబంధాలు, మనిషికుండాల్సిన మానవత్వ లక్షణాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. అదేవిధంగా మీడియా కూడా వీడియోలు తీసి తమ ఛానెళ్ళలో ప్రసారం చేస్తారే గాని, ఏ ఒక్కళ్ళూ అత్యవసర సహాయక చర్యలు చెయ్యరు. అటువంటి క్లిష్ట సమయంలో ఒక్కడంటే ఒక్కడు, ఒకేఒక్కడు వచ్చి తన స్నేహితుడు పోలీసు కేసవుతుంది, అవతల పెళ్ళిచూపులు, తరవాత, ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్ళాలి, వెళిపోదాం అని చెప్పినా కూడా, ‘అంతకంటే ముఖ్యం మనిషి ప్రాణం పోతుంటే సాటి మనిషిగా వెంటనే ఆస్పత్రికి తీసికెళ్ళి వైద్యం చేయించి అతడ్ని రక్షించడమే నా తక్షణ కర్తవ్యం.’ అన్న, గొప్ప మానవత్వ విలువలు, సేవాగుణం కలిగిన ఈ మంచి మనిషినే నేను పెళ్ళి చేసుకుంటానమ్మా. ఆయనని నేను చూడక్కర్లేదు. ఆయనకి నేను నచ్చితే చాలు. ఈ సంబంధం సెటిల్ చేసెయ్యండి.' సునంద శిరీషను హాల్లోకి తీసుకువచ్చి కూర్చోబెట్టింది. సుధాకర్ ఆమెకేసి రెప్పవాల్చకుండా చూసాడు. వెంటనే అన్నాడు, 'మీ అమ్మాయి నాకు నచ్చిందండి. నాకు నచ్చితే మా ఇంట్లో వాళ్ళంతా వెంటనే ఓ.కె. చేసేస్తారు. ఐతే పచ్చగా వున్న మీ అమ్మాయికి నల్లగా వున్న నేను నచ్చుతాననుకోను. అందుకని ముందు మీ అమ్మాయి అభిప్రాయం కనుక్కోండి.' సునంద అంది, 'అమ్మాయిని అడగాల్సిన పనిలేదు నాయనా. మధు చెప్పిందంతా అమ్మాయి వింది. ఇందాకే, అసలు మిమ్మల్ని చూడాల్సిన పని లేదని, మనస్ఫూర్తిగా మీరంటే ఇష్టపడుతున్నానని, ఈ సంబంధం ఖాయం చెయ్యమని నాతో అంది నాయనా.' శిరీష సిగ్గుతో తల ఎత్తి అతనికేసి చూసి చిరునవ్వు నవ్వింది. ఇద్దరి చూపులూ కలిసాయి. ఇద్దరూ చూపులతో సంభాషించుకున్నారు.
______________________
No comments:
Post a Comment