పార్వతీ పరిణయం
డా.బల్లూరి ఉమాదేవి
పార్వతీ దేవి తండ్రి యైన దక్షుడు చేయు యఙ్ఞమునకు పిలవని పేరంటముగా వెళ్ళిన సతీదేవి శివుని తండ్రి నిందించడం విని భరించలేక నిరసనను వ్యక్తం చేస్తూ ఆయఙ్ఞంలో పడి మరణిస్తుంది.అప్పుడు--
1.ఆ.వె:దక్షయఙ్ఞమందు దాక్షాయణీ దేవి
దగ్ధమవగ గాంచి తల్లడిల్లి
తాను తపము చేయదలచి మదిని,సాగె
శీతశైలమునకు శివుడు తాను.
భావము:దక్షుడు చేసిన యఙ్ఞంలో దాక్షాయణీ దేవి(పార్వతీదేవి) కాలిపోగా తల్లడిల్లిన మదితో శివుడు తపము చేయడానికై హిమాలయంవైపు వెళతాడు.
2.తే.గీ:తారకాసురుడనియెడు దనుజుడొకడు
బ్రహ్మ వలన తాను వరము బడసి కోరె
శంకరు తనయుని వలన చావు వలయు
ననగ తపము భంగ పరుప నరిగె మరుడు.
భావము:సతి విరహితుడైన శివుడు తపం చేయడాన్ని గమనించిన తారకాసురుడనే రాక్షసుడుబ్రహ్మను గూర్చి తపస్సు చేసి శివుని కుమారుని చేత మాత్రమే చాఖవు రావాలని వరమును పొంది వుంటాడు.దీనిని తెలుసుకొన్న దేవతల కోరికపై శివుని తపస్సు భంగపరచడానికై మన్మథుడు వెళ్తాడు.
3.కం: మారహరుని తాను పతిగ
కోరుచు హైమవతి వేగ కుధరము చెంతన్
చేరి తపము చేయుదు ననగ
పర్వత రాజను మతించి పంపెను గిరిజన్
భావము:శివుని ఫాలనేత్రపు జ్వాలకు మాడి మసియై పోయిన మన్మథుని చూసిన పార్వతి శివుని నిగ్రహాన్ని మెచ్చుకొని ఆ శివుడే తనకు భర్త కావాలని కోరుకొని తపము చేయడానికి తండ్రి అనుమతిస్తాడు.
4ఆ.వె: మంచి పుటముఁదాల్చు మహరాజ సుత నాడు
నార చీర కట్టె నయము గాన
పట్టు పాన్పు పైన పవళించు పడతి తా
కటిక నేల పైన కనులు మూసె(నిద్రించె)
భావము:మంచి విలువైన వస్త్రములు ధరించు హిమగిరి రాజు కూతురు నార చీర ధరించింది.
పట్టు పానుపులపై పవళించు నామె కటికనేలపై నిద్రించింది.
5.ఆ.వె:తపము చేయుచుండె తాపసి వోలె తా
నొంటికాలిపైన నువిద యచట
పర్ణములను కూడ బక్షించని యతివఁ
గాంచి ముదము తోడ కరుణ జూప
భావము:పార్వతీ దేవి ఒంటికాలిపై ఆకులలములుకూడ బక్షింపక తపము చేయుచుండగా
6.ఆ.వె:పరమశివుడు వచ్చె వటురూపమును దాల్చి
మాట కలిపె తాను మంచిగాను
హితుల మైతి మంచు హితవుగా పల్కుచు
తపము మాను మనియె తరుణి తోడ.
భావము:పరమశివుడు పార్వతి తపమునకు మెచ్చి వటురూపములో చెంతచేరి మాటకలుపుచూ స్నేహితులమైనాము కనుక చెపుతున్నాను తపము మానమంటాడు.
7.సీ:సుదతి తపము తీరు చూడంగ నచ్చోట
మదినెంచి యేతెంచె మార హరుడు
తపమేల యనుచును తరుణీమణి నడుగ
పరమేశు కొరకనె పడతి తాను
పరిపరి విధముల పరిహాసములు చేయు
భవుని పల్కులు విని పార్వతచట
చెవులు మూసుకొనుచు శివ నిందవలదంచు
వారించె వటునట వడిగ తాను
ఆ.వె:వెంట బడుచు తిరుగు వేషధారిని జూచి
ఛీత్కరించి తాను శీఘ్రముగను
మొగము త్రిప్పుకొనగ,ముదమార నవ్వుచూ
కనుల యెదుట నిలిచె కంతు హరుడు.
భావము:పార్వతి చేస్తున్న తపస్సును చూడటానికై శివుడు కపటవటువు వేషంలో వచ్చి తపమెవరికోసమని ప్రశ్నించగా శివుని కొరకంటుంది.కపటవటుడు పరిహాసోక్తులాడగా చెవులు మూసుకొనుచు శివనింద చేయబోకని వారిస్తుంది.మోము చూడనొల్లక అటు తిరుగగానే శివుడు నవ్వుతూ సాక్షాత్కరిస్తాడు.
8.ఆ.వె:నమ్మి కొలిచినట్టి నగరాజ నందినిన్
పెండ్లి యాడె శివుడు పేర్మి తోడ
భువన త్రయము మెచ్చ పూలవాన కురిసె
మురిసె జగతి యెల్ల ముదము తోడ.
భావము:తననే నమ్మి తపము చేసిన పార్వతిని ముల్లోకములు మెచ్చుచుండగా పులవర్షము కురియగా శివుడు వివాహము చేసుకొంటాడు.
పరమశివుని అనుగ్రహం అందరికి కలగు గాక !
No comments:
Post a Comment