రాజ్యలక్ష్మి టీచరు సేవ
డి. శోభా రాణి.
“రాజ్యలక్ష్మి టీచర్ బదిలీ..! రద్దు చేయాలి..!!’’
“రాజ్యలక్ష్మి టీచర్ బదిలీ..! రద్దు చేయాలి..!!’’
“రాజ్యలక్ష్మి టీచర్ బదిలీ..! రద్దు చేయాలి..!!’’
అనే విద్యార్థుల నినాదాలతో గుమ్మడిదల వీధులన్నీ దద్దరిల్లిపోతున్నాయి.
ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల వేరు వేరైనప్పటికీ విద్యార్థులంతా సమైక్యంగా ఒక ప్రణాళిక ప్రకారం ప్రతీ వీధినాక్రమించారు. వర్షానికి వరదమయమైనట్లు.. వీధులన్నీ విద్యార్థులమయమయ్యాయి.
న్యాయసమ్మతమైన విద్యార్థుల కోరికకు మద్దతుగా క్షణాల్లో గుమ్మడిదల ఊరుకు ఊరు కదిలింది. అప్పుడప్పుడే తప్పటడుగులు నేర్చిన పసిపిల్లల కాన్నుండి కాటికి కాళ్ళు చాచిన వయోవృద్ధుల వరకు “ప్రాణాలైనా అర్పిస్తాం.. టీచర్ బదిలీ ఆపిస్తాం” అనే ప్లకార్డులు పట్టుకొని రోడ్డెక్కి బైఠాయించారు.
అది నిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగించే మెదక్ - నర్సాపూర్ రహదారి. అరగంటలో ఆందోళనకారులకు ఇరువైపులా అరమైలు దూరం మేరకు వాహనాలు నాలుగేసి చొప్పున బారులు తీరాయి.
ఆ ఊళ్ళో పోలీసు స్టేషన్ లేదు.. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో నినాదాలు నిరాటంకంగా మారుమ్రోగి పోతున్నాయి. జనాల నినాదాల ముందు వాహనాల హారన్ మోతలు పోటీ పడలేక మూతలు పడిపోయాయి.
పది సెకన్లలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే మహత్తు కలిగిన నేటి ఆధునిక యుగంలో.. బుహురూప అవతారాల మీడియా.. గుమ్మడిదల ఆందోళన వార్తా విశేషాలు రాష్ట్రాధికారు లందరికీ అరసెకన్ లోపే అందజేసింది.
పాఠశాల మండలాధికారి మొదలు.. సంచాలకుల వరకు కొరుకుడు పడని అంశంమిది..
‘ఒక సాదా సీదా చిన్న బడి పంతులమ్మను బదిలీ చేస్తే పబ్లిక్ అంతా బజారెక్కడమా..? ఇదెక్కడి లెక్క..’ అని అధికారులంతా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇలా అయితే మా అధికారాలేంగాను.. అని గుండెలు బాదుకున్నారు.
మరో అరగంటలో పక్క స్టేషన్ నుండి వచ్చిన పోలీసులు వలయాకారంలో ఫోజులు పెట్టారు. ముందు కూర్చున్న చిన్నారులపై లాఠీ ఎత్తాలంటే వాళ్లకు చేతులు రావడం లేదు.
బలవంతంగా శ్రేణిని చీల్చుకుని వెళ్దామంటే వృద్ధుల చేతుల్లో కిరోసిన్ సీసాలున్నాయి ఎక్కడ అఘాయిత్యానికి పాలుపడ్తారోననే భయం. ఏనిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి..
ఇంతలో పాఠశాల విద్యాధికారులంతా సంఘటనా స్థలానికి చేరుకోవడం.. పోలీసులు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు.
అధికారులను చూడగానే ఆందోళనకారుల్లో ఆగ్రహ జ్వాలలు ఆకాశాన్నంటాయి.
‘రాజ్యలక్ష్మి టీచర్ బదిలీ..! రద్దుకావాలి..!!’ అనే నినాదం నిప్పుల వర్షమై కురిసింది.
జిల్లా విద్యాధికారి వినయకుమార్ ప్రజలకు.. రెండు చేతులెత్తి వినయంగా నమస్కరించాడు.
“మనమందరం పాఠశాల మైదానంలో సమావేశమై నిర్ణయం తీసుకుందాం..మీకు న్యాయం చేస్తాను.. దయచేసి రోడ్డు దిగండి” అని వేడుకున్నాడు.
విద్యార్థులు కాస్తా శాంతించారు. పది నిముషాల్లో రోడ్డు ఖాళీ అయ్యింది.. గుమ్మడిదల ప్రైమరీ పాఠశాల మైదానం జనంతో నిండిపోయింది.
విద్యార్థులు క్రమశిక్షణతో తరగతుల వారిగా వరుసలు కట్టి కూర్చున్న వధానం వినయ కుమార్ ను అబ్బుర పర్చింది. వారి వెనుకాల గ్రామ ప్రజలు..
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అరుగు సభా వేదిక. సభకు కావాల్సిన హంగులన్నీ క్షణాల్లో పూర్తీ చేయించాడు పాఠశాల ప్రధానోపాద్యాయులు ప్రకాశం.
వేదికను ఉపాద్యాయులు, పురప్రముఖులు ఆసీనులయ్యారు.
వినయకుమార్ అద్యక్షతన సభ ఆరంభమయ్యింది. సభాద్యక్షులకు ఒక ప్రక్క రాజ్యలక్ష్మి టీచర్.. మరో ప్రక్క పాఠశాల మండల విద్యాధికారి.. ప్రకాశంగార్లు కూర్చున్నారు.
“శ్రీమతి రాజ్యలక్ష్మి సెకండరీ గ్రేడు టీచరు గారి పట్ల వివక్షతో బదిలీ చేసింది కాదు. ఆమె పై ఎలాంటి ఫిర్యాదులూ లేవు. కేవలం స్థానికంగా ఆమె ‘లాంగ్ స్టాండింగ్’ అనే కారణంతో ప్రభుత్వ నియమానుసారం ఆమెను బదిలీ చేయాల్సి వచ్చింది.
ఒక టీచరుపై ఎనలేని అభిమానంతో ఇలా ఆందోళన చేయడం నా సర్వీసులో ఎక్కడా చూసిఎరగను. నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. ఆమె బదిలీని ఎందుకు రద్దుచెయ్యాలో.. నాకు ఒక్క కారణం.. చెప్పండి చాలు. నాకు సబబు అనిపిస్తే ప్రభుత్వానికి తెలిపి.. తప్పకుండా మరో ఏడాది పాటు బదిలీ నిలిపేస్తానని వాగ్దానం చేస్తున్నాను” అంటూ ప్రకటన చేసాడు వినయకుమార్.
సభలో చప్పట్లు మ్రోగాయి.
కారణాలు చెప్పడానికి విద్యార్థుల సమూహం ఒక కొండలా కదిలింది. ఆ కొండ ముందు కొదమసింహంలా కదిలి వచ్చే ఒక చిచ్చర పిడుగును చూసి ముచ్చటపడ్డాడు వినయకుమార్. పట్టుమని పదేండ్లు లేని పసివాడు కారణం చెప్పడానికి బాణంలా రివ్వున దూసుకు వస్తూండటం విస్తుపోయాడు. చిరునవ్వునవ్వుతూ పసివానికెదురేగి భుజం తట్టాడు. మిగతా వారిని వేచి వుండమన్నట్లు సంజ్ఞచేస్తూ..
ఆ పసివాడి మోములో.. ‘దేవుడా..! మాటీచరు బదిలీ ఆపుస్వామీ..!!’ అనే ఆవేదన ప్రస్ఫుటమౌతోంది..మైకు ముందుకు వెళ్ళాడు.. ఆఫీసు సహాయకుడు వచ్చి మైకు ఎత్తును సరిజేసాడు.
“నా పేరు అభయ్..ఆరో తరగతి చదువుతున్నాను” అంటూ ఏమాత్రమూ తొట్రుపడకుండా పలికే సరికి సభలో చప్పట్లు మారుమ్రోగాయి.
“రాజ్యలక్ష్మి టీచరు బదిలీ రద్దు చెయ్యాలి.. ఎప్పటికీ ఇక్కడే వుండాలి..” అంటూ ఎలుగెత్తి చాటాడు.
కారణం కళ్ళకు కట్టినట్లు చెప్పసాగాడు.
***
వరుసగా నాలుగు రోజులు సెలవులు కలిసి రావడంతో గుమ్మడిదల ప్రైమరీ పాఠశాల ‘నెహ్రూ జంతు ప్రదర్శన శాల’ సందర్శనార్థం విజ్ఞాన యాత్రకు ప్రణాళిక సిద్ధం చేసింది రాజ్యలక్ష్మి టీచరు.
అది పిల్లలకు మహదానందంగా వుంటుందని తెలిసినా ‘తప్పించుకు వాడు ధన్యుడు సుమతీ..’ అనే రీతిలో “అ..! ఎందుకొచ్చిన రిస్కు టీచర్.. సరదాగా మీ పిల్లలతో ఏ సినిమాకో షికార్లకో వెళ్లి ఎంజాయ్ చెయ్యండి” అంటూ సలహాయిచ్చాడు ప్రకాశం.
“అదేంటి సార్.. వీళ్ళంతా నాపిల్లలు గాదా..!” అంటూ ప్రశ్నించే సరికి తెల్లమొహం వేసాడు.
రాజ్యలక్ష్మి పట్టువిడువలేదు. తనే పూర్తి బాధ్యత తీసుకుంటానని అభ్యర్థించింది. చివరికి సరే అనక తప్పలేదు. ముందస్తు అనుమతి కోసం పైఅధికారులకు రాసాడు ప్రకాశం.
చిన్న పిల్లలను పంపడమూ ఊళ్ళో ఎవరూ ఇష్టపడలేదు.
అభయ్ నిద్రాహారాలుమాని విజ్ఞాన యాత్రకు వెళ్తానని మంకు పట్టు పట్టాడు.
రాజ్యలక్ష్మి తోటి ఉపాద్యాయులను ఒప్పించి.. వెంటతీసుకొని ఇలిల్లూ తిరిగింది. విజ్ఞాన
యాత్ర వల్ల పిల్లలకు కలిగే లాభాలను వివరించింది.
అభయ్ పేరెంట్స్ చివరికి ఒప్పుకున్నారు. అభయ్ వెనకాల మరో పదిమంది
తయారయ్యారు.
అలా ఒక్క రోజులోనే ఒక బస్సుకు సరిపడా విద్యార్థులు విజ్ఞాన యాత్రకోసం ముందుకు రావడం రాజ్యలక్ష్మి కృషికి నిదర్శనమని స్టాఫ్ అంతా పొగిడింది.
సకాలంలో విజ్ఞాన యాత్రకు అనుమతి కూడా లభించింది.
విద్యార్థులు ఆనందంతో గెంతులు వేయడం..నృత్యాలు చెయ్యడం.. ఉపాద్యాయులంతా రాజ్యలక్ష్మికి అభినందనలతో ముంచెత్తారు.
అనుకున్న ప్రకారం బస్సు బడి ముందు వచ్చి నిలిచింది. దానిని సర్వాంగసుందరంగా అలంకరించారు పిల్లలు. పదిమంది పిల్లలకు ఒక టీచరు చొప్పున అంటగట్టి తెలివిగా తప్పుకున్నాడు ప్రకాశం.
బస్సు ముందు ‘గుమ్మడిదల విద్యార్థుల విజ్ఞాన విహార యాత్ర’ అనే ఫ్లెక్షీ చూసి ఊరంతా సంబరపడింది. తల్లి దండ్రుల జాగ్రత్తలు.. రాజ్యలక్ష్మి టీచరు అభయం..పిల్లల నిర్భయం. చూడ ముచ్చటగా వుంది.
బస్సు క్లీనర్.. “రైట్..రైట్..” అంటూ గ్రీన్ సిగ్నలివ్వడంతో పిల్లలంతా ముక్తకంఠంగా “రైట్.. రైట్” అంటూ కోరస్ అందుకున్నారు.
డ్రైవరు ముసి ముసి నవ్వులు నవ్వుతూ బస్సు చెవి నులిపెట్టాడు.. బస్సు బయలుదేరింది..
పిల్లల పాటలు లయబద్ధంగా చప్పట్లు వింటూ బస్సు ఆనందపారవశ్యంతో పరుగెడుతోంది.
అలుపూ సొలుపూ లేకుండా రెండు గంటల్లో.. గమ్యాన్ని చేరింది.
మబ్బులు కప్పిన సూరీడు పిల్లలను దీవించసాగాడు. ఆహ్లాదకరవాతావరణం..
ద్విగుణీకృతోత్సాహంతో పిల్లలు బస్సు దిగి జూ లో అడుగు పెట్టారు.
రక రకాల జంతువులను.. పక్షులను చూస్తూ పిల్లలు పెట్టే కేరింతలతో ‘జూ’ తన్మయత్వం చెందసాగింది. కోతి చేష్టలు చేసే పిల్లలు బుద్ధిమంతుల్లా.. కోతులను చూడ్డం.. కోతులు విస్తుపోయాయి.. మళ్ళీ మళ్ళీ రావాలని కిచ కిచ లాడుతూ కోరుకున్నాయి.
జూ కలియ తిప్పుతూ.. పిల్లలకు జంతువుల గురించి విజ్ఞానాత్మక విశేషాలెన్నో.. వివరించా సాగింది రాజ్యలక్ష్మి. తమకు సైతం తెలియని విషయాలు వింటూ మిగతా టీచర్లూ ఆశ్చర్యపోయారు.
మధ్యాహ్నం.. పిల్లలకు తోటి టీచర్లకు తాను స్వయంగా తయారు చేసుకొచ్చిన పులిహోర పాకెట్స్.. పెరుగన్నం పాకెట్స్ అందజేసింది రాజ్యలక్ష్మి. పిల్లలు వాటర్ బాటిల్స్ తప్ప మరేమీ
తెచ్చుకోవద్దని ముందే చెప్పింది. సాయంత్రం బిస్కట్లు పంచింది..
దాదాపు ఆరు గంటల ప్రాంతంలో తిరిగి బస్సు బయలుదేరింది.
పిల్లలు తాము పొందిన ఆనందాన్ని ఒకరినొకరు పంచుకోసాగారు. బస్సు ‘నా జన్మ సార్థకమైంది’ అన్నట్లుగా అమితోత్సాహంతో పరుగులు తీయసాగింది.
ఒక మూల మలుపులో.. ఢామ్మంటూ.. చెవులు చిల్లులు పడేలా శబ్దమయ్యింది.. ఏమయ్యింది? అని ఆలోచన కంటే ముందే.. బస్సులో ‘హా..! హా..!! కారాలు ఆవహించాయి.
బస్సును వెనుకాల బలంగా వాటర్ ట్యాంకర్ ‘ఢీ’ కొట్టింది. పిల్లల ఆర్తానాదాలతో బస్సు తల్లడిల్లింది.
రాజ్యలక్ష్మి టీచర్ ఆందోళనతో అందరినీ పరమార్శించింది..అనుకున్నంతగా ప్రమాదమేమీ జరుగలేదు. కొందరు విద్యార్థులకు మామూలు గాయాలయ్యాయి.. కాని మరో ఇద్దరు తీవ్రంగా తలకు దెబ్బలు తగిలాయి. అభయ్ అగుపించడంలేదు.. రాజ్యలక్ష్మి గుండె గుభేలుమంది..
“అభయ్ బస్సు సీటు కింద ఉన్నాడు టీచర్..” అంటూ ఒక విద్యార్థి కేకతో అటువైపు పరుగెత్తింది. అభయ్ స్పృహ తప్పి నిర్జీవంగా పడివున్నాడు. రాజ్యలక్ష్మి ధైర్యం చెడలేదు. అమాంతం తన అక్కున చేర్చుకుంది.
అంబులెన్స్ వచ్చేసరికి ఆలస్యమవుతుందని బస్సు డ్రైవరును తోడుగా తీసుకుని ఆటో ఎక్కింది.
దగ్గరలోని ఉస్మానియా హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో అభయ్ పరీక్షల పరంపర కొనసాగుతోంది.. రాజ్యలక్ష్మి ప్రాణాలు అరచేతిలో పట్టుకుంది.
డాక్టర్లు అర్జంటుగా అభయ్ కి రక్తం ఎక్కించాలన్నారు. కాని సరిపోయే గ్రూప్ రక్తం తమ వద్ద లేదని హడావుడి పడసాగారు.
బస్సు ప్రమాద వార్త గుమ్మడిదల ఊళ్ళోకి పాకిపోయింది..
విద్యార్థుల తల్లిదండ్రులు హుటా హుటిన వచ్చి చేరారు. ఎవరినీ ఎమర్జెన్సీ వార్డులో అడుగు పెట్టనివ్వలేదు.. అభయ్ తల్లిదండ్రులని సైతం రానివ్వలేదు.. వారు శోక సముద్రంలో మునిగి పోయారు. మిగతా పేరెంట్స్ వారిని ఓదార్చసాగారు.
రాత్రి పదయ్యింది..
“అభయ్..సేవ్ద్..” అంటూ డాక్టర్ తీపి కబురు చెప్పాడు. అభయ్ తల్లిదండ్రులు అమాంతం డాక్టరు కాళ్ళపై పడ్డారు. కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
“కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు గాదు.. రాజ్యలక్ష్మి టీచరుకు..” అన్నాడు డాక్టర్.
విషయం అర్థంగాక అంతా తెల్లబోయారు.
“అవును.. రాజ్యలక్ష్మి టీచర్ రక్తమే అభయ్ ని కాపాడింది. మీ బాబుది ‘ఓ - నెగెటివ్’ గ్రూప్ రక్తం.. అది చాలా అరుదైనది. మా దగ్గర లేదు. పలు చోట్ల ప్రయత్నించాం ఫలించ లేదు . సమయం మించి పోతున్నది.. మరో పది నిమిషాల్లో రక్తం ఎక్కించకుంటే అభయ్ ప్రాణాలు అనంతలోకంలో కలిసి పోయేవి. అప్పుడు రాజ్యలక్ష్మి టీచర్ విషయం తెలుసుకొని తనది అదే గ్రూపు రక్తమని ముందుకు వచ్చింది.. కొందరు రక్తం ఇవ్వాలంటే భయపడ్తారు.. కాని ఆ మహానుభావురాలు తన ప్రాణాలైనా యిచ్చి అభయ్ ని రక్షించమని వేడుకుంది.. కావాల్సినంత రక్తం యిచ్చింది. ఇప్పుడప్పుడే ఆమెను డిస్ట్రబ్ చేయకండి.. కాస్తా నీరసంగా వుంది” అంటూ డాక్టరు రాజ్యలక్ష్మిని ప్రశంసించాడు.
అంతా రాజ్యలక్ష్మికి మనసులో శతకోటి ప్రణామాలు సమర్పించుకున్నారు. గండం గడిచిందని తృప్తిగా శ్వాస పీల్చుకున్నారు.
అనుకున్న సమయానికంటే అభయ్ కోలుకోవడం అమితంగా సంతోషించింది రాజ్యలక్ష్మి.
దేవుని దయవల్ల త్వరలోనే పాఠశాల మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
ప్రతీ రోజు పాఠశాల ప్రార్థన.. ప్రతిజ్ఞ అనంతరం ఒక నానుడి చెప్పుకోవడం దాన్ని విశ్లేషించుకోవడం ఆనవాయితీ..
ఆ రోజు రాజ్యలక్ష్మి టీచరు అవకాశం తీసుకుంది.
“దానములలో కెల్ల రక్త దానం మిన్న. నేను ఎన్నాళ్ళగానో ఈ విషయం మీకు చెబుతూ వస్తూనే వున్నాను. మీరెవ్వరూ దీనిపై అంతగా శ్రద్ధ పెట్టినట్లు నాకు కనబడలేదు.
మొన్నటి అనుభవం మీకందరికీ తెలిసిందే..
నా రక్తం అభయ్ కివ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓ-నెగెటివ్ గ్రూపు రక్తం దొరకడం చాలా అరుదు. అందుకే నేను ప్రతీ పుట్టిన రోజు రక్తం దానం చేస్తాను. ఇంకా అత్యవసర పరిస్థితుల్లోనూ రక్తం ధారపోస్తూనే వున్నాను. రక్తం ఇవ్వడం మూలాన మనకేమీ నష్టం జరగదు. కాని ఒక నిండు ప్రాణాన్ని రక్షించినా వాళ్ళమవుతాం..
మీరు పదిహేడు సంవత్సరాలనుండి రక్తం దానం చేయవచ్చు. అలాగే మన ఊళ్ళోని వారందరినీ ఒప్పించి.. రక్త దానం చేయడానికి ప్రోత్సహించాలని వేడుకుంటున్నాను” అని రెండు చేతులా నమస్కరించింది.
విద్యార్థులు.. ప్రకాశంతో సహా.. సహ అద్యాపకులంతా కరతాళ ధ్వనులతో తమ సమ్మతిని తెలియ పర్చారు.
అలా.. అలా విద్యార్థులు కొనసాగించిన రక్త దాన ప్రచారం ప్రజల మనస్సుల్లో హత్తుకు పోయింది. వారి వెనుకాల రాజ్యలక్ష్మి టీచరు ప్రోత్సాహం రక్త దాన శిబిరాలకు నాంది పలికింది.
***
సభలోని వారికి ఒక సినిమాలా చూపించి ఆగాడు అభయ్..
మళ్ళీ చెప్పదమారంభించేసరికి సభలో చప్పట్ల వర్షం ఆగింది.
“టీచరు ప్రతీ సంవత్సరం పేద విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కుట్టిస్తుంది. ఇలా
కారణాలు ఎన్నైనా చెప్పగలను. కాని మన డి.యీ.ఓ. గారు ఒక కారణం చాలన్నారు. దయచేసి మా ఇలవేల్పు అయిన టీచర్ బదిలీ రద్దు చేయుమని మరో సారి ప్రార్తిస్తున్నా..” అంటూ అభయ్ వినయకుమార్ వంక జాలిగా చూడసాగాడు. సభ యావత్తు నిలబడి చప్పట్లతో అభ్యర్థించ సాగింది.
ఇంతలో రాజ్యలక్ష్మి టీచరు లేచి సభ ముందుకు వచ్చింది. అంతా నిశ్శబ్దమయ్యారు.
“సభాసడులందరికీ నాహృదయ పూర్వక నమస్కారాలు. నా యందు అభిమానంతో నా బదిలీని రద్దు చేయాల్సిందిగా ఇంతగా పోరాడే మీ కందరికీ నేను రెండు చేతులెత్తి వేడుకుంటున్నాను.. మీ పోరాటం వెనుక నేనున్నానని ప్రభుత్వం పొరబడుతుంది. అలా నిందకు గురి కావడం నాకిష్టం లేదు. నన్ను అర్థం చేసుకొండి.
ప్రభుత్వ ఉద్యోగి అన్నాక బదిలీలు తప్పవు. ప్రభుత్వ ఉత్తర్వులను శిరసావహించడం నా కర్తవ్యం. దయచేసి నా బదిలీ రద్దు చేయవద్దని డి.యీ.ఓ. గారిని విజ్ఞప్తిచేస్తున్నాను” అనగానే సభ మ్రాన్పడి పోయింది. వినయకుమార్ నిర్ఘాంతపోయాడు. స్టాఫ్ ఊహించని పరిణామం.
“టీచర్ అంటే.. జ్ఞానాన్ని అందించే వ్యక్తి. జ్ఞానం అందరికీ దక్కాలి. కొంతమేరకు మీకందించాను. ఇప్పుడు నేను బదిలీ మీద వెళ్ళే ఊరి ప్రజలూ మీలాగే నన్ను కోరుకుంటున్నారు. నాకు తెలిసిన జ్ఞానాన్ని వారికీ అందించాల్సిన బాధ్యత నాపై వుంది. మా టీచరు ప్రతీ ఊరును తీర్చి దిద్దుతున్నదని చెప్పుకోవడం.. మీకూ గర్వకారణమే..
ఆఊరి ప్రజలు కిడ్నీ వ్యాధిపీడితులు. మరికొందరు ఆ వ్యాధిబారిన పడకుండా వారికి సలహాలిప్పించే అవకాశం నాకు కలిగించండి” అని సభకు ప్రణమిల్లి కూర్చుంది.
సభ పది నిముషాలు తర్జనభర్జనలో పడింది..
రాజ్యలక్ష్మి టీచర్ బదిలీ ఆమోదమయ్యింది.
ఆ మరునాడు రాజ్యలక్ష్మి టీచర్ సన్మాన కార్యక్రమం..అనంతరం కన్నీటి తరంగాల మధ్య వీడ్కోలు పలికారు గుమ్మడిదల విద్యార్థులు..వాస్తవ్యులు.
విధి బలీయమైనది.. ఏ నిముషానికి ఏమి జరుగునో..! ఎవరూ ఊహించనిది. ఒక్కోసారి దేవుడు విర్దయుడు అనిపిస్తుంది. ఆ సర్వేశ్వరుడు సర్వదా తనను తలుచు కోవాలని కాబోలు.. మానవులతో ఆటాడుకుంటాడు.
రాజ్యలక్ష్మి టీచర్ బయలుదేరిన ఒక గంటలోనే ఆక్సిడెంట్ అయ్యింది. లారీలో సామాను ముందు తానూ వెనకాల టూ వీలరుపై వెళ్తుంటే.. మరో లారీ వేగంగా వచ్చి తగిలిందట.
టీచరుని అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెల్లారనే వార్త దావానంలా ఊరంతా ప్రాకిపోయింది. ఆర్తనాదాలతో ఊరు శోక సంద్రమైంది. అందిన వాహనాలను అందినట్లుగా పట్టుకొని వాయు వేగాలతో విద్యార్థులు పరుగులు తీసారు. జనం గుండెల హోరు హాస్పిటల్ వరకూ వినవస్తుందంటే అతిశయోక్తి గాదు..
డాక్టరు ఖిన్నుడై కూర్చున్నాడు..
మళ్ళీ అదే పరిస్థితి. రాజ్యలక్ష్మి ఐ.సి.యు. లో వుంది.
ఓ-నెగెటివ్ రక్తం కొరత.. బ్లడ్ బ్యాంక్ లన్నిటికీ సమాచారం వుంది కాని బ్లడ్ లేదు..
కొందరు బదిలీ రద్దైనా ఈ ఘోరం జరిగి వుండేది కాదనీ.. గుండెలు బాడుకోసాగారు. మరి కొందరు ప్రమాదం జరిగిన వైనాన్ని.. రక్తం అందుబాటులో లేని దురదృష్టాన్ని నిందించుకోసాగారు.
“సార్.. నాది ఓ-నెగెటివ్ గ్రూప్ రక్తం. ఒకప్పుడు టీచర్ తన రక్తమిచ్చి నా ప్రాణం కాపాడింది. నా రక్తం తీసుకొండి..” అంటూ అభయ్ కన్నీళ్ళ పర్యంతమై డాక్టర్ ను వేడుకోసాగాడు.
“అభయ్.. అప్పుడు నీకు ఆపరేషన్ చేసింది నేనే. నాకు తెలుసు.. నీ గ్రూప్ రక్తం. కాని నీవు చిన్న పిల్లాడివి. కనీసం పదహారు సంవత్సరాలు నిండితే నీ తల్లిదండ్రుల అనుమతితో రక్తం తీసుకునే వీలుండేది ” అంటూ తన నిస్సహాయతను తెలుపుతూ.. తల పట్టుకున్నాడు.
ఇంతలో నర్స్ పరుగెత్తుకుంటూ వచ్చింది.. ఆమె వదనంలో విషాద ఛాయలు..
నా టీచరును బతికించుకోలేక పోయాననే అభయ్ రోదన అందరినీ కంటతడి పెట్టించింది. టీచర్ రక్త దాన సేవా నిరతి మరింత కళ్ళు తెరపించింది. రక్త దాన శిబిరాల నిర్వహణ గుమ్మడిదలలోనే గాకుండా.. దశ దిశలా వ్యపింపజేయాలని.. మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు అభయ్.
***
No comments:
Post a Comment