సామ్రాజ్ఞి – 7 - అచ్చంగా తెలుగు

సామ్రాజ్ఞి – 7

భావరాజు పద్మిని


(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె  ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మతో మల్లయుద్ద్హంలో గెలిచి, అతని రాజ్యం అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది ప్రమీల. రాజ నియమాల ప్రకారం అతను విలాసపురుషుడిగా మార్చబడతాడు. పరిణామ, వ్యాఘ్ర  సరోవరాలలో మునిగిన యాగాశ్వం పులిగా మారిపోవడంతో, దిక్కుతోచక శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటాడు అర్జునుడు. కృష్ణుడు ప్రత్యక్షమై యాగాశ్వానికి పూర్వపు రూపును తెప్పించి, ఆర్జునుడిని దీవించి, మాయమౌతాడు. పంపా నదీ తీరాన సీమంతినీ నగరాన్ని కావలి కాస్తున్న వారికి దొరుకుతుంది ధర్మరాజు యాగాశ్వం. దాన్ని సామ్రాజ్ఞి తన అశ్వశాలలో కట్టేయించి, యాగాశ్వం కావాలంటే తనతో యుద్ధం చేసి, విడిపించుకోమని, తన దండనాయకి వీరవల్లితో అర్జునుడికి లేఖ పంపుతుంది. ఇక చదవండి...)
“జయము జయము అర్జున మహారాజా ! రమ్మని కబురు పంపారట? “ వినయంగా వంగి నమస్కరిస్తూ అన్నాడు సర్వసేనాని ప్రతాప రుద్రుడు.
తన ముందున్న మేజా బల్లపై ఉన్న లేఖను అతనికి చూపుతూ, “ప్రతాప రుద్రా ! ఈ లేఖ చూసారా ? ఇది స్త్రీ సామ్రాజ్య గుర్విణి మనకు పంపిన సందేశం. మన యాగాశ్వాన్ని వారు నిర్బంధించారట ! అది కావాలంటే తమతో యుద్ధం చేసి తీసుకుని వెళ్ళవచ్చని సారాంశం. ఇంత ధైర్యంగా లేఖ పంపారంటే, వారి శక్తియుక్తులు ఏమై ఉంటాయి ?ఎదుటివారి బలాబలాలు తెలియకుండా యుద్ధానికి సిద్ధమవటం మంచిది కాదు కదా ! అందుకే స్త్రీ సామ్రాజ్య ఆశ్వ, గజ, తురగ, సైనిక బలాలు ఏమిటో, అలాగే స్త్రీ సామ్రాజ్ఞి యుద్ధ కౌశలం ఎటువంటిదో తెలుసుకోండి. ఇక వారి దండనాయకి వీరవల్లి, ప్రస్తుతం మన అతిధిగా ఉన్నారు. వారికి సకల మర్యాదలూ చెయ్యండి, విలువైన బహుమానాలు  ఇవ్వండి.” అన్నాడు ఆందోళన ముఖంలో ప్రతిఫలిస్తూ ఉండగా.
“ఆజ్ఞ మహారాజా ! మీరేమీ చింతించకండి. సమగ్ర సమాచారాన్ని సేకరిస్తాను. త్వరలోనే అందిస్తాను. “ అంటూ మరొక్కసారి అర్జునుడికి గౌరవ సూచకంగా వంగి నమస్కరించి, అక్కడినుంచి నిష్క్రమించాడు ప్రతాపరుద్రుడు.
అర్జునుడి గుడారం నుంచి బయటకు వస్తూనే, ఎవరో స్త్రీ గంభీరమైన వదనంతో అక్కడ ఆసీనురాలై ఉండడం చూసాడు ప్రతాపరుద్రుడు. తమ దళంలో స్త్రీలు ఎవరూ లేరు కనుక, ఆమే వీరవల్లి అయ్యి ఉంటుందని ఊహించాడు. బింకంగా ఉండే స్త్రీలతో తియ్యగా, మన్ననగా మాట్లాడితే, కరిగిపోతారని, అతనికి బాగా తెలుసు.
“ఈమెనే మంచి చేసుకుని, వారి సామ్రాజ్ఞి బలాబలాలు తెలుసుకోవాలి,” అనుకున్నాడు అతను.
“ ఓహో లలనామణీ ! మీ రాకతో ఈ ప్రకృతి కొత్త శోభను సంతరించుకున్నట్లు ఉంది. ఈ నేల అడుగడుగునా అంకురించి చిగురిస్తున్నట్లు ఉంది. ఈ గాలి ఏదో పరిమళాన్ని తీసుకు వస్తున్నట్లు ఉంది. లలిత కోమల పల్లవముల బోలు మీ కరములందు కరకైన కత్తులేల కోమలీ...” అంటూ ఉండగానే..
“ధిక్... “ అంటూ బిగ్గరగా గద్దించి, ఆసనం కాలితో తన్ని లేచింది వీరవల్లి. ఆ అరుపు తాకిడికి, ఉలిక్కి పడ్డాడు అంతటి ప్రతాపరుద్రుడు.
“చాలించు నీ చవట కబుర్లు. నీ మాటలకు కరిగి నీరవడానికి నేనేమీ మామూలు స్త్రీని కాదు. సీమంతినీ సామ్రాజ్య దండ నాయకిని. మా రాజ్యంలో నీవంటి పురుషులను ఒంటి చేత్తో మట్టి కరిపిస్తాం, లక్కపిడతలు చేసి ఆడించేస్తాం. మా రాజ్యం లోని స్త్రీలు పొగడ్తలకు పొంగిపోరు. వీరత్వం, శూరత్వం, ధీరత్వం కలబోసిన ఆదిశక్తులు వారు.”
“ అంటే, మీరు స్త్రీలు కాదా! “ ఆశ్చర్యంగా నోరు తెరుచుకు చూస్తూ, వీరవల్లి క్రోధపు చూపులకు జడిసి, మళ్ళీ అరుస్తుందేమో అని బెదిరి, కాస్త బెరుగ్గా ఇలా అన్నాడు...
“దండనాయకి వారు క్షమించాలి. ఇంతవరకు లోకంలో మాకు స్త్రీలతో, పురుషులతో, పిల్లలతో, పెద్దలతో ఎలా మెలగాలో నేర్పారు. కాని ఈ వీర, ధీర, శూర నారీమణులను ఎలా పిలవాలి, వారితో ఎలా మెలగాలో నాకు అవగతం కావట్లేదు. దయుంచి, మా ప్రత్యేక అతిధుల కోసం సిద్ధం చేసిన ఈ గుడారంలో స్నాన పానాదులు కానిచ్చుకుని, ఆ పై మీ రాజ్యపు వింతలూ, విశేషాలు మాకు సమగ్రంగా తెలుపవలసినదిగా మనవి చేస్తున్నాము.” వినయంగా వంగి మాట్లాడుతున్న ప్రతాప రుద్రుడిని చూస్తూ, కాస్త ప్రసన్నమయినట్లు ముఖం పెట్టింది వీరవల్లి. ప్రతాపరుద్రుడికి ఒక సంగతి స్పష్టంగా అర్ధమయ్యింది. వారు ఆకారానికి స్త్రీలలా ఉన్నా, వారిలో పురుష లక్షణాలే అధికంగా ఉన్నాయి ! వారి మర్యాద, మన్ననల విషయంలో పురుష నియమాలే పాటించాలి.
కాస్త సమయం గడిచాకా, మామూలు వస్త్రాలలో తయారై వచ్చిన వీరవల్లిని మరో గుడారంలోకి తీసుకువెళ్ళి, తమ ప్రాంతంలో విశిష్టమైన రకరకాల రుచుల భోజనం వడ్డించారు. ఆమె వచ్చిన వంటకాలన్నీ వచ్చినట్టు  అవలీలగా ఖాళీ చేస్తుంటే... ఒక స్త్రీ అంత ఎక్కువ భోజనం చెయ్యడం ఎన్నడూ చూడని వారు, ఆశ్చర్యపోతూ చూడసాగారు.  భోజనానంతరం తాంబూల చర్వణం చేస్తూ, సరోవరాల ఒడ్డున కూర్చున్న వీరవల్లితో మాటకలిపాడు ప్రతాపరుద్రుడు.
“దండనాయకీ ! మీ రాజ్యంలో స్త్రీలు స్త్రీ సహజమైన సౌకుమార్యం, బేలతనంతో ఉండరా ? అక్కడి స్త్రీలకు ఎటువంటి శిక్షణ లభిస్తుంది?” అని అడిగాడు.
“సర్వ సేనాని ! స్త్రీ బాల్యంలో తండ్రి సంరక్షణలోనూ, కౌమారంలో సోదరుడి సంరక్షణ లోనూ, వివాహం పూర్తయ్యాకా భర్త సంరక్షణలోనూ, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలోనూ ఉండాలన్న నియమానికి మేము పూర్తిగా వ్యతిరేకం. స్త్రీని సర్వస్వతంత్రంగా, స్వావలంబన దిశగా నడిపించి, స్త్రీలు తమ రక్షణకు ఎవరి మీదా ఆధారపడకుండా చెయ్యాలన్నదే మా లక్ష్యం.
ఇందుకోసం మా రాజ్యంలో పుట్టిన ఆడపిల్లలకు బాల్యం నుంచే కర్ర సాము, కత్తి సాము, మల్ల యుద్ధం, వంటి విద్యల్లో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారు ఎంచుకునే వృత్తిని బట్టి వారికి అశ్వ శాస్త్రం, వృక్ష శాస్త్రం, తర్క శాస్త్రం, వేద శాస్త్రాలు, పలు రకాల కళలు, విద్యలు నేర్పుతారు. అశ్వ, గజ స్వారీ చేస్తూ యుద్ధం చేయగల యుద్ధ విద్యలు, యుద్ధ తంత్రాలు మా సైన్యంలోని ప్రతి ఒక్కరికీ తెలుసును.” అంది వీరవల్లి.
“అవునా... స్త్రీలకు అశ్వ, గజారోహణతో పాటు, వాటిపై స్వారీ చేస్తూ చేసే యుద్ధ విద్యలు నేర్పుతారా ? ఈ లెక్కన మీ సైనిక బలం ఎంత? అశ్వ బలం ఎంత? గజబలం ఎంత? అని మాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇంతవరకు మేము ఇటువంటి దేశాన్ని గురించి చూసి ఉండడం కాని, విని ఉండడం కాని జరగలేదు!” ఆశ్చర్యం ప్రకటిస్తూ అన్నాడు ప్రతాపరుద్రుడు.
“ఇక్కడే చాలామంది పొరబడుతూ ఉంటారు ప్రతాపా ! ‘బలం’ అన్నది కండల్లో కాదు గుండెల్లో ఉండాలి. అటువంటి బలానికి తోడుగా ఒక ఉక్కు సంకల్పం తోడైనప్పుడు, ఆ వ్యక్తి ఒక శక్తి అవుతాడు. కొండనైనా ఢీ కొనే ధీరత్వాన్ని కలిగి ఉంటాడు. ఇక మా రాజ్యంలోని అశ్వాలు పలు దేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించబడ్డ మేటి జాతికి చెందినవి. అవి ఎన్ని అని మీరు అడిగితే, ఆ అశ్వాలన్నీ వేగంగా పరుగెత్తడం ఆరంభిస్తే రేగే ధూళి సర్దుకుని, తిరిగి మీకు దృశ్యం కనిపించేందుకు ఒక గంట సమయం పడుతుంది. మా మద గజాలు, కదిలే పర్వతాల్లా ఉంటాయి. అవన్నీ ఎన్ని అంటే, ఒక చోట నిలబెడితే, పగలే రాత్రయ్యిందా అనేంతగా మా రాజ్యంలో సగభాగాన్ని ఆక్రమించేన్ని ఉంటాయి. అలాగే రధ బలం, పదాతి బలం సమృద్ధిగా గల దేశం మాది.
అయినా, బలగం ఎక్కువ ఉండడమే బలమని మీరు భావిస్తే, మరి కురుపాండవ సంగ్రామం కురుక్షేత్రంలో జరిగినప్పుడు, పాండవుల సైన్యం 7 అక్షౌహిణులయితే కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు. మరి ఎక్కువ సైన్యం ఉన్న కౌరవులే గెలవాలి కదా ! అలా ఎందుకు సంభవించలేదు?”
ఒక్క క్షణం అవాక్కయ్యాడు ప్రతాపరుద్రుడు. అతని భావాలను పసిగట్టింది వీరవల్లి.
“ మా రాజ్యంలోని స్త్రీలు అన్ని రంగాల్లోనూ సుశిక్షితులని మీకు ముందే తెలిపాను. సమకాలీన అంశాల అధ్యయనం , చరిత్ర అధ్యయనం మా విద్యలో ఒక భాగం ! ఏ యుద్ధాలు జరిగినా అందులో ప్రయోగించిన యుద్ధ వ్యూహాలు, యుద్ధ తంత్రాలు ఏమిటో మాకు బోధిస్తారు మా గుర్విణి. అయినా, మా రాజ్యంలోని రధ, అశ్వ,గజ, పదాతి దళ బలాల గురించి మీరు చింతిస్తున్నారే కాని, మా రాజ్యానికి అసలైన బలం ఏమిటో మీరు అడగడం మరిచారు.” అంది వీరవల్లి. ఆమె ప్రతి ఒక్క కవళిక ఆమె మాటవరుసకు ఈ విషయాలు చెప్పటం లేదని, కావాలనే సమాచారం అందించి ,గుంభనంగా తమను హెచ్చరిస్తోందని, ప్రతాపరుద్రుడికి  స్పష్టమైపోయింది.
“అసలైన బలమా? అదేమిటి ?” అడిగాడు ప్రతాపరుద్రుడు ఆసక్తిగా.
“మా సామ్రాజ్ఞి ప్రమీల ! ఆవిడే మా అసలైన బలం. ఆవిడకు తెలియని కళలు లేవు, యుద్ధ విద్యలు లేవు ! సర్వసమర్ధురాలైన నాయకి మా స్త్రీ సామ్రాజ్ఞి !” అంటూ అతని కళ్ళలోకి సూటిగా చూసింది వీరవల్లి.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages