నాకు నచ్చిన కధ - సభల సంరంభం - శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కధ - సభల సంరంభం - శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి

Share This

నాకు నచ్చిన కధ - సభల సంరంభం - శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి

శారదాప్రసాద్



శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు ప్రముఖ కథా రచయిత్రి. ఈవిడ హాస్య కథలకు, నవలలకూ ప్రసిద్ధురాలు.ఈమె జూలై 18, 1953న గుంటూరు జిల్లా యాజలి గ్రామంలో జన్మించారు. వల్లూరి సత్యవాణి, వల్లూరి వెంకటకృష్ణమూర్తి ఈమె తల్లిదండ్రులు.పీ.వీ. శివరావు గారితో ఈమె వివాహం 1970లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు శిరీష, ప్రవీణ్ కుమార్.ఈమె 1982లో రాయటం మొదలు పెట్టారు.

మొదటి నవల ప్రేమలేఖ. ఇది శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాగా తీయబడింది. ఈ సినిమా జంధ్యాల దర్శకత్వంలో రూపుదిద్దుకొని అఖండ విజయాన్ని సాధించి హాస్య ప్రియుల మన్ననలను కూడా పొందింది!ఈమె మొత్తం మీద 150 కథలు, 14 నవలలు, 3 సినిమాలు, 2 టీవీ సీరియల్స్ రూపొందించారు. ఈమె రచనలు రేడియోలో నాటికలుగా ప్రసారమయ్యాయి. ఈమె రాసిన హాస్య కథలు- పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలు, మా ఇంటి రామాయణం, చంద్ర హారం, అందమె ఆనందం అనే హాస్యకథా సంపుటాలుగా వెలువడ్డాయి.2007లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం,2007లో తురగా కృష్ణమోహనరావు గారి స్మారక పురస్కారం,2009లో శేషారత్నం స్మారక హాస్యకథా పురస్కారం--- ఈమె అందుకున్న పురస్కారాల్లో కొన్ని.

******
మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఈ కధ హాస్యంగా ఆ విలువలను గుర్తుకు చేస్తుంది.అతిధి మర్యాదలకు తెలుగువారు పెట్టింది పేరు.కానీ ఈ రోజుల్లో ఎవరి ఇంటికైనా వెళితే ,వెళ్లిన కాసేపటికి ఒక్కొక్క బెడ్ రూమ్ నుంచి ఒక్కక్కరూ ఒక్కసారి తొంగి చూసి హాయ్ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు.కొద్దీ సేపు అయినా తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తారు--వచ్చిన అతిధి ఇంకా వున్నాడా లేక వెళ్లిపోయాడా అని !ఇదీ నేటి తెలుగు లోగిళ్ల సాంప్రదాయం.ఇలాంటి కొన్ని లోగిళ్లను చూసి బాధతో ఈ కథను మీకు కూడా చెప్పాలనిపించింది.కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అఖిల భారతీయ కాంగ్రస్ సభలు గుంటూరులో జరిగాయి!అప్పుడు నాకు బాగా ఊహ ఉంది!మా నాన్నగారు ఆ సభలకు నన్ను తీసుకొని వెళ్ళారు!లాల్ బహదూర్ శాస్త్రి గారితో పాటుగా,చాలామంది నాయకులను చూసాను!కామరాజ్ ,సంజీవరెడ్డి,ఇందిరాగాంధీ ,మొరార్జీ దేశాయ్ లాంటి హేమాహేమీలను చూసిన జ్ఞాపకాలు నా మనస్సులో నిలిచిపోయాయి!కామరాజ్ తమిళంలో మాట్లాడిన ప్రసంగాన్ని సంజీవరెడ్డి గారు తెలుగులోకి అనువదించారు!అప్పటి నుంచే నాకు అలవాటైన ఒకే ఒక తమిళ మాట వణక్కం!అప్పుడు కాంగ్రెస్ గుర్తు కాడెద్దులు. నమ్మినబంటు సినిమాలో సావిత్రి రెండు ఎద్దులను పట్టుకున్న పెద్ద పోస్టర్స్ ఊరంతా వెలిశాయి!విజయా నాగిరెడ్డి గారు వేదికను, ముఖ్యమైన కూడళ్లను తీర్చి దిద్దించారు!జిల్లా అంతా పండుగ వాతావరణమే!ఆ సంబరాలను గురించి నేను ఒక చిన్న కథను వ్రాద్దామనుకున్నాను!

అయితే ,నా భావాలకు అక్షర రూపాన్ని ఎప్పుడో ఇచ్చిన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి కధ -​సభల సంరంభం --చదివిన తర్వాత, ఆ పనిని విరమించుకున్నాను!తెలుగువారికి అతిధి సేవ,మర్యాదలంటే అమితమైన అభిమాన గౌరవాలు!ఇంటికి వచ్చిన అతిధిని చేతైనంత రీతిలో సత్కరించి పంపాలనుకోవటం మన సాంప్రదాయం!కాంగ్రెస్ సభల సంబరాల సందర్భంలో అమాయక మధ్యతరగతి మామ్మల ,బామ్మల మనోగతాలు ఎలా ఉండేవో ఈ క్రింది కధలో మీరే చూడండి!

********
మన గుంటూరులో కాంగ్రెస్ సభలట--అనే వార్త మా అందర్నీ ఆనందోత్సవాలతో ముంచెత్తింది.గుంటూరులో సభలకు నల్లచెరువును పూడ్చి అక్కడ ఏర్పాట్లు చేస్తారని,వచ్చే పెద్దలంతా ఉండటానికి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లు సిద్ధం చేస్తారనీ వార్తలు వచ్చాయి!పెద్ద ఎత్తున సన్నాహాలు మొదలు పెట్టారు.ఊరంతా పెళ్ళివారిల్లా ముస్తాబు చేశారు.సభలంటే బంధువులు,మిత్రులు వస్తారని పనిలోపనిగా చాలామంది వాళ్ళ ఇళ్లకు సున్నాలు,రంగులు వేయించుకున్నారు!మా ఇల్లు మరీ రోడ్ మీదే ఉంది.మా డాబా మీదకి ఎక్కితే చాలు ఊరేగింపు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని మా మూడో లైన్ వాళ్లంతా 'మీ ఇంటికి వస్తాం ఆ వేళ్ళకి ' అని ముందే చెప్పి పెట్టుకున్నారు.సభలు దగ్గరపడినకొద్దీ ఒకటే సందడి.రోడ్లన్నీ కాంగ్రెస్ జెండాల తోరణాలు కట్టారు .స్వాగత వచనాలతో బేనర్లు అడుగడునా కట్టారు.ఉత్తర భారతదేశం నుంచి ఇనుప టోపీలు పోలీసులు లారీల నిండా వచ్చి దిగిపోయారు.పొద్దున్న తొమ్మిదింటికి రింగురోడ్డు నుంచి నల్ల చెరువు సభావేదికకి వెళ్ళాలి ప్రముఖులందరూ!రోడ్లకు ఇరువైపులా జనం బారులు తీరి నిలుచున్నారు!నగరమంతా కిక్కిరిసి పోయింది.అయితే,మాకు ఎటువంటి సమస్యా లేదు!మా డాబా మీద పెద్దవారికోసం నవారు మంచాలను వేశారు!కుర్రకారంతా నిలబడే చూస్తున్నారు .ప్రముఖులు ఒకరి వెంట మరొకరు తమ వాహనాల్లో రావటం మొదలు పెట్టారు!వారిని చూసి జనం ఒకటే కేరింతలు!కామరాజు ,గుల్జారీలాల్ నందా... లాంటి పెద్దలు మరియు మేము పాఠాల్లో చదువుకునే మరికొంతమంది ప్రముఖులను చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం కలిగింది.ఇంతలో ఒక బంగారు రంగు కారు వచ్చింది.ముందూ వెనకా మోటారు సైకిల్స్ మీద సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు.ఆ కారుకు నంబరు ప్లేట్ స్థానంలో అశోక చక్రం బొమ్మ ఉంది.ఆ కారులో నిలబడి ఉంది మరెవరో కాదు, ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు,ఆయన పక్కనే ఆయన సతీమణి లలితా శాస్త్రి గారు.దేశ ప్రధానిని సాక్షాత్తు చూడటంతో ఆ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.ఆ ఆనందం నుంచి బయటపడకముందే దూరంగా మరో నల్ల రంగు కారు కనపడింది.ఆ కారులోని వ్యక్తిని గుర్తుపట్టగానే జనం ఒక్క పెట్టున హర్షధ్వానాలు చేశారు.ఆమె ఎవరో కాదు,చాచా నెహ్రూ ముద్దుల కుమార్తె ఇందిరాగాంధీ!ఆమెను చూడటానికి జనం విరగబడ్డారు.జనాన్ని అదుపు చేయటానికి పోలీసులు విపరీతంగా శ్రమపడ్డారు.పోలీసులు లాఠీలకు పనిచెప్పవలసి వచ్చింది కూడా !

ఆవిడ పోతపోసిన బంగారు విగ్రహంలా ఉంది.ఆ అందాన్ని చూడవలసిందే కానీ వర్ణించటం సాధ్యం కాదు!కట్టింది మామూలు ఖద్దరు చీరే అయినా మెరిసిపోతుంది.అందరూ తనివితీరా చూసేందుకు వీలుగా ఆమె కారు చీమలా నెమ్మదిగా కదిలిపోతుంది.ఆమెను తృప్తిగా చూసి వెనుదిరిగారు!మా ఇంట్లో సందడి కూడా సద్దుమణిగింది.అయితే మాఇంట్లో మామ్మల సణుగుడు ప్రారంభం అయింది."ఏమిట్రా మరి ?మేము చెప్పిన సంగతి ఏమి చేశారు?ఈ పూటైనా ఆ వివరాలు కనుక్కుంటారా?" అని మామ్మలు కొడుకుల వెంటపడ్డారు?" "నీ చాదస్తం దొంగలు తోలా , చెబితే అర్థంకాదా మీకు ?" అని వీళ్ళు విసుక్కోవటం.విషయం ఏమిటంటే --ఇందిరా గాంధీ తండ్రిపోయాక మొదటిసారిగా గుంటూరుకు వచ్చిందట!రాక రాక వచ్చింది.ఇంటికి భోజనానికి పిలిచి గుంటూరు జరీచీరె పెట్టి పంపిస్తారట!అది విని మా వాళ్ళందరూ పగలబడి నవ్వుకున్నారు!"ఆవిడేం మామూలు మనిషి అనుకున్నారా ?మన ఇంటికి భోజనానికి రావటానికి?"మనం పిలవటం మర్యాద,వీలుకాకపోతే ఆవిడే రాదు.అసలు పిలవకపోవడం ఏం మర్యాద?"అని మామ్మల జవాబు!ఇంక ఇట్లా లాభం లేదనుకొని వారు చూస్తుండగానే కొందరు ఖద్దరు ధరించిన వారికి విషయాన్ని వివరించి చెప్పారు.వీళ్ళ సొద భరించలేక వాళ్ళు 'అలాగే లెండి,చెప్పి చూస్తాం!' అని అక్కడి నుంచి వెళ్లిపోయారు.చూస్తుండగానే సభలు అయిపోయాయి.అందరూ సంతోషంగా ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు .మామ్మలు మాత్రం,"ఇంత ఊరుంది ఏమి లాభం?తండ్రి చచ్చిపోయిన అమ్మాయిని ఒక్కరంటే ఒక్కరు ఇంటికి పిలిచి ఆదరించలేకపోయారు."అని బాధ పడ్డారు.
*****

No comments:

Post a Comment

Pages