వీడిన నీడ - అచ్చంగా తెలుగు

వీడిన నీడ

పి.వి.ఆర్. గోపీనాథ్.



"బామ్మా కథ చెప్పవా.."
నీరెండలో మల్లె పందిరి కింద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న శారదమ్మ చుట్టూ చేరారు మనుమలూ, మనుమరాళ్ళూనూ. ఆషాఢం వచ్చేసినా సాయంత్రం ఆరవుతున్నా ఋతువు మారకపోవడం వల్ల భానుడు ఇంకొక్కసారి అంటూ ఎర్రగా వెలిగిపోతున్నాడు. మరోవైపు చాల్లేవయ్యా దిగు దిగూ నేను రావాలీ అంటున్నట్లు తూర్పున రేరాజు పైపైకి వచ్చేస్తున్నాడు.
పెద్ద పరీక్షలైపోవడంతో నగరాల నుంచి సెలవులకని వచ్చేశారు శారదమ్మగారి కొడుకు పిల్లలూ, కూతురు పిల్లలూ. వీరు నలుగురే అయినా చుట్టూ ఉన్న వీరి నేస్తాలకూ ఆవిడే కబుర్లు చెప్పే బామ్మ మరి.
"కథలు చెప్పడం నా వల్ల నేమవుతుందిరా. ఏవో నాలుగు మంచి మాటలైతే చెప్తాగాని..."
"అదేంటీ,  బామ్మలకు కథలు రాకపోవడమేంటీ?!"
బుగ్గన చేయేసుకుని మరీ దబాయించింది అయిదేళ్ళ చంటి ఆరిందాలా. మురిపంగా దాన్ని ముద్దు పెట్టుకుని తిరిగి ఆలోచనలలోకి జారుకుంది ఆమె. అది గమనించి ఒకరికొకరు హుష్ అంటూ సైగలు చేసుకుంటూ సైలెంటైపోయారు. ఓ పది నిముషాలు అలా చూసి ఆమెలో కదలిక లేకపోవడంతో చెప్పు బామ్మా అంటూ కుదిపి ఈ లోకింలోకి తెచ్చాడు రాముడు.
"సరే చెప్తా. మద్యలో ప్రశ్నలు వేయకూడదు మరీ." ముందే కండిషన్ పెట్టింది.
 వెంటనే  ...బలే బలే బామ్మ కథ చెపుతుంది రండిరో ... అంటూ వీరు మరో నలుగురిని కేకేసేరు. అంతా కలిసి ఓ పది మంది మూగారు.
****
“ ఛాయల పాడు”
శ్రీకాకుళం సమీపాన జాతీయ రహదారికి ఓ కిలో మీటరు దూరాన ఉన్న పల్లే పట్టణమూ కాని ఊరు.  సుమారు వెయ్యి గడపలు. సర్పంచ్ రంగారావు అదో రకం మనిషి. తాను ఎదిగి నట్లే అంతా సొంత కాళ్ళపై నిలబడాలనీ దేనికీ ఎవరి కోసమో ఎదురు చూడకూడదనీ అనుకుంటాడు. వినడానికి బాగానే  ఉందనిపించినా దానిని ఆయన అమలులో పెట్టిన తీరు మాత్రం చూసేవారికి వెగటూ, అనుభవించేవారికి దుర్భరమూనూ ...
భార్య రుక్మిణమ్మకైతే భర్తే సర్వస్వం. "యజమాని తప్పు ఆలోచించడూ, మాట్లాడడు, చేయడు" అనుకునే మనిషి. వీరికి ఊరు చివర పదెకరాల పొలం. మరో ఐదెకరాల్లో మామిడి, సపోటా, జామ వగైరా తోటలు. ఊళ్ళోనే రైసు మిల్లు.  ఒక్కడే కొడుకు. శ్రీకాకుళంలో కాలేజీ లెక్చరర్. ఒక కూతురు. ఆమె కూడా శ్రీకాకుళంలో అన్నగారి కాలేజిలోనే డిగ్రీ చదువుతోంది.
వీరికి చెప్పుకోవడనికి ఆస్తి పాస్తులూ, పెద్ద బంగళాయే ఉన్నప్పటికీ.....
  గేటు బయట హోదా చాటే అరుగులు కానీ, వచ్చేపోయే వారికి నీడ నిచ్చే చెట్లు కానీ కనిపించవు. బయటకు కనబడే వేపా, నేరేడూ వగయిరాలన్నీ ఆవరణలోపలే. వాటి కొమ్మలు కూడా వీధిలోకి తొంగి చూడటానికి భయపడతాయంటే అతిశయోక్తి లేదేమో. అదేమంటే “అరుగులూ,, చెట్లూ ఉంటే అలగా జనం చేరతారు. నానా యాగీ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేము, పొమ్మనీ చెప్పలేము కదా, ఇంట్లో ఎదిగిన పిల్లలున్నారాయే..” అంటాడాయన. ఇక ఊరి జనం చూస్తే... యధా రాజా తథా ప్రజా!
అందుకేనేమో ఊరిపేరు మొదట్లో అరసవిల్లి స్ఫూర్తిగా ఛాయవరం అని పెట్టుకున్నా చుట్టు పక్కల జనం వెటకారంగా ఛాయ వరం కాదు, ఛాయపాడు అనేవారు. క్రమంగా అదే ఛాయలపాడుగా మారిపోయింది.! రాను రాను వీరితో సంబంధాలు కలుపుకోవాలంటేనే ఇతర ఊళ్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటి ఊరికి  కోడలుగా వచ్చింది శారద. నిజానికి ఆమె తల్లి దండ్రులూ కొంత తటపటాయించినట్లే కనిపించారుగానీ, రంగారావుగారు దూరపు బంధువు కావడం వల్లనూ,  ఆయన హోదా, పలుకుబడీ, ఆపైన ఆస్తిపాస్తులూ, ఒక్కడే కొడుకూ...ఇవన్నీ మొగ్గు చూపేలా చేసాయి. పైగా శారదకూ, వారి కుమారుడైన కృష్ణకు కూడా కాలేజీ రోజులలోనే పరిచయం ఉంది. అందుకే డిగ్రీ కాగానే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కదాని వెంటనే పెళ్ళి చేసేశారు.
కొత్త కోడలు గనుక ఓ నెల రోజులు బయటకు పోకుండానే ఇంట్లో టివి, పుస్తకాలు, ఇంటి పనులతో గడిచిపోయాయి. ఓ సాయంకాలం ఆడపడుచు శైలజను తోడు తీసుకుని దగ్గరలోనే ఉన్న రామాలయానికి పెళ్ళింది. అక్కడ ఎక్కడా కనుచూపు మేరలో యాచకులు కనబడలేదు సరికదా,
పూజారి పళ్ళెరంలో పైసలు వేయబోతుంటే "వద్దమ్మా మీ మామగారికి తెలుస్తే కోప్పడతా"రంటూ ఆయనే వారించడం చూసి విస్తుబోయింది. తర్వాత ఆరా తీస్తే శైలజ చెప్పింది. ఊళ్లో యెవరికీ ఏదీ ఊరికే ఇవ్వకూడదని. పూజారిక్కూడా ట్రస్టు తరఫున జీతం ముడుతుంది కనుక మనం దక్షిణ అంటూ అలవాటు చేయకూడదన్నారన్నది. అప్పుడే మండపం బయట పెద్దగా అరుగులూ గట్రా లేకుండా కేవలం దారి పక్క మందిరంలా ఉండటానికి కారణమూ వివరించడంతో శారదకు మతి పోయినంత పనయింది. క్రమంగా ఆ ఊరి పరిస్థితులు ఆకళింపు చేసుకున్నాక తాను ఏమి చేయగలదో  ఓ అవగాహనకు వచ్చింది. కాకపోతే ఎలా మొదలుపెట్టాలన్నదే సమస్య. అయితే ఓ రోజు ఆ అవకాశం రానే వచ్చింది.
కాలేజి నుంచి ఇంట్లో అడుగు పెడుతూనే ధుమ ధుమ లాడుతున్న ఆడపడుచును నెమ్మదిగా చల్లబరచగా...
"వెధవ లైబ్రరీ. ఒక్క మంచి పుస్తకం లేదు. ఆ రాణికేమో మహా టెక్కు. నీ దగ్గరున్న ఏకవీర ఓసారివ్వవే చదివిస్తానంటే మనకా అలవాటు లేదు పొమ్మంటుందా?"
"పోనీ నీ దగ్గరున్నదేదైనా ఇస్తాననకపోయావా?"
"అదీ అయింది వదినా. వేయి పడగలు తన దగ్గర లేదని తెలిసి నే ఇస్తానని చెప్పా. ఊఁహూఁ. కావాలంటే తనే కొనుక్కుంటుందంట కానీ..."
అప్పుడు బయట పెట్టింది శారద తన మనసులో మాట. మొదట తండ్రిని తలుచుకుని భయపడిన శైలు తర్వాత ఆలోచనలో పడింది. క్రమంగా మెత్తబడి తనతో అత్యంత  స్నేహంగా గోప్యంగా కూడా మరో ఇద్దరు ముగ్గురి చెవిన వేసింది. పెద్దాయనకుతెలిస్తే ఏమవుతుందోనని హడిలిపోతున్న వీరురంగారావు గారు అసలేమీ జరగనట్లు మవునం పాటించడం,ఎవరితోనూ ఏమీ మాట్లాడకపోవడం చూసిభయం పోయి అయోమయంలో పడ్డారు. కృష్ణ అసలు పట్టించుకోలేదు. తండ్రి పట్ల ఉన్న భయమూ, అంతకు మించి భార్య పట్ల ఉన్న నమ్మకమే అందుక్కారణం అనుకోవాలి. అదీగాక, శారద కాపురానికి వచ్చిన వారం రోజులకే ఆవు ఈనింది. ఇంటికి ఇంకో లక్ష్మి వచ్చిందంటూ అందరూ ప్రత్యేకించి రంగారావు మహా సంబరపడిపోయారు. వ్యాపారంలో కలసివస్తూండడమూ ఆయనకు కోడలిపై అభిమానం, గురి పెంచసాగాయి మరి. కనుక అవసరమైతే ఆమెనే రంగంలోకి దింపాలనుకున్నారు రుక్మిణమ్మా, శైలజానూ.
చివరకు ఇక ఆగలేక ఓ రోజు పడక్కుర్చీలో వాలి భక్తి ఛానెల్ లో చాగంటిగారి ప్రవచనాలు శ్రద్ధగా ఆలకిస్తున్న మామగారికి పాలు పట్టుకెళ్ళింది. ఎప్పుడూ లేనిది కోడలు రావడం వెనుక ఆంతర్యం గ్రహించారు ఆయన. నిజానికి ఇంటా బయటా జరుగుతున్న సంగతులు ఆయన గమనించకపోలేదు. కానీ తానుగా బయట పడదలచుకోలేదు. అంతే. ఏం చెప్పిందో, ఎలా చెప్పిందోగాని...
మూడు రోజులకే ఊరివారిని విస్మయానికి గురి చేస్తూ  పంచాయతీ కార్యాలయంలోని పఠన మందిరం వళలు మారాయి. ఇప్పటి వరకూ రోజూ దయం 6 నుంచి 10 వరకే ఉండేదల్లా ఇప్పుడు 6 నుంచి 11 వరకూ, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకూ పనిచేయ సాగింది. అక్కడితో ఆగలేదా సంస్కరణ. ఒక మంచి పని మరో మంచి ఆలోచనకు దారి తీస్తుందన్నట్లు పఠన మందిరం పట్ల పెరుగుతున్న ఆసక్తి గమనించి పంచాయతీ భవనంపైనే ఓ గది వెలసింది. అలాగే అప్పటి వరకూ దినపత్రికలకే పరిమితమైన ఆ మందిరంలో ఇప్పుడు దొరకని మాగజైను లేదు. క్రమంగా ప్రముఖుల రచనలనూ కొనసాగారు. పర్యవేక్షణకు మరో ఉద్యోగీ కూడా.
ఇదిలా ఉండగా  ఓ రోజు  పక్కింటి పిల్లాడెవరో వడగొట్టి పడిపోయాడని తెలిసింది. వెంటనే పరామర్శకు వెళ్ళిన శారదకు మరో ఆలోచన వచ్చింది. ఈసారి వారితోనే చర్చింది. ఆ ఇంటాయన పంచాయతీ సభ్యుడు కావడంతో ఆ విషయం తనదిగా సమావేశంలో బయట పెట్టాడు. చర్చోప చర్చల తర్వాత ఊరంతా ఎవరిళ్ల ముందువారు విధిగా మొక్కలు నాటాలనే చాటింపు వేశారు. మొక్కల సరఫరా బాద్యత రంగారావుగారే తీసుకోవడం కొస మెరుపు.
ఇంతలో శ్రీరామ నవమి వేడుకలు వచ్చాయి. అప్పటి వరకూ దసరా రోజులలో కూడా  ఊరివారు రోజు కొకరు అన్నట్లుగా తమ ఆత్మీయులకే అన్నదానాలు(?) చేసేవారు. గుడి ఆధ్వర్యాన చేసిననాడు కూడా వచ్చిన యాచకులు ఆ వెంటనే ఊరి బయటకు పోవలసిందే. కానీ ఈసారి ఊరంతా పందిళ్ళు వెలిశాయి. రోజూ ఊరిలోని పేదలకే గాక యాచకులకు కూడా రోజు కొకరు వంతున సంతర్పణలు చేశారు.
అప్పుడే రంగారావుగారికి వచ్చిన మరో ఐడియా.మరి కొద్దిరోజులకే వీధి వీధినా దారికటూ ఇటూ గోతులు వెలిశాయి. ఇది చూసి మునసబు, కరణం కూడా రంగంలోకి దిగారు. ఫలితంగా ముగ్గురూ వంతులు వేసుకుని మొక్కలూ, చుట్టూ ట్రీగార్డులూ వాటి చుట్టూ విశాలమైన అరుగులూ కూడా ఏర్పాటు చేయించేశారు. కొద్ది రోజులకే ఊరంతా పచ్చని వనంలా మారింది. ఇప్పుడైతే నీడా, చల్లనిగాలీ కలసి వారికి వేసవి తాపం అంటే తెలియకుండా చేసింది. అదీ సంగతి.
కథ ముగిసినట్లు ఆగింది. శారదమ్మ.
"అబ్బో. నిజంగా అలా జరుగుతుందా అమ్మా. అలాగైతే ఆ శారదాంటీ ఎవరో గానీ సూపర్ కదూ?" అప్పుడే ఏడో తరగతిలోకి వస్తున్న రాముడి ఆశ్చర్యమూ, ప్రశంసా.
" నిజమే. అది జరిగిన కథే. మన కథే. ఇదుగో మీ అమ్మమ్మే ఆ సూపర్ లేడీ " పార్కు నుంచి ఎప్పుడొచ్చారో కృష్ణారావుగారు నవ్వుతూ చెప్పారు.
" వావ్. నువ్వే....?!" అని ఒకరూ
" మరి నీపేరు లక్ష్మి"  అంటారుగా అని ఒకరూ
" మన ఊరి పేరు ఛాయలపాడు కాదుగా " అని ఇంకొకరూ ప్రశ్నల వర్షం కురిపించారు.
" వాటికి జవాబులు నేను చెపుతానర్రా. ఈవిడ అసలు పేరు లక్ష్మీ శారద. తన కారణంగానే ఊరు బాగుపడిందని అందరూ లక్ష్మీపురం అనో, శారదవరం అనో అందామన్నారు. కానీ తను మరీ మంచిది కదా . అందుకని మా నాన్నగారి పేరుతో రంగాపురం అనిపించిదన్నమాట. జేజేలు చెప్పండర్రా  మీ సూపర్ ఉమన్ కీ... "  ఆయనా చివరి ముక్క కాస్త అల్లరిగానే అన్నారు. పిల్లలూ అందరూ అందుకోగానే ......
" చాల్లెండి. మీ అందరి సహకారం లేకుండానే జరిగిందా ?" ఆమె గొంతులో సిగ్గుతో కూడిన చిరుకోపం తొంగి చూసింది.
" అవునవును. నేను చాలా బాగా సహకరించాను కదూ " నవ్వుతూనే అన్నా ఆయన గొంతులో ఒకింత పశ్చాత్తాపం తను సరిగా పట్టించుకోనందుకు.
" అర్థం చేసుకోవడమూ, అడ్డురాకపోవడమూ గొప్ప సహాయమే కదండీ. పైపెచ్చు మీకు బయట బోలెడన్ని పనులుంటాయాయే "...
సాగదీయడం దేనికని ఆయనా ఇంక మాటాడలేదు. ఇంతలో పిల్లలే అందుకున్నారు.
" అయ్యో. అప్పుడే కథైపోయిందా.  బామ్మా బామ్మా పద్యం చెప్పవా?"
"బావుందర్రా. పోనీ కదాని కథ చెబితే ఇప్పుడు పద్యం కావాలా హన్నా.." పైకి అలా అన్నా కథకు తగ్గ పద్యం చెప్పడం ఆమెకూ ఇష్టమే. వీళ్ళకు తెలీదు గానీ, వయసులో ఉన్నప్పుడు తానూ తన పిల్లలకు కథలూ, పద్యాలూ కూడా వినిపించింది మరి. ఇప్పుడు వయసు మీద పడటం, దానికి తోడు ఈ చిన్నారులకు ఆ వివరాలేమీ తెలియకపోవడం వల్ల(చెప్పాలని ఉన్నా) హమ్మయ్య అనుకోక తప్పడం లేదు మరి.
           అందుకే ఆలోచించినట్లు నటిస్తూ చివరకు ఒక్కటే అనే కండిషన్ పెట్టింది.
                "కం. మానవ సేవయె మిన్నగ
                  మానసమునె నెంచి సేయ మాధవుడెపుడున్
                  మానక చూచును మన కను
                 మానమె ఇక వలదు గాదె మహి విను మిత్రా !"
   "సరే. ఎటూ పద్యం చెప్పించుకున్నారు కదా. మీరడగకుండానే అర్తం చెప్తున్నా వినండి.
 మానవ సేవయే మాదవ సేవ అంటారు. అంటే దేవుడు ఎక్కడోలేడు. మనలోనే, బయట కూడా మనతోనే ఉంటాడన్న మాట. కనుక అడిగినా, అడగకపోయినా అందరిక తోచినంత సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు కూడా మనలను మరిచిపోకుండా కాపాడుతూ ఉంటాడు. తెలిసిందిగా. ఇక పోండి. అన్నాలు తిని పడుకోవాలి."
  ***

No comments:

Post a Comment

Pages