యహ్ మేరా ఉస్మానియా
కృష్ణ మణి
9866767875
నిత్యం పురిటినొప్పుల బాధలే
మా ఉస్మానియా క్యాంపస్ కు
ఇక్కడే మరో జన్మనెత్తాము
మావంటి ఎందరినో కని
ప్రపంచానికి బహూకరించింది ఆ వెచ్చని గర్భం.
ఆ తల్లి ఒడిలో మేము మానసిక చైతన్యం పొంది
రక్తం మరిగిస్తూ అడుగులో అడుగేస్తూ సాగే పోరులో
సమాజాన్ని కదిలించే విప్లవ కాగడాలమై వెలిగాము.
ఆవేశానికి రెక్కలు తొడిగి
ప్రతిధ్వనిస్తున్న నినాదాలను కవచాలుగా చేసుకొని
ఎత్తిన పిడికిళ్లతో చేసిన కవాతులకు భీతిల్లిన రాజ్యాహంకారం
కుటిల నీతితో ఝుళిపించిన కత్తికి
బలి అయిన మిత్రులు ఊపిరినొదులుతూ చూసారు.
ఎగిసిపడే ఉప్పెనను ఎదుర్కోలేక
వెనుదిరిగిన కాకిబూట్ల చప్పుళ్ళను
రేపటి రోజున పొందే విజయబావుట రెపరెపలను
సాధిస్తాము ఆశలు నెరవేరా
మీ ఆయుష్శునందుకొని అని శపథం చేసారు.
ఆనాటి స్వాతంత్ర ఉద్యమం మొదలుకొని
ఇడ్లి సాంబారు గో బ్యాక్
తోలి దశ తెలంగాణ ఉధ్యమం
మలి దశ తెలంగాణ ఉద్యమాల వంటి ఎన్నో ఘట్టాలుకు
సాక్షిభూతం మా ఉస్మానియా !
ఎన్నో ప్రాణత్యాగాలకు
హత్యలకు సాక్షం మా ఉస్మానియా
ఎన్నో కన్నీళ్ళకు
మరెన్నో ఆనందాలకు ఆడ్డా మా ఉస్మానియా
ఈ చదువుల తల్లికి శతవసంతాల ఉత్సవం
అంటే మా పండుగ
పసిపిల్లలమై ఆడాలని పాడాలని మా ఉబలాటం
యహ్ మేరా ఉస్మానియా
ప్యారా ప్యారా ఉస్మానియా
*****
No comments:
Post a Comment