“అమ్మ చెట్టు...” - అచ్చంగా తెలుగు

“అమ్మ చెట్టు...”

Share This

అమ్మ చెట్టు...

తిమ్మన సుజాత , 93 91 34 10 29


పని ముగించుకొని మంచం మీద వాలాను...అమ్మ ఒడిలో ఒదిగి  పడుకున్న భావన...
అవును మరి... ఆ మంచం... ఒకప్పుడు అమ్మ నాటిన చెట్టు కదూ...
మంచం ఏంటి.....? చెట్టు ఏంటి...?  అనుకుంటున్నారా... అదే చెప్పబోతున్నా...
అమ్మ తన చిన్నతనంలో చింత పిక్కలాట ఆడుకుంటూ, ఓ గింజని తన చిన్ని చేతులతో( అప్పుడు తనకి అయిదేళ్ళట )వాళ్ళ ఇంటి పెరడులో నాటిందట. రోజూ ఉదయం లేచింది మొదలు నీళ్ళు పోస్తూ, ఆ  విత్తు ఎప్పుడు అంకురిస్తుంది అనుకుంటూ, చూసేదట! ఓ ఉదయం నేలని చీల్చుకుంటూ, .ఓ చిన్ని మొలక ! అమ్మ ఎగిరెగిరి గంతులు వేసిందట ఆనందంతో. ప్రతి రోజు ఆ మొక్కతో మాట్లాడుతూ, తనతో పాటే ఆ మొక్కని ఎంతో ప్రేమతో పెంచుకుందిట.
పెరటినిండా ఇంకా ఎన్నో చెట్లు..జామ ..సపోటా...దానిమ్మ ..నిమ్మ...దబ్బపండు ..మామిడి..ఇలా పండ్ల చెట్లే కాదు..మల్లె పందిరి ..చుట్టూ గులాబి పూవులు..కనకాంబరాలు..మందార ..నందివర్ధం..సంపెంగ..ఇలా రకరకాల పూల చెట్లు ఎన్ని ఉన్నా, చింత చెట్టుపై తన చేతులతో పెట్టిన గింజ మొలకెత్తింది అనే పిచ్చి ప్రేమని పెంచుకుందిట అమ్మ. పెళ్లి అయి అత్తవారింటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఆ చెట్టును వదిలి వెళ్లనని గోల గోలగా ఏడిచిందిట. తాతగారు ఈ గోల పడలేక ఆ ఇంటిని అమ్మకి కానుకగా ఇచ్చేసారుట!
అప్పటి నుంచి అమ్మ కాపురం కూడా ఆ ఇంట్లోనే. నాన్నగారు ఈమె పిచ్చితనం చూసి ముసి ముసిగా నవ్వుకునే వారు. గంటల తరబడి ఆ చెట్టు దగ్గరే పనులు చేసుకుంటూ, పని అయ్యాక రేడియో పెట్టుకుని పాటలు వింటూ, తనూ పాడుకుంటూ, ఎంతో  ఉత్సాహంగా ఉండేది. నన్ను ,తమ్ముడిని కుడా ఆ చెట్టు నీడలో కూర్చోబెట్టి చదువుకోమనేది. చింత చెట్టు కదూ, ఎంచక్కగా చింత చిగురుతో రకరకాలుగా వంటలు చేసి పెట్టేది. చింతకాయలతో పచ్చడి మా కొక్కళ్లకే  కాదు, మా చుట్టాలందరికి పంచేది..
చింతపండు సంవత్సరానికి సరిపడా మాకు ఉంచి, మిగిలినది అందరికి పంచేది. ఆ చెట్టు కొమ్మకి తాడు కట్టుకొని మా స్నేహుతులం అందరమూ ఎంచక్కా ఉయ్యాలలూగే వాళ్ళం. ఇలా అమ్మతో పాటే మేము కూడా ఆ చింత చెట్టు తో మమకారం పెంచుకున్నాము. పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము. ఇల్లు పాతబడి పోయినా అమ్మ మాత్రం మరమత్తులు చేయించేది కాని, ‘మార్చటానికి వీలు లేదు’ అనిగట్టిగా చెప్పేసింది. నా వివాహం జరిగి నేను ఆ చెట్టుని, ఇంటిని, ఆ వీధిని, ఆ ఊరిని, వదిలి శ్రీవారి ఉద్యోగ రిత్యా ఈ పట్నం వచ్చి చేరాను. నాకు ఇద్దరు అబ్బాయిలు. వారి అలనలో,పాలనలో కాల చక్రం తిరుగుతూనే ఉంది. అమ్మ, నాన్నలతో పాటే ఆ చెట్టు కుడా పెద్దది అవుతూ ఉంది. అయినా తన జాతి ధర్మంగా తన సేవ చేస్తూనే ఉంది. ప్రతి సంవత్సరము నాకు చింతపండు, చింత కాయ పచ్చడి అమ్మ పంపిస్తూనే ఉండింది. గత ఎనిమిది  సంవత్సరాల క్రితం వరకు... ఓ రోజు పూజ చేసుకుంటూ, అలానే ఒరిగిపోయింది...అమ్మ...
మొండిది కదూ, అమ్మ !నొప్పితో గుండె అల్లాడుతున్నా, పైకి చెప్పకుండా అలా వెళ్ళిపోయింది. అమ్మ సహచర్యం కోల్పయిన నాన్న కుడా ఆరునెలలు తిరగకుండానే ఆవిడని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. తమ్ముడు ఎంతో ఇష్టంతో ప్రేమించి మామయ్య కూతురినే పెళ్ళిచేసుకున్నాడు. మరదలు గారాల పట్టి, మాకందరికీ కూడా....
అమ్మ సంవత్సరికం అని వెళ్లి చూద్దును కదా...మొత్తం ఇల్లు మారిపోయింది..
“భాస్కర్....ఏంటిది...నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా...ఇల్లు కూలగొట్టి మరి కొత్తగా కట్టేసుకున్నావు...ముఖ్యంగా అమ్మ చెట్టును ..పూర్తిగా నరికేసావు...” కోపంతో అరిచినంత పని చేసాను.
“ అక్కా..! నీవు కూడా ఇంత సెంటిమెంట్ గా అలోచిస్తావని అనుకోలేదు..నేనేం తప్పు చేసాను..ఎన్నాళ్ళు ఆ పాత ఇంట్లో ఇబ్బందులు పడుతూ..ఉంటాం.....నా పిల్లలు కుడా పెద్దవాళ్ళవుతున్నారు..అనుకూలంగా కట్టుకోవటం తప్పా...!” అంటూ..ఎదురు ప్రశ్న వేసాడు.
“ భాస్కర్...ప్లీజ్...ఇది తప్పే రా..అమ్మ తన ప్రాణం అంతా ఆ చెట్టులోనే పెట్టుకుంది రా..కనీసం ఆ చెట్టు అయినా ఉంచవలసినది  రా...” ఆవేదనతో కూలబడిపోయాను.
వాడు దగ్గరగా వచ్చి...రండు చేతులు నా భుజం చుట్టూ వేసి, “సారి అక్కా..! కంట్రోల్..ప్లీజ్...ఇది నేను అసలు తప్పు అనుకోలేదు..నాకు అప్పుడు అనిపించలేదు..ఇప్పుడు నేనేం చేయలేనక్కా...” అంటూ బావురుమన్నాడు..
వాడంటే..నాకు ప్రాణం....వాడు అలా  ఏడవడం చూసి నేను కదిలి పోయాను...వాడిని ఒళ్లోకి తీసుకుంటూ.
“చా...చా..ఏంటిది..చిన్నపిల్లాడిలా....నాకు అమ్మ గుర్తుకు వచ్చి అలా కసిరాను...పోనిలేరా..వదిలేయి..అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది...” అనునయిస్తూ...బుజ్జగించాను.
అలా అమ్మ ..నాన్నల తో పాటే..ఆ చింతచెట్టుకి  కూడా కాలం తీరింది..
*****
ఓ రోజు ఉన్నట్టుండి తమ్ముడు వచ్చాడు. ఆ వెనుకే ఓ మినీ లారిలో మంచం తీసుకుని మరీ!
“అయ్యో..! నాకెందుకురా..ఈ మంచం..మా ఇంట్లో ఉన్నాయిగా..” అన్నా ఆశ్చర్యపోతూ!
మంచాన్ని వరండాలో వేయించి, నన్ను భుజాలు పట్టుకుని నడిపించుకుంటూ వెళ్లి..
“ముందు నీవు ఈ మంచం మీద కూర్చో..చెపుతా..” అంటూ కూర్చోబెట్టాడు.
“ఎలా ఉందక్కా...” కళ్ళు మిల మిల మెరుస్తుండగా అడిగాడు..
“ఏంటో..ఏదో తెలియని అమ్మతనం అనిపిస్తుంది రా..” ఒక్కసారిగా మనసును అమృతంలో ముంచిన భావన.
“అవునక్కా..! ఈ మంచం మన అమ్మ చెట్టు..!” వాడు కుడా అంతే ఉద్వేగంతో అన్నాడు.
“ఓహ్.........నిజమా..రా..! “వాణ్ణి గట్టిగా కవుగిలించుకున్నా...అమ్మ నాలో వచ్చేసిందేమో....!!
ఇలా మళ్ళి అక్కా తమ్ముళ్ళం ఆ మంచం మీద కూర్చొని ఎన్నో చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకున్నాం.
అప్పటి నుంచి ఈ మంచం నాలో ఒక భాగమైపోయింది. నా పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు. ఉద్యోగాల రీత్యా, చెరొక దేశం వెళ్ళారు. పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు.
మధు మేహం ఎక్కువయి, కిడ్ని పాడవడం వలన ఆ బాధని ఎక్కువగా భరించకుండానే, శ్రీవారు కూడా వెళ్ళిపోయారు..నన్ను ఒంటరిని చేసి....
పిల్లలు రమ్మని ఎంతగా పిలిచినా, నాకు అక్కడకి వెళ్లాలని అనిపించదు. నాకు దొరికిన సమయాన్ని నా కోసం బ్రతకాలనే తపన నాలో. చాతనయినంత వరకు అవసరం అనుకున్న వాళ్ళకి సహాయం చేస్తూ...ఇష్టదైవం అయిన శ్రీనివాసుని సేవించుకుంటూ...గడుపుతూ ఉన్నా.....
పక్క ఇంట్లో ఉన్న భవ్య తల్లి లేని పిల్ల. పెళ్ళయిన ఏడాది లోపే, బాబు పుట్టాడు. కడుపుతో ఉన్నప్పటి నుంచి తన దగ్గరే ఉండి జాగ్రత్తలు చెపుతూ, కాన్పు సమయంలో కూడా ఆ అమ్మాయితో పాటే ఉండి, బిడ్డ పుట్టే వరకు అమ్మలా ఆదుకున్నానని, ఆ పిచ్చి పిల్ల నన్ను ‘అమ్మా’ అనే పిలుస్తుంది. నాకు కూడా కూతుళ్ళు లేని లోటు తీర్చింది మరి. చంటి వాడికి స్నానం చేయించటం, చక్కగా తాయారు చేసి, వాడిని పడుకోబెట్టటం, రోజూ నా దిన చర్యలో ఒక భాగం అయిపోయింది. వాడటు నిద్ర పోగానే భవ్యని  కూడా తినమని చెప్పి, ఇలా వచ్చా మరి అమ్మ జ్ఞాపకాలలోనికి.
మనిషి జీవితసమయం వంద సంవత్సరాలు అయినా పుట్టటం, మరణించటం మన చేతుల్లో లేదు. మధ్యలో జీవితం సార్ధకం చేసుకుంటూ, ఓ చెట్టులా..నిస్వార్ధంగా జీవించాలని నా అభిప్రాయం. అలాగే పట్టణాల పేరుతో చెట్లని నరికేస్తూ, అదే స్థానంలో ఎత్తైన భవనలు నిర్మిస్తూ, పచ్చదనం కరువైపోయేలా చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాననుసరించి తప్పదు కాని, మొక్కలని కుడా నాటుతూ వాటి వలన మనం ఉపయోగం పొందుతూ, ముందు తరాలకు కూడా వాటి ఫలితాలను అందించాలి. మొక్కల వలన వాతావరణ కాలుష్యం అంతరించి పోతుంది. స్వచ్చమయిన గాలి మనకి లభిస్తుంది.
“అమ్మలా లాలిస్తూ..మనకోసమే జీవిస్తుంది..అందుకే చెట్టు ఎప్పుడు అమ్మ చెట్టు “ అవుతుంది..స్వగతంలో అనుకుంటూ...నిద్రలోకి జారుకున్నా..!!
****



2 comments:

  1. మమ్మల్ని కూడా మీ కథలో భాగం చేశారు.
    మనసుంటే మార్గం ఉంటుందని మంచం ద్వారా నిరూపించారు.
    చెట్టు కొట్టేయ్యగానే బాధపడ్డ మాట వాస్తవమే.!
    అదే చెట్టు, మంచం రూపం దాల్చడం మాత్రం పెదవిపై చిరునవ్వు పుట్టేలా చేసింది.
    మంచి అనుభూతి గల కథను అందించిన మీకు ధన్యవాదములమ్మా ..!!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కృష్ణ...అమ్మ గుర్తుకు వచ్చి వ్రాసాను...చక్కని వివరణ ఇచ్చావు...

      Delete

Pages