* అమ్మమ్మ * - అచ్చంగా తెలుగు
* అమ్మమ్మ *

గరిమెళ్ళ గమనాలు



అమ్మమ్మ అమ్మమ్మ
నువ్వు రేపటి వెలుగమ్మ
అమ్మమ్మ అమ్మమ్మ
నువ్వు భవితకు గతమమ్మ

మా అమ్మకు అమ్మవు
మమతల పందిరివు
ఇంటికే ఇలవేల్పువు
మా కంటికే కోవెలవు
ముద్దుల అమ్మమ్మ
నువ్వే మా పేదరాశి పెద్దమ్మ

కల్లాపు జల్లేవు
కన్నతల్లిగా సాకేవు
పాలు పితికేవు
మా ఆకలి కాసేవు
అమ్మ అంటే చిరు భయం
నీతోనే మా సరదా సమయం

అటుకులు బెల్లం అందిచేవు
ఆవకాయ రుచిని చూపావు
మా అల్లరిని భరించేవు
అది చూసి నువ్వు మురిసేవు

ఎన్నో కబుర్లు కొత్తగా చెప్పేవు
ఆ చందమామలా మమ్ము చూసేవు
మా ఆట పాటలకు అమ్మవు నువ్వు
మాకు ప్రేమ పంచే అనురాగం నువ్వు

మా కష్టం చూసి నొచ్చుకునేవు
మా ఇష్టాలలో సంబరపడేవు
మా కంట్లో నీరు చూడలేకపోయావు
మాకు నలత అయితే దిష్టి తీసేవు

ఏ మందు , మాకులు మేము ఎరుగము
నీ స్పర్శ చాలు మాకది ఆరోగ్యము
నీ అలసట నీవే గ్రహించవు
ఎంత పని ఉన్నా విశ్రమించవు

నీతి ,నియమాలు నీ జీవితము
మంచే పంచింది నీ సాంగత్యము
నిండు మహాలక్ష్మిలా నీ రూపము
నిత్య మంగళ హారతిలా నీ హృదయము

నీతో గడిపిన ఆ రోజులు శాశ్వతం
నీవు లేని లోటు బహు కఠినం
నీ జ్ఞాపకాలు మాకొక గ్రంధం
నీ ఆత్మీయం ఒక చెదరని సుగంధం


****

No comments:

Post a Comment

Pages