బాల గేయాలు- 6 - అచ్చంగా తెలుగు
బాల గేయాలు- 6
-      టేకుమళ్ళ వెంకటప్పయ్య


చెమ్మ చెక్క
ఒకనాడు తెలుగు ముంగిళ్ళలో పెండ్లి కాని ఆడపిల్లలు నలుగురు కలిస్తే చాలు, అన్ని పండగల్లోనూ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చెమ్మ చెక్క ఆటను ఎదురెదురుగా నిలబడి, చేతులు చాచి, ఒకరి చేతులు మరొకరికి తాటిస్తూ, ఎగురుతూ, గెంతుతూ, వెనకకు ముందుకూ వూగుతూ, అడుగుల లయకు చేతులు తట్టుతూ, పాటలు పాడుతారు. రంగు రంగుల దుస్తులతో వలయాకారంగా, వరుసన తప్పకుండా నృత్యం చేస్తూ వుంటే,అంగ రంగ వైభోగంగా ఉంటూ చూడ ముచ్చటగా ఉండేది. నేడు పిల్లలకు అంత టైం ఏది? చదువు! చదువు! చదువు! అదీ కాదంటే కంప్యూటర్తోనూ, చరవాణితోనూ ఆటలు ఆడుకోవడం. ఇంకొద్ది సంవత్సరాలకు ఆటలన్నీ అటకెక్కి కేవలం పుస్తకాల్లో ఒకప్పుడు ఇలాంటి ఆటలుండేవట అని తెలుసుకోవలసి వచ్చే దుర్గతి సంభవిస్తుంది.
ఒకనాటి ఆడపిల్లకు ఇష్టమైన ఆట...పాట.. ఇదే చదవండి...భావి తరాలకు అందించండి. మీ పిల్లలచే తీరిక సమయాల్లో ఆడించండి.

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ 

అట్లుపొయ్యంగ ఆరగించంగ

ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగ

రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ

పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ

పందిట్లో మా బావ పెండ్లిచెయ్యంగ

సుబ్బారాయుడి పెళ్ళి చూసివద్దాం రండి

(సూర్య దేవుని) చూసివత్తము రండి

మా వాళ్లింట్లో పెండ్లి మళ్లీ వద్దాం రండి

దొరగారింట్లో పెండ్లి దోచుకు పోదాం రండి.

-0o0-


No comments:

Post a Comment

Pages