కవిద్వయం
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
రమేష్ రాణులు
కవి, కవయిత్రులు. మొగుడూ పెళ్లాలు.
జస్ట్ టూ ఇయర్స్
బ్యాక్...వాట్ హాపెండ్ యు నో...
టైం మెషిన్ అవసరంలేకుండా
గతంలోకి మిమ్మల్ని నేను తీసుకెళతా (మళ్లీ తీసుకొస్తా..నాదీ పూచీ) ఫాలో మీ..
*****
"ఏవండీ
మాధవయ్యగారూ..‘ఊళ్లో ఎంతోమందికి మీ చేతుల మీదుగా పెళ్లి చేశారు. మా అబ్బాయికి మాత్రం
చెయ్యలేరా’ అని మా అబ్బాయి జాతకం మీ చేతుల్లో పెట్టాం. ఇప్పటిదాకా ఒక్క సంబంధమూ తెచ్చింది
లేదు. అసలు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తారా, లేదా?" తమింటి గుమ్మం ముందు నుంచి పెద్ద పెద్ద అడుగులతో దాటుతున్న మాధవయ్య’ఆరి వీడి
దుంపతెగ చూసేశాడు’ అని మనసులో అనుకుని ముఖాన నవ్వు పులుముకుని "ఎందుకు చెయ్యనండీ
చేస్తాను..ఇవాళా.. నిన్నానా..ఊళ్లో మూడొంతుల పెళ్లిళ్లు నేను కుదిర్చినవి కాదటండీ.."
అని లోపలికి వచ్చి రంగనాథం గారి ముందున్న కుర్చీలో కూర్చుని కాస్త మంచి నీళ్లు తెప్పిద్దురూ"
అని లోపలినుంచి తెప్పించిన మజ్జిగ తాగి "ఎవరి పెళ్లయినా ఇట్టే జరిపించేస్తాను.
కానీ మీ వాడిదే కాస్త క్లిష్టంగా ఉంది. మీ అబ్బాయికి రచనల పిచ్చి. తనో కవిగా తెలుగు
భాషను, సంప్రదాయాన్ని కాపాడడానికే పుట్టాడని ఓ గొప్ప నమ్మకం.
అమ్మాయిలు పరికిణీ, ఓణీల్లో, తల్లో పూలతో,
కలహంసనడకలతో, కులుకులతో నయగారాలు పోతూ పదహరణాల
పడుచులా కనిపించాలట. ఈ రోజుల్లో అది సాధ్యమేనాండీ..అరే కుగ్రామాల్లోనూ అలాంటి అమ్మాయి
కనిపించదే..ఇహ నేను అలాంటి అమ్మాయిని ఎలా పట్టుకోనూ, పెళ్లి ఎలా
జరిపించను. మీకు కనిపించినా, మీ అబ్బాయికి కనిపించినా,
నా జీవితం దుర్భరమవుతోంది. తప్పించుకు తిరగలేక పోతున్నాను. అంచేత ఇవి
మీ చేతులే కాళ్లు కాదు, నలిపేస్తూ, నా బాధను
తెలియజేస్తూన్నాను. సంబంధం కనిపిస్తే మీ ఇంట్లో కాకై వాలతాను. కనికరించండి" అని
వెనక్కి తిరక్కుండా బయటకు పరిగెత్తాడు.
పారిపోతున్న
ఆయన్ని చూసి రంగనాథం,
వంటింటి కిటికీలోంచి ఆయన పెళ్లాం రాధమ్మా గాఢంగా నిట్టూర్చారు ’తమ కొడుకు
పెళ్లెప్పుడు అవుతుందో.."అని మనసులో మదనపడుతూ.
*****
అది జరిగిన కొన్నాళ్లకు..
"అయ్యా
రంగనాథంగారూ,
దొరికింది..మీ అబ్బాయికి సంబంధం దొరికింది...ఇంక నేను మీ అబ్బాయికి పెళ్లి
చేయలేనేమో అనుకున్నాను..అన్ని మతాల దేవుళ్లనూ వేడుకున్నందుకు నా మొరాలకించారు."
ఫ్లడ్ లైట్లా వెలిగిపోతున్న ముఖంతో రంగనాథం ఇంటికి వచ్చాడు మాధవయ్య.
"అవునా.."
గాఠ్ఠిగా రంగనాథం దంపతుల నోటి స్పీకర్లోంచి ఒక్కసారిగా వినవచ్చింది.
"అవునవును.
పిల్ల సరస్వతీదేవి చిట్టి చెల్లెల్లా ఉంటుంది. చేతిలో ఎప్పుడూ పెన్ను, కాగితాలూ
పట్టుకు తిరుగుతుంటుంది. మీ అబ్బాయికిలానే సూర్యుడు, చంద్రుడు,
వెన్నెల, ప్రకృతి అంటూ కాగితాలమీద పిచ్చ పిచ్చగా
బరుకుతుంటుంది. పిల్ల పక్కూర్లో పాపయ్య కూతురు. ఒక్కసారి చూశాడంటే మీ అబ్బాయీ నచ్చుకుంటాడు.
గ్యారంటీ. ఆ ఊళ్లో పెళ్లిళ్ల పేరయ్య పీతానందం ఆమెకి సంబంధం చూడలేక, ఆ పిల్ల తల్లిదండ్రులతో మాటలు పడలేక ఊరొదిలేస్తుంటే కాకా హోటల్లో నాకు తారసపడి
విషయం చెప్పాడు. నా ఆనందం అంతా ఇంతా కాదు. మీరు ‘ఊ’ అంటే ఇహ శుభస్య శీఘ్రమే! ఆఁ!!"
అన్నాడు మాటలు, వాటితో పాటు ఉమ్మి తుంపర్లూ అందరి ముఖాలపై వెదజల్లుతూ.
అవి ఉత్తరీయంతో రామనాథం, చీరకొంగుతో ఆయన భార్య తుడుచుకుంటూ
"శుభవార్త చెప్పారు" అన్నారు సంతోషం పూర్తిబలంగా వ్యక్తం చేస్తూ.
*****
అంగరంగ వైభవంగా
పెళ్లయింది.
ఇది రెండు మనసుల
రెండు దేహాల
పెళ్లి కాదు
రెండు కలాల పెళ్లి
రెండు కాగితాల
పెళ్లి
అన్నాడు మైకులో
పెళ్లికి వచ్చిన ఓ పేద్ద కవి.
ఆడా, మగా
పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు
కవి, కవయిత్రీ
వివాహం చేసుకుంటే కవితలు పుడతాయి
సంపుటాలు వెలువడతాయి.
అన్నాడు యువకవుల
వాహ్వాల మధ్య మరో కవి మిత్రుడు.
అలా మరో కొన్ని
కవితలతో వాళ్లిద్దరు ఒక్కటయ్యారు.
ఆ దంపతుల తల్లిదండ్రులు
పక్క ఊర్లో మంచి ఇల్లు చూసి వాళ్ల కొత్తకాపురానికి ఏర్పాట్లు చేశారు.
వాళ్లిద్దరి
కాపురంలో ఆనందం,
ఆక్రోశం, అలకలు, గొడవలు అన్నీ
కవితలై ఊళ్లోవాళ్లని తెగ ఇబ్బంది పెట్టసాగాయి.
ఒక కవినే తట్టుకోవడం
కష్టం,
అలాంటిది ఆ కవిద్వయం ఇంటికెవరొచ్చినా, రోడ్డుమీద
ఎవరెదురొచ్చినా కలాలతో కుమ్మేస్తున్నారు.
చుట్టుపక్కలవాళ్లు, అయినవాళ్లు,
కానివాళ్లు ఎవరైనా వాళ్లింటి గుమ్మం తొక్కడానికి జంకుతున్నారు.
పేపర్, పాలపేకేట్లు,
పోస్ట్ అన్నీ దూరం నుంచే వాళ్లింట్లో పడతాయి. దగ్గరకెళ్లే సాహసం ఏ ఢింభకుడూ
చేయలేకపోతున్నాడు.
ఇళ్ల మధ్య ఇలాంటి
విద్రోహులుండకూడదని,
ఉంటే పిల్లలు జిహాద్ కు అట్రాక్ట్ అయినట్టు వీళ్లకెట్రాక్టై పుస్తకాలు,
స్కూళ్లు వొదిలి కాగితం, కలం మారణాయుధాలతో తిరుగుతారన్న
నిర్ణయానికి కాలనీవాళ్లందరూ వచ్చి, ‘వాళ్లను విరగడ ఎలా చేసుకోవాలా’
అని బుర్రలు బద్దలు కొట్టుకోసాగారు.
*****
ఒకరోజు ఆదివారం.
కాలనీవాళ్లందరూ
కలసి కట్టుగా కలందంపతుల ఇంటికొచ్చారు.
"అసలు మా
ఇంటి గుమ్మం తొక్కరనుకున్నాం. సాహిత్యం అందరికీ అర్థం కాదు. దానికి పూర్వజన్మ సుకృతం
ఉండాలి. అలాంటిది ఇంతమంది వచ్చారంటే..అది మా గొప్పతనం కాదు. సాహిత్యం అంటేనే అది. మంచి
పాటకు చెవికోసుకుంటారు. మంచి కవితకు ఒళ్లంతా కోసుకుంటారు."అన్నాడు గుడ్లు బయటకొచ్చేలా
ఆనందంగా కళ్లు పెద్దవి చేస్తూ కవి.
"ఎంత మంచి
వాక్య నిర్మాణం చేశారండీ" కవయిత్రి అరమోడ్పు కళ్లతో భర్తవంక చూసింది.
వచ్చిన వాళ్లందరూ
బిక్కచచ్చిపోయారు.
వాళ్లలో ఓ పెద్దాయన
ముందుగా తేరుకుని "మీలాంటి కవులు మాదగ్గరుండడం అదృష్టమైనా, రోడ్లమీద
ట్రాఫిక్, ఇళ్లలోని అరుపులు కేకలు మీ ఏకాగ్రతకి భంగం కలిగిస్తాయి.
అందువల్ల కొన్ని కవితలు మీ మెదళ్లలోనే ఉండిపోయి పురిట్లోనే సంధి కొడతాయి. అంచేత.. అంచేత..మేమందరం
కలసి ఊరికి దూరంగా ప్రశాంతంగా మీకో ఇళ్లు కట్టించాం. అది మీ సాహితీ సేవకు మేమిస్తున్న
బహుమతి. ఇహ మీరక్కడకు వెళ్లి మీకిష్టమైనన్ని రాసుకోవచ్చు"అన్నాడు.
అందరూ చప్పట్లు
కొట్టారు.
కవులు పడిపోయేది
బహుమతులకీ,
చప్పట్లకే! వీళ్లూ పడిపోయారు.
*****
ఆరోజు వాళ్లు
ఆ ఇల్లు ఖాళీ చేసి కొత్తింటికి వెళ్లిపోయే రోజు.
చివరిగా దీర్ఘ
కవిత చదివి తమ కొత్తింటి వైపు సాగిపోయారు.
వాళ్లు అలా సందు
దాటారో లేదో అందరూ చెవుల్లోని దూదిని తీసేసి, హాయిగా మనశ్శాంతిగా నిద్రపోయారు
ఆ రాత్రి.
తమ పిల్లలు ఒకింటి
వారయ్యారని ఆనందంగా వచ్చిన కవిద్వయం తల్లిదండ్రులు ఊరికి దూరంగా విసిరేసినట్టున్న ఆ
ఇంటిని చూసి విషయం అర్థం చేసుకుని బాధగా నిట్టూర్చారు.
ఇదేమీ పట్టని
ఆ కవులు చందమామని,
ప్రకృతిని పరవశంగా చూస్తూ...
నల్లటి మబ్బులపై
గుండ్రని చంద్రుడు
చిన్ని పొన్ని
చుక్కలు...
.............................................
.............................................
(ఏంటీ! మీరు
వాళ్ల కవిత విందామనుకుంటున్నారా?! హతోస్మి)
***
No comments:
Post a Comment