మంత్రాల సుబ్బారావు - అచ్చంగా తెలుగు
మంత్రాల సుబ్బారావు
మా బాపట్ల కధలు – 13
భావరాజు పద్మిని


“నాన్సెన్స్... అయినా ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు ఏవిటి ? మనిషి అంతరిక్షానికి చేరినా అతని అంతరంగంలో ఉన్న ఛాందస భావాలు పోవడంలేదు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? మీ ఫ్రెండ్ కొడుక్కి జ్వరం వస్తే ఫకీరు దగ్గర తాయత్తు కట్టించారా ? అప్పుడు తగ్గిందా ? ఈ పేరుతో ఎంత దండుకున్నాడు గురుడు? మన భయాలు, మూఢనమ్మకాలే పెట్టుబడిగా ఇటువంటి వారు మేడలు కడుతూ ఉంటారు.” అంది నా ఫ్రెండ్ అనుపమ. రెండు రోజుల నుంచి నా ఫోన్ ఆడియో పాడవడంతో స్పీకర్ పెట్టి మాట్లాడాల్సి వస్తోంది. ఆ రోజున యాదృచ్చికంగా అనుపమ మా ఇంట్లోనే ఉండడం, మా మాటలు వినడం జరిగింది.
“అవును, మన సెన్స్ కి అందని ప్రతీ దాన్ని ‘నాన్సెన్స్’ అని సరిపెట్టుకోవడం మనకు రివాజు అయిపొయింది. ఆధునిక మానవులం కదా !పూర్వీకులు అందించిన ఘన సంస్కృతిపై పరీక్షనాళికలు తీసుకుని పరిశోధించేందుకు బయలుదేరతాము. భూమి గుండ్రంగా ఉందని మన వేదాల్లో ముందే చెప్పినా నమ్మము. కాని ఎవరో విదేశీయులు ఏవేవో సిద్ధాంతాల ద్వారా చివరికి దాన్నే ప్రతిపాదిస్తే, అప్పుడు నమ్ముతాము. మతాన్ని పరిశోదిస్తాము, సైన్సు ను నమ్ముతాము. నిజానికి మతాన్ని నమ్మాలి, దానికి మూలం ప్రగాఢ విశ్వాసం, సైన్సు ను పరిశోధించాలి. ఈ రెండూ ప్రస్తుతం విరుద్ధంగా జరగడం వల్లే ఈ గందరగోళం.”
“ఏదేదో మాట్లాడకు పద్మినీ! టీవీ లలో దొంగ బాబాలు, స్వాములను ఎంత మందిని చూపించటం లేదూ? వారంతా నువ్వు చెబుతున్న మతాన్ని, నమ్మకాన్ని అమ్ముకుని జిమ్మిక్స్ తో కోటీశ్వరులు కావట్లేదూ? అంతెందుకు, ఒక్క రూపాయి ఆశించకుండా ఇతరులకు మేలు చేసేవారు, ఇతరుల మేలు కోసం త్యాగాలు చేసేవారు, ఎవరైనా ఉన్నారా? నీ జీవితకాలంలో నువ్వు చూసావా? చెప్పు?”
“చూసాను... ఎక్కడో కాదు, మా సొంతూరు బాపట్ల లోనే చూసాను... ఆ కధ చెబుతాను విను...”
***
అప్పట్లో మా బాపట్ల మరీ పెద్ద ఊరేం కాదు. కులాల పట్టింపులూ అవీ ఎక్కువగా ఉన్న సమయం అది. ఎవరూ ఎక్కడ పడితే అక్కడ తినేవారు కాదు. కొంతమంది కేరళ అయ్యర్లు పెట్టిన ఉడిపి టిఫిన్ హోటల్స్ ఊరు మొత్తం మీదా ఒక నాలుగైదు ఉండేవి. అక్కడ వండేది జంధ్యాలు వేసుకున్న బ్రాహ్మలే కనుక, అప్పుడప్పుడు ఊరివాళ్ళు అక్కడ ఇడ్లీ, దోస లాంటి టిఫిన్లు తెచ్చుకునేవారు.
గడియారపు స్థంభం నుంచి ఆంజనేయ స్వామి గుడి వైపు వెళ్తే అచ్చ్యుతుని వారి ఇంట్లో చలం గారి హోటల్ ఉండేది. ఆయన బాబాయ్ ‘మణయ్యరు’గారని ఆయనతోనే ఉండేవారు. నుదుట విభూతి రేఖలు, రూపాయి కాసంత కుంకుమతో అపర శివుడిలా వెలిగిపోయేవారు ఆయన.  ఆయనకు రకరకాల మంత్రాలు తెలుసు. పొద్దున్నే లేచి, నియమనిష్టలతో మంత్రానుష్టానం చేసుకునేవారు. ఆ తర్వాత హోటల్ కు సంబంధించిన పనులు చేసేవారు. అడపా దడపా ఆయన అవసరంలో ఉన్నవారికి తన మంత్రబలంతో సాయం చేస్తూ ఉండేవారు.
గత నాలుగైదు రోజుల నుంచి ఉదయాన్నే, ఇంకా హోటల్ వాకిలి ఊడ్చి ముగ్గు పెడుతూ ఉండగానే, ఓ కుర్రాడు హోటల్ బయట ఉన్న అరుగుమీద కూర్చుని, మణయ్యరు గారుండే గదికి రోడ్డుప్రక్క అమర్చిన కిటికీ లోంచి ఆయన చేసుకునే మంత్రానుష్టానమంతా శ్రద్ధగా పరిశీలించడం, మణయ్యరుగారి దృష్టిని దాటి పోలేదు. ఆ రోజు విషయం ఏవిటో తేల్చాలని ఆ కుర్రాడిని లోపలకు పిలిచారు.
“చూడు నాయనా. నాలుగైదు రోజులుగా నన్నే గమనిస్తున్నావు. నీకేమైనా కష్టాలున్నాయా? నా నుంచి ఏమైనా సాయం ఆశించి వస్తున్నావా? మొహమాట పడకుండా చెప్పు.” అన్నారు ఆప్యాయంగా.
“అయ్యరుగారు, నమస్కారం. నా పేరు సుబ్బారావు. నర్రాలశెట్టివారి పాలెంలో రామాలయం దగ్గరే మా ఇల్లు. హెడ్ పోస్టాఫీసు దగ్గర బూర్ల సూర్నారాయణ గారి సూపరు కొట్టు పక్కన నాకు చిన్న బడ్డీ కొట్టు ఉంది. అందులో కిళ్ళీలు అమ్ముకుంటూ ఉంటాను. గత కొంతకాలంగా మీరు మీ మంత్రబలంతో కొందరి జబ్బులు నయం చెయ్యడం గురించి విన్నాను. నాకూ మంత్రాలు నేర్చుకుని, అందరికీ సాయపడాలని ఉంది. కాని,  నేను మీలాగా బ్రాహ్మడిని కాదు, మేము నాయుళ్ళం. కాని, నా మనసులో మంత్రాలు నేర్చుకోవాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది,” అన్నాడు ధృడమైన స్వరంతో.
ఒక్కపెట్టున పెద్దగా నవ్వారు మణయ్యరు గారు. “ నీ అమాయకత్వం చూస్తే నవ్వొస్తోంది. ఇవి నేను గురుముఖతా నేర్చుకున్నవి. ఇవి నాకు ప్రసాదించేటప్పుడు మా గురువుగారు నాకు కొన్ని మాటలు చెప్పారు. అవే నీకు చెప్తాను...
‘ నాయనా ! ఈ లోకంలో మనిషి మేధస్సుకు అందని ఎన్నో విషయాలు ఉన్నాయి. రాముడంతటి వాడు, వాలిని చాటుగా కొట్టాడు, ఎందుకంటావ్? ఎందుకంటే, వాలికి ఎదురుపడి ఎవరైనా పోరాడితే, వారి శక్తిలో సగం శక్తి వాలికి వెళ్ళిపోతుంది. అంటే... వాలి చూపుకు అంత శక్తి ఉంది. దాన్ని భగవంతుడే వాలికి ఇచ్చాడు. అలాగే ‘నర దిష్టికి రాళ్ళు కూడా పగులుతాయన్న’ సామెత నువ్వు వినే ఉంటావు. అటువంటి దృష్టి దోషాలు, నర ఘోష, దడుపు జ్వరాలు, బాలారిష్టాలు, జంతు సంబంధమైన విచిత్ర వ్యాధులు, సర్ప దోషాలు, మనిషి ఉన్నట్టుండి నీరసించే చెడ్డ ప్రయోగాలు, దెయ్యాలు పట్టడాలు, చేతబళ్ళు .... ఇలా ఎన్నో లోకంలో అనాదిగా చెలామణీలో ఉన్నాయి. వాటిని తిప్పికొట్టే మంత్రాలను నువ్వు నేర్చుకోవాలని వచ్చావు. కాని, ఇది నువ్వనుకున్నంత సులువు కాదు. ఇది చెడుపై మంచి చేసే పోరాటం. ఎవరో ఏదో ప్రయోజనం కోసం కష్టపడి ఒక చెడ్డ ప్రయోగం చేసారనుకో ! నువ్వు నీ మంత్రబలంతో దాన్ని తిప్పి కొడతావు. అప్పుడు వారు నీపై కక్ష్య కట్టే అవకాశాలు ఉంటాయి. అందువల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వే కాదు, నీవారికి, నీ కుటుంబ సభ్యులకు కూడా హాని జరగవచ్చు. రాజును కొట్టలేనప్పుడు ఆయన బలగాన్ని కొడుతూ, రాజు మనోబలాన్ని దెబ్బతియ్యడం అనాదిగా వస్తున్న రాజకీయ తంత్రం. వీటన్నింటికీ సిద్ధపడి, ఏ క్షణంలో అయినా పదుగురి మేలు కోసం నీ ప్రాణాన్ని, నీవారిని కూడా పణంగా పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అంతటి మహా త్యాగం చేసే లక్షణం నీలో ఉండాలి. ఆరు నూరైనా, ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా, మంత్రానుష్టానం నియమ నిబంధనలతో, క్రమశిక్షణతో చెయ్యాలి. ఇంకో ముఖ్యమైన విషయం...
ఈ మంత్రాలు ఎంత గమ్మత్తయినవంటే, ఈ మంత్రంతో నయం చేసినందుకు గాను ఎవరి దగ్గరనుంచైనా నువ్వు ఒక్క రూపాయి ఆశించినా, నీకు తెలియకుండా చిన్న పూచికపుల్ల తీసుకున్నా ఈ మంత్రాలు ఇక శాశ్వతంగా పని చెయ్యవు. అంటే... వీటివల్ల నీకు డబ్బు, ఇతర వస్తువులు రావు. అటువంటప్పుడు నువ్వు నియమ నిబంధనలకు కట్టుబడి, ప్రాణాన్ని, నీ వారిని ఒడ్డి, ఇంత త్యాగాన్ని ఎందుకు చెయ్యాలి చెప్పు ? అందరిలాగే హాయిగా వేళకు తిని పడుకోవచ్చుగా ! ఆలోచించు...” అని.
ఇక్కడ కులంతో పనిలేదు. ధైర్యం, తెగువ, నిబద్ధత, నిస్వార్ధం, క్రమశిక్షణ... ఇవే ముఖ్యం. కాని, మంత్రసిద్ధికి సంస్కారం చేసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు చెప్పు... నా దగ్గర సంస్కారం చేసుకుని, జంధ్యం వేసుకుని, ఈ మంత్రాలు నేర్చుకునేందుకు నువ్వు సిద్ధమేనా? కంగారు ఏమీ లేదు, బాగా ఆలోచించుకుని రా, వెళ్లిరా నాయనా!” అని సుబ్బారావును గుమ్మం దాకా సాగనంపారు మణయ్యరు.
నేనూ బాగా ఆలోచించాను. మరి వీటన్నింటికీ సిద్ధపడి మా గురువుగారు కూడా ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు ? మనకోసమే మనం బ్రతికితే జంతు జీవనం అవుతుంది, ఇతరుల కోసం బ్రతకడం మనిషితనం అవుతుంది, అదే పరులకోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తే, అది దైవీక జీవనం అవుతుంది. ఈ లోకంలో జనం కోసం నిస్వార్ధంగా తమ జీవితాల్ని త్యాగం చేస్తున్న ఇటువంటి గురువులు, సాధువులు ఉండబట్టే మంచివాళ్ళు కంటి నిండా నిద్ర పోగలుగుతూ ఉన్నారేమో! మందలో గొర్రెలా వందేళ్ళు బ్రతకడం కంటే, జనం కోసం త్యాగబుద్ధితో ఒక్కరోజు బ్రతికినా చాలని నాకు అనిపించింది. అదే నిర్ణయాన్ని మర్నాడుఆయనకు చెప్పి, ఆయన వద్ద ఎన్నో కష్టాలకు ఓర్చి, ఈ మంత్రాలు నేర్చుకున్నాను.
ఆ మర్నాడు ఉదయమే తాను వీటన్నింటికీ సిద్ధమంటూ వచ్చాడు సుబ్బారావు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, నెలరోజుల పాటు అతడి చిత్తశుద్ధిని పరీక్షించారు మణయ్యరు. చివరికి అతనికి సంస్కారం చేసి, దీక్ష ఇచ్చి, మంత్రాలు నేర్పారు. చాలా శ్రద్ధగా మంత్రాలన్నీ అనుష్టానం చెయ్యడం మొదలు పెట్టిన సుబ్బారావు అచ్చం మణయ్యరు లాగానే విభూతి రేఖలు, మధ్యన కుంకుమ పెట్టుకుని, చూసేందుకు ఒకింత భయం గొలిపేలా తయారయ్యాడు. కోపం కూడా ఎక్కువగానే ఉండేది. కాని, పద్దతిగా ఉండేవాడు, అతని మాట వెన్న, మనసు వెన్న. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే కరిగిపోయేవాడు. ‘దయను మించిన దైవం లేదు...’ అన్న చందంగా ఉండేది అతని వైఖరి.
వారమంతా జీవిక కోసం వ్యాపారం, ఆదివారం మాత్రం ఇతరుల సమస్యల్ని అదే బడ్డీ కొట్లో పరిష్కరించేందుకు రక్షలు, తాయత్తులు ఇచ్చే వ్యవహారం... ఇలా కొనసాగేది సుబ్బారావు జీవితం. అమావాస్యకి, పౌర్ణమికి తప్పనిసరిగా సముద్రానికి వెళ్లి, స్నానం చేసి, మంత్రాల్ని పునశ్చరణ చేసుకుని వచ్చేవారు.
మాయాబజార్ మట్టిగుంట వారి దొడ్లో ఎప్పటినుంచో ఒక పెద్ద పాము చేరింది. పడగెత్తి, కసిగా అది బుసలు కొడుతుంటే, పనివాళ్ళతో సహా దొడ్డి గుమ్మం తెరిచి అటు అడుగు పెట్టాలంటేనే భయపడేవారు. అదేమి చిత్రమో, పాములు పట్టే వాళ్ళని తీసుకొచ్చి ఎంత ప్రయత్నించినా అది దొరికేది కాదు. మర్నాడు మళ్ళీ వచ్చేసేది. విసిగిపోయిన ఆ ఇంటాయన  ఒకసారి సుబ్బారావు కొట్టు దగ్గరకి వచ్చినప్పుడు ఎవరితోనో ఆ సంగతి చెబుతుంటే విన్న సుబ్బారావు, ఆ సమస్య తాను పరిష్కరిస్తానని చెప్పాడు. ఒక ఆదివారం నాడు రమ్మని, మంత్రించిన ఇసుక కలిపి, ఇల్లంతా, ఇంటి బయట జల్లమని ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పాము కనబడితే ఒట్టు ! సాయబుల వీధిలో హమీదుల్లాకు పుట్టిన కొడుకు అసలు పాలే తాగేవాడు కాదు. నిద్రపడితే చాలు అస్తమానూ ఉల్లికిపడి లేచి, ఏడుస్తూనే ఉండేవాడు. ఆదివారం నాడు సుబ్బారావు మంత్రించి ఇచ్చిన తాయత్తు కట్టగానే... చిత్రంగా బాబు మామూలైపోయాడు. బస్టాండు ఎదర ఉండే మద్దుల వాళ్ళ గేదె ఈని వారమైనా ఒక్క చుక్క పాలు కూడా ఇవ్వలేదు. సుబ్బారావు ఏదో మంత్రించిన తాడు ఇవ్వగానే, లీటర్ల కొద్దీ పాలు ఇవ్వసాగింది. ఇలా   బాలారిష్టాలు, జంతువుల సమస్యలు, దయ్యాలు పట్టడాలు, అంతుబట్టని అనారోగ్యాలు, దడుపు జ్వరాలు, భయాలు, వీటన్నింటికీ సుబ్బారావు మంత్రాలు అమృత గుళికల్లా పనిచేసేవి. అలా సుబ్బారావు పేరు ముందు ‘మంత్రాల’ చేరిపోయి, అతని ఇంటి పేరు మారిపోయి, ‘మంత్రాల సుబ్బారావు’ గా పేరొచ్చేసింది.
కొన్నాళ్ళకి సుబ్బారావు కిళ్ళీ కొట్టు అతను మంత్రాలు నేర్చుకున్న చలం గారి హోటల్ అరుగు బయటకు మారింది. ఆదివారం వస్తే చాలు జనం కొట్టు బయట బారులు తీరేవారు. ఎప్పటికీ తగ్గని మొండి పార్శ్వ నొప్పికి ఒక అరుదైన వైద్యం చేసేవాడు సుబ్బారావు. మనిషిని ఎండలో నిల్చోపెట్టి, వాళ్ళ నీడ తలకు మేకు కొట్టేవాడు. అంతటితో తలనొప్పి మాయమయ్యేది.
క్రమంగా మంత్రాల సుబ్బారావు పేరు చుట్టుప్రక్కల ఊళ్లకు పాకింది. పక్క ఊళ్ళ నుంచి పెద్ద పెద్ద కామందులు, జమీందార్లు వచ్చినప్పుడు హోటల్ నుంచి కాఫీలు తెప్పించేందుకు ఓ కోమటి కుర్రాడిని పెట్టుకున్నాడు సుబ్బారావు. తనవద్దకు వచ్చే జనాన్ని వచ్చేటప్పుడు కొబ్బరికాయ, నిమ్మకాయలు, వంటివి తెచ్చుకోమని చెప్పి, వాటిని మంత్రించాకా తిరిగి వాళ్ళకే ఇచ్చేసేవాడు. ఒక్కోసారి సమస్యను బట్టి, హారతి కర్పూరం, సాంబ్రాణి వంటివి తెచ్చుకోమని పంపేవాడు. సమయానికి అవన్నీ దొరక్కపోతే, వచ్చే వారందాకా వాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చేది.
ఈ సమస్య తీరేందుకు కోమటి కుర్రాడిని తన పక్కనే ఒక పొడవాటి బల్ల వేసుకొమ్మని చెప్పి, దాని మీద అతను మొలతాళ్ళు, విభూది కాయలు, తాయత్తులు, సాంబ్రాణి, కర్పూరం వంటివి పెట్టుకుని అమ్ముకునే ఏర్పాటు చేసాడు సుబ్బారావు. అతనికి వచ్చిన సొమ్ములో కూడా ఒక్క రూపాయి ముట్టలేదు.
నెమ్మదిగా చలంగారి ‘రామకృష్ణా భోజన హోటల్’ స్థానంలో ‘మీనాక్షి భవన్’ అన్న కొత్త హోటల్ వెలసింది. చూస్తుండగానే, ఆ కోమటి కుర్రాడు పెద్ద శెట్టిగా మారి కొట్లు, మేడల మీద మేడలు కట్టాడు. కాని, సుబ్బారావు పధ్ధతి మారలేదు. ఏ వైద్యానికి అందని జాడ్యాలన్నీ తన మంత్రాలతో ప్రతీ ఆదివారం నివారించేవాడు. అలా మంత్రాలు వేస్తూనే... అతని ఇద్దరు కూతుళ్ళ, ఒక్కగానొక్క కొడుకు పెళ్ళిళ్ళు చూసి, మనవలతో ఆడుకుని, ముదిమి వయసులో కన్నుమూసాడు సుబ్బారావు.
***
“ఇదీ కధ... ఇదేదో కట్టు కధ కాదు. మా బాపట్లలో ఆంజనేయస్వామి గుడి దగ్గరకు వెళ్లి ఆరా తీస్తే, ఎవరైనా ఇది వాస్తవమేనని చెబుతారు. ఇప్పుడు చెప్పు అనుపమా ! టీవీ లు రాకముందు నుంచీ మోసగాళ్ళు ఉన్నారు, త్యాగనిరతులూ ఉన్నారు. కాని, టీవీలు ప్రత్యేకించి మోసగాళ్లనే చూపిస్తూ డబ్బు చేసుకుంటున్నాయి. దానివల్ల నీవంటివారు కొన ఊపిరితో ఉన్న నమ్మకాలకు కూడా తిలోదకాలు ఇస్తున్నారు. అందుకే అందరినీ ఒక్క తాటిన కట్టేముందు కాస్త ఆలోచించు. కనీసం, వాళ్ళు చేసిన త్యాగానికైనా మనం వారికి మర్యాద ఇవ్వాలి కదా !”


“నిజమే... వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఆ మంత్రాల సుబ్బారావు గారు ఎంత గొప్పవారో కదా... “ అంది  అప్రయత్నంగా చేతులు జోడిస్తూ అనుపమ.

No comments:

Post a Comment

Pages