ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య ప్రణీత -మను చరిత్రము -3
(కళా ఖండానికి ఒక పామరుడి ప్రశంస)
బాలాంత్రపు వేంకట రమణ
శీలంబున్ గులమున్ శమంబు దమముం జెల్వంబు లేబ్రాయమున్
బోలంజూచి ఈతండు పాత్రుడని యే భూపాలు డీ వచ్చినన్
సాలగ్రామము మున్నుగా గొనడు - మాన్యక్షేత్రముల్ పెక్కు చం
దాలం బండు నొకప్పుడుం దఱుగ దింటం బాడియుం బంటయున్
అతడి శీలాన్ని చూసి, కులాన్ని చూసి, అంతరింద్రియ నిగ్రహాన్ని (శమము) గమనించి, బాహ్యేంద్రియ నిగ్రహాన్ని (దమము) గుర్తించి, సౌందర్యాన్ని (చెల్వంబు) వీక్షించి, లేత వయస్సుని పరిశీలించి - ఆహా ఇంత చిన్న వయస్సులోనే ఈతడు ఎంత ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉన్నాడు! అని గుర్తించి మెచ్చుకొని - ఏ రాజుగారైనా ఏదైనా ఇవ్వడానికి వస్తే (ఈన్ వచ్చినన్) ప్రవరుడు అంగీకరించేవాడు కాదు. కనీసం సాలగ్రామ దానమైన స్వీకరించేవాడు కాదు.
దానం పట్టినవాడు ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. సాలగ్రామం మాత్రం విష్ణుస్వరూపం. ఇది దాతకీ ప్రతిగ్రహీతకీ కూడా శుభప్రదం. కాబట్టి దీనికి ప్రతిగ్రహీత ప్రాయశ్చిత్తం చేసుకోనవసరం లేదు. అయినా దాన్ని కూడా స్వీకరించేవాడు కాదుట. అప్రతిగ్రహం - పరులసొమ్ము ఏదీకూడా స్వీకరించకూడదు అనేది - ప్రవరుడికి ధృఢమైన నియమం.
ఇంక అతని భార్య ఎంతటి అనుకూలవతి అంటే -
వండనలయదు వేవురు వచ్చిరేని
నన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి
యతిథు లేతేర నడికి రేయైన బెట్టు
వలయు భోజ్యంబులింట నవ్వారి గాగ.
ఒక్క సారిగా వెయ్యిమంది (వేవురు) భోజనాలకు వచ్చినా ఆవిడ వండటానికి అలిసిపోదు. బద్ధకించదు. అన్నపూర్ణాదేవికి సాటివస్తుంది (ఉద్దియౌ) అతని భార్య (గృహిణి). అతిథులు అర్థరాత్రి వేళ వచ్చినాసరే వండిపెడుతుంది. కావలసిన పదార్థాలు ఇంటిలో ఎప్పుడూ సమృద్ధిగా (అవ్వారిగాగన్) ఉండటంతో సోమిదమ్మగారు సాక్షాత్తూ అన్నపూర్ణ అయ్యింది. యఙ్ఞం చేసినవాడు సోమయాజి; అతని భార్య సోమిదమ్మ.
తీర్థ సంవాసు లేతెంచినారని విన్న
నెదురుగా నేగు దవ్వెంత యైన
నేగి తత్పదముల కెఱగి యింటికి దెచ్చు
దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు
నిచ్చి యిష్టాన్న సంతృప్తులగా జేయు
జేసి కూర్చున్నచో జేరవచ్చు
వచ్చి యిద్ధరగల్గు వనధి పర్వత సరి
త్తీర్థ మాహత్మ్యముల్ దెలియ నడుగు
నడిగి యోజన పరిమాణ మరయు, నరసి
పోవలయు జూడ ననుచు నూర్పులు నిగుడ్చు
ననుదినము తీర్థ సందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి.
తీర్థయాత్రలు చేసినవారెవరైనా అరుణాస్పదం వైపు వస్తున్నారని తెలిస్తే చాలు, ఎంత దూరమైనా ఎదురువెళతాడు. వెళ్ళి వారి పాదాలకు నమస్కరిస్తాడు, నమస్కరించి (ఎఱగి) ఇంటికి ఆహ్వానించి తీసుకు వస్తాడు. తెచ్చి మంచి భక్తితో ఆతిథ్యం ఇస్తాడు. ఇచ్చి వారికి నచ్చిన భోజన పదార్ధాలు వండించి పెట్టి వారిని సంత్రుప్తుల్ని చేస్తాడు (ఇష్టాన్నసంతృప్తుల్నిగాజేయు. చేసి వారు విశ్రాంతిగా కూచున్న సమయంలో దగ్గరకి చేరతాడు. చేరి - ఈ భూమి మీద ఉన్న (ఈ ధరన్ కలుగు) సముద్రాలు, పర్వతాలు, నదులు (సరిత్) తీర్థాలు, వాటి మహత్తులూ తెలియజెప్పమని అడుగుతాడు. వారు చూసినవి చెబుతారు. అవి ఇక్కడికి ఎన్ని యోజనాలదూరంలో ఉన్నాయో అడిగి తెలుసుకొంటాడు. అరసి - నేనుకూడా చూడటానికి వెళ్ళాలి అంటూ నిట్టూర్పులు విడుస్తాడు (చూడన్ పోవలయుననుచు ఊర్పులు నిగుడ్చున్).
తరుణవయస్సులో ఉన్న ఆ నిత్యాగ్నిహోత్రుడి మనస్సులో ఎప్పుడూ ఒకటే కోరిక. వెళ్ళాలి, తీర్థాలు సందర్శించాలి అనే అభిలాష రోజురోజుకీ ఆత్మలో ఉప్పొంగుతోంది.
ఈ విధముగ నభ్యాగత
సేవా పరతంత్ర సకల జీవనుడై భూ
దేవ కుమారకు డుండం
గా విను మొకనాడు కుతపకాలము నందున్
(కుతప కాలము = దివసాష్టమ భాగం లేదా ముహూర్తం చూ: శబ్దకల్పద్రుమః)
"అభ్యాగతః స్వయం విష్ణుః" అన్నారు కనక అతిథి అభ్యాగతుల్ని ఈ విధంగా సేవించడానికే అంకితమైన సమస్త జీవితమూ కలవాడై ఆ యువ బ్రాహ్మణుడు కాలక్షేపం చేస్తూ ఉండగా - ఒక నాడు కుతపకాలంలో ఏం జరిగిందంటే - విను.
మార్కండేయ పురాణ కథను మార్కండేయుడు క్రోష్టికి చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ విను అంటే క్రోష్టిని సావధానంగా వినమని హెచ్చరిక. ఉత్కంఠను పెంచే అంశం రాబోతోంది కనక ఈ హెచ్చరిక.
కుతపకాలం అంటే ఏది అని చాలా చర్చలు జరిగాయి. మధ్యాహ్నం రెండు గంటల వేళ అని కొందరన్నారు. అప్పుడు బయలుదేరిన ప్రవరుడు తరువాత కథలో హిమాలయాలకు వెళ్ళి అక్కడ చాలా ప్రాంతం చూసి - పయి పయిన్ మధ్యాహ్నముందెల్పెడిన్ కాబట్టి ఇప్పటికి ఇంటికి వెళ్ళిపోతాను, మిగతా విశేషాలు రేపు వచ్చి చూస్తాను - అనుకుంటాడు. మరి అప్పుడు మిట్ట మధ్యాహ్నం అయిందంటే ఇంటిదగ్గర బయలుదేరిన వేళ మధ్యాహ్నం రెండు గంటల సమయం ఎలా అవుతుంది? కాబట్టి కుతపవేళ అంటే ఇంకా ముందే అయి ఉండాలి అని మరికొందరు భావించారు.
సరే, ఇంతకీ ఆ కుతపకాలంలో ఎం జరిగిందంటే –
ముడిచిన యొంటి కెంజడ మూయ మువ్వన్నె
మెకము తోలు కిరీటముగ ధరించి
కకపాల కేదార కటక ముద్రిత పాణి
గుఱుచ లాతాముతో గూర్చి పట్టి
యైణేయమైన యొడ్డాణంబు లవణిచే
నక్కళించిన పొట్ట మక్కళించి
యారకూటచ్చాయ నవఘళింపగ జాలు
బడుగు దేహంబున భస్మమలది
మిట్టయురమున నిడుయోగపట్టెమెఱయ
జెవుల రుద్రాక్ష పోగులు చవుకళింప
గావి కుబుసంబు జలకుండియును బూని
చేరె దద్గేహ మౌషధ సిద్ధు డొకడు
ఒక ఔషధ సిద్ధుడు ఆ ప్రవరుడి ఇంటికి (తద్ గేహము ; గృహము ప్రకృతి, గేహము వికృతి) వచ్చాడు. హఠాత్తుగా ఊడి పడ్డాడు. సరాసరి ఇతడి ఇంటికి వచ్చాడు (ఈ రెండు కారణాలవల్లా - ఒకప్పుడు వరూధినిచేత తిరస్కృతుడైన గంధర్వుడే ఇక్కడికి సిద్ధుడుగా వచ్చాడనీ, ఆనక అతడే మాయాప్రవరుడయ్యాడనీ కొందరు ఊహించారు.)
అలా వచ్చిన సిద్ధుడి వేషం చిత్రంగా ఉంది.
తైల సంస్కారం లేక రాగిరంగుకి (ఎరుపు) మారిపోయిన ఒంటి జడ (కెంపు+జడ = కెంజడ) దాన్ని కప్పుతూ పులితోలు (మువ్వన్నె మెకము = మూడు రంగుల్లో ఉండే మృగం = పెద్దపులి, మువ్వన్నె మెకము తోలు=పులితోలు) కిరీటంగా ధరించాడు.
ఒక చేతిలో సంచి (కకపాల) పట్టుకున్నాడు. ఆ చేతికే కేదార కటకం (పంచలోహాలతో శివలింగముద్రతో ఉన్న కడియం లేదా కంకణం) ఉంది. అర్థచంద్రాకారముఖం గల ఒక పొట్టి దండాన్ని (కుఱచలాతాము), అదే చేతిచంకలో కూర్చి దగ్గరగా పట్టుకున్నాడు. జపమాల తిప్పేటప్పుడు చేతికింద బోటుగా ఉపయోగించే యోగదండం కావచ్చునిది (లాతము రూపాంతరం).
దుప్పితోలుని (ఏణి=ఆడలేడి, ఐణేయం=ఆడలేడితోలుతొ చేసింది) ఒడ్డాణంగా ధరించాడు. వెన్నుకి అంటుకుపోయిన పొట్టను (అక్కళించిన పొట్టన్) ఆ తోలుపట్టా బిగింపుతో (లవణిచేన్) లావుగా ఉబ్బించి కనిపించేటట్టు చేసుకున్నడు (మక్కళించి=లావెక్కించి).
ఇత్తడి రంగులో ఉన్న (ఆరకూట+ఛాయ) సన్నని దేహం (బడుగు దేహం - బక్క శరీరం) నిండా విభూతి పులుముకున్నాడు. ముందుకు పొడుచుకువచ్చి ఎత్తుగా ఉన్న రొమ్ము మీద (మిట్ట ఉరమున) పొడవైన యోగపట్టె జందెంలా వేలాడుతోంది. చెవులకి రుద్రాక్షపోగులు చవుకళిస్తున్నాయి (ఊగిసలాడుతున్నాయి). కావిరంగు కుబుసాన్ని (పొడుగాటి కావిచొక్కా) ధరించాడు. (కూర్పాసము=కుబుసము) జలకుండికను (కమండలువో తాబేటికాయలాంటిదో) పట్టుకున్నాడు.
ఇలాంటి రూపంతో ఒక ఔషధసిద్ధుడు ప్రవరుడి ఇంటికి హఠాత్తుగా వచ్చాడు.
ఇంటికి వచ్చిన సిద్దుడికి ప్రవరుడు భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అర్ఘ్యపాద్యాలను సమర్పించాడు. ఇష్ట మృష్టాన్న కలన సంతుష్టుని చేసి ఇలా సంభాషిస్తున్నాడు.
మీ మాటలు మంత్రంబులు
మీ మెట్టిన యెడ ప్రయాగ, మీ పాద పవి
త్రామల తోయము లలఘు
ద్యొమార్గ ఝరాంబు పౌనరుక్త్యములుర్విన్
స్వామీ! మీ మాటలే మంత్రాలు. మీరు కాలుపెట్టినచోటు ప్రయాగ (అంతటి పవిత్రస్థలం అని). మీ కాళ్ళు కడిగిన నీళ్ళు ఆకాశ గంగాజలానికి (ద్యోమార్గఝరి) భూమిమీద పునరుక్తులు. వాటికంటే రెట్టింపు పవిత్రమైనవి అని. లఘు అంటే చిన్న; అలఘు: చిన్నదికానిది, గొప్పది.
మౌనినాథ! కుటుంబ జంబాల పటల
మగ్న మాదృశ గృహమేధి మండలంబు
నుద్ధరింపగ నౌషధ మొండు గలదె!
యుష్మదంఘ్రి రజోలేశ మొకటి దక్క
ఓ మునీశ్వరా! సంసార రూపమైన పెద్ద బురదగుంటలొ (జంబాల పటలం) మునిగిపోతున్న మావంటి గృహస్థుల్ని ఉద్ధరించాలంటే మీ దివ్య పాదరజోలేశం (కాలి దుమ్ము కణం) తప్ప మరొక ఔషధం ఉందా?
నావిని ముని ఇట్లను - వ
త్సా! విను మావంటి తైర్థికావళికెల్లన్
మీ వంటి గృహస్థుల సుఖ
జీవనమున గాదె తీర్థసేవయు దలపన్
సిద్ధుడు ప్రవరుడితో గృహస్థాశ్రమం ఎంత ప్రసస్తమయినదో వివరిస్తున్నాడు.
కెలకుల నున్న తంగెటి జున్ను గృహమేధి
యజమానుడంక స్థితార్ధ పేటి
పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు
దొడ్డి బెట్టిన వేల్పుగిడ్డి కాపు
కడలేని యమృతంపు నడబావి సంసారి
సవిధ మేరు నగంబు భవన భర్త
మరుదేశ పథ మధ్యమప్రప కులపతి
యాకటి కొదవు సస్యము కుటుంబి
బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి
జటి పరివ్రాజకాతిధి క్షపణ కావ
ధూత కాపాలికాద్యనాధులకు గాన
భూసురోత్తమ ! గార్హస్త్యమునకు సరియె !
ఓ బ్రాహ్మణోత్తమా! ఆశ్రమాలు నాల్గింటిలోకీ గృహస్థాశ్రమమే (గార్హస్త్యము) గొప్పది. తక్కిన అన్ని ఆశ్రమాలవారికీ ఇదే ఆధారం. చెవిటి, కుంటి (పంగు), గ్రుడ్డి, భిక్షువులు, బ్రహ్మచారులు, జటి (వానప్రస్థులు), పరివ్రాజకులు (సన్యాసులు), అతిథులు, క్షపణకులు (బౌద్ధ భిక్షువులు), అవధూతలు (దిగంబరులు), కాపాలికులు (శాక్తేయులు) - ఈ మొదలైన అనాథులకు అందరికీ గృహమేథి (యజమానుడు, వాస్తవ్యుడు, కాపు, సంసారి, భవన బర్త, కులపతి, కుటుంబి – ఇవన్నీ గృహస్థుకి పర్యాయపదాలు) దగ్గరలో ఉన్న తంగేటిజున్ను లాంటివాడు (చేతితో తీసుకోవచ్చునని) ఒడిలో ఉన్న ధనపేటిక (డబ్బుపెట్టి), పెరటిలో ఉండి పండిన కల్పవృక్షం, దొడ్డిలో కట్టేసుకున్న కామధేనువు (వేల్పుగిడ్డి) అంతులేని అమృతకూపం, అందుబాటులోఉన్న మేరుపర్వతం, ఎడారిదారిలో (మరుదేశపథం) చలివేంద్రం (ప్రప). ఆకలికి అమిరే పంట - అన్నీ అభేద రూపకాలు.
ఇంత గొప్పది గృహస్థాశ్రమం. గృహమేథిగా ఉంటూ నువ్వు సన్యాసుల్ని మమ్మల్ని పొగుడుతావేంటి, పిచ్చివాడా! అని సిద్ధుడి అభిప్రాయం.
మీరు ఏమేమి ప్రదేశాలు దర్శించి వచ్చారు స్వామీ? ఆని ప్రవరుడు అడిగినదానికి, సిద్ధుడు ఇలా బదులు చెబుతున్నాడు.
ఓ చతురాస్య వంశ కలశోదధి పూర్ణ శశాంక! తీర్థయా
త్రాచణశీలినై జనపదంబులు, పుణ్యనదీనదంబులున్
జూచితి నందు నందుఁగల జోద్యములున్ గనుఁగొంటి నాపటీ
రాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబుగన్
చతురాస్యుడు - నాలుగు ముఖాలు కలవాడు - బ్రహ్మ. ఆ వంశం అనే క్షీరసముద్రం (కలశ + ఉదధి). ఆ సముద్రానికి పూర్ణచంద్రుని వంటి వాడా ! అని ప్రవరుణ్ణి సంబొధించాడు. పున్నమిచందమామను చూస్తే సముద్రం ఉప్పొంగుతందిట. అలా ప్రవరుడు ఉదయించినందువల్ల అతడి వంశం సంతోషతరంగితమయ్యిందని భావం. చంద్రుడు క్షీరసముద్రంనుంచి జన్మించాడని క్షీరసాగర మథనకథ. బ్రాహ్మణవంశం అనే క్షీరసముద్రం నుంచి ప్రవరుడు అనే పూర్ణ శశాంకుడు జన్మించాడు.
ఈ సుధీర్ఘ సంబోధన సిద్ధుడికి ప్రవరుడిపై కలిగిన ఆదరాతిశయాన్ని సూచిస్తుంది.
చణుడు అంటే నేర్పరి. వ్యాకరణ చణుడు అంటే వ్యాకరణంలో నేర్పరి - పండితుడు అని. మహాకవి శ్రీ శ్రీ ఒకచోట "హింసనచణ ధ్వంస రచన" అన్నారు.
తీర్థాయత్రాచణుడంటే, తీర్థయాత్రలు చెయ్యడంలో నేర్పరితనం కలవాడు. అదే శీలంగా, అదే పనిగా, జనపదాలూ, పవిత్ర నదీ నదాలూ (తూర్పునకు ప్రవహించేవి నదులు, పశ్చిమానికి ప్రవహించేవి నదాలు) అన్నీ తిరిగాను. ఆయా చోట్లగల వింతలు (చోద్యాలు) చూశాను. తెలుసుకున్నాను. ఎంతదేశం తిరిగానంటే మలయాద్రి, పశ్చిమాద్రి, హిమాద్రి, పూర్వాద్రి సరిహద్దులుగా మధ్యలో ఉన్నదేశంలో అన్ని జనపదాలూ, అన్ని నదీ-నదాలూ దర్శించాను. పటీరం అంటే మంచిగంధం. దక్షిణదిక్కున మలయ పర్వతం ఉంది. దానిమీద మంచి గంధం చెట్ట్లు ఎక్కువగా ఉంటాయని కవుల వర్ణన. అందుకని మలయ పర్వతాన్ని పటీరాచలం అంటారు.
ఆకర్ణాంతం అంటే చెవిదాకా. ఆశాంతం అంటే దిక్కు చివరిదాకా. అలాగే ఆ పటీరాచల, పశ్చిమాచల....అంటే ఆయా పర్వతాలచివరిదాకా అని.
కేదారేశు భజించితిన్, శిరమునన్ గీలించితిన్ హింగుళా
పదాంభోరుహముల్, ప్రయాగ నిలయుం బద్మాక్షు సేవించితిన్,
యాదోనాధసుతాకళత్రు బదరీ నారయణుం గంటి, నీ
యా దేశంబన నేల? చూచితి సమస్తాశావకాశంబులన్
కేదారేశ్వరుణ్ణి సేవించాను. హింగుళాదేవి పాదపద్మాలు శిరస్సున కీలించాను. శిరస్సు ఆన్చి నమస్కరించానని. ప్రయాగనిలయుడైన పద్మాక్షుణ్ణి భజించాను. బదరీనారాయణుడు - క్షీరసముద్రరాజతనయ యొక్క పతిని దర్శించాను. (యాదస్ = నీరు, యాదోనాధుడు = సముద్రుడు. యాదోనాథుని సుత = లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కళత్రంగా - భార్యగా కలవాడు - విష్ణుమూర్తి).
ఈ దేశమూ, ఆ దేశమూ ఏమిటి, అన్ని దిక్కులా అన్ని భాగాలనూ అన్ని ప్రాంతాలనూ చూసాను. (సమస్త + అశా = దిక్కు + అవకాశంబులన్ = ప్రాంతాలను, మధ్యభాగాలను).
దివి బిసరుహబాంధవ సైం
ధవ సంఘం బెంత దవ్వు దగలే కరుగున్
భువి నంత దవ్వు నేమును
ఠవఠవలే కరుగుదుము హుటాహుటి నడలన్
బిసము అంటే తామరతూడు. దానినుంచి పుట్టింది బిసరుహం = పద్మం. పద్మబాంధవుడు - సూర్యుడు. సూర్యోదయంకాగానే పద్మాలు వికసిస్తాయి కనక. సైంధవం అంటే గుఱ్రం. సూర్యుడి రధాశ్వాలు ఏడూ ఆకాశంలో దప్పిక (దగ) అనేది లేకుండా ఎంత దూరం (దవ్వు) వెడతాయో - మేమూ (ఏమును) భూమి మీద అలసట (ఠవఠవ) అనేది లేకుండా హుటాహుటి ప్రయాణాలతో వెళ్ళగలం.
సూర్యుడు ఆకాశంలో ఈ చివరినుంచి ఆ చివరికి ప్రయాణిస్తాడు. అలాగే మేమూ ఒక్క రోజులో భూగోళం మీద ఈ చివరినుంచి ఆ చివరికి వెళ్ళగలం అని పాదలేపన ప్రభావాన్ని నాటుకొనేటట్ట్లు చెప్పాడు.
ఆ మందిడి యత డరిగిన
భూమీసురు డరిగెఁ దుహిన భూధర శృంగ
శ్యామల కోమల కానన
హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్షన్
ఆ మందు పులిమి ఆ సిద్ధుడు అలా వెళ్ళగానే, భూమిసురుడు ప్రవరుడుకూడా వెళ్ళాడు. హిమాలయాలకు వెళ్ళాడు. తుహినం అంటే మంచు. భూధరం అంటే పర్వతం. తుహిన భూధరము మంచుకొండ. ఆ కొండ కొమ్ముల మీద (శృంగం), పచ్చగా (శ్యామలం) కోమలంగా ఉండే కాననాలు, బంగారు గుహలు (దరీ) సెలయేళ్ళు (ఝరీ) - వీటిని వీక్షించాలనే అపేక్షతో వెళ్ళాడు.
భూధర శృంగ శ్యామల కోమల కానన హేమాఢ్యదరీ ఝరీ నిరీక్షాపేక్షన్.. కొండకొమ్ముల ఎత్తుపల్లలూ సెలయేళ్ళ వంకర టింకరలూ స్ఫురించేటట్టు కట్టిన సమాసమిది.
ఈ క్రింది పద్యంలో ఇది ఇంకా బాగా స్ఫురిస్తుంది.
అటఁజని కాంచె భూమిసురుఁడంబర చుంబి శిర స్సరీ జ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
ఇది తెలుగు సాహిత్యంలో బహు ప్రసిద్ధి గాంచిన పద్యం. ప్రవరుడు సిద్ధుడిచ్చిన పాదలేపన ప్రభావంతో తలుచుకోగానే హిమాలయపర్వతం చేరుకున్నాడు.
ఆకాశాన్ని తాకుతున్న (అంబరచుంబిత) కొనలనుండి (శిరః) ప్రవహిస్తున్న (సరత్) సెలయేళ్ళమొత్తము నందు (ఝరీపటల) మాటిమాటికీ (ముహుర్-ముహుర్) దొరలుతున్న (లుఠత్), అడ్డులేని (అభంగ) కెరటాలచే (తరంగ), మృదంగధ్వనులతో (నిస్స్వన) వెల్లడి అవుతున్న (స్ఫుట), నాట్యం చేయడానికి అనుకూలంగా ఉన్న (నటనానుకూల) విచ్చుకున్న (పరిఫుల్ల) పింఛములుగల (కలాప) నెమిళ్ళ సమూహము కలదానిని (కలాపి జాలమున్), ఆ ప్రాంతమునందు (కటక) సంచరించుచున్న (చరత్) ఆడ ఏనుగుల (కరేణు) తొండాలచేత (కర) కదలింపబడుతున్న (కంపిత) సాలవృక్షమున్ (మద్దిచెట్లు) – ఇలాంటివాటిని కలిగియున్న హిమగిరిని (శీతసలమున్) – అక్కడికి అటన్, చని – వెళ్ళి, కాంచెను.
అక్కడ ఆకాశాన్నంటుతున్న శిఖరాలనుండి పడుతున్న జలపాతాల్నీ, సెలయేళ్ళనీ చూశాడు. అవి ఎడతెరిపిలేకుండా ప్రవహిస్తున్నాయి. లయబద్ధంగా ఉన్న వాటి ప్రవాహ ధ్వనులు మృదంగధ్వనుల్లా వినబడుతున్నాయి. నీటితుంపర్లు అన్నిదిక్కులకీ తుళ్ళుతున్నాయి. వాటినిచూసి పులకించిన నెమళ్ళు గుంపులు గుంపులుగా పురులు విప్పుకుని నాట్యం చేస్తున్నాయి. ఆ పర్వతమధ్య ప్రదేశమంతా చెట్ట్లూ చేమలతొ అరణ్యంలా ఉంది. ఆడ ఏనుగులు (కరేణులు) గొప్ప మద్దివృక్షాల్ని (సాలమున్) కదిలించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నయి. అలాంటి సౌందర్యాలతో శోభిల్లుతున్న హిమవత్పర్వతాన్ని (శీతశైలమున్) ప్రవరుడు చూశాడు.
ఇక్కడ ఆడ ఏనుగులు ఎంత ప్రయత్నించినా ఆ మద్ధివృక్షాలు చలించడం లేదు అన్నాడు. భావిసూచన. త్వరలో వరూధిని అనే ఆడ మదగజం ప్రవరుణ్ణి నైతికంగా కూల్చడానికి ప్రయత్నించబోతోంది. కానీ ప్రవరుడు సాలవృక్షంలాగా చలించకుండా నిలబడ్డాడు.
ప్రకృతిసౌందర్యంతో పరవశం కలిగించే దృశ్యాలే కాదు, హిమలయాల్లో ప్రవరుడు కొన్ని పవిత్రమైన పురాణఘట్టాలకి నెలవైన ప్రదేశాలు కూడా చూశాడు.
నిడుద పెన్నెఱిగుంపు జడగట్ట సగరుము
మ్మనుమండు తపము గైకొనిన చోటు
జరఠకచ్ఛప కులేశ్వరు వెన్ను గాన రా
జగతికి మిన్నేఱు దిగినచోటు
పుచ్చడీకతనంబు పోఁబెట్టి గిరికన్య
పతిఁ కొల్వ నాయాసపడిన చోటు
వలరాచరాచవాఁ డలికాక్షు కనువెచ్చఁ
గరఁగిన యలనికరపుఁ జోటు
తపసి ఇల్లాండ్ర చెలువంబు దలఁచి తలఁచి
మున్ను ముచ్చిచ్చును విరాళిగొన్న చోటు
కనుపపులు వేల్పుఁబడ వాలుఁ గన్న చోటు
హర్షమునఁ జూచి ప్రవరాక్షుఁ డాత్మలోన.
సగరచక్రవర్తి మునిమనుమడు (ముమ్మనుమండు) భగీరధుడు ఆకాశగంగని భూమి మీదికి ఘోరమైన తపస్సు చేసిన చోటు చూసాడు. అలా తపస్సు చేసినప్పుడు అతని నిడుపయిన నిగనిగలాడుతున్న తలవెండ్రుకలు (నిడుద పెన్నెఱి గుంపు) జడలు బాగా కట్టాయి. ఆకాశగంగ భూమి మీద పడినప్పుడు ఆ ధారాపాతానికి భూమి విచ్చుకుని భూమిని మోస్తున్న ముదుసలి (జరఠ) ఆదికూర్మము (ఆది కచ్ఛప కులెశ్వరు) యొక్క వీపు కూడ కనిపించిందిట. అలా ఆకాశగంగ భూమి మీద పడినచోటు; కన్నెసహజమైన సిగ్గుని (పుచ్చడీకతనంబు) విడిచిపెట్టి (పోబెట్టి) పార్వతీ దేవి పరమశివుణ్ణి పతిగా బడయటంకోసం ఆయాసపడిన, శ్రమపడిన - తపస్సు చేసిన - ప్రదేశమూ; మన్మధుడు (వలరాచరాచవాడు) శివుని (ఫాలాక్షు) కంటిమంటచే కాలిబూడిదయిపోయిన (కరగిన) ఆ జాలికలిగించే చోటూ (అల కనికరపుచోటు); సప్తఋషుల భార్యల (తపసి ఇల్లాండ్ర) అందాన్ని (చెలువంబు) చూసి, స్మరించి స్మరించి (తలచి తలచి) (మునిపత్నులను కామించడం యుక్తంకాదని తెలిసి కూడా, ఎట్టకేలకి ఇక ఉండబట్టలేక తెగించి, ముచ్చిచ్చును (అగ్నిదేవుణ్ణి) (గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులు - ముచ్చిచ్చులు) ) మోహం (విరాళి) గొన్నచోటు (ఆక్రమించిన) ప్రదేశమూ; అగ్నిదేవుడు అలా మునిపత్నులయందు మోహాన్ని పొందిన చోటూ, దేవతలసేనాథిపతి (వేల్పుబడవాలున్) జనించిన ఱెల్లుపొదల్ని (కనుపపులు). ఈ ప్రదేశాలన్నీ
ప్రవరుడు చూశాడు. ఆత్మలో సంతోషం ఉప్పొంగగా చూశాడు.
హిమగిరి సౌందర్యంతో పులకించిపోయి కూడా ప్రవరుడు తన నిత్యకృత్యాలయిన కర్మాచరణాన్ని విస్మరించలేదు. అతను ఇలా అనుకున్నాడు.
తలమే బ్రహ్మకునైన నీనగమహత్త్వంబెన్న నేనియ్యెడన్
గలచోద్యంబులు ఱేపు గన్గొనియెదన్ గాకేమి నేఁడేఁగెదన్
నలినీబాంధవ బాను తప్త రవికాంతస్యంది నీహారకందళ చూ
త్కారపరంపరల్ పయిపయిన్ మధ్యాహ్నమున్ దెల్పిడిన్
ఈ హిమాలయసౌందర్యం, మహత్యం గణుతింపడం ఆ బ్రహ్మకైనా తరం కాదు. పైనున్న చెట్లకొమ్మలనుండి సూర్యకిరణాలు తాకి వేడెక్కిన మంచుబొట్లు క్రిందనున్న సూర్యకాంత శిలలపై పడి చుయి చుయి అనడం వల్ల మధ్యాహ్నసమయం అయిందని తెలుస్తోంది. నేటికి ఇంటికి వెళ్తాను. రేపు మరల వచ్చి ఇక్కడ గల మిగతా వింతలూ విశేషాలూ చూస్తాను.
నను నిముసంబు గానక యున్న నూరెల్ల
నరయు మజ్జనకుఁ డెంతడలు నొక్కొ
యెపుడు సంధ్యలయందు నిలు వెళ్ళనీక న
న్నొమెడు తల్లి యంతొరలునొక్కొ
యనుకూలవతి నాదు మనసులో వర్తించు
కులకాంత మది నెంత కుందునొక్కొ
కెడఁ దోడునీడలై క్రీడించు సచ్చాత్రు
లింతకు నెంత చింతింతురొక్కొ
యతిథిసంతర్పణంబు లేమయ్యె నొక్కొ
యగ్ను లేమయ్యె నొక్కొ నిత్యంబులైన
కృత్యములఁ బాపి దైవంబ కినుక నిట్లు
పాఱవైచితె మిన్నులు పడ్డ చోట.
తను అక్కడే చిక్కుబడిపోయి ఇంటికి వెళ్ళలేకపోతే ఎవరెవరు ఎంత బెంగపెట్టుకుంటారో, ప్రవరుడిలా చింతిస్తున్నాడు. నేను ఒక్క నిముషం కనిపించకపోతే ఊరంతా వెదికే (అరయు) నా తండ్రి ఎంత విచారిస్తాడో (అడలునో)కదా; ఉదయ, మధ్యాహ్న , సాయం సంధ్యలయందు (త్రిసంధ్యలయందు) ఇల్లు దాటనీయక నిత్యం నన్ను కాపాడుతూ ఉండే (నన్ను ఓమెడు) నా కన్నతల్లి ఎంత దుఃఖిస్తుందో కదా (ఒరలునొక్కొ); అనుకూలవతి, ఎల్లఫ్ఫుడూ నామనసులో వర్తించే నా భార్య ఎంత వెతపడుతుందో కదా (కుందునొక్కొ) ; నిత్యం నాకు తోడునీడలుగా, నా చెంతనే (ఎడన్) ఉంటూ, నాతో ఆటలాడే (క్రీడించు), నా మంచి శిష్యులు (సచ్చాత్రులు) - ప్రవరుడు శిష్యుల్ని స్నేహితుల్లాగా చూసుకుంటాడన్నమాట - నేను ఇల్లు చేరకపోతే (ఇంతకు) ఎంత విచారిస్తారో కదా; నేను చేసే అతిథి సంతర్పణలు ఏమైపోతాయో కదా! నిత్యాగ్నిహోత్రినైన నా అగ్నులేమైపోతాయో కదా! నేను భక్తిశ్రద్ధలతో చేసే నా దినచర్యనుండి (నిత్యకృత్యములన్) దూరంచేసి, తప్పించి (పాపి) - ఓ దైవమా నన్నెందుకిలా దూరంగా (మిన్నులు పడ్డచోట) విసిరేశావు (పారవైచితివి) తండ్రీ ! అని మొరపెట్టుకున్నాడు ప్రవరుడు.
(సశేషం)
No comments:
Post a Comment