నాకు నచ్చిన కధ- శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కధ "డు -ము -వు -లు "
అంబటిపూడి శ్యామ సుందరరావు
మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు అంటే జాన తెలుగు నుడికారానికి కిరీటము వుంచిన వ్యక్తి. ఈయన కృష్ణా జిల్లాలోని చిట్టి గూడూరు అనే గ్రామములో 16 జూన్,1905లో జన్మించారు బందర్ నోబుల్ కాలేజీలో బి.ఏ , మద్రాస్ యూనివర్సిటీ లో ఎమ్.ఎ తెలుగు, సంస్కృతములో పట్టా తీసుకున్నారు. యడవల్లి సుబ్బావధాన్ల వద్ద వేదాలు,నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి వద్ద మహాభ్యాసము, శిష్ట్లా నరసింహ శాస్త్రిగారి వద్ద బ్రహ్మ సూత్రాలు నేర్చుకున్న మేధావి. దాదాపు 50భాషలు నేర్చుకున్న బహు భాషాకోవిదుడు కవి, నాటక రచయిత ,కదా రచయిత మాత్రమే కాకుండా తెలుగు చిత్రసీమలో ఈనాటికి మరచిపోలే నటువంటి సుమారు 40 సినిమాలలో 150 పాటల దాకా వ్రాశారు.
అంతేకాకుండా ఆనాటి ప్రముఖ గీత రచయితలకు ఘోస్ట్ రైటర్ గా పాటలు వ్రాశారు. అయన చిరంజీవులు సినిమాకు వ్రాసిన "కనుపాప కరువైన కనులెందుకు",కన్యాశుల్కము సినిమాలోని "చిటారు కొమ్మన మిఠాయి పొట్లము "పాట చరణదాసిలోని,"ఈ దయ చాలును కృష్ణా " వంటి పాటలు ప్రజాదరణ పొందిన పాటలలో కొన్ని. క్రిష్ణా తీర్ధము, చలవ మిరియాలు, తేజోమూర్తులు ,క్షేత్రయ్య వంటి ఈయన కొన్ని రచనలు. ఇంచుమించు రెండు వందల కధలు రచించారు. నాటాకాలంకార, వ్యాకరణములు ఈయన అభిమాన విద్యలు. 12, సెప్టెంబర్ ,1965లో పరమపదించారు.
కానీ అయన సాహిత్యము ద్వారా తెలుగు సాహితీరంగములో చిరంజీవిగా ఉన్నారు. ప్రస్తుతము ఆయన వ్రాసిన కధ "డు-ము-వు-లు " గురించి ముచ్చటించుకుందాము. ఈ కధ భారతాన్ని ఆంధ్రీకరించిన తిక్కన సోమయాజి గారి తండ్రి గుంటూరి కొమ్మన్న గారి జీవితానికి సంబంధినది .కథ కల్పితమా యదార్ధమా అన్నది అప్రస్తుతము. కథను కథగానే ఆస్వాదించాలి.ముందు ముందు ఎప్పుడో మహా భారతాన్ని పదిహేను పర్వాలు తెలుగులో వ్రాయ బోయే తిక్కన గారిని కనబోయే గుంటూరి కొమ్మన్నగారు యవ్వనము వచ్చి రాగానే తన గర్భాధానము గురించి తండ్రితో పోట్లాట పెట్టుకున్నాడు .కొమ్మన్న గారు వివాహముచేసుకున్నది మేనమామ కూతుర్నే. కానీ కొమ్మన్న తల్లిదండ్రులకు రెండు విధాలుగా వియ్యాల వారిపై కినుక వహిస్తున్నారు.
ఒకటి తన హోదాకు తగ్గట్టుగా అన్నగారి హోదాకు తగ్గట్టుగా పెళ్ళిలో లంచాలో, లాంచనాలో ముట్టజెప్పాలేదని కొమ్మన్నగారి తల్లికి అసంతృప్తి . రెండవది స్నేహితుడై ఉండితన బావమరిది తనను అమాయకుణ్ణి చేసి కట్నకానుకలు ఏమిలేకుండా ఆరోజుల్లో తన పెళ్ళిచేశారని కొమ్మన్న గారి తండ్రి అక్కసు. ఈ పరిస్థితిని అదను గాజేసుకొని ఇరువైపుల గల బంధువర్గము ఉన్నవి లేనివి చెప్పి సమస్యను జఠిలముచేసి ఇరు కుటుంబాల మధ్య రాకపోకలను బంధుత్వాలను తెగేటట్లు చేశారు. ఇన్నేళ్లకు పిల్ల పెద్దమనిషి అయినాక కొమ్మన్న మామగారికి తప్పనిసరి అయి శోభనానికి ముహూర్తము ఏర్పాటుచేసి ,అది తప్పితే మళ్ళీ ఒక్క అయనం వరకు ముహుర్తాలు లేవని వియ్యంకుడికి శుభలేఖ పంపుతాడు.
కొమ్మన్న తండ్రి కొడుక్కి తప్ప ఊళ్లోని పెద్దలందరికి ఆ శుభలేఖను చూపితే యధావిధిగా అందరు సమస్య పరిష్కారము కాకుండా యధాశక్తిగా నాలుగు సమిధలు వేశారు. కానీ వూళ్ళో అమిత తలతిక్క మనిషిగా పేరున్న,జ్యోతిష్యములో చండ ప్రచండుడు అయిన గుర్నాధము తాతగారు కొమ్మన్నను పని గట్టుకొని గ్రామదేవత తోపులోకి తీసుకొని వెళ్లి తండ్రికి ఎదురు తిరిగి అవసరమయితే ఇల్లు విడిచి భార్య దగ్గరకు వెళ్లి భార్యను ఏలుకోమని గట్టి సలహా ఇచ్చాడు. తప్పు దారి పట్టిన తండ్రికి విధేయుడై అలికి అన్యాయము చేస్తే అలి ఉసురు తగిలి అన్యాయము అవుతావని హెచ్చరిస్తాడు.
.
గుర్నాధముగారి హితభోధతో కొమ్మన్న కట్టుబట్టలతో ఇంటిమొఖమైనా చూడకుండా అత్తవారింటికి పయనమయినాడు. దారిలో ఎదుట పడ్డ తండ్రికి తన నిర్ణయము చెప్పాడు అయితే అత్తవారింట్లోనే ఊడిగము చేసుకుంటూ అక్కడే పొట్ట గడుపుకో , నా గడప తొక్కకు అని నిష్కర్షగా తండ్రి చెపుతాడు. కొమ్మన్న నవ్వుకుంటు వెళ్ళిపోయినాడు తండ్రి కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయినాడు.
వెళ్లగా వెళ్లగా ఏరు అడ్డము వచ్చింది. ఏటిమీద కంపా గట్రా కొట్టుకు వస్తుంది.నీటికి ముదురు రంగు తేరుతుంది ఇవన్నీఏటికి వరద వచ్చే సూచనలు ఏరు దాటాటానికి ఎక్కడ కనుచూపు మేరలో తెప్ప లేదు. కొమ్మన్న యజ్నోపవీతాన్ని నడుముకు చుట్టుకొని పై అంగవస్త్రాన్నికాసే బిగించి నీటిలోకి దిగి ఈత ప్రయత్నిస్తున్నాడు కానీ కొమ్మన్న పరిస్తితి మునగానం తెలనాంగాఉంది. ఆ పరిస్థితి లో పైనుంచి కొట్టుకొస్తున్న ఓ నడి బాన పట్టుకొని ఒడ్డుకి చేరాడు.
అల్లంత దూరాన ఎదో నెగడి రగులుతుంటే అక్కడికిచేరాడు. అక్కడ తామర పువ్వు లాంటి పిల్ల తడి బట్టలతో చలికాచుకుంటుంది.కొమ్మన్న ఆ పిల్లకెదురుగా కూలబడతాడు ఆ పిల్ల గౌరవంగా నిలబడి కొట్టుకొచ్చారా అయ్యా
అని అడుగీతే లేదు బాన పట్టుకుని వచ్చానని చెపుతాడు ఆ బాన లన్ని మావే వరద వల్ల అన్ని నీటిపాలయినాయి అనిచెబుతుంది. కొమ్మన్న కు బువ్వెట్టా అని అడిగి రెండు కోసుల దూరములో ఉన్న గ్రామానికి వెళ్లే వీలు లేదు కాబట్టి ఈరోజుకు పస్తే అని చెప్పి తన కొక చెంగుతో కొమ్మన్న తల తుడుస్తూ ,"మీరు చదువుకున్న బాపనోరే గంద ఒక చక్కని కత చెప్పండి "అని తగిలేంత దగ్గరగా కూర్చుని అడుగుతుంది. కొమ్మన్న తన కధనే భేతాళుడు విక్రమార్కుడికి చెప్పినట్లుగా సవివరంగా చెపుతాడు. కధ అంతా విన్న పిల్ల ముక్కుమీద వేలేసుకుంటుంది.ఇద్దరు సక్కనోళ్లు అయివుండి మనసు పడి ఈ ఇబ్బందులేంటి అయినా బాపనోరికె మనసు దాచు కోవటం చేతనవునని తన అభిప్రాయము చెపుతుంది.
కొమ్మన్నకు పిల్లమీద మనసుంది కాని పిల్ల ఏమనుకుంటుందో అన్న భయము కానీ ఆపిల్ల కొమ్మన్న చెంపలు నిమిరి ఆ అయ్యా నీవంటోడే అనుకుంటా అని అంటుంది. రాత్రి ఆ పిల్లతో జరగాల్సింది అంతా జరిగింది ఉదయానే ఆ పిల్ల కాళ్లకు మొక్కుతుంటే మెలుకువ వస్తుంది. స్నానము అనుష్టానము తీర్చుకొని," మీ అయ్యతో మాట్లాడి నిన్ను మా ఊరికి తీసుకొని వెళ్లి నిన్ను నా భార్య గా చూసుకుంటాను ",అని చెబుతాడు . ఆపిల్ల ఫకాలున నవ్వి,"అది నీవల్ల కదయ్యోయ్, నేనీ గడ్డ ఇడిసి రాను నీమీద ఎంత మక్కువ ఉన్నా ఆ మక్కువ అంతా ఒక్క ముచ్చటలో తీరింది మాకు అరటి చెట్టు కులదేవత ఒక్కటే పున్నమి ఒక్కటేపూత పుట్టబోయే బిడ్డకు ఏం పేరెట్టుకోను, కొడుకైతే గురునాధుడు, ఆడపిల్లయితే నీ కంట పడదు. నీ ఆనవాలుగా ఆ సేతి ఉంగరము ఇచ్చుకో "అని అడుగుతుంది.
కొమ్మన్న పిల్లను శతవిధాలుగా బ్రతిమాలుతాడుకాని పిల్ల పెదవి విరిచింది. ,"రేతిరి ముచ్చట అంతా కల అనుకో నిన్ననే తల కడుక్కుని శుద్ధిగా కులదేవతకు మొక్కులిచ్చినా, ఆ ఆమ్మోరే నిన్ను ఈడకు చేర్చింది . ఆ అమ్మోరిని తలుచుకునే నీకు అర్పించుకున్నా పోయి రావయ్యా నీ బతుకు నీవు బతకవయ్యా ఈ దుఖము బిడ్డ మొగము చూసేదాకా ఉంటుంది మన ముచ్చట భారతము అనుకో నీవు అర్జునుడివనుకో నేను ఆ నాగుల పిల్ల ననుకో ఈ మంట ఇక్కడే మరచిపో నీ ఆలీని సక్కగా చూసుకో ", అని చెప్పిఏట్లోకి దూకి మాయమైంది.
కొమ్మన్న అత్తవారి ఊరు వెళ్లి అక్కడే ఉండిపోతాడు మనవడు పుట్టినాకా అందరి తిక్కకుదిరి ఇరు కుటుంబాలు ఏకమై నందుకు గుర్తుగా మనమడికి తిక్కన్న అని పేరు పెట్టటం జరుగుతుంది. ఆ బాలుడే పెరిగి పెద్దవాడై సోమయాజి అయి భారతాన్నిఆంధ్రీకరించటానికి పూనుకొన్నాడు కొమ్మన్నపెద్దవాడు అయినాడు కొడుకు ప్రాపకము వల్ల ఆయనలో ఠీవి రాజసము ఉట్టి పడుతున్నాయి. ఒకరోజు కొమ్మన్న కొలువు తీరి ఉండగా గురునాధుడు వచ్చి నమస్కరించి తమ దర్శనానికి వచ్చానని ఏకాంతముగా మనవి చేసుకుంటానని చెబుతాడు ఏకాంతములో గురునాధుడు తన రొండిలోని ఉంగరాన్ని కొమ్మన్న చేతిలో ఉంచుతాడు ఆ ఉంగరాన్ని చుసిన కొమ్మన్న కంపించి అందరిని బయటకు పంపి కుమారుణ్ణి కౌగలించుకుంటాడు ,"మీ
అమ్మ బాగుందా "అని అడుగుతాడు.
"నిన్ను తలచుకుంటూ, నన్ను చూసుకుంటూ పండల్లే బతికి మొన్న ఏకాదశి రాంగానే కన్ను మూసిందయ్యా"అని చేబుతాడు ఇది విన్న కొమ్మన్న పసిపిల్లాడల్లే బావురుమన్నాడు. గుర్నాదుడు "నాకో సిట్టి తమ్ముడుండట కొమ్ముల్దిరిగి వోడంట కంట సుద్దునా ?"అని అడుగుతాడు.
స్వచ్చంగా మాట్లాడటము కూడా చేతకాని గురునాధుడిని పెద్ద పండితుడైన తిక్కన సోమయాజికి అన్నగా ఎలా పరిచయము చేయగలడు ఇంతలో తిక్కనే తండ్రిదగ్గరకు వస్తాడు ప్రక్కనే కూర్చుని ఉన్న గురునాధుడిని చూసి ఎవరితడు అని తండ్రిని అడుగుతాడు కొమ్మన్న గారు జవాబు చెప్పేలోపు గురునాధుడు ,"కవి బ్రహ్మ లని పేరు మోశారు గందా ఆ మాత్రము ఎరికా లేదా? అయ్యగోరి పక్క నట్టా కూకుండవయ్యా ఒక్క పరి చూస్తా "అని అంటాడు .ఈ భాష విన్న తిక్కన్న గారికి కోపము ముంచుకొచ్చింది.
"అయ్యా నాకన్నా చిన్నోరు , దణ్ణ మెట్టరాదు గాలికి పుట్టి ధూలికి పెరిగినోణ్ణి తవురి భాష నా కేడ వస్తది అయ్యగారికి మొక్కి నా మనసు విప్పుకుంటా అయ్యా నేను తవురి లాగా నీడన మేడనా బుట్టలే వరదొచ్చి మా అయ్యా కొట్టుకొచ్చిండు మా యమ్మ తడిసిన జువ్విచెట్టల్లే ఒడ్డున ఆ పడింది, మెరుపు మీద మేఘం అట్లే ఒకరి నొకరు కమ్ముకున్నారు, ఆకాశము నీడన సుక్కల యెలుగులో మా యవ్వ కడుపున పడ్డానయ్యా, ఏటిఒడ్డున రెల్లు మొక్కబాసే నా బాస "అని తన గతాన్ని క్లుప్తముగా తిక్కనకు చెపుతాడు. తిక్కన్నగారు తెప్పరిల్లి ,మర్యాదగా,"ఎవరండీ మీరు?" అని అడుగగా కొమ్మన్న గారు ఎదో చెప్పబోతుండాగా గురునాధుడు వారించి ,"అయ్యా నమస్కారాలు నాకళ్ళు సల్లబడ్డాయి ఇక నే పోతా సెలవు " అని వెళ్ళిపోవాటానికి ఉపక్రమిస్తాడు.
తిక్కన్న తెప్పరిల్లి,ఎవరండీ మీరు అని మళ్ళీ మర్యాద పూర్వకంగా అడుగుతాడు. కొమ్మన్న గారు నోరు విప్పబోతారు కానీ గురునాధుడు నివారించి బయలుదేరుతాడు తిక్కన్న తండ్రిని అతనిని ఆపమని అడుగుతాడు . "నేను నిలవనని అయ్యకు తెలుసు "అనిచెప్పి బయటికి వస్తాడు కొమ్మన్న గారు సాగనంపడానికి నాల్గు అడుగులు వేసి ",ఉండవా నాయనా నామీదకోపమా " అని దీనంగా అంటాడు.
"అయ్యా నీవీ మాట అంటే మా యవ్వ అరటి మొక్కను జ్ఞాపకము చేయమంది. నా బతుకు నేను బతకాలి గందా పోయే నయ్యా , తమ్ముడికి కూతురు పుడితే మా యవ్వ పేరెట్టుకోమంది "అని చెప్పిపరుగున వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరకు తిమ్మన్న గారు వచ్చి ఎవరు నాయనా వారు అని అడిగితె"మీ అన్నగారయ్య", అనిచెప్పినాటి ముచ్చట అంతా కొడుక్కి చెపుతాడు కొమ్మన్నగారు . గురునాధుడు వెళ్లిన వెళ్లిన వంకనే తిక్కన్నగారు చూస్తూ రవంత సేపు ధ్యానముద్రలో ఉండిపోతాడు.
తరువాత తండ్రితో,"నాన్నగారు భారత రచనకు ఫలము ఏమిటో నాకు ఇప్పుడు అవగతమయింది. నేను,వ్యాస భగవానుడికి వంకలు దిద్ది మెరుగులు పెట్టగల మేధావిని కాను కవిబ్రహ్మను కాను నా అహంకారము నశించటానికే దైవము యీ రూపున వచ్చాడనుకొంటాను పంచభూతాలలో శాశ్వతముగా స్పందించే పరతత్వపు పరాకాష్ట మా అన్న నాన్నగారు సోమయాజినై సంకల్పించాను కాబట్టి భారత సంహిత పూర్తి చేస్తాను ఆపైన ఘంటము ముట్టను" అని చెబుతాడు.
****
No comments:
Post a Comment