‘సాంత్వన’
నండూరి సుందరీ నాగమణి
“చూసారుగా, మా పిన్ని... కష్ట కాలంలో నన్నెలా విడిచిపెట్టి వెళ్ళిపోయిందో
చూడండి...”
ఫిర్యాదుగా అంటున్న
అద్వితితో, “ఛ! ఊరుకో... ఆవిడ ఎందుకలా వెళ్ళిపోయిందో మనకు తెలియదు కదా, ఊరికే తొందరపాటు మాటలెందుకు?” అంటూ మందలించాడు కృష్ణ.
“నాన్న చనిపోయినప్పటినుంచీ
తనను మనమే చూసుకుంటున్నాము కదా... గత ఏడాది కాలంగా నేను ఏ లోటూ చేయలేదు ఆవిడకు. అయినా నెలరోజుల క్రితం కాకినాడ వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళి వచ్చినప్పటినుండీ అదోలా
మారిపోయింది... నేను వద్దు వద్దు అని ఎంత వారించినా వినకుండా
ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోయింది... మనమిద్దరం ఉద్యోగాలకు
వెళ్ళిపోతే బాబును ఎవరు చూసుకుంటారు? పైగా వాడు ఆవిడకి బాగా
మాలిమి కూడా అయిపోయాడు... ఆమె మీద బెంగ పెట్టుకునే ప్రమాదం ఉంది... అయినా సవతి తల్లి సవతి తల్లేనండీ, మా అమ్మే బ్రతికుంటే ఇలా
ఎప్పుడూ చేసి ఉండేది కాదు...” కోపంగా, ఉక్రోషంగా, దిగులుగా అన్నది అద్వితి.
“ఛ, అవేం మాటలు అద్వితీ? నాకు తెలిసి ఆవిడ ఎప్పుడూ నిన్ను సాధించటం కానీ, వేధించటం కానీ చేయలేదు. పైగా నీకెంత చేసింది? కన్నతల్లిలాగే పురుడు పోసింది... ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడక
పోవటం ఆవిడ స్వభావం... తనకూ సంతానం లేరు కదా... పోనీ, వచ్చే ఆదివారం ఓ సారి కాకినాడ వెళదాంలే, విషయం తెలుస్తుంది కదా...” సముదాయించాడు కృష్ణ.
“సరే...అప్పటివరకూ లీవు కంటిన్యూ చేస్తాను...” ఏడుస్తున్న బాబును
ఎత్తుకుని, పాలసీసాతో పాలు పట్టసాగింది అద్వితి.
తలపంకించాడు కృష్ణ.
***
అద్వితికి చదువు
పూర్తయి ఉద్యోగం వచ్చిన వెంటనే ఆమె తల్లి మరణించింది. తరువాత, అద్వితికి వివాహ ప్రయత్నాలు చేస్తూ
ఉండగానే, ఆమె తండ్రి బలరామయ్య పదవీ విరమణ చేసాడు.
కూతురికి వివాహం
చేసిన మూడు నెలలకు ఆయన ఉన్నట్టుండి అరుంధతిని గుడిలో వివాహం చేసుకున్నాడు. అరుంధతి ఆయన కొలీగ్ భార్య. రోడ్డు ప్రమాదంలో ఆయన
ప్రాణాలు కోల్పోయాడు. సంతానమే కాక, ముందూ వెనుకా తోడబుట్టిన చెల్లెలు తప్ప
ఎవ్వరూ లేని అరుంధతి దిక్కులేనిది అయిపోయింది. యాభై సంవత్సరాల వయసులో కూడా ఆమె తనను తాను కాపాడుకోవలసి వచ్చింది. అప్పుడే ఆమె భర్త స్నేహితుడైన బలరామయ్య, ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆయన చర్య వలన బంధువులనుండి, మిత్రులనుండే కాక, ఒక్కగానొక్క బిడ్డ అయిన అద్వితినుండి కూడా చాలా వ్యతిరేకతనే ఎదుర్కొన్నాడు. కోపం వచ్చిన అద్వితి తండ్రిమీద ఆగ్రహంతో ఆయన దగ్గరకు వెళ్ళటమే మానేసింది.
ఒకరోజు ఆమె తన
ఆఫీసులో ఉండగా ఆమెకు కొరియర్ లో ఒక కవర్ వచ్చింది. అందులో తండ్రి తన పేరున ఆస్తులన్నీ బదిలీ చేసిన వీలునామాతో పాటుగా ఒక లేఖ కూడా
ఉంది.
“అమ్మా, అద్వితీ,
నాన్న మీద ఇంకా
కోపంగానే ఉన్నదా? ఈ వయసులో నాన్నకి ఇదేమి బుద్ధి? అని చిరాకు పడుతున్నావు కదూ?
దైహికమైన కోరికలు
తీర్చుకోవడానికో, లేక ఇంకో స్వార్థంతోనో నేను అరుంధతిని వివాహం
చేసుకోలేదమ్మా... కాలమెంత మారినా ఒంటరి స్త్రీకి ఈ సమాజంలో రక్షణ
లేదన్నది వాస్తవం... అరుంధతి భర్త మాధవరావు అంకుల్ నీకూ తెలుసుగా? బ్రతికి ఉన్నన్నాళ్ళూ ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఒంటరిదైపోవటం వలన అప్పుడే యవ్వనంలోకి అడుగు పెట్టిన కుర్రాడి
నుండి, కాటికి కాళ్ళు చాచుకున్న ముసలి వాడి వరకూ అందరి చూపులూ ఆవిడ పైనే... అవకాశం వస్తే ఆమె స్త్రీత్వాన్ని
కబళించివేయాలన్న ఆలోచనే... కాకినాడ దగ్గరలోని
పల్లెటూరిలో ఆమెకో చెల్లెలుంది... కానీ ఆమెకు అత్తగారి పోరు... ఈవిడ అందుకనే అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు.
ఒకరోజు ఆవిడ
వాళ్ళాయన డైరీలో నా నంబర్ చూసి ఫోన్ చేసిందమ్మా...
“మీకు పని మనిషిగా, వంట మనిషిగా మీ ఇంట్లో ఉంటాను... దయచేసి నాకు ఆశ్రయం
ఇవ్వగలరా?” అని అడిగింది.
నాకేమనాలో
తెలియలేదు. అలా ఆమెను ఆశ్రయం ఇచ్చి నా దగ్గర ఉంచుకోగలను... నా స్నేహితుడి ఇల్లాలిగా పవిత్రంగా చూసుకోగలను. కానీ లోకం ఎలాంటిదో నీకూ తెలుసుగా? ఏ బంధమూ లేకుండా అలా ఉంటే
మన మీద బురద చల్లుతుంది... అందుకే దైవసాక్షిగా ఆమె మెడలో తాళి కట్టి ఆమెను మన
ఇంటికి తీసుకువెళ్ళాను. ఆవిడ నాకు కేర్ టేకర్. నా పనులన్నీ చూస్తుంది, ఒక ఆయాలాగా... అలాగే ఆవిడకు నేను ఒక మంచి ఫ్రెండ్ ని... ఆమెకు ఆశ్రయమిచ్చిన ఒక
ఆశ్రమనిర్వాహకుడి లాంటివాడిని. అంతకు మించి మా ఇద్దరి మధ్య
ఎలాంటి బంధమూ లేదమ్మా...
ఈ మధ్యన నాకు
ఆరోగ్యం అంత బాగుండటం లేదు... అందుకే నా స్వార్జితమైన
ఆస్తులన్నీ నీ పేరున రాసి వీలునామా రిజిష్టర్ చేయించాను. ఆ కాగితాలు నీకు పంపిస్తున్నాను. అరుంధతికి ఉన్న స్వంత ఇల్లు
అద్దెకి ఇచ్చాము. నాకేమైనా అయితే అరుంధతిని నీవు తీసుకువెళ్ళు...
నువ్వెప్పుడూ నీ
భర్తతో, సంతానంతో కళకళలాడుతూ ఉండాలమ్మా అద్వితీ...
ప్రేమతో మీ నాన్న.”
ఉత్తరం చదివిన
అద్వితికి కన్నీళ్లు ఆగలేదు. ఆఘమేఘాల మీద భర్తతో కలిసి
తండ్రి దగ్గరకు పరుగుతీసింది.
***
బలరామయ్య చనిపోయాక, అరుంధతి తన చెల్లెలి ఇంటికి వెళతానని అన్నా సరే, తనింటికే తీసుకువెళ్ళింది అద్వితి. అప్పటికే గర్భవతియైన
అద్వితిని కంటికి రెప్పలా చూసుకునేది అరుంధతి. ఎక్కువగా మాట్లాడకపోయినా, తన ప్రేమను ప్రకటించక
పోయినా, ఇంట్లో పనులన్నీ చేస్తూ, అద్వితికి సాయంగా ఉంటూ, డెలివరీ కూడా ఈజీగా అవటానికి ఎంతో తోడ్పడింది.
అరుంధతి తీరు
అద్వితికి కొరుకుడు పడేది కాదు. తను ఆఫీసు నుంచి వచ్చేసరికి
కమ్మగా వండిపెట్టేది. ఇల్లంతా సర్ది ఉంచేది. వేడివేడిగా కాఫీ అందించేది. కృష్ణకి కావలసినవి కూడా
అమర్చేది. ఎక్కువగా మాట్లాడేది కాదు. ఖాళీ ఉంటే భగవద్గీత కానీ, ఏవైనా ఆధ్యాత్మిక గ్రంథాలు
కానీ చదువుకునేది. అరుంధతి ఉండటం వలన చాలా హాయిగా, వెసులుబాటుగా ఉన్నా, ఆమె ముభావానికి కాస్త విసుగ్గా కూడా ఉండేది
అద్వితికి.
బాబు పుట్టాక, అరుంధతి కొద్దిగా మారింది. వాణ్ణి ఆడిస్తూ, పాలుపడుతూ, ముద్దులాడుతూ ఎంతో ఆనందాన్ని పొందేది. ఆమె ముఖంలో చిరునవ్వును చూసిన అద్వితికీ ఎంతో ఆనందం కలిగేది... ఈలోగా ఉన్నట్టుండి ఈ సంఘటన...
***
“రండి బాబూ... రామ్మా...” ఆదరంగా ఆహ్వానించింది అన్నపూర్ణ.
అన్నపూర్ణ భర్త
సత్యనారాయణకు స్వంత వ్యవసాయం. గయ్యాళి గంప అన్నపూర్ణ
అత్తగారు ఈమధ్యనే పరమపదించారు. పిల్లలు హాస్టల్లో ఉండి
చదువుకుంటున్నారు.
పంట పొలాల మధ్యన చిన్నగా
ఉన్నా శుభ్రంగా అలికి, ముగ్గులు పెట్టి ఉన్న ఆ పూరింటిని విచిత్రంగా
చూస్తూ భర్త వెంట లోపలికి వచ్చింది అద్వితి.
ముందు వరండా కాక
లోపల మూడు గదులున్నాయి. “పిన్నీ బాగున్నారా? బాబాయ్ గారు లేరా?” అటూ ఇటూ చూసింది అద్వితి.
“పనిమీద టౌనుకి వెళ్ళారమ్మా...”
“పిన్ని...” అంటున్న అద్వితి వైపు విచారంగా చూసింది అన్నపూర్ణ.
“అక్కకి ఆరోగ్యం దెబ్బ
తిందమ్మా... బాగా దగ్గు, ఆయాసం... క్రిందటి సారి ఇక్కడికి వచ్చినప్పుడే పరీక్షలు చేయిస్తే క్షయవ్యాధితో
బాధపడుతోంది అని తెలిసింది. బాబును ఎత్తుకోవడం, పాలు పట్టడం లాంటి పనులు చేస్తే ఇది అంటువ్యాధి కనుక వాడికి
ఎక్కడ అంటుకుంటుందో అని భయపడి, మీతో అసలు విషయం చెప్పకుండా ఇక్కడికి వచ్చేసింది...” ఆవిడ మాట పూర్తికాకుండానే లోపలి గదిలోంచి పెద్ద దగ్గు తెర మధ్య, “పూర్ణా...” అని నీరసంగా వినిపించింది అరుంధతి గొంతు.
అసలు విషయం
తెలుసుకున్న అద్వితి కన్నుల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
ఒక్క ఉదుటున
అరుంధతి దగ్గరకు పరుగుతీసి, “ఏమిటి పిన్నీ ఇది? ఇలా చెప్పకుండా వచ్చేస్తే ఎలా? వెంటనే మనింటికి
వెళ్ళిపోదాం. సిటీలో పెద్ద స్పెషలిస్ట్ కి చూపిస్తాను నిన్ను... అమ్మ తర్వాత అమ్మవు నాకు... నీ కూతుర్నీ, మనవడినీ వదిలిపెట్టి వచ్చేస్తావా? కన్నా, వచ్చేయమని చెప్పరా అమ్మమ్మకి...” అంటూ చేతిలోని బాబును
అరుంధతికి అందించబోయింది అద్వితి.
కంటినిండా ఊరిన
నీటితో అడ్డంగా తలాడించింది అరుంధతి. “వద్దమ్మా... వాడు నా దగ్గరకు వస్తే ప్రమాదం...” వారించింది బాధగా...
అమ్మమ్మను
చూస్తూనే బాబు చేతులు చాపుతూ ఏడవసాగాడు. కృష్ణ వాడిని అందుకుని
వరండాలోకి వెళ్ళాడు.
“అన్నపూర్ణ పిన్నీ... హైదరాబాదులో లేని వైద్యం లేదు... పిన్నికి నేను ట్రీట్మెంట్
చేయిస్తాను... ఆవిడ ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి...” చెప్పింది అద్వితి.
“అలాగేనమ్మా... ఇక్కడికి వచ్చిందే కానీ ఆవిడ నోట ముద్ద సయించటం లేదు... ఇక మందులేమి పనిచేస్తాయి, మనసంతా మీ మీదనే ఉంటే? ఇక్కడ నేనూ తనకి పెద్దగా ఏమీ చేయలేను, బాధ పడుతూ కూర్చోవటం తప్ప... ఆ... కాళ్ళూ చేతులూ కడుక్కుని రండమ్మా... ఎప్పుడనగా భోజనం చేసారో?” హడావుడి పడింది అన్నపూర్ణ.
“అత్తయ్య గారూ, రేపే మన ప్రయాణం... ఇప్పుడే నేను స్పెషలిస్ట్ డాక్టర్ తో ఫోన్ లో
మాట్లాడాను... మీకేమీ కాదు, తప్పకుండా మందులతో తగ్గిపోతుంది...” అన్నాడు కృష్ణ.
“పిన్నీ, కొన్నాళ్ళ పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకో... వెళ్ళిన వెంటనే, ఇంటిపనికీ, వంటపనికీ మనిషిని
పెట్టేసుకుందాం. నువ్వు మళ్ళీ మా మామూలు పిన్నివి అయిపోవాలి...” గబగబా అన్నది అద్వితి.
“అలాగేనమ్మా... వీడి కోసం అయినా అలాగే అయిపోతాను...” నీరసంగా నవ్వుతూ అన్నది
అరుంధతి, కృష్ణ భుజమ్మీద పడుకుని నిద్రపోయిన పసివాడిని
చూస్తూ...
“నాకు... నాకు సరిగ్గా మాట్లాడటం రాదు పిన్నీ... నేనేమైనా తప్పుగా
ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించు...” కన్నీళ్ళతో అంటున్న
అద్వితిని చూస్తూ, “పిచ్చిపిల్ల... ఏమిటా మాటలు? నాకైతే అసలు మాట్లాడటమే రాదు కాదమ్మా... నేనే మీ దగ్గర ఇమడలేనని నాకో భావన... అయినా, నువ్వు ఎవరివి? పరాయిదానివి కాదుగా, నాకూతురివే... ఏవీ మనసులో పెట్టుకోకు... రేపు బయలుదేరిపోదాము మనింటికి...” అనునయంగా అన్నది అరుంధతి.
“అమ్మా, భోజనాలు వడ్డించాను...” అన్నపూర్ణ పిలవటంతో బాబును వేరే గదిలోని మంచం మీద
పడుకోబెట్టి వంటగదిలోకి నడిచారు కృష్ణ, అద్వితి.
వాళ్ళను చూస్తూ
ఉంటే అరుంధతికి మనసు నెమ్మదించి, తెలియని సాంత్వన కలగసాగింది.
***
కథ బాగానే వుంది. కాని "కష్టకాలంలో మనల్ని విడిచి ఎలా వెళిపోయిందో, మనిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతే బాబును ఎవరు చూసుకుంటారు?" అని .....అద్వితి చేత అనిపించడంలో అద్వితి పాత్ర మసకబారింది. ఆమె స్వార్థం తోనే పిన్నిని తన ఇంట్లో వుంచుకోవాలనుకుంది అన్న భావన పాఠకులకు కలుగుతోంది. .ఐతే బలరామయ్య అరుంధతిని వివాహం చేసుకోవడం అన్న సంఘటన వల్ల కథకు బలం చేకూరింది, రచయిత్రి కొంత సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఈ కథను వ్రాసిందనే సాంత్వన పాఠకులకు కలుగుతుంది
ReplyDelete