సామ్రాజ్ఞి – 8 - అచ్చంగా తెలుగు
సామ్రాజ్ఞి – 8
భావరాజు పద్మిని



(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె  ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మతో మల్లయుద్దంలో గెలిచి, అతని రాజ్యం అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది ప్రమీల. రాజ నియమాల ప్రకారం అతను విలాసపురుషుడిగా మార్చబడతాడు. పరిణామ, వ్యాఘ్ర  సరోవరాలలో మునిగిన యాగాశ్వం పులిగా మారిపోవడంతో, దిక్కుతోచక శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటాడు అర్జునుడు. కృష్ణుడు ప్రత్యక్షమై యాగాశ్వానికి పూర్వపు రూపును తెప్పించి, ఆర్జునుడిని దీవించి, మాయమౌతాడు. పంపా నదీ తీరాన సీమంతినీ నగరాన్ని కావలి కాస్తున్న వారికి దొరుకుతుంది ధర్మరాజు యాగాశ్వం. దాన్ని సామ్రాజ్ఞి తన అశ్వశాలలో కట్టేయించి, యాగాశ్వం కావాలంటే తనతో యుద్ధం చేసి, విడిపించుకోమని, తన దండనాయకి వీరవల్లితో అర్జునుడికి లేఖ పంపుతుంది. తమ రాజ్యంలోని వివిధ బలాబలాలను గురించి అర్జునుడి సర్వసేనానియైన ప్రతాపరుద్రుడితో చెబుతూ ఉంటుంది వీరవల్లి. ఇక చదవండి...)

“అవును, సమర్ధుడైన నాయకుడు/నాయకి ఉండడమే ఆ దేశానికి, ప్రజలకు, సేనకు నిజమైన బలం. ప్రజల కోసం అటువంటి నాయకి త్యాగానిరతితో నిలబడ్డప్పుడు, ప్రజలంతా ఒక భద్రతా భావంతో కంటి నిండా నిద్రపోతారు. మీరు చెప్తున్న వివరాలు వింటుంటే మీ సామ్రాజ్ఞిని అభినందించకుడా ఉండలేకపోతున్నాను.” మాటల్లో సామ్రాజ్ఞి పట్ల ఒకరకమైన ఆరాధనాభావం తొణుకుతుండగా అన్నాడు ప్రతాపరుద్రుడు.

“ లెస్స పలికితిరి ప్రతాపరుద్రా ! నిజానికి మీరు మా సామ్రాజ్యం గురించి వినడం కాదు, మీ కళ్ళతోనే చూడాలి. అప్పుడు మీకు ఏ దేవలోకానికో వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. జీవితకాలంలో మీకు ఇదొక మర్చిపోలేని అనుభవమవుతుంది.” ఆనందంతో కూడిన ఒకరకం ఉద్వేగంతో చెప్పింది వీరవల్లి.

“దైవం కరుణిస్తే తప్పకుండా వస్తాము నాయకి....” అని ప్రతాపరుద్రుడు అంటూ ఉండగా అక్కడికి బోడిగుండు, కోడి గుడ్డు మొహంతో, సన్నగా పీలగా ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. అతని గడ్డం నుంచి రెండు పాయలు వేళ్ళాడుతున్నాయి.

అమాయకంగా మొహం పెట్టి , “ప్రతాపా ! నువ్వు ఈ వీరాధివీరుడికి కృతఙ్ఞతలు చెప్పాలి. నీ డాలు ఇందాక డేరాలోకి దూరి ఓ కొండముచ్చు ఎత్తుకుపోయింది, తెల్సా? “ అన్నాడు.
అతని అవతారం చూస్తేనే నవ్వు తన్నుకొచ్చేసింది వీరవల్లికి. ఇక అతని మొహంలో గోచరిస్తున్న హావభావాలు, ఆమెను కడుపుబ్బా నవ్వింపజేస్తున్నాయి.

“ఓ! కొండముచ్చు నుంచి నా డాలును వెనక్కు తెచ్చినందుకు కృతఙ్ఞతలు చతురసఖా !” అన్నాడు ప్రతాపుడు.

“డాలు తెచ్చారని ఎవరు చెప్పారు?” అన్నాడు చతురుడు గమ్మత్తుగా కనుబొమలు ఎగరేస్తూ.

“మరి? నా డాలు ఏమైంది? అది నాకు కురుక్షేత్ర పోరాటం తర్వాత బహుమతిగా లభించింది.” ఆందోళనగా అడిగాడు ప్రతాపుడు.

“ అది డాలుతో చెట్టెక్కిందా,  నేను నీ కత్తి తీసుకుని దానితో పోరుకు సిద్ధమయ్యాను. అది తోడుకోసం ముచ్చు భాషలో ఏదో ముచ్చటించింది. మరికాసిన్ని కొండముచ్చులు ఊడలు పట్టుకు వేళ్ళాడుతూ వచ్చాయి. అప్పుడు నేనో తంత్రం ప్రయోగించాను. నేనూ వాటిలాగే హావభావాలు పలికిస్తే, సజాతీయుడిని అనుకుని, సంధికి వస్తాయని అనుకుని, కత్తి కింద పెట్టి, వాటిలాగే నటించాను. డాలు పట్టుకున్న కొండముచ్చు క్రిందికి దిగసాగింది... నా యుక్తి పనిచేసింది... ఇంతలో...” చెప్పడం ఆపి బుర్ర గోక్కోసాగాడు చతురుడు.

“అబ్బా, చతురా, ఏమైందో చెప్పవయ్యా... ఇక్కడ బెంగతో చస్తుంటేనూ!” 

“ఏముంది, నేను దాన్ని చూస్తూ ఉండగా, వెనుక నుంచి మరో కొండముచ్చు నెమ్మదిగా వచ్చి కత్తి కాస్తా ఎత్తుకుపోయి, చెట్టేక్కేసింది. వెంటనే కత్తి ముచ్చు, డాలు ముచ్చు కొట్టుకోడం మొదలెట్టాయి. “

“అయ్యిందీ ! నిన్ను నమ్ముకుంటే అదీ పోయె, ఇదీ పోయె.  దేవుడా ! ఇప్పుడు అర్జునుల వారికి ఏం చెప్పేదీ?” తలపట్టుకున్నాడు ప్రతాపుడు. వీరిద్దరి వ్యవహారం చూస్తున్న వీరవల్లి అతి కష్టం మీద నవ్వాపుకుంటోంది.

“పోయిందని ఎవరు చెప్పారు? కొట్టుకునేవి ఎప్పుడూ మొగుడూ పెళ్ళాలే అయి ఉంటాయని, కాసేపటికి ఆ మొగుడు ముచ్చు లొంగి శరణాగతి వేడాల్సిందేనని , నేను మళ్ళీ అంచనా వేసాను. “

“హబ్బబ్బా, నీ అంచనాలు అంగట్లో పెట్ట ! నా కత్తి, డాలు ఎక్కడో చెప్పవయ్యా మగడా !”

“ అవి గుబురుగా ఉన్న మఱ్ఱి చెట్టెక్కి, నాకు కనబడకుండా పోయాయి. వెంటనే నేను బెబ్బులిలా గాండ్రించాను. ఆ అరుపుకు భయపడి అవి కత్తీ, డాలు పడేస్తాయని అనుకున్నాను.”

“ఓహ్, పడేసాయా.. ఐతే సరే. హమ్మయ్య.”

“పడేసాయని ఎవరు చెప్పారు ? నా అరుపుని, మగ సింహం మనసుపడి పిలిచిన పిలుపని అనుకుందేమో, ఎక్కడనుంచో ఒక శివంగి వయ్యారంగా అక్కడికి వచ్చింది. వెంటనే అది చూడకుండా నేను పలాయన మంత్రం చిత్తగించి, నీ కత్తి, డాలు వెతుక్కురమ్మని మన సైనికులకి చెప్పాను. “ ఈ సరికి బిగ్గరగా నవ్వసాగింది వీరవల్లి.

“గోవింద... ఓర్నాయనో, ఈ కారడవిలో నాకు మళ్ళీ వేరే ఆయుధాలు కూడా దొరకవు. నీవల్ల నా కత్తి పోయే, డాలు పోయే ! పైగా ఈపాటి దానికి నేన్నీకు కృతఙ్ఞతలు చెప్పాలా?” కోపంగా అన్నాడు ప్రతాపుడు.

“ఇదిగో మళ్ళీ, పోయాయని ఎవరు చెప్పారు? మన సైనికుల దండు కాగాడాలతో అక్కడకు వెళ్ళగానే ఆ మంటలు చూసి, శివంగి పారిపోయిందిట. గుర్రాల మీద కవచాలు వేసుకుని వెళ్ళిన మన సైనికులను చూడగానే, ఇవేవో వింత జంతువుల్లా ఉన్నాయి, మన చేతుల్లో ఉన్న వీళ్ళ సామాన్ల కోసమే మన మీదకు తెగబడ్డాయని అనుమానం వచ్చిన ముచ్చులు  క్రిందకు కత్తీ, డాలు విసిరేసి చక్కా పోయాయట. చివరికి అవి తెచ్చి నీ గుడారంలో పెట్టారు మన సైనికులు. నీకోసం ఇంత పోరాటం చేస్తే, కృతఙ్ఞతలు కూడా చెప్పడానికి నీకు కష్టంగా ఉంది. నే పోతున్నా ప్రతాపా !” బుంగమూతి పెట్టి అన్నాడు చతురుడు.

“ఆగాగు మిత్రమా ! మన్నించు...” అన్నాడు వీరవల్లి నవ్వులతో శృతి కలుపుతూ ప్రతాపుడు.

ఈ లోపల వెనుదిరిగిన చతురుడు ఆగి, వీరవల్లి కురులనే చూడసాగాడు. ఇద్దరూ వెంటనే చతురుడి ప్రవర్తనకు అవాక్కయ్యారు. తనకు కావలసిన భావం వాళ్ళ వదనంలో ద్యోతకమవగానే “ సాహో దండనాయకీ ! దండనాయకికి దండిగా ఇచ్చే మనసు ఉండాలి. క్షామం ఉన్న చోట ప్రజలు తమవంటి నాయకులను ఆశ్రయించడం, వారు ఉదారంగా దానాలు ఇవ్వటం మామూలే కదా ! చూడబోతే, నా తల మీద ఆట మైదానం ఉంది, మీ తల మీద కళకళలాడే సుక్షేత్రం ఉంది. కాస్త నా బోడి గుండుకు అతికించుకుందుకు కాసిన్ని కురులేమైనా అప్పిప్పిస్తారా?” అని తన గుండు రుద్దుకుంటూ అడిగాడు చతురుడు. వెంటనే ఇద్దరూ పగలబడి నవ్వసాగారు.

“సముద్రంలో ముత్యాలు వెతికేందుకు వెళ్ళిన జాలరివారికి ఈమధ్యన ఉత్త చిప్పలే తప్ప, ముత్యాలు దొరకట్లేదట ! ఎందుకా అనుకున్నాను. అప్పుడో ఇప్పుడో మీవంటి అందమైన దండనాయకి నవ్వినప్పుడు రాలేందుకు సిద్ధంగా, సముద్రాన్ని వీడి మీవెంటే అదృశ్యంగా తిరుగుతున్నాయని అనుమానంగా ఉంది.” మళ్ళీ అన్నాడు ఆశ్చర్యపోతున్న కవళిక తో చతురుడు.

“ఓహో, విదూషకుడు అంటే హాస్యాన్నే పండించగలరని అనుకున్నాను. చూడబోతే, మీ విదూషకుల వారు సకల విద్యాచాతుర్యం కలిగి ఉన్నట్లు తోస్తున్నది,” అంది సాలోచనగా వీరవల్లి.

“మీరు సరిగ్గానే అంచనావేసారు దండనాయకీ ! మా హస్తినాపురంలో విదూషకుడు అంటే గంతులేసి నవ్వించే హాస్యకాడు మాత్రమే కాదు. అతనికి వైదుష్యం వుండాలి, సమయస్ఫూర్తి వుండాలి, అప్రియమైనది సభాముఖంగా చెప్పగల ధైర్యం వుండాలి, హాస్యాన్ని రంగరించే చెప్పే ఒడుపు తెలిసి వుండాలి, మనసులో కల్మషం లేకుండా చెపుతున్నాడనే నమ్మకం రాజుకి సైతం కలిగించాలి, విమర్శ హద్దులెరిగి, వికటించకుండా తనను తాను నియంత్రించుకో గలగాలి. ఆంతరంగిక రహస్యాలను దాచే రాజభక్తి ఉండాలి. ఇవన్నీ పరీక్షించిన పిదపే వీరు ఎంపిక చెయ్యబడతారు.” అన్నాడు ప్రతాపుడు.

“బాగు బాగు, ప్రయాణ బడలిక వలన నాకు నిద్ర వస్తోంది. ఇక విశ్రమిస్తాను. సెలవు ఇప్పించండి “ అంటూ ఇద్దరికీ మన్ననగా చెప్పి,  తన గుడారంలోకి కదిలింది వీరవల్లి.

ఆమె వెళ్ళిన తర్వాత జరిగినవన్నీ అర్జునుడికి చెప్పాడు ప్రతాపరుద్రుడు. రాత్రంతా ఆలోచించి, మర్నాడు ఉదయం వీరవల్లికి ఇచ్చి పంపేందుకు ఒక లేఖను సిద్ధం చేయించాడు అర్జునుడు.


(సశేషం...)
   



No comments:

Post a Comment

Pages