సీతారమణ వో శ్రీరామచంద్ర - అచ్చంగా తెలుగు

సీతారమణ వో శ్రీరామచంద్ర

Share This
 అన్నమయ్య రామ కీర్తన అర్థ తాత్పర్య విశేషాలు
                     సీతారమణ వో శ్రీరామచంద్ర
డా.తాడేపల్లి పతంజలి


సీతారమణ వో శ్రీరామచంద్ర దా-
దాత లక్ష్మణుడదే తగు రామచంద్ర ॥పల్లవి॥
                  1
చెలువపు సింగారాల శ్రీరామచంద్ర నీ-
సెలవుల నవ్వుగారీ శ్రీరామచంద్ర
చెలఁగీ చెక్కులఁ గళ శ్రీరామచంద్ర
మొలచె మోహనము నీ మోమున రామచంద్ర     ॥సీతా॥
                  2
చిక్కని మురిపెముల శ్రీరామచంద్ర
చిక్కులేదు పెద్దకొప్పు శ్రీరామచంద్ర
చిక్కె నీచే మదనుఁడు శ్రీరామచంద్ర
చొక్కపు నున్నని మేనిసొంపు రామచంద్ర    ॥సీతా॥
                  3
చేవదేరిన సిగ్గుల శ్రీరామచంద్ర
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీరామచంద్ర
యీవల దాసరిపల్లె నిరవుకొని మీ-
సేవకుల మమ్మునేలే శ్రీరామచంద్ర ॥సీతా॥ (3-157)
విశేషాలు
పల్లవి
సీతారమణ వో శ్రీరామచంద్ర దా
దాత లక్ష్మణుడదే తగు రామచంద్ర
తాత్పర్యము  
ఓ శ్రీరామచంద్ర !
సీతమ్మకు భర్తా ! సీతమ్మకు అందమైనవాడా ! ఓ శ్రీరామచంద్ర! గట్టిగా, ఇంచుమించుగా.(= దాదాత) మాలక్ష్మణుడు కూడా నీకు తగినవాడయ్యా !
విశేషాలు
      దశరథుడు సూర్యచంద్రుల వంటి పుత్రులిద్దరినీ తన వద్ద కూర్చోబెట్టుకుని, వారి వనజీవన యాత్రా విశేషాలను గుచ్చిగుచ్చి అడిగి తెలుసుకున్నాడు. సద్గుణనిధి రాముడు వినమ్రతతో స్వీయప్రతాపాన్ని ప్రస్తావించని సందర్భాలలో తండ్రి తన చిన్న కుమారుడి వంక చూసేవాడు. లక్ష్మణుడు నవ్వి, ఆయా విశేషాలను, అన్నగారి ప్రజ్ఞాపాటవాలను మహోత్సాహంతో వర్ణించి చెప్పేవాడు అని ముళ్లపూడి వెంకటరమణ గారు  సీతా కల్యాణం కథలో చెప్పారు. ఇప్పుడు “లక్ష్మణుడదే తగు”  పదం నిజమనిపిస్తుంది కదూ !
దాదాతకు ఇతర ప్రయోగాలు
"యీదెస శ్రీవేంకటేశయిన్నియు మానికొందరు, దాదాత నీ శరణని దాసరులైరి." [తాళ్ల-2-246]
"వేదతో వెన్నవట్టి నేయివెదకఁ బోయినయట్టు, దాదాత నా తెలివి యితరుల నడిగేను." [తాళ్ల-10-87]

                  1
చెలువపు సింగారాల శ్రీరామచంద్ర నీ-
సెలవుల నవ్వుగారీ శ్రీరామచంద్ర
చెలఁగీ చెక్కులఁ గళ శ్రీరామచంద్ర
మొలచె మోహనము నీ మోమున రామచంద్ర     ॥సీతా॥
      శ్రీరామచంద్ర! అందమైన సింగారాలతో నీపెదవుల చివర నవ్వు దొర్లుతోంది.నీ చెక్కిళ్ళ మీద కళ అతిశయించి, నీ మోములో మోహనము( మన్మథ బాణ విశేషము) మొలుస్తోంది.
విశేషాలు
      రాముడు అందమైనవాడు అని చెప్పటానికి ఇంతకంటే అద్భుత భావన చేయటం ఏ కవికయినా అసాధ్యం.
                        2
చిక్కని మురిపెముల శ్రీరామచంద్ర
చిక్కులేదు పెద్దకొప్పు శ్రీరామచంద్ర
చిక్కె నీచే మదనుఁడు శ్రీరామచంద్ర
చొక్కపు నున్నని మేనిసొంపు రామచంద్ర    ॥సీతా॥ 
తాత్పర్యము
శ్రీరామచంద్ర! నీ మురిపెములు (నడకయందలి కులుకులు) చిక్కనివి.
నీ  పెద్దకొప్పు (తలయందు దోపిన వెండ్రుకలముడి) చిక్కులేనిది. రామచంద్ర ! నీ  నునుపైన శరీరపు అందం     చూసిమదనుడు (మన్మథుడు)  నీ చేతిలో చిక్కాడు.
విశేషాలు
      పూర్వకాలంలో మగవారు కూడా స్త్రీలలా జుట్టు పెంచేవారు. పెరిగిన జుట్టూని తలపై మధ్యకు చేర్చి ముడి (సిగ)వేసేవారు. దానిలో పువ్వులు కూడా పెట్టేవారు. మగవారి దెబ్బలాటలకి సిగపట్లగోత్రాలని  ఇదివరకు తెలుగులోనే   మాట్లాడేవారు  అనేవారు.
      మనుచరిత్రలో  ప్రవరాఖ్యుని  కొప్పు  కొలిచి సోమిదమ్మ నిచ్చి పెళ్లిచేసారట.  “ (కూకటుల్ కొలిచి చేసిన సోమిదమ్మ) కనుక పెద్దకొప్పు ఉంటే మగవాడికి పూర్వకాలంలో ఒక గొప్పతనం.
అన్నమయ్య “పెద్దకొప్పు” వెనుక కథ ఇది.
చేతిలో చిక్కటం అంటే లొంగడం. మన్మథుడు అందంలో రామునిముందు నిలబడలేక దాసోహమ్మన్నాడని కవి చమత్కారం.
                  3
చేవదేరిన సిగ్గుల శ్రీరామచంద్ర
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీరామచంద్ర
యీవల దాసరిపల్లె నిరవుకొని మీ-
సేవకుల మమ్మునేలే శ్రీరామచంద్ర ॥సీతా॥
తాత్పర్యము
శ్రీరామచంద్ర! చేవదేరిన(=బలపడిన) సిగ్గులతో ఆ వేంకట పర్వతముపైన వేంకటేశుని అవతారంలో  ఉన్నావు.
వేంకట పర్వతముపైన ఒకచోటేనా ! ఇవతల ఈ పక్కగా(=యీవల )దాసరిపల్లె  అను ఊళ్లో ఉండి( =ఇరవుకొని)  మీ సేవకులమయిన మమ్మలిని పరిపాలిస్తున్నావు.
విశేషాలు

సిగ్గు బలపడటమంటే వేంకటేశుడు  అందాలతో  అతిశయించటం అని ఇక్కడ అర్థం. స్వస్తి.

No comments:

Post a Comment

Pages