జ్ఞానయోగము
వీతరాగ భయక్రోధా
మన్మయామాముపాశ్రీతాః
బహవోజ్ఞాన తపసాపూతా
మద్భావ మాగతాః 10 వ శ్లోకం
తాత్పర్యము:రాగ,భయ,క్రోధములు లేకుండుట,ఎల్లప్పుడూ భగవంతునిలో రమించుచుండుట ఎల్లప్పుడూ భగవంతుని ఆశ్రయించుట అను విషయములు జ్ఞాన తపస్సుగా గీతాచార్యుడు వివరించెను.అట్టి జ్ఞాన తపస్సు యొక్క ఫలితము చిత్త శుధ్ధి మరియు పరమాత్మ స్వరూప ప్రాప్తి.
శరీర మాలిన్యము జలముచే శుద్ధ మగునట్లు బహు జన్మార్జితములైన అజ్ఞానపు వాసనలు,మలినములు జ్ఞాన తపస్సుచే శుద్ధమొనర్చి పరమాత్మ ప్రాప్తి కలిగించును. నిర్మలమై నిశ్చలమై అలలు లేని నీటియందే ప్రతి బింబము స్పష్టముగా గోచరించును. హృదయములో ప్రతిష్టితుడైన భగవంతుని చూడాలంటే చిత్త నైర్మల్యము అత్యంత ముఖ్యమైనది.
యేయధామాంప్రపద్యంతే
తాంస్తధైవ భజామ్యహమ్
మమవర్త్మాను వర్తన్తే
మనుష్యాః పార్థ సర్వశః 11వ శ్లోకం
అర్జనా ! ఎవరు ఏ ప్రకారముగా నన్ను సేవింతురో ఆ ప్రకారముగనే వారిని అనుగ్రహింతును. మనుజులు అనుసరించు అన్ని మార్గములు నన్నే చేరుచున్నవి.
పసుల వన్నె వేరు పాలేక వర్ణమౌ
పుష్ప జాతి వేరు పూజ యొకటి
దర్శనములు వేరు దైవమ్మదొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చోటనే భగవద్గీత యొక్క సర్వ వ్యాపకత్వము దేదీప్యమానమై వెలుగొందు చున్నది. రాముడు,కృష్ణుడు,శివుడు,అల్లా,నా నక్,యేసు ఏ రూపములో కొలిచినా అన్ని రూపములు, అన్ని నామములు నేనే,నదులన్నియు సముద్రములో కలిసియున్నట్లు హృదయభాష ద్వారా(కర్మ,భక్తి,జ్ఞానము) భక్తుడు భగవంతుని యందుండు సుగుణములను పొందు చున్నాడు.
యస్య సర్వే సమారంభాః
కామ సంకల్ప వర్జితాః
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం
తమాహుః పణ్డితంబుదాః 19వ శ్లోకం
ఎవని యొక్క సమస్త కర్మలు సంకల్పము, కోరిక అనునవి లేక యుండునో జ్ఞానమను అగ్నిచేత దహించబడిన కర్మలు గల అట్టివానిని పండితుడని విజ్ఞులు పేర్కొందురు. భగవంతుని దృష్టిలో పండితుడనగా ప్రాపంచిక విద్యలందు ప్రావీణ్యముండుటే కాదు హృదయము పరిశుద్ధమై ,బాహ్య విషములందాసక్తి లేకుండా ఆత్మజ్ఞానము కలిగియండుటే నిజమైన పాండిత్యము. కర్మను దైవార్పణ భావంతో చేయువానికి కర్మ వలన కలిగిన సుఖము గాని , దుఃఖము గాని బాధింపవు. ఆతడు ఎల్లప్పుడు ఆనంద స్థితిలో ఓలలాడు చుండును.
యదృచ్చాలాభ సన్తుష్టో
ద్వన్ద్వాతీతో విమత్సరః
సమః సిద్ధావ సిద్ధౌచ
కృత్వాపిన నిబధ్యతే 22వ శ్లోకం
తాత్పర్యం:లభించిన దానితో సంతుష్టినొందుట, ద్వందములను లక్ష్యపెట్టకుండుట, ఈర్ష్య అసూయ లేకుండుట, కార్య జయమును పొందిననూ, పొందకున్ననూ సమభావముతో నుండుట, జ్ఞాన గుణములని , జీవన్ముక్తుని లక్షణములని స్పష్టముగానున్నవి.నిష్కామ కర్మ ద్వారా జ్ఞానము కలుగుచున్నది.జ్ఞానము కలిగిననే నిష్కామ కర్మాచరణ సాధ్యమగుచున్నది.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్
బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవతేన గన్తవ్యం
బ్రహ్మ కర్మ సమాధినా 24 వ శ్లోకం
ఈ విశ్వములో ప్రతియణువు బ్రహ్మమే బ్రహ్మము కాని పదార్ధమేదియు లేదు. ప్రతియణువులోను భగవంతుని దర్శించుచు కర్మనాచరించిన జ్ఞాని చివరికి బ్రహ్మమునే పొందుచున్నాడు.
తరువాతి భాగంలో ప్రాణాయామ విశిష్టతను సవివరంగా తెలియజేయబడును.
***
No comments:
Post a Comment