శ్రీ రామకర్ణామృతం - 17
డా.బల్లూరి ఉమాదేవి
కామవరం
61.శ్లో:సాకేతే నగరే సమస్త సుఖదే హర్మ్యేబ్జ కోటి ద్యుతౌ
నక్షత్రగ్రహ పంఙ్క్తి లగ్నశిఖరే చాంతర్య పంకేరుహే
వాల్మీక్యత్రి పరాశరాది మునిభిస్సంసేవ్యమానం స్థితం
సీతాలంకృత వామభాగ మనిశం రామం భజే తారకం.
తెలుగు అనువాద పద్యము:
మ:తనయూరన్ శరదిందుకోటి నిభమై తారాగ్రహాకాంత శృం
గనితాంతో న్నతమైన సౌధమున సౌఖ్యంబౌ తదంతస్థస
ద్వనజంబందు బరాశరాత్రి భృగు దూర్వాసుదులుం గొల్వ భూ
తనయా సంయుతుడైన రామవిభునిన్ దాసుండనై కొల్చెదన్.
భావము:అయోధ్యయందు సర్వసౌఖ్యముల నిచ్చునట్టి కోటి చంద్రుల శోభకల్గిన మేడలు కల్గినట్టి అశ్విన్యాది నక్షత్రములయొక్క అంగారకాది గ్రహములయొక్కయు వరుసచే తగులుకోబడిన శిఖరములు కలిగినట్టి మధ్యమునంగల పద్మమందుండి వాల్మీకి మొదలగు మునులచేత సేవించబడుచున్నట్టి
సీతచేతనలంకరింపబడిన యెడమ భాగము
గలట్టి తారకరాము నెల్లప్పుడు సేవించుచున్నాను.
62.శ్లో:వందే రామ మనాది పూరుష మజం వందే రమానాయకం
వందేహారకిరీటకుండల ధరం వందే సునీలద్యుతిమ్
వందే చాపకలంబకోజ్జ్వలకరం వందే జగన్మంగళం
వందేపంఙ్క్తిరథాత్మజం మమ గురుం వందే సదా రాఘవం.
తెలుగు అనువాద పద్యము:
మ:కమలానాథు ననాది పూరుషు జగత్కల్యాణు గోదండది
వ్యమహాస్త్రోజ్జ్వలు హారకుండల కిరీటాలంకృతు న్నిర్జరేం
ద్రమణీ శోభిత గాత్రు మద్గురు నజున్ రామున్ దశస్యందనో
త్తమ పుత్రున్ సుచరిత్రు మద్ధృదయమధ్యంబందు భావించెదన్.
భావము:పురాణపురుషుడైనట్టి పుట్టుకలేనట్టి లక్ష్మీనాథుడైనట్టి రాముని నమస్కరించుచున్నాను.హారములు కిరీటకుండలములు ధరించినట్టి యింద్రనీలమువంటి కాంతి కలిగినట్టి ధనుర్బాణములచే ప్రకాశించు హస్తములు కలిగినట్టి జగత్తునకు శుభములు చేయునట్టి దశరథుని కుమారుడైనట్టి నాకు గురువైనట్టి
రాము నెల్లప్పుడు నమస్కరించుచున్నాను.
63.శ్లో:వందే శౌనక గౌతమాద్యభినుతం వందే ఘనశ్యామలం
వందే తారకపీఠ మధ్యనిలయం వందే జగన్నాయకమ్
వందే భక్తజనౌఘ దైవతతరుం వందేధనుర్వల్లభం
వందే తత్త్వమసీతి వాక్యజనకం వందేసదారాఘవమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:పరునిం తత్త్వమసీతి వాక్యజనకున్ భక్తామరానోకహున్
సురుచిం దారుక పీఠపద్మనిలయున్ సుత్రామ నీలోజ్జ్వలున్
సరసున్ గౌతమ శౌనకాద్యభినుతున్ సర్వేశ్వరున్ జానకీ
వరు గోదండ గురున్ సురారిహరు భావంబందు సేవించెదన్.
భావము:శౌనకుడు,గౌతముడు మొదలగు వారిచే స్తోత్రము చేయబడినట్టి,మేఘము వలె నల్లనైనట్టి,నక్షత్రపీఠ మధ్యమందు స్థానము కల్గినట్టి ,జగత్తుల కధిపతియైనట్టి భక్తసముదాయమునకు కల్పవృక్షశాఖయైనట్టి,ధనస్సునంది ష్టుడైనట్టి
"అబ్రహ్మము నీవైతివి"అను వాక్యమును కలిగినట్టి రామునకెల్లప్పుడు నమస్కరించుచున్నాను.
64.శ్లో:వందే సూర్యశశాంక లోచన యుగం వందే జగత్పావనం
వందే పత్రసహస్రపద్మనిలయం వందే పురారి ప్రియమ్
వందే రాక్షసవంశనాశనకరం వందే సుధాశీతలం
వందే దేవకపీంద్రకోటి వినుతం వందే సదా రాఘవం.
తెలుగు అనువాద పద్యము:
మ:హరమ రవిచంద్ర నేత్రు దితిపుత్రారణ్య దావాగ్ని ని
ర్జర శాఖామృగ సేవితాంఘ్రియగు శ్రీరామున్ సుధాశీతలున్
ధరణీనాథు సహస్రపత్రకమల స్థానున్ జగత్పావనుం
బరమాత్మున్ రఘురామచంద్రు మదిసంభావించి
సేవించెదన్.
భావము:చంద్రసూర్యులు నేత్రద్వంద్వముగా గలిగినట్టి జగత్తులను పవిత్రము చేయునట్టి
సహస్రార పద్మమునందు స్థానము కలిగినట్టి యీశ్వరుని కిష్టుడైనట్టి రాక్షసకులమును నశింప చేయునట్టియమృతము వలె చల్లనైనట్టి దేవతలచేతను బహువానరుల చేతను స్తోత్రము చేయబడుచున్నట్టి రామునకు నమస్కరించుచున్నాను.
65.శ్లో:వందే సాగరగర్వ భంగవిశిఖం వందే జగజ్జీవనం
వందే కౌశిక యాగరక్షణ కరం వందే గురూణాం గురుం
వందేబాణశరాసనోజ్జ్వలకరం వందే జటా వల్కలం
వందే లక్ష్మణ భూమిజాన్విత మహం వందే సదా రాఘవం.
తెలుగు అనువాద పద్యము:
మ:శరచాపోజ్జ్వల హస్తు లక్ష్మణ ధరా సత్పుత్రికాయుక్తు సా
గర గర్వాపహ శౌర్యధుర్యు ననఘున్ గాధేయ యజ్ఞావనున్
వరదున్ దేశికదేశికున్ ధృతాజటావల్కున్ జగగజ్జీవనుం
గరుణాంభోనిధి రామచంద్రు నియతిం గాంక్షించి సేవించెదన్.
భావము:
66.శ్లో: వందే పాండుర పుండరీకనయనం
వందేబ్జ బింబాననం
వందే కంబుగళం కరాబ్జ యుగళం వందే లలాటోజ్జ్వలమ్
వందే పీత దుకూల మంబుదనిభం వందే జగన్మోహనం
వందే కారణ మానుషోజ్జ్వల తనుం వందే సదా రాఘవమ్.
తెలుగు అనువాద పద్యము:
మ:సితకంజేక్షణు హస్తిహస్తకరురాజీవారి బింబాస్యు భా
సిత ప్రావృడ్ఘనవర్ణు గాంచనలసచ్ఛేలున్ సుశీలున్ బుధా
ర్చితునిం గారణదేహు గంబు గళు ధాత్రీపున్ జగన్మోహనున్ ధృతమాణిక్య లలాము రామవిభు నెనెంతుం గృపాకాంక్షినై.
భావము:తెల్లతామరలవంటి నేత్రములు కలిగినట్టి చంద్రబింబము వంటి మోము కలిగినట్టి శంఖఖము వంటి కంఠము కలిగినట్టి పద్మములవంటి హస్తములజోడు కల్గినట్టి అలంకారములచే ప్రకాశించుచున్నట్టి పచ్చపట్టు బట్టలు కలిగినట్టి మేఘముతో సమానుడైనట్టి జగత్తులను మోహపెట్టునట్టి ఏదో కారణముచేత మనుష్యదేహముచే ప్రకాశించునట్టి రాము నెల్లప్పుడు నమస్కరించుచున్నాను.
67.శ్లో:వందే నీలసరోజ కోమల రుచిం వందే జగద్వందితం
వందే సూర్య కులాబ్ధి కౌస్తుభమణిం వందే సురారాధితమ్
వందే పాతక పంచక ప్రహరణం వందే జగత్కారణం
వందే వింశతి పంచతత్త్వరహితం వందే సదా రాఘవం.
తెలుగు అనువాద పద్యము:
మ:వరనీలోత్పల కోమలాంగు ద్రిజగద్వంద్యున్ జగత్కారణున్
సరసీజాప్త కులాబ్ధి కౌస్తుభమణిన్ సర్వాత్ము దేవార్చితున్
వరదుం బంచమహాఘ నాశకు గృపావార్ధిన్బరున్ దైత్య సం
హరు షడ్వింశతి తత్త్వభాసితుని రామాధీశు సేవించెదన్.
భావము:నల్లకలువలవలె సొగసైన కాంతి కలిగినట్టి జగత్తుల చేత నమస్కరింపబడుచున్నట్టి సూర్యవంశమను సముద్రమునకు కౌస్తుభమణి యైనట్టి దేవతలచే పూజింప బడుచున్నట్టి పంచమహా పాపములను హరించునట్టి జగత్తులకు కారణమైనట్టి యిరువదియైదు తత్త్వములు లేనివాడునై యిరువది యారవ తత్త్వముచే ప్రకాశించు వాడైనట్టి రాము నెల్లప్పుడు నమస్కరించుచున్నాను.
68.శ్లో:వందే సాధక వర్గ కల్పకతరుం వందే త్రిమూర్త్యాత్మకం
వందే నాదలయాంతర స్థలగతం వందే త్రివర్గాత్మకం
వందే రాగవిహీన చిత్త సులభం వందేసభానాయకం
వందే పూర్ణదయామృతార్ణవ మహం వందే సదారాఘవం.
తెలుగు అనువాద పద్యము:
మ:వరదున్ సాధక వర్గ కల్పకతరున్ భవ్యున్ ద్రిమూర్త్యాత్మకున్
సరసున్ నాదలయాంతర స్థలగతున్ శాంతుం ద్రివర్గాత్మకున్
గురు సంపూర్ణ దయామృతాబ్ధి రహితాంగున్ సత్సభానాథు సు
స్థిరునిన్ రాగవిహీన చిత్త సులభున్ శ్రీరాము సేవించెదన్.
భావము:యోగి సముదాయమునకు కల్పవృకషమైనట్టి బ్రహ్మ,విష్ణు,రుద్ర స్వరూపుడైనట్టి నాదగుణమగునట్టి స్థలమును బొందినట్టి ధర్మార్థకామ రూపుడైనట్టి వైరాగ్య చిత్తులకు సులభుడైనట్టి సభాస్థలముల కధిపతి యైనట్టి సంపూర్ణ దయామృతమునకు సముద్రుడైనట్టి రాము నెల్లెప్పుడు నమస్కరించుచున్నాను.
69.శ్లో:వందే సాత్త్విక తత్త్వ ముద్రిత తనుం వందేసుఖాదాయకం
వందే చారు చతుర్భుజం మణినిభం వందే షడబ్జస్థితమ్
వందే బ్రహ్మపిపీలికాది నిలయం వందే విరాడ్వవిగ్రహం
వందే పన్నగతల్పశాయినమహం వందే సదా రాఘవం.
తెలుగు అనువాద పద్యము:
మ:వరు నీలాంగు షడంబర స్థితు జతుర్బాహున్ సుఖదాయకున్
సరసున్ సాత్త్విక తత్త్వ ముద్రిత తనున్ సర్వున్ విరాడ్విగ్రహుం
బరమేష్ఠ్యాది పిపీలికాంత నిలయున్ నాగేంద్రపర్యంక ని
ర్జరబృందావనశీలు రాఘవు బరబ్రహ్మంబు సేవించెదన్.
భావము:సత్త్వగుణప్రధానమైన స్వభావము గలవారిచే హృదయము నందు నిలుపబడిన రూపము గలిగినట్టి అమృతము నిచ్చునట్టి సుందరములైన నాలుగు చేతులు కలిగినట్టి రత్నముతో తుల్యుడైనట్టి మూలాధారము మొదలగు నారుచక్రములందున్నట్టి బ్రహ్మమొదలు చీమ వరకు గల జంతువుల యందున్నట్టి ఆది విరాట్స్వరూపుడైనట్టి శేషశయ్య యందు బరున్నట్టి రాముని నేనెల్లప్పుడు నమస్కరించుచున్నాను.
70.శ్లో:అయోధ్యా పురమంటపే స్ఫురితసింహపీఠే స్థితం
వసిష్ఠ శుక గౌతమైర్భృగు శుకాదిభిస్సేవితం
దినేశ సుత రావణానుజ సహోదరాద్యావృతం
భజామిరఘునందనం ప్రణవబీజసారాత్మకం.
తెలుగు అనువాద పద్యము:
మ:ప్రకటాయోధ్య సురత్నమంటపమునన్ భద్రాసీనుడై
యకలంకుల్ శుక గౌతమ భృగు వశిష్ఠాదుల్ దినేశాన పు
త్రక ముఖ్యుల్ దశకంఠ సోదరుడు భ్రాతల్ గొల్వ నోంకార బీ
జ రసాత్మకుడైన శ్రీ జనకజాజానిం బ్రశంసించెదన్.
భావము:అయోధ్యా పురమందలి ప్రకాశించుచున్న సింహాసనము నందున్నట్టి వశిష్ఠాది మునుల చేత సేవించ బడుచున్నట్టి సుగ్రీవ విభీషణులచే తమ్ములు మొదలగు వారిచే జుట్టుకో బడినట్టి ఓంకారబీజము యెక్క సారరూపుడైనట్టి ఓంకారబీజము యొక్క సారరూపుడైనట్టి రాముని సేవించుచున్నాను.
No comments:
Post a Comment