అపర రామదాసు--శ్రీ తూము లక్ష్మీనరసింహదాసు - అచ్చంగా తెలుగు

అపర రామదాసు--శ్రీ తూము లక్ష్మీనరసింహదాసు

Share This
అపర రామదాసు-శ్రీ తూము లక్ష్మీనరసింహదాసు
మధురిమ 


కర్ణాటక శాస్త్రీయ సంగీత వాగ్గేయకారులెందరో తమ భక్తిభావావేశం ద్వారా జాలువారిన ఎన్నో భక్తిరస ప్రధానమైన  కీర్తనలతో పరమాత్మని స్తుతించి తరించి విన్న వారిని కూడాతరింపచేసి,చేస్తూ ఉన్నధన్యజీవులు,పుణ్యజీవులు.వారి కీర్తి ఆచంద్రతారార్కం.అయితే కొంత మంది వాగ్గేయకారుల రచనలు బాగా జనప్రాచుర్యం పొంది భావితరాలవారికి కూడా అందింపబడ్డాయి.ఉదాహరణకి అన్నమయ్య,శ్రీ భద్రాచల రామదాసు,సంగీత త్రిమూర్తులు,మైసూరు వాసుదేవాచారి.వీరందరి రచనలు సామాన్యులదగ్గరనుండీ సంగీత శాస్త్ర పండితులవరకూ అందరికీ పరిచయమే... 

అయితే కొందరు వాగ్గేయకారులు మాత్రం అమృతతుల్యమైన కీర్తనలు రచించినప్పటికీ అవి అజ్ఞాతంగా ఉండిపోయాయే, కానీ బహుళజనాదరణ పొందలేదు.ఇలా జరగడానికి చాలా కారణాలు ఉండవచ్చు. వాగ్గేయకారునికి శిష్య ప్రశిష్యులు లేనియెడల వాటి ప్రచారానికి అవకాశం ఎక్కువగా ఉండదు.ఆవాగ్గేయకారుని సమకాలీనులైన ఇతరవాగ్గేయకారులతో కానీ,మహరాజులతోకానీ సంబంధాలు అధికముగా లేనియెడల కూడా వారి రచనలు జనంలోకి రావడానికి అవకాశం తక్కువే మరి.ఇలా కారణాలు ఏవైనా వారు,వారి రచనలు కూడా అజ్ఞాతంగా ఉండిపోతాయి.
 
ఇలాంటి కోవకి చెందిన శ్రీరామ భక్తాగ్రేసరులు,ఉత్తమ వాగ్గేయకారులు శ్రీ తూము లక్ష్మీనరసింహదాసు గారు.వీరు 1770-1833 కాలానికి చెందినవారు,త్యాగరాజస్వామి సమకాలీనులు కూడా.జీవించినంతకాలం శ్రీరామచంద్రమూర్తే శ్వాసగా,ఆయనపైనే ధ్యాసతో నిరంతర రామనామ సంకీర్తనా కైంకర్యంతో కాలం గడిపిన ధన్యులు.భద్రాచల రామదాసు వలె భద్రాద్రి రామునిపై పెక్కు సంకీర్తనలు రచించి  శ్రీరామునిలో ఐక్యమైన శ్రీరామ సంపూర్ణ అనుగ్రహ సంపన్నులు,వాగ్గేయకార శిఖామణి శ్రీ నరసింహదాసులవారు.

శ్రీ నరసింహదాసులవారు నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు  జిల్లాలోని, పొన్నూరు గ్రామంలోని పుణ్యదంపతులైన శ్రీ తూము అప్పయ్యదీక్షితులు, వెంకమాంబ దంపతులకు మంగళగిరి నరసింహస్వామి అనుగ్రహంతో   10-12-1790నాడు జన్మించారు. స్వామి అనుగ్రహ వరప్రసాదం కనుక తల్లితండ్రులు నరసింహదాసు అని నామకరణం చేసారు.తండ్రిగారు అప్పయ్య దీక్షితులవారు గొప్ప సంస్కృత పండితులు కావటం చేత ఎందరో పండితులు,విద్వాంసులు వీరి ఇంటికి వస్తూ ఉండేవారట.వారు చిన్నవాడైన నరసింహదాసు భాషా జ్ఞానాన్ని,పాండిత్యాన్ని,తెలివితేటలను, చూసి ఆశ్చర్యపోయేవారట.బాల్యంలోనే సంగీతంలో సంస్కృత,ఆంధ్రభాషలలో అపారమైన అనితరసాధ్యమైన ప్రతిభాపఠవాలు ప్రదర్శించేవారట మన నరసింహదాసులవారు.
 
కేవలం ఎనిమిదేళ్ళ వయసులో రామునిపై కీర్తనలు రచించి పాడుతూ ఉంటే బాలుని ప్రతిభా పాఠవాలకి అందరూ ఆశ్చర్యపోయేవారట.వీరి లయజ్ఞానం అపారం.కంజీర వాయిద్యాన్ని అద్భుతంగా వాయించేవారట.ఇక సాహిత్యపు లోతుల్లోంచి వచ్చిన వీరి భాషాజ్ఞానం అద్భుతంగా ఉండేదట.భగవంతునిపై ఆయనకున్న భక్తిని ప్రదర్శించడానికి భాషని ఎంతో అద్భుతంగా ఉపయోగించేవారట. పిన్న వయసులోనే భద్రాచల  రామునిపై "నమో నమో దాశరధే" అన్న అద్భుతమైన కీర్తన ని రచించి, స్వరపరిచి అందరినీ ఆనందపరచడమే కాదు ఆశ్చర్యపరిచారు కూడా.
 
గుంటూరు రెవెన్యూ శాఖలో  ఉదరపోషణార్థం చిన్న ఉద్యోగాన్ని కూడా ఎంతో పవిత్రంగా, పనే దైవంగా చేస్తు ఉండేవారు.అదే సమయంలో వారికి లక్ష్మీ బాయ్ గారితో వివాహం జరిగింది.కొన్నాళ్ళకి తండ్రి గారు అప్పయ్యదీక్షితులు గారు మరణించాక "పంచ సంస్కార దీక్ష" ని దామోదరం కేశవదాసు గారి దగ్గర స్వీకరించారు. దీక్ష ని స్వీకరించినవారు భగవత్ రామానుజులు ప్రతిపాదించిన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి భుజాలపై శంకు,చక్రాలు ధరించి,నుదుటిపై నామాన్ని ధరించి విష్ణుదాసులుగా మారి జీవితం సాగించారు.

ఇదంతా జరిగాక రామునిపై భక్తి పతాకస్థాయికి చేరుకుని ఇక నిరంతర రామనామ ధ్యానంలోనే గడుపుతూ అలౌకిక ఆనందాన్ని పొందుతూ ఉండేవారట. ఆనందానుభూతి కోసం చేస్తున్న ఉద్యోగాన్ని  కూడా వదిలి పెట్టేసరికి లౌకిక పరమైన జీవితానికి చాలా ఇబ్బందులు సహజంగానే కలిగాయి మరి..కుటుంబ పోషణ కూడా చాలా కష్టం గా మారింది.

అయితే కష్టాలు ఎదురౌతున్నకొద్దీ రామచంద్రమూర్తి పై విశ్వాసం ఇంకా దృఢపడుతూనే వచ్చింది.గొప్పవాళ్ళెవరైనా ధన సహాయం చేస్తామన్నా కూడా కష్టాలు రాముణ్ణి చేరడానికి సోపానాలు అనేవారట.రామ నామమే తన సర్వస్వంగా భావించి ఈవిధంగా జీవితం గడుపుతూ ఉత్తమ వాగ్గేయకారులందరివలె ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ తీర్థయాత్రలు  చేసారు. తీర్థయాత్రలో భాగంగా శ్రీరంగం ,కంచి మొదలైన క్షేత్రాలను దర్శించి ఆయా దేవతామూర్తులపై కూడా ఎన్నో కీర్తనలు రచించారు.కంచి క్షేత్రం దర్శించిన తరువాత మద్రాసు దగ్గర ఉన్న తిరువొత్తియ్యూర్ కు చేరుకోగా అక్కడ సద్గురు త్యాగరాజస్వామి వారి శిష్యులైన వీణ కుప్పయార్ గారి ఇంటి వద్దనున్నారని తెలుసుకుని వారిని దర్శించి,వారి కీర్తనలు విని ఆనందపరవశులై త్యాగరాజస్వామిని ప్రశంసిస్తూ పద్యరచన చేసి వారి మెప్పును కూడా పొందిన ధన్య జీవి. ఇద్దరు రామభక్తాగ్రేసులు కలుసుకున్న క్షణం ఎంత మధురమైనదో..వీరిద్దరికీ ఒకేసారి తన ఇంట ఆతిధ్యం ఇచ్చిన వీణ కుప్పయ్యార్ గారు ఎంత పుణ్యం చేసుకున్నారో.

తీర్థయాత్రల తరువాత శుభదినాన రామదర్శనం కలిగి ,శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు ఇక అన్నీ విడిచిపెట్టి భద్రాచలం చేరి ఇక తన శేష జీవితం అంతా శ్రీరాముని సేవలో గడిపిన అపర రామదాసు శ్రీ నరసింహదాసు..మనం అందరం రాముడిని చూడడానికి భదాద్రి వెళ్ళాలనుకుంటాము కాని రాముడు నరసింహదాసు తనదగ్గర ఉండాలని పిలిపించుకున్నాడు.. ఒక్క నిదర్శనం చాలు ఆయన కారణజన్ముడని నమ్మడానికి.

భద్రాచల రామదాసు వలె ఆయన బాటలోనే రామునిపై సుమారు 134 కీర్తనలు రచించారు.వీరి కీర్తనలలో  రామభక్తి, పారమార్థచింతన,వేదాంత తత్వము మాత్రమే కలిగినవి కాక సీతారాముల సంకీర్తనా కైంకర్యానికి ఉపయోగించే ఉత్సవ సాంప్రదాయ కృతులైన మేలుకొలుపు,లాలిపాటలు,మంగళహారతులు వంటివి కూడా ఉన్నాయి.ఇప్పటికీ ఆంధ్రదేశంలోని భజనకూటములలో,సాంప్రదాయ కుటుంబాలలో వినబడుతూ ఉంటాయి.వీరు స్వనామ ముద్రకారులు.నేటి తరం వాగ్గేయకారులైనటువంటి శీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు వీరి కీర్తనలను చాలాఆలపించగా వాటి క్యాసెట్లు కూడా విడుదలయ్యాయి.

వీరు భద్రాచలంలో శ్రీరాముని సేవకే తన జీవితం అంకితం చేసారు.రామదాసులవారి అనంతరము శ్రీ తూము లక్ష్మీ నరసింహదాసులవారు అప్పటి నిజాముప్రభువును కలుసుకుని తానీషా వారు కంచర్లగోపెన్నకి ఇచ్చిన,పాడైన దాస శాసనం తిరిగి వ్రాయించి నైజాముప్రభువుచేత తిరిగి సీతారాముల వారి కైంకర్యానికి,నిత్యోత్సవాలకు గాను వార్షిక నిధిని చేయించారు. తన మితృడైన వరద రామదాసుగారితో కలిసి  భద్రాచలంలో ఉన్న శ్రీ సీతా లక్ష్మణసమేత శ్రీరామచంద్రమూర్తికి దశవిధ ఉత్సవాలను ఏర్పాటు చేసినఘనుడు.వీరు ఏర్పాటు చేసిన ఉత్సవ సాంప్రదాయాలే నేటికీ భద్రాద్రిలో శ్రీరామచంద్రమూర్తికి కొనసాగుతున్నాయి.
రామునిపై అమృతతుల్యమైన కీర్తనలు రచించడమే కాక శ్రీ భద్రాచల క్షేత్ర వైభవ అభివృద్ధిలోను ముఖ్యకారకులైన అపర రామదాసు శ్రీ తూము లక్ష్మీనరసింహదాసు గారు. అజ్ఞాతవాగ్గేయకారులని రానున్న శ్రీరామనవమి పర్వదినము సందర్భముగా స్మరించుకుని వారి కీర్తనలను వినినంతనే  మనం కూడా భద్రాద్రిలో ఉన్న సీతాలక్ష్మణ సమేత  శ్రీరామచంద్రమూర్తి సానిహిత్యాన్ని అనుభవించగలము.

రాబోవు కాలములో వీరి కీర్తనలు కూడా  అన్నమయ్య ,రామదాసు,త్యాగరాజస్వామి వంటి వారి రచనలవల్లే బహుళజనాదరన పొంది ఆచంద్రతారార్కం  నిలవాలని ఆకాంక్షిద్దాము.

1 comment:

  1. Manchi samaachaaranni panchaaru ayya, viirito paaTu mana telugu nEla payi yunna endaro goppa vaggEyakaarulu baahya prapanchaaniki antagaa teliyadu..veerilo Tyagaraja swami vaariki samakaaliinulayina Maanemkonda hanumaddaasu, Vepuuri Hanumaddaasu, Rakamacherla Venkatadaasu pratyekanga perkovaali, ii muggurini telugu nelapai yunna sangeeta trimuurtalani antaau, veeru apara raama bhaktulu, bhadraachala raamunipayi viiru vandala koladi sankeertanalu rachinchi saamaanya prajallo bhakti bhaavaanni marinta penchaaru, viiru prastuta telangaana rashtramloni mahabubnagar jilla vaastavyulu, nizam paalana lo telugu kalalaku, kalaakaarulaku etuvanti protsaaham, swechcha lekapovadam valana viiri goppa rachanalu bayati prapanchaaniki teliyaraledu, kaani appatlo All India Radio lo hanumaddasu gaari konni kiirtanalanu adhbutanga paaDi record chesaaru..

    VaaTilo konni kindi link lo yunnavi , vini aanandinchandi


    http://sobhanaachala.blogspot.in/2013/11/blog-post_15.html


    Mana telugu nelapai yunna sangeeta trimurtulayina viirigurinchi, viiri sankeertanala chaala prachuryam , gurtimpu tesukuravaalsina avasaram entayina undi..

    ReplyDelete

Pages