ప్రేమతో నీ ఋషి – 26 - అచ్చంగా తెలుగు
ప్రేమతో నీ ఋషి – 26
-      యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ కంపెనీ వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్ వేలానికి వారిద్దరూ వెళ్తుండగా,  దారిలో స్నిగ్ధకు ఆర్ట్ మ్యూజియం కోసం వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో ఆ విషయం చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. స్నిగ్ధ ఋషితో ఫోనులో చెప్పిన అడ్రస్ ప్రకారం, ఇటలీ లోని మిలాన్ కు వెళ్లి, ఆ పెయింటింగ్ అమ్మిన వ్యక్తిని కలిసి, అతని ద్వారా స్పార్క్ ఈస్ట్ గాలరీ క్రూయిస్ కు చేరుకుంటాడు ఋషి. గిల్సీ పెయింటింగ్స్ గురించి అతనికి చెప్తుంది ఐడా..  ఇక చదవండి...)

“కొనుగోలు పత్రాల్లో స్పష్టంగా అది గిల్సీ పెయింటింగ్ అని చెప్పబడింది. మీకు కావలిస్తే నేను కాంట్రాక్టు కాపీ ని చూపగలను. “ అంటూ లేచి ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళింది ఐడా. ఒక పది నిముషాల తర్వాత చేతిలో ఒక ఫైల్ తో ఆమె తిరిగి వచ్చి, దాన్ని ఋషికి ఇచ్చింది.
“మిష్టర్ ఋషి, మిష్టర్ బెనెడిట్టో సంతకం చేసిన ఈ ఫైల్ ను చూడండి,” అంటూ కాంట్రాక్టు లో ఉన్న సంతకాలను ఆమె చూపింది.
ఋషి ఒక రెండు నిముషాల పాటు మొత్తం కాంట్రాక్టును పరిశీలించాడు. అలా చేస్తుండగా, గతంలో ఈ పెయింటింగ్ ను ఆక్షన్ హౌస్ వారికి అమ్మిన వారి పేరు, చిరునామా రాసిఉండే చోట వివరాలను గబగబా పరీక్షించాడు.
అతనే వద్దనే క్రూయిస్ ఆక్షన్ హౌస్ వారు పెయింటింగ్ ను కొనుక్కున్నది, ఆ తర్వాత వారు దాన్ని సముద్రం పైకి తీసుకువెళ్ళి మిష్టర్ బెనెడిట్టో కు అమ్మారు. అమ్మినవారి పేరు చూడగానే, ఇక అతను టైం వేస్ట్ చెయ్యదల్చుకోలేదు. అతను వెంటనే ఫైల్ మూసి, లేచాడు.
“థాంక్స్ ఐడా, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మీరిచ్చిన సమాచారానికి కృతఙ్ఞతలు. అదినాకు చాలా ఉపయోగపడింది,” అంటూ, అతను బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు.
“మిమ్మల్ని చూడడం నాకూ సంతోషంగా ఉంది, “ అంటూ ఐడా తన మామూలు ధోరణిలో వీడ్కోలు పలికింది. ఋషి ఆఫీస్ నుంచి బయటకు వచ్చి, తన హోటల్ వైపు వెళ్ళసాగాడు. దారిలో స్నిగ్ధకు కాల్ చేసాడు.
“హాయ్ స్నిగ్ధ, ఎలా ఉన్నావు?” అని అడిగాడు.
“ఋషి, నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. నేను బాలేదు. నీ అవసరం నాకు చాలా ఉంది,” అంటూ ఏదో షాక్ లో ఉన్నట్లుగా మాట్లాడింది స్నిగ్ధ. అది ఋషికి తెలుస్తోంది.
“స్నిగ్ధ, చింతించకు. నేను త్వరలోనే వచ్చేస్తాను. అధైర్యపడకు, నాకు ఆ పెయింటింగ్ చరిత్ర అంతా తెలిసిపోయింది,” ఉత్సాహంగా ఋషి తన ప్రయాణంలో జరిగినవన్నీ ఆమెతో చెప్పసాగాడు.
“స్నిగ్ధ, మృణాల్ ఈ పెయింటింగ్ ను మిష్టర్ బెనెడిట్టో నుంచి కొన్నాడు. మిష్టర్ బెనెడిట్టో ఒక ఆక్షన్ హౌస్ నుంచి ఒక క్రూయిస్ సేల్ లో ఈ పెయింటింగ్ కొన్నారు. నీకో ఆసక్తికరమైన నిజం చెప్పనా? ఇది అసలు పెయింటింగ్ కాదు – ఇదొక గిల్సీ పెయింటింగ్, లేక ప్రామాణికమైన ఓఅక ఆర్ట్ వర్క్ కి డిజిటల్ ప్రింట్. దీన్ని నకలుగా కొందరు పొరబడుతూ ఉంటారు.” ఇంకా ఋషి ఇలా చెప్పసాగాడు.
స్నిగ్ధ, “ వెంటనే ఒక పని చెయ్యమని నిన్ను అభ్యర్ధిస్తున్నాను. కాస్త టైం తీసుకుని, ఆఫీస్ కు వెళ్ళు. విశ్వామిత్ర పెయింటింగ్ కు సంబంధించిన పత్రాలు పరిశీలించు. వాటిలో “గిల్సీ పెయింటింగ్” అని నమోదు చెయ్యబడి ఉందేమో పరిశీలించు.”
మ్యూజియంకోసం వారు కొన్న పెయింటింగ్, ఐడా చెప్పిన గిల్సీ పెయింటింగ్ ఒకటేనేమోనని నిర్ధారించుకునేందుకు అతను ప్రయత్నిస్తున్నాడు.
“స్నిగ్ధ, చివరగా మరొక్క ముఖ్యమైన విషయం విను. మ్యూజియం కోసం మృణాల్ కొన్న పెయింటింగ్ ని అతడే అంతకు ముందు క్రూయిస్ కు అతనే అమ్మాడు. మొదట అతను అమ్మిన దానినే క్రూయిస్ ఆక్షన్ హౌస్ వారు ఇటాలియన్ ఆర్ట్ కలెక్టర్ కు అమ్మారు. అక్కడి నుంచి మృణాల్ తిరిగి పెయింటింగ్ ను మ్యూజియం కోసమని కొన్నాడు. ఈ వలయాకార ప్రణాళికలో ఏదో లొసుగు ఉందని నాకు తోస్తోంది.”
స్నిగ్ధ ఋషి చెప్పేది అర్ధం చేసుకోలేక పోయింది. మృణాల్ తో తరచుగా తాను గొడవలు పడుతూ ఉన్నా అతడు మోసగాడని, స్కాం లు చేసేవాడని ఆమె ఊహించలేదు. కాని, జరుగుతున్న సంఘటనలు  ఈ విషయాన్నే నిర్ధారిస్తున్నాయి.
ఆఫీస్ కు వెళ్లి, పత్రాలు పరిశీలించాకా, మళ్ళీ ఫోన్ చేస్తానని ఆమె ఋషికి చెప్పింది.
***
ఋషి త్వరగా హోటల్ రూమ్ కు వెళ్ళాడు. తన సామాను సర్దుకుని, ఎయిర్పోర్ట్ కు బయలుదేరాడు. తనకు ఏ ఇటాలియన్ అమ్మాయిని ప్రేమించే అవకాశం దొరకనందుకు కాస్త బాధ పడ్డాడు కూడా !
ఎయిర్పోర్ట్ కు వెళ్ళే దారిలో అతను స్నిగ్ధకు ఫోన్ చేసాడు. “ హాయ్ స్నిగ్ధ, ఆఫీస్ కు వెళ్లి పేపర్స్ చూసావా? నిన్నిలా పరుగేట్టిస్తున్నందుకు క్షమించు. కాని, దీని ప్రాముఖ్యతను నువ్వు అర్ధం చేసుకుంటావని భావిస్తున్నాను.”
అవతలి వైపు మౌనం... మొదట అతను ఫోన్ డిస్కనెక్ట్ అయిందని అనుకున్నాడు. కాని, ఫోన్లో అతనికి గట్టిగా ఊపిరి తీసుకుంటున్న శబ్దం వినిపించింది.
“స్నిగ్ధ... ఉన్నావా?” ఋషి మళ్ళీ పలకరించాడు.
అయినా, అవతలి వైపు నుంచి కొద్ది క్షణాలు స్పందన లేదు. ఆ తర్వాత స్నిగ్ధ గట్టిగా అరవడం అతనికి వినవచ్చింది.
“ఋషి, మృణాల్ ను ఎవరో హత్య చేసారు. నేను ఇప్పుడే ఆఫీస్ లోకి వచ్చాను, ఇక్కడ అతని శవం నేలపై పడుంది. ఎవరో అతన్ని కాల్చేశారు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చెయ్యాలో తెలియట్లేదు.” వణుకుతున్న స్నిగ్ధ స్వరం ఆ క్షణంలో ఆమె అనుభవిస్తున్న తీవ్రమైన భయాన్ని తెలియజేస్తోంది.
ఒక్క క్షణం పాటు ఋషికి ఆలోచనలు స్తంభించిపోయాయి. వెంటనే అతను కోలుకుని, స్నిగ్ధకు ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.
“స్నిగ్ధ, వీలైనంత త్వరగా అక్కడినుంచి బయటపడు. ఇవాళ రాత్రి, రేపు ఉదయం మీ ఫ్రెండ్ ఇంట్లో ఉండిపో. ఉదయాన్నే నాకు కాల్ చెయ్యి. నేనొచ్చి నిన్ను పిక్ అప్ చేసుకుంటాను. నా ప్రేమ నీకు తోడుంటుంది, ధైర్యంగా ఉండు, “ ఇంతే చెప్పగలిగాడు అతను.
***
ఉదయాన్నే 6 గంటలకే స్నిగ్ధ ఋషికి ఫోన్ చేసింది.” గుడ్ మార్నింగ్ ఋషి, నువ్వు మాంచెస్టర్ తిరిగి వచ్చేసావా?” అని అడిగింది.
ఋషి మిలాన్ వెళ్ళినప్పటి నుంచి ఆమె కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కుంటోంది. ఋషి మిలాన్ వెళ్ళిన రోజున, మృణాల్ మరొక్క అడుగు ముందుకు వేసి, ఆమెను బలాత్కారించేందుకు ప్రయత్నించాడు. ఆమె చెంపదెబ్బ కొట్టి, పారిపోయి వచ్చింది. ఆమె అతన్ని చూడడం అదే చివరిసారి.
ఆ తర్వాత ఆమె, విశ్వామిత్ర పెయింటింగ్ కు సంబంధించిన ఆలోచనల్లో మునిగిపోయింది. మొదట మృణాల్ పొరపాటున ఆ పెయింటింగ్ కొని ఉంటాడని ఆమె భావించింది. కాని, మిలాన్ నుంచి ఋషి చేసిన కాల్ ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. తాను అమ్మిన పెయింటింగ్ నే మృణాల్ మళ్ళీ మ్యూజియం కోసం కొనుక్కొచ్చాడని ఆమె నమ్మలేకపోయింది. మృణాల్ ఇదంతా ఎందుకు చేసి ఉంటాడో ఆమెకు అంతుబట్టలేదు.
ఈ నిజం తెలియడంతో ఆమె మనసే ఆలోచనలతో కల్లోలంగా ఉండగా, ఋషి సూచన మేరకు ఆఫీస్ కు వెళ్ళగానే ఆమెకు ఎదురైన పరిస్థితులు ఆమెను మరింత కల్లోల పరిచాయి. ఆమె తలుపు తియ్యగానే మృణాల్ నేలపై చచ్చి పడుండడం కనిపించింది. మొదట అతడు తాగి పడిపోయాడేమోనని ఆమె భావించింది. కాని, అతడిని బోర్లా తిప్పగానే, అతని పొట్టలో ఒక బులెట్ ఉండడం ఆమె గమనించింది. దాని చుట్టూ రక్తం గడ్డకట్టి ఉండడంతో, ఆతనిక లేడని ఆమె తీర్మానిన్చుకుంది. తర్వాత ఋషి చెప్పినవిధంగా వెంటనే ఆ చోటు వదిలి వెళ్ళింది. రాత్రంతా ఫ్రెండ్ వద్ద ఉంది, జరిగిన వాటితో ఆమె పూర్తిగా భయపడిపోయింది.
రాత్రంతా ఆమె నిద్రపోలేకపోయింది. ఋషి రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ, ఉదయాన్నే కాల్ చేసింది.
“అవును స్నిగ్ధా, నేను ఉదయం 4 గం.లకే మాంచెస్టర్ వచ్చేసాను. నువ్వెక్కడ ఉన్నావో నాకు చెప్పు.” అడిగాడు ఋషి.
స్నిగ్ధ అడ్రస్ చెప్పింది. ప్రస్తుతం ఆమె తన కాలేజీ ఫ్రెండ్ వద్ద ఉంది.
(సశేషం)



No comments:

Post a Comment

Pages