బంగారాలు......
హరీష్ గొర్లె
సబరీ నదిలోని
కొన్ని చేపపిల్లలు చిత్రంగా
నా జీవనసంద్రంలో జతకలిసాయి.
అక్షరాలు నేర్చుకుంటూ
అల్లరల్లరిగా నా గుండెల్లొ
చేసిన చిరు సందళ్ళ అలజడికి
ఉద్వేగపు అలలు నన్నుతట్టి
సంతోషాలు వినిపించేలా మార్చాయి.
ఒక్కసారిగా పౌర్ణమి వెలిగి
నా జీవితం ఏదో చెప్పడానికి ప్రయత్నించింది.
హృదయలోతుల్లోని కెరటాలు
క్షీరమైనట్టు ఎగసిపడుతున్నాయి.
తుళ్ళుతున్న ఈ చేపపిల్లలకి
జీవితాన్ని నేర్పుతున్న ఉపాధ్యాయుడిని నేను..
నాలో కలిసిన కూతుళ్ళు వాళ్ళు..
పిల్లల నవ్వుల వెన్నెల్లో
నా జీవితం మెరుస్తుంటే
నిశ్శబ్ధంగా వుండలేకపోతున్నాను.
ఈ విద్యార్ధినులను కూతుర్లుగా చూసుకున్నప్పుడల్లా
నాలో ప్రేమ గర్వంగా ఘోషిస్తుంది.
(నాకు పుత్రికా సమానులైన నా స్కూల్ పిల్లలకు అంకితం...)
No comments:
Post a Comment