ఎట్టు దరించెనో యిందాఁకాను - అచ్చంగా తెలుగు

ఎట్టు దరించెనో యిందాఁకాను

Share This
తాళ్లపాక అన్నమాచార్య శృంగార సంకీర్తన
ఎట్టు దరించెనో యిందాఁకాను(అర్థ తాత్పర్య విశేషాలు)
రేకు: 661-6
సంపుటము: 14-366
 -డా. తాడేపల్లి పతంజలి

ఎట్టు దరించెనో యిందాఁకాను
దట్టమై యిప్పుడే తమకించీని    ॥పల్లవి॥
1.కన్నులకలికి కాఁకలు చల్లీ
మన్నన చూపుల మగనిపయి
వెన్నెల నవ్వులు వెదలువెట్టీ
పన్నినమోహానఁ బ్రాణేశుమీఁద   ॥ఎట్టు॥
2.చిలుకలకొలికి చేతులు చాఁచీ
వెలయు సిగ్గుల విభునిపై
చలివేఁడివూర్పు సారెకుఁజల్లీ
కలిమి మెరసి కాంతునిమీఁద     ॥ఎట్టు॥
3.అలిమేలుమంగ ఆయాలు మోపీ
యెలమి శ్రీవేంకటేశునిపై
నిలువున ముద్దు నేఁడే గునిసీ
యిలఁ దనపతి యీతనిఁ గూడి   ॥ఎట్టు॥     
అర్థ తాత్పర్య విశేషాలు
పల్లవి
ఇప్పటివరకు, ఈవేంకటేశుని కలియనంతవరకు (ఇంత+దనుక= ఇందాక) మా అలమేలుమంగమ్మ ఈ మోహాన్ని ఏ విధముగా అంగీకరించిందో ! తెలియదు కాని, (దరించు= అంగీకరించు) 
ఈవేంకటేశుని  చూడటం తోనే  ఆ ఇష్టము గాఢమై ఇప్పుడే త్వరపడింది. మోహపడింది.
01వ చరణం
ప్రాణనాయకుడైన వేంకటేశ్వరుని పై  కలిగిన మోహముతో ( పన్నిన= కలిగిన)
మా అలమేలు మంగమ్మ  ప్రాణ నాథుడైన వేంకటేశుని కన్నులందు మనోజ్ఞమైన (కలికి= మనోజ్ఞము)  తాపాలను(కాఁకలు= తాపాలు)  చల్లింది.
తన మగనిపయి కురిపించే చూపులలో కాసింత గౌరవాన్ని అట్టే పెట్టింది.( మన్నన= సమ్మానము, గౌరవము, గొప్పచేయడము)
వెన్నెలలా చల్లగా ఉండే తన నవ్వులలో   శృంగార బాధలను కలిపి మావేంకటేశుని తీపి బాధలకు గురిచేసింది. (వెదలు= వ్యథలు)
2 వచరణం
తన మగనిపై   ప్రకాశించు తన  సిగ్గులతో  ( విభుడు= మగడు, ప్రభువు) (వెలయు= ప్రకాశించు)
చిలుకలకొలికి వంటి  మా  అలమేలు మంగమ్మ  వేంకటేశుని కొరకు  చేతులు చాచింది.
(చిలుకలకొలికి=1. చిలకకొలికివంటి కొలుకులుగల ఆడుది; 2.a woman having eyes as beautiful as those of a parrot. This seems to make no sense, for the parrot is not famed for the beauty of its eyes; perhaps the కొలికి is an error for కులికి, from కులుకు=grace, elegance.శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953)
అందగాడైన తన  మగనిపై  చూపుల సంపద ప్రకాశిస్తుండగా ( కాంతుడు= మగడు, అందగాడు)( కలిమి= సంపద)
చల్లగాను, వేడిగాను ఉన్న తన శ్వాసను మాటి మాటికి  భర్తపై  చల్లుతోంది.(సారెకు= మాటి మాటికి)
3 వచరణం
శ్రీవేంకటేశుని  సంతోషముతో   చూస్తూ  (ఎలమి= సంతోషము)
మా అలమేలు మంగ  ఇవి, అవి కలబోసిన  సంగతులను  తన చూపులలో ఆనించి (ఆయాలు= ఈ ఆ, వివిధమైన.ఆ + ఆ.) (మోపి= ఆనించి)
ఈ భూలోకంలో తన భర్తగా ప్రసిద్ధిని పొందిన  ఈ వేంకటేశుని కలిసి
ఆపాదమస్తకము   ముద్దును (నిలువున= ఆపాదమస్తకము) ఈరోజు మా అలమేలు మంగమ్మ  భర్తపై కురిపిస్తూ  అతనిని చలింపచేస్తోంది. ( గునియు= చలింపచేయు)
విశేషాలు
1.”ప్రాణ నాథుడైన వేంకటేశుని కన్నులందు మనోజ్ఞమైన   తాపాలను   చల్లింది.
2.తన మగనిపయి కురిపించే చూపులలో కాసింత గౌరవాన్ని అట్టే పెట్టింది.
3.మా అలమేలు మంగ  ఇవి, అవి కలబోసిన  సంగతులను  తన చూపులలో ఆనించింది “అను భావాలు చిత్రాలకు అందనివి.
ఎంత గొప్ప చిత్ర కారుడయినా వీటిని చిత్రించలేడు. కేవలం ఆలోచనకు మాత్రమే అందే మధురమైన భావాలు.ఇవి అన్నమయ్య భావాలు. 
-  స్వస్తి   -

No comments:

Post a Comment

Pages