స్పూర్తిదాయక చిత్రకారిణి - మన్నెం శారద - అచ్చంగా తెలుగు

స్పూర్తిదాయక చిత్రకారిణి - మన్నెం శారద

Share This
స్పూర్తిదాయక చిత్రకారిణి - మన్నెం శారద 
భావరాజు పద్మిని 

ప్రముఖ రచయిత్రిగా అందరికీ సుపరిచితమే మన్నెం శారద గారు. అయితే, ఆమెకు చిత్రకళ పట్ల కూడా తగని మక్కువ. అందుకే కళా తృష్ణ తీర్చుకోవడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపిస్తూ, ఆవిడ వేసిన బొమ్మలు చూసి, మెచ్చిన స్నేహితులు వాటిపై కవితలు, పద్యాలు రాసారు. వారి చిత్రకళా విశేషాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం...

మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి.
నా బాల్యం అంతా మా నాన్నగారి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో జరిగింది . మా ఇంట్లో రెండవ సంతానాన్ని నేను. పుట్టిన వూరు కాకినాడ . టీవల నా బాల్యం గురించి 'చిగురాకు రెపరెపలు’ అనే పేరుతో పుస్తకం రాసాను .కుటుంబపరంగా స్త్రీలకి అంత స్వేఛ్చ ఇవ్వని నేపద్యం .దానితో కొంత పోరాటమే జరిగింది. 

 మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా?
ఎవరూ లేరు కానీ, మేము నలుగురు సిస్టర్స్. అందరం బొమ్మలు వేస్తాం. అందులో ఎక్కువగా కృషి చేసింది నేను మాత్రమే !


చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది ?
అవును. వూహ తెలిసినదగ్గరనుండీ ఏదో ఒకటి వేస్తూనే వచ్చాను .ప్రోత్సాహం మాత్రం లేదు. ఇంట్లో రవివర్మ పెయింటింగ్స్ ఉండేవి. వాటిని చూసి వేస్తుండే దాన్ని .అలా చిన్నగా నాకు నేనే ప్రోత్సహించుకుంటూ వేసేదాన్ని .కొందరు ప్రముఖ చిత్రకారులు  
చిన్నతనంలో నేను మాచర్లలో నాపరాళ్ళ మీద వేసిన బొమ్మలు చూసి, ఈఅ మ్మాయి భవిష్యత్తులో గొప్ప చిత్రకారిణి అవుతుందని వారిదగ్గరకి పంపిస్తే మెళకువలు నేర్పుతామని, మా నాన్న గారిని అడిగారు .అందులో నాగార్జునసాగర్ మోడల్ డాం నిర్మించిన గుఱ్ఱం మల్లయ్య గారు ఒకరు .కానీ మా వాళ్లకి చిత్రకళ అంటే చిన్నచూపు కనుక పంపలేదు.



మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ?
గురువులు అంటూ లేనే లేరు. చిన్నప్పుడు JPసింఘాల్, రవివర్మల బొమ్మలు చూసి ప్రాక్టీస్ చేసేదాన్ని. నా
ఆనందం కోసం వేసుకోవడమే . నేర్చుకోవాలని అనుకున్నప్పుడల్లా అనేక ఇతర వత్తిడులు అడ్డం వచ్చేవి .

రచయిత్రిగా, చిత్రకారిణిగా రాణించాలంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి కదా ! మీకు అటువంటివి ఏమైనా ఎదురయ్యాయా?
నేను ఏమయినా ఒడిదుడుకులు ఎదుర్కున్నానంటే అది కేవలం నా ఇంటినుండే .ఇందులో నా పొరపాటు ఎక్కువగా వుంది. నన్ను నేను  ప్రొజెక్ట్ చేసుకోవడంలో లోపం
అది. ఇంటి బాధ్యతలు నేను ఎక్కువగా స్వీకరించాల్సి వచ్చింది . జాబ్ చాలా బిజీ జాబ్ కావడంతో టైం సర్దుబాటు చేసుకోలేక పోయాను.

 మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
చిన్నప్పుడు JPసింఘాల్ బొమ్మలు చూసి ప్రాక్టీస్ చేసేదాన్ని .నాకు నేనే తంటాలు పడి రంగులు మిశ్రమాలు తయారు చేసుకునేదాన్ని .ఇప్పటిలా రంగులు సెకండరి కలర్స్ అంటారు కదా, అవి దొరికేవి కావు .అన్నీ ప్రైమరీ కలర్సే. ఆ తర్వాత వుద్యోగం ,ఇల్లు
రచయిత్రిగా ఎక్కువగా ఇన్వాల్వ్ కావడంతో పెయింటింగ్ ని పక్కకి పెట్టేసాను.

మళ్ళీ చిత్రాలు వెయ్యడం ఎప్పుడు, ఎలా మొదలుపెట్టారు?
అనుకోకుండా రెండున్నర సంవత్సరాలక్రితం ఫేస్ బుక్ లోకి వచ్చాను ఒకరోజు కంప్యూటర్ లో పెయింటింగ్స్  వేసే అవకాశం ఉంటుందని తెలిసి, చిన్నగా వేయడం అలవాటు చేసుకున్నాను .మొదట చాలా కష్టమయ్యేది పెన్సిల్ గిరగిరా తిరిగి పోయేది .రంగులు ఒకదానితో మరొకటి బ్లెండ్ కావు .మెల్లిగా నాకు నేనుగా “trail and error methodలో ప్రాక్టీస్ చేస్తూ రోజూ ఒక బొమ్మా వేస్తున్నాను .కేవలం నా తృప్తీ కోసమే ఇదంతా !

చిత్రాల్లో మీరు ఏ ఏ రకాలను ప్రయత్నించారు?
నిర్మల్ పెయింటింగ్స్ లా  మేష్ నైట్  మీద కూడా వేసే పట్టు సాధించాను . వాటర్ కలర్స్ ఆయిల్ పెయింటింగ్స్, చివరికి ఫేబ్రిక్ పెయింటింగ్ లో కూడా చాలా ప్రయోగాలు చేసాను .అంతా కేవలం సృజనాత్మకతే !

భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి?
ఎవరికయినా సలహాలిచ్చేంత పెద్ద ఆర్టిస్ట్ ని కాను గానీ నా సలహా ఒకటే ...మిమ్మల్ని మీరు పోగొట్టుకోకండి .మీ అభిరుచుల్ని ఎవరికోసమో చంపుకోకండి ,పేరు ప్రతిష్టల కోసం కూడా ప్రాకులాడనవసరం లేదు. మీరు నిజంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే అవి వాటంతట అవే
లభిస్తాయి. వెంపర్లా డి కొనితేచ్చుకున్నవాటికి గౌరవం వుండదు.

మన్నెం శారద గారు మరిన్ని స్పూర్తిదాయకమైన చిత్రాలు గీసి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తోంది – అచ్చంగా తెలుగు. 



 ****

No comments:

Post a Comment

Pages