పరకామణి సేవ
-చెన్నూరి సుదర్శన్
పంచషష్టి వయసు మీరబోతోంది. ఏదైనా పుణ్య కార్యక్రమంలో పాల్గొనాలని నామనసు పదే, పదే ప్రాకులాడుతోంది. ఆ వయసుతో ముడిపడిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి సేవలు గుర్తుకు వచ్చాయి. సర్వీసులో ఉండగా స్వామి వారిని దర్శించుకోవడమే తప్ప వారి సేవలు చేసుకునే అవకాశంకోసం ప్రయత్నించ వీలుకాలేదు.
పనుల ఒత్తిడి..
నేను పదవీ నిరమణ చేసినా.. పది మందికి జీవనోపాధి కల్పించాలనే సంకల్పంతో ఒక పరిశ్రమ స్థాపించాలనే ధ్యేయం అడ్డుపడింది.
చివరికి సాధించాను. అది కుటీర పరిశ్రమ.. ‘ప్లాస్టిక్ సంచులు వాడకం రద్దు.. పేపర్ సంచులు ముద్దు’ అనే నినాదంతో నడుస్తోంది. అందులో పేపర్లతో చేసంచులను తయ్యారు చెయ్యడం.. కంపెనీ డైరక్టర్ అయిన నా సతీమణి దమయంతి చూసుకుంటుంది.
నేను కాలేజీలో పాఠాలు చెప్పడమూ దైవ కార్యక్రమమే అని భావించే వాణ్ణి. తదనుగుణంగా పదవీ విరమణ అనంతరం బీద పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పడమూ మానలేదు.
చతుర్విద దానాలలో విద్యా దానం అత్యంత ప్రశస్తమైనదని నా ప్రగాఢ విశ్వాసం.
పదవీ విరమణ అనంతరం.. ఇలా క్షణం తీరిక లేకుండా.. పనిచెయ్యడం వెనుకాల పెద్ద కథ దాగి వుందనే చెప్పాలి. అలాంటి కథలు నేడు సర్వసాధారణమై పోయాయి.. ఇంటింటి రామాయణమే..
కొడుకులను కష్టపడి చదివించడం.. వారికిష్టమైన పెళ్లిళ్ళు జరిపించడం.. వారు నిర్దయులు.
మనకష్టాలను కాలదన్ని.. వారి ఇష్టాలకెగబాకి అమెరికాకెగిరి పోయేపిల్లల్లో నా ఒక్కగానొక్క కొడుకేమీ అతీతుడెమీ కాడు. వాడు ఎప్పుడొస్తాడో తెలియదు.. కనీసం మాకు తలగొరివి పెట్ట వస్తాడన్న నమ్మకమూ లేదు. వాని దయ.. మాప్రాప్తం. తలుచుకుని ఫాయిదాలేదు.. ఆ సర్వంతర్యామిని తలుచుకున్నా ఫలితముంటుందనే మార్గం.. స్వామివారి సేవ చెయ్యాలనే కోరికకు కారణమయ్యింది.
కాని స్వామి వారి సేవకు వయసుకు లంకె వుంది.
లడ్డూ ప్రసాద సేవ.. పరకామణి సేవలో తరించాలంటే అరవై ఐదు సంవత్సరాలు మించితే అనుమతిలేదు. పైగా రెండు సేవలకు మధ్య కనీసం మూడు మాసాల వ్యత్యాసముండాలానే నియమమూ వుంది..
కాలాతీతంగాకుండా స్వామి వారి పరకామణి సేవకు అంతర్జాలం ద్వారా దరఖాస్తు చేసు కున్నాను. స్వామి వారి కృపకు పాత్రుడనయ్యాను కాబోలు.. శ్రీవారి సేవకు అనుమతి లభించింది. నాసంతోషానికి అవధులు లేవు.
పరకామణి హాల్లో డబ్బులు.. ముడుపులు వేరు చేసే కార్యక్రమంలో భక్తులు తమ హృదయాలలోని ఆవేదనలు.. వానిని పరిష్కరించుమని స్వామివారికి సమర్పించుకునే వేడుకోలు
ఉత్తరాలు చూసి గుండె బరువెక్కేది.. కళ్ళు చెమర్చేవి.
అలాంటి ఉత్తరాలలో.. ఒక ఉత్తరం నా కంట కన్నీరు తెప్పించింది. దాని సారాంశం..
‘శ్రీవెంకటేశ్వరస్వామీ.. మా అక్కయ్యకు త్వరగా ఉద్యోగం దొరికేలా.. నా వివాహం అయ్యేలా చూడు స్వామీ.. సదానందం - నల్గొండ’ అని సెల్ ఫోన్ నంబరు రాసి వుంది.
నాకు ఆశ్చర్యమేసింది..మదిలో ఆలోచనలు చెలరేగాయి.
‘అక్కయ్యకు ఉద్యోగామేనా..! ఆమె వివాహం సంగతి?. ఆమెకు వివాహం గాకుండా చిన్నవాడైన అతడికి పెళ్లి కావాలని కోరుకోవడమేమిటి?. ఒక వేళ ఆమె వివాహితురాలైతే.. ఆమె భర్త ఉద్యోగం చెయ్యడం లేదా.. ఆమెకెందుకుద్యోగం? అతడికి ఉద్యోగం వద్దా..?’ ఇలా పరి పరి విధాల నా మనసు ఆలోచించసాగింది.
అతడి వివరాలన్నీ నాకింకా గుర్తున్నాయి.
***
అదే రాత్రి ఫోన్ చేసాను. అతడు ఫోన్ ఎత్తాడు..
“హలో.. సదానందంగారేనా మాట్లాడేది” అడిగాను.
“హలో సార్.. సదానందంనే మాట్లాడుతున్నా.. మీరెవరు సార్..” అతడి గొంతు సౌమ్యంగా వినిపించింది.
నాకు కాస్తా ధైర్యం వచ్చింది. విషయం అడుగొచ్చు అని నిర్ధారించుకున్నాను.
“సదానందంగారు.. నా పేరు దయాకర్. నేను తిరుపతి నుండి మాట్లాడుతున్నాను”
“దయాకరా.. తిరుపతినుండా..!” ఆశ్చర్యంగా అడిగాడు.
“అవునండీ.. నేను మీకు తెలియదు. మీరు నాకు తెలియదు” అనేసరికి మరింత ఆశ్చర్యపోయినట్లు ధ్వనించింది. మరైతే ఎందుకు ఫోన్ చేస్తున్నట్లు?. అనుకొని వుంటాడు.. రాంగ్ నంబని ధబాల్న ఫోన్ కట్ చెయ్యక పోవడం నాలో ఉత్సాహం రెట్టింపయ్యింది.
“నేను స్వామి వారి పరకామణి సేవ కోసం తిరుమల వచ్చాను. హుండీలో మీకోరికలను స్వామివారికి రాసి సమర్పించిన చీటీ దొరికింది. అందులో మీ వివరాలు చూసి ఫోన్ చేస్తున్నా..” అని విషయం వివరించాను. ఎలా స్పందిస్తాడోనని కాసేపు సమయమిచ్చాను..సమాధానం రాలేదు. నేనే తిరిగి ప్రశ్నల వర్షం కురిపించసాగాను.. నా అనుమానాల నివృతి కోసం.
“మీ అక్కయ్యకు ఉద్యోగం రావాలని.. నీకు వివాహం కావాలని స్వామివారిని కోరుకున్నావు. నీకక్కరలేదా ఉద్యోగం.. ! ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకుంటే బతుకు భారం కాదా..”
సదానందం నుండి సమాధానం రాలేదు.
“స్వామివారే నిన్నిలా అడిగితే మౌనంగా ఉన్నావనుకో.. ఏం ప్రయోజనం..?” అని చిన్న ఝలకిచ్చాను.
“సార్.. మా అక్కయ్యకు ఉద్యోగమొస్తే చాలు సార్..” మొత్తానికి ఒక సమాధానం రాబట్టగలిగాను.
“అదెలా..సదానందం..!” మెల్లిగా చొరవ తీసుకుని ఏకవచన ప్రయోగానికి దిగాను. ఎలాగూ నాకంటే.. చాలా పిన్నవయస్కుడేగనుక.
“అక్కయ్య ఉద్యోగంతో మేమంతా బతుకొచ్చు..” అన్నాడు సదానందం. నాకు ఆశ్చర్యమేసింది.
“అక్కయ్యకు కుటుంబం లేదా.. ఆమె భర్త అడ్డుకోడా..” అడిగాను.
“అక్కయ్యకి పెళ్లి కాలేదు సార్.. కాదు కూడా..” అంటుంటే అతడి గొంతు బొంగురుపోయింది. ఏడుస్తున్నట్లు అర్థమవుతోంది.
“ఎందుకు కాదు.. ఆమెకు ఉద్యోగమొస్తే పెళ్లి అవుతుంది. అప్పుడామే అత్తవారింటికి వెళ్లి పోతుంది. ఆ తరువాత మీ గతేమవుతుంది?..
బాబూ..! సదానందం.. నేను స్వామివారి దగ్గరే వున్నాను. నీ తరపున ఆలయంలోని స్వామి వారి బండపలకపై వ్రాస్తాను.. నీకు స్వామివారిమీద నమ్మకముంటే.. నాకు కాస్తా వివరంగా చెప్పు” అంటూ అతడికి, భక్తికి చిన్న ఫిట్టింగ్ పెట్టాను.
కొద్ది సెకన్లు మా మధ్య మౌనం..
సదానందం హృదయం తెరిచాడు.
“సార్.. మా అక్కయ్య డిగ్రీ పాసయ్యింది.. దివ్యాంగురాలు. రెండు కాళ్ళూ చచ్చు పడి పోయాయి.. నడువలేదు. ఆమెనెవరు పెళ్లి చేసుకుంటారు సార్..! రిజర్వేషన్ కోటాలో ఉద్యోగమం రావాలని స్వామి వారికి రోజూ పూజలు చేస్తున్నా..
నాన్న మేస్త్రీ పని చేసే వాడట. నా చిన్న తనంలోనే నాన్న కాలం చేసాడు. నాకేమో చదువు అబ్బలేదు.. అక్కయ్యకు చదువు మీద మక్కువ. అది గమనించి అమ్మ కూలిపని..నాలుగిండ్లల్లో పాచి పని.. చేస్తూ చదివించింది. నేను ఎంతగా వారించినా మా అమ్మ ఇంకా రెక్కలు ముక్కలు చేసుకుంటూనే వుంది. నేనూ వేన్నీళ్ళకు చన్నీళ్ళలా సహాయ పడ్తూనే వున్నా ఐదు వెళ్ళు నోట్లోకి వెళ్ళడం లేదు.
అక్కయ్యకు ఉద్యోగమొస్తే అమ్మకు విశ్రాంతి లభిస్తుంది. అక్కయ్యకు.. అమ్మకు సేవాలు చేయాలంటే ఒక ఆడ మనిషి అవసరం కదా.. అందుకే నాకు త్వరగా పెళ్లి కావాలని స్వామివారికి ఉత్తరం రాసా..”
“నీకు పెళ్ళైతే నీ భార్య వారికి సేవ చేస్తుందని గ్యారంటీ ఏంటి?” అంటూ రెట్టించాను.
“ఒక ఆడకూతురు సంపాదనకు ఆశించడం తప్పుకాదా.. పైగా ఆమె జీవితాంతం
బ్రహ్మచారిణిగావుండి మీకు సంపాదించి పెట్టాలా..? దివ్యాంగురాలైతేనేమి.. ఎందరికి పెళ్ళిళ్ళు జరగడం లేదు.. ఎవరో ఒక మహాను భావుడు ఆమె కోసం రాసి పెట్టే వుంటాడు భగవంతుడు.. ” అని నిలదీసే సరికి ఎక్కడలేని పౌరుషం పొడ్చుకు వచ్చిందేమో..! కస్సున నా పైకి లేచాడు సదానందం..
తప్పించుకునే ధోరణిలో కేక పెట్టి కదిలే ప్రయత్నంచేసాను..
మెళకువ వచ్చింది..
“ఏమయ్యింది సార్.. ఏమైనా కలగన్నారా..!” అంటూ నా ప్రక్క బెడ్ పై పడుకున్న శర్మ గారు నన్ను కదిపారు.
కళ్ళు నులుముకొని చూసాను. ఎదురుగా శర్మగారు చిరునవ్వు నవ్వుతూ కనిపించాడు.
“అవును సార్.. ఎదో కల వచ్చింది..” అంటూ లేచి హాల్లో వున్న గడియారం వంక చూసాను.. తెల్లవారు ఝాము నాలుగు కావస్తోంది.. బాత్ రూం వైపు దారి తీసాను.
***
ఆమరునాడు సాయంత్రం సదానందంకు ఫోన్ చేసాను. స్విచ్చాఫ్ వచ్చింది.
పరకామణి సేవ నాలుగు రోజుల కార్యక్రమం ముగించుకొని హైద్రాబాదులోని మాఇంటికి తిరిగి వచ్చాను.
నా మదిలో అవే ఆలోచనలు.. సదానందం కలలో చెప్పిందంతా నిజమేనా.. అతడి అక్కయ్య వాస్తవంగా దివ్యాంగురాలా..! తెల్లవారు ఝామున వచ్చిన కలలు నిజమవుతాయని అంటారు.
విషయం తెలుసుకోవాలని నాలో కుతూహలం క్షణ క్షణానికీ అధికం కాసాగింది.
మళ్ళీ.. మళ్ళీ ఫోన్ చేసాను. అదే సమాధానం స్విచ్చాఫ్... స్విచ్చాఫ్.
చరవాణి నంబరు బి. ఎస్. ఎన్. ఎల్. అని గమనించాను. అందులో నా స్నేహితుడు మోతీఅహ్మద్ కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. వెంటనే అతడికి ఫోన్ చేసి నంబరిచ్చి చిరునామా కనుక్కోమన్నాను.
అరగంటలో చిరునామా తెలిసింది.. మోతీఅహ్మద్‍కు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఆ మరునాడు ఉదయమే నల్గొండకు జన్మభూమి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో బయలు దేరాను.
నల్గొండ చేరే సరికి తొమ్మిదయ్యింది.
చిరునామా కనుక్కుంటుంటే అంతా నన్ను చాలా ఆశ్చర్యంగా చూడసాగారు. సదానందం మీకేమవుతాడని.. మీకెలా తెలుసనీ.. పలు ప్రశ్నలు సంధించసాగారు. నాకర్థం కాలేదు. అయినా నైపుణ్యంగా ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిస్తూ సదానందం ఇంటి వేటలో నిమగ్నమయ్యాను.
రామన్న వీధిలో అల్లంత దూరంలో సదానందం ఇల్లు.. అది కనబడకుండా మూగిన జనాన్ని చూసి నిర్ఘాంతపోయాను.
నేనొక అనామకుడిగా జనంలో కలిసిపోయాను. విషయం తెలుసుకుందామని...
“చూడమ్మా సంధ్యా.. జరుగరాని ఘోరం జరిగిపోయింది. మన చేతుల్లో ఏముంది చెప్పు అంతా ఆ దేవుని లీలలు. ఎలా జరుగనుందో.. అలా జరుగక మానదు. నువ్వేమీ అధైర్యపడకురా.. మేమంతా లేమా.. ఇంకెన్ని రోజులు ఏడ్చినా లాభం లేదు. ఏడువకమ్మా ..ఏడ్చీ, ఏడ్చీ కళ్ళు వాచిపోయాయి.. నిన్ను చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది.. ఊరుకో తల్లీ.. ఊరుకో..” అంటూ ఒకామె సంధ్యను ఓదార్చుతోంది.
సంధ్య ఎవరో కాదు.. నా కలలో చెప్పిన సదానందం అక్కయ్య.. ఆమె ప్రక్కకు రెండు చేతి సహాయ కర్రలు కనిపించాయి. కాళ్ళు పరీక్షించాను. నిజమే..! ఆమె సదానందం అక్కయ్యనే.. దివ్యాంగురాలు. అప్రయత్నంగా నాకళ్ళు చెమర్చాయి. నా కల నిజం మయ్యింది..
సదానందం కనబడ్డం లేదేమీ..! అని ఆలోచిస్తున్నాను..
“తమ్ముడు గాడు చేసిన పనికి పిల్ల బతుకు బజార్ల పడిపోయే.. ఎలా బతుకుతుందో ఏమో..!” మరొక తల్లి నిట్టూర్పు విడువసాగింది.
“సదానందం లాంటి వాడు నాకొడుకైనా చంపి పోగులు పెట్టేవాణ్ణి. మంచి పని చేసింది సత్తెమ్మ. ఉండి వాడేమైనా వీళ్ళనుద్ధరించే వాడా..! కాల్చుకు తినడం తప్ప.
తాగుడుకు డబ్బులివ్వకుంటే తల్లి అని కనికరం లేకుండా తన్నేవాడు. ఆ దెబ్బలకు ఎలాగూ సచ్చేదే సత్తెమ్మ.. అందుకే వాణ్ని చంపి తను జైలుకు పోయింది..
కాని సత్తెమ్మకు ఆక్షణంలో సంధ్య బతుకు ఆలోచనకు రాలే.. అయినా సదానందం చస్తాడనుకుందా?..
మైకంలో సదానందం తనను కొట్టడానికి వస్తుంటే భయంతో నెట్టేసింది. వాని తల పోయి స్వామివారి పటానికి తగిలింది. పటానికున్న మేకు వాని తలలో దిగింది. అలాగే గోడకు కరుచుకొని ప్రాణాలు వదిలాడు. ఘోరం జరిగిపోయింది.
భగవంతుడు.. వాని చావు సత్తెమ్మ చేతిలో రాసి పెట్టాడు....” అంటూ జనంలో ఒకడు కన్నీరు కార్చసాగాడు.
నాకు విషయమంతా అర్థమయ్యింది.
నా కలలో చెప్పినట్లు సదానందం వారికి చేదోడు వాదోడుగా గాకుండా తాగుడుకు బానిసై తన స్వార్థం తాను చూసుకో బోయాడు. అక్కయ్య సంధ్య దివ్యాంగురాలు అనే వంకతో ఆమె వివాహానికడ్డు పడే వాడు.
సంధ్యకు ఉద్యోగమొస్తే సత్తెమ్మను ఎలాగో అలాగా వదిలించుకునే వాడు. సంధ్య జీత భత్యాలతో బతుకాలని కలలు గన్నాడు.. కాని విధి వక్రించింది.. అంతా స్వామివారి
మహత్యంమేమో..!
అతడి ఆగడాలు సహించలేక సత్తెమ్మ కొడుకు ప్రాణాలు తీసి జైలు పాలయ్యింది. స్వామి వారు సదానందానికి తగిన శిక్ష విధించాడు. అనుకున్నాను. కాని పాపం..! సత్తెమ్మ ఏం పాపం చేసింది?. ఆమెకెందుకీ శిక్ష..? పూర్వజన్మలో ఆమె చేసుకున్న పాపఫలితం కావచ్చు. ఆ సర్వాంతర్యామి లీలలు మన కర్థంగావు.
ఇప్పుడు సంధ్య అనాధ అన్నది వాస్తవం.. నన్ను సంధ్యకు వెలుగు చూపుమని స్వామివారు పంపించారా..! ఇంటి అరుగుపై ఒక మూల కూర్చొని ఆలోచించసాగాను.
జనం నన్ను వింతగా చూసుకుంటూ ఒక్కొక్కరే వెళ్లి పోయారు.
సంధ్య తన చేతి కర్రలను రెండు చంకల కింద పెట్టుకొని నిలబడింది. నా వంక ఆశ్చర్యంగా చూడసాగింది. ఆమె మోములో దైవత్వం ఉట్టిపడుతోంది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కాళ్ళు మినహా సంధ్య అప్సరస అనడంలో అతిశయోక్తి లేదు.
దేశంలో ఎంతో మంది దివ్యాంగులున్నారు. చేతులు లేని వారు కాళ్ళతో.. కాళ్ళు లేని వారు చేతులతో.. పనులు చక్కదిద్దుకుంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవనయానం కొనసాగిస్తున్నారు. సంధ్యలో సైతం ఆత్మవిశ్వాసం కనబడింది.
నాలో పరకామణి సేవ అంతరార్థం బోధపడింది.
సంధ్యను చేరదీయడం.. స్వామివారి ఆజ్ఞగా తలచాను.
సంధ్యను నా దమయంతి స్థానంలో మా కంపెనీకి మేనేజింగ్ డైరక్టర్‍ను చేసి... ఒక ఇంటిదాన్ని చెయ్యాలనే ధృఢ సంకల్పంతో సంధ్య గుమ్మంలోకి అడుగులు వేసాను.
***
No comments:
Post a Comment