పుష్యమిత్ర - 15 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 15
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు బృహద్ధ్రదుని వద్దకు సైన్యాధికారి పదవి కోసం వెళ్ళిన సమయంలో సింహకేతనునితో తలపడి అతన్ని ఓడించగా,  సింహకేతనుడు ఆ నగరం వదలివెళ్తాడు. బృహద్ధ్రధుని అనుజ్ఞమేరకు ఆంధ్ర దేశానికి స్వయంవరానికి వెళ్ళిన పుష్యమిత్రుడు వసంతసేనను ఆలయంలో చూసి ప్రేమలో పడతాడు. అనుకోకుండా వారిద్దరికీ వివాహం అవుతుంది. వసంత సేనను కార్తీక పున్నమిరోజున సైనిక కవాతు సమయంలో సింహకేతనుడు పుష్యమిత్రుని వధించడానికి ముందుకొస్తాడు.  వసంత సేనను బంధించి తీసుకువస్తాడు. పుష్యమిత్రుడు సింహకేతనునితోబాటూ, బృహద్ధ్రధునీ వధించి సింహాసనం అధిష్టించి సుపరిపాలన సాగిస్తూ, బౌద్ధులను అదుపులోపెడతాడు. కొంతకాలం తరవాత కుమారుడు అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించి, రాణి వసంతసేన మరణానంతరం హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు (ఇక చదవండి)


అలికిడి వినిపించింది కానీ ఎవరూ లేరు. ఎదురుగా ఓ నీడ వచ్చి తన మీద పడింది. రెండడుగుల దూరంలో తెల్లని దూదిపింజలా  ఏదో ఆకారం నిలుచుని ఉంది. ఎవరో తెలీడంలేదు, కనపడడం లేదు. కళ్ళు నులుముకుని చూశాడు. అంతలో  వెండి మబ్బునుపోలిన కాంతిపుంజం ఒకటి కళ్ళముందు గోచరించింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపుతో పుష్యమిత్రుని ఎదుట నిలబడింది. ఒంటిపై అంగవస్త్రం తప్ప ఏమీ ధరించని ఓ మహాపురుషుడు సాక్షాత్కరించాడు. ఆయన కన్నులు తేజోమయంగా ప్రకాశిస్తున్నాయి. రాగిరంగు కేశాలు వెనుక నడుముభాగం వరకూ దట్టంగా కప్పివున్నాయి.  నాకు బాగా దగ్గరగా వచ్చి "పుష్యమిత్రా! నీకు కావలసినది ఈ కొండలూ మంచుగుట్టలూ ఇవ్వలేవు" అంటూ నా గుండె పైభాగంలో సుతారంగా చేత్తో తట్టారు. అంతే! నా శరీరం కదలకుండా పాతుకుపోయింది. నా సర్వశక్తులూ, నా వూపిరీ, శ్వాసా, ఎవరో లాగేసి నాలో ఏదో తెలీని శక్తిని ప్రవేశపెట్టిన భావన. నేను మునుపెన్నడూ ఎరగని ఒక సంపూర్ణ చైతన్యతో ఉన్న స్పృహ. అది కేవలం శరీరానికి కట్టుబడిలేదు. ఆశ్చర్యకరంగా భూమిలో ఉన్న చెట్ల వేళ్ళు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి జీవ రసప్రవహాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను. మామూలుగా ఎదుట ఉన్న వస్థువులు మాత్రమే కనబడే నాకు నా వెనుక జరిగే విషయాలన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి. నాలోని కేంద్రకం నుండి వెలువడుతున్న       ఉద్దీప్తప్రభ  విశ్వనిర్మితిలో ప్రతిభాగానికీ ప్రసరిస్తోంది. ఆ పరమేశ్వరుని స్వరం నాలో "ఓంకారం" గా ప్రతిధ్వనించడం గమనించాను. ఇదంతా కేవలం ఒక నిముషమే! అంతలో  హఠాత్తుగా నా వూపిరితిత్తుల్లోకి శ్వాస మరలా వచ్చింది. నా శరీరంలోకి నేను మరలా వచ్చేశానని గమనించాను. ఆ మహానుభావుని పాదాలపై సాష్టాంగ పడి నా మోము అతని పాదాలపై ఉంచి అతని పాదాలను గట్టిగా పట్టుకుని "స్వామీ! పరంధామా! తమరు సాక్షాత్తు పరమశివుడా! లేక సృష్టికర్తా! తెలీడంలేదు. మీరెవరు చెప్పేదాకా మీ పాదాలు విడువను అని గట్టిగా పట్టుకున్నాను.

“నాయనా! పుష్యమిత్రా! నేను ఉత్తర హిమాలయ ప్రాంతంలో ఉంటున్నాను. నన్ను అనేక శతాబ్దాలుగా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారు. నువ్వు నన్ను హిందూ దేశవాసులు పిలిచే పద్ధతిలో బాబాజీ అని పిలువవచ్చు. ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు సహాయపడడమే నా ధ్యేయం. హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పే ప్రతి వ్యక్తివెనుక నేను ఉంటాను. వారు పిలిచినా పిలవకపోయినా సహాయపడుతూనే ఉంటాను. ఆ పరంధాముని ఆశీస్సులతో వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మార్గదర్శనం చేస్తూనే ఉంటాను.”   అనగానే పుష్యమిత్రునికి దు:ఖం పొంగి పొరలింది. "బాబాజీ! క్షమించండి! నేను ఘోరపాపాలు చేశాను. ఒక సద్బ్రాహ్మణవంశంలో జన్మించి ఖడ్గం చేతబూని ఎందరినో తెగనరికాను. బౌద్ధులను  హింసించాను.  వారి సాంచి, సారనాధ్, అమరావతీ స్థూపాలను నేలమట్టం చేయించాను. పాపిని. మహాపాపిని. నాకు మీరు ఎందుకు దర్శనం ఇచ్చారో తెలీడంలేదు"

“ రాజ్యాంతే నరకం ధృవం” ఏ రాజుకైనా పాలన అయిన తరువాత నరకం తప్పదు. అది పాండవులకే తప్పలేదు. యుధిష్టిరుడు చివరకు స్వర్గారోహణ చేసినా, నరకంలోకి తొంగి చూడక తప్పలేదు. ధర్మరాజుకి కూడా ఒక్క సారైనా యుద్ధకాల ఆపద్ధర్మంగా "అశ్వద్ధామ హత:, కుంజరః" అనక తప్పలేదు కదా? కనుక, కల్మషపూరిత రాజకీయాలలో అనుక్షణమూ పాపకార్యాలలో మునిగి తేలుతూ వున్న ఈ రోజులలో, సద్ధర్మ పరిపాలన చేయటం, సత్యవాక్పరిపాలన చేయటం రాజధర్మంగా వుండాలీ అని ఎవరైనా అంటే సాధ్యపడదు కదా! అలాంటి క్లిష్ట పరిస్థితులలో నీవు జన్మించి హిందూ ధర్మ ప్రతిష్టాపనకు నడుం కట్టావు. 

"దాతా దరిద్రః, కృపణో ధనాఢ్యః
పాపీ చిరాయుః, సుకృతీ గతాయుః
రాజా అకులీనః , సకులీన సేవ్యః
షడౌగుణాః కలియుగమాశ్రయంతే." 
అంటే దాత దరిద్రుడిగా, లోభి ధనవంతుడిగా, పాపి దీర్ఘాయువుతొ, పుణ్యమూర్తి అర్ధాయుస్సు తోనూ, నీచుడు రాజు గానూ, ఉత్తముడు సేవకుడు గానూ వుండటం రాబోవు కలియుగపు ఆరు లక్షణాలుగా వేదాలు చెప్తున్నాయి. నీవు నీ ధర్మం నిర్వర్తించావు. ధ్యాన నిమజ్ఞుడవై ఉండు. నీకు ఇప్పటికి ఈ ధ్యానంలో పొందిన పరిపక్వత గొప్పదే! నీకు భ్రూకుటి ముందు ఒక జ్ఞాన జ్యోతి సదా సాక్షాత్కరిస్తున్నది కదా! కొన్నిమెట్లు పైకి ఎక్కినట్ట్లే లెక్క.  నీవు ఇంకా సాధన చేయవలసి యున్నది. ప్రస్తుతం కైలాసంలో ఆ పరమశివుడు మేధాదక్షిణా మూర్తిగా సాక్షాత్కరించి ఉంటారు. మౌనంగా అడిగిన ప్రశ్నలకు మౌనంగానే మనకు సమాధానాలను ఇస్తారు.  ఆశ్చర్యకరంగా కొన్ని వందల, వేల మంది జ్ఞానులకు ఒకే సారి సమాధానం లభిస్తుంది. ఆ సమయంలో నీ సమస్యకు కూడా పరిష్కారం అడిగి తెలుసుకుంటాను. అంతవరకూ జ్ఞాన సమాధిలో ఉండు. అని ఒక ఆకుపచ్చని ద్రవాన్ని నా తలపై చల్లి "పుష్యమిత్రా! ఆకలి దప్పులను జయించావు, కౄరమృగాలు నిన్ను చూడలేవు. " నేను రావడం ఎంత కాలమైనా నిరభ్యంతరంగా ధ్యాన సమాధిలో ఉండవచ్చు" అంటూ అదృశ్యమయాడు శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ.

నేనొక ఏకాంత ప్రదేశం వేపు నడిచాను. నిండు పున్నమి నక్షత్రాలకాంతిలో సుదూరంగా నడచి, నడచి ఒక రాతి బడపై కూర్చున్నాను. నాకు వెనుకభాగంలో ఒక పెద్ద కొండ. వెనుకకు తిరిగి చూశాను. కొండకు ముందు ఒక బండ అడ్డంగా లోపలగా ఏదో కలుగు..దగ్గరగా వేళ్ళి చూశాను. ఏదో గుహ లాంటి ప్రదేశం. అంతపెద్ద బండను నేను ఒంటిచేత్తో ఎలా తొలిగించానో తెలీదు. చేయి వేయగానే పక్కకు సునాయాసంగా తొలిగిపోయింది. లోనకు ప్రవేశించాను. అక్కడ లోపల ఉన్న ఒక బండపై కూర్చున్నాను. ధ్యాన నిమజ్ఞుడినయ్యాను.  కాలం తెలీడంలేదు.
* * *
కరిముల్లా కూపీ లాగడానికి వచ్చిన జిలానీ బాషాను సుమంత్ అరెస్టు చేసి ఢిల్లీ పోలీసులకు అప్పజెప్పాడు. అతనిపై సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయింది.  "మిస్టర్ జిలానీ బాషా! మారువేషంలో వచ్చినంత మాత్రాన ఇండియా పోలీసులు కనుక్కోలేరనుకున్నావా! నిజం చెప్పు! ఎవరు పంపించారు? నీకు కరిముల్లా గత జీవితంపై ఏమిటి పని?" అధికారి గర్జించాడు.

జిలానీ బాషా ఏమీ చెప్పడంలేదు. అధికారికి విసుగును ప్రదర్శిస్తూ ఉండగా తోటి అధికారి "సార్! మొన్న స్కాట్ ల్యాండ్ యార్డ్ నుంచి వచ్చిన "లై డిటెక్టర్ వాడవచ్చుగదా!" అనే సరికి గుడ్ ఐడియా! తెప్పించండి. ఈ లోపు వీడికి వేళ్ళను ఇనుప రాడ్ల మధ్య పెట్టి నొక్కే మిషన్ లో ఉంచి వీలైనంత హింసించండి. అని అనుజ్ఞ నిచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది. రక్తం ధారాపాతంగా కారిపోతోంది. ఎలాగూ లైడిటెక్టర్తో నీ చేత నిజం చెప్పిస్తాం. చెప్పు! ఈ హింస భరిస్తూ ఉంటావా! చెప్తావా! అని క్రింది అధికారులు ధర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్ర విచిత్రమైన హింసలకు నడుం కట్టారు.. జిలానీ " అల్లా....." అని అరిచే అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. 

నిన్ను మన  అల్లా కాపాడతాడనుకుంటున్నావా? జిలానీ బాషా! జీహాద్ అంటే ఏమిటో తెలుసా మీకు? ధర్మపోరాటం, న్యాయంకోసం పోరాటం అని అర్ధం. మీలాంటి తీవ్రవాదులు, ఉగ్రవాదులు, హింసకు పాల్పడే అరాచకవాదులు తమ దుర్మార్గపు పనులను కూడా జీహాద్ అనే పిలుస్తున్నందువలన ఇంత మంచి పదం బ్రష్టుబట్టిపోయింది. నేనూ ముస్లిమ్ నే! హిందూ దేశపు ముస్లిమ్ ను... జీహాద్ గురించి చెప్తా విను...జీహాద్ లు రెండు రకాలు. ఒకటి "జీహాద్-ఎ-కుబ్రా" అంటే మనలోని మంచి చెడుల మధ్య జరిగే అంతర్గతపోరాటం. రెండోది "జిహాద్-ఎ-సొగ్రా" అంటే...మన చుట్టూ జరిగే చెడును నివారించటంకోసం చేసే బహిర్గత పోరాటం. న్యాయాన్ని అమలుచేయడం. చెడును ఆపడం రెండూ జీహాదే. చెడును చేతితో ఆపగలిగితే ఆపు. చేతితో ఆపలేకపోతే నోటితో ఆపు. నోటితోకుడా ఆపలేకపోతే మనసులోనైనా చెడుపనిని అసహ్యించుకో అని మన ప్రవక్త చెప్పిన విషయం తుంగలో తొక్కి...మంచిని ఆపుతూ దుష్టులు జీహాద్ అని అరవటం వల్లనే ఈ పదం అభాసుపాలయ్యింది. జీహాద్ అంటరాని దయ్యంలా అయ్యింది. అల్ఖైదా లాంటి హింసాత్మక చర్యలు చేపట్టడం ఇస్లాం ప్రవక్త బోధనల ప్రకారం నిషిద్ధం...  నిషిద్ధ 'తక్ఫిరిజమ్' సిద్ధాంతాన్ని అల్ఖైదా అనుసరిస్తోంది. నీవు నిజమైన ముస్లింవు అయితే ఒప్పుకో ! అంటూ హూంకరించాడు ఆ ఇండియన్ ముస్లిం అధికారి.  మీ ముష్కర మూకలు ఖురాన్ను, ఇస్లామ్ ను అడ్డుపెట్టుకుని ఉగ్రవాద చర్యలకు పాలుపడుతుంది. మరి  ఇస్లామ్ మతపెద్దలు, మతాధికారులు వీరి చేష్టలను చూసి ఎందుకు ఉరకున్నట్లు వీరికి అల్లా నుండి ఆదేశాలు లేవా? వీరి అకృత్యాలను ఆపాటానికి. హింస జరుగుతున్న, జరుపుతున్న ప్రతీ సారీ సిగ్గులేకుండా ఇస్లామ్ను అడ్డు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైన మన ముస్లిమ్ మతపెద్దలు,మతాధి కారులు ఈ ముష్కర మూకల మతిమాలిన చేష్టలను, హింసాత్మక చర్యలను ఖండించి, హింసాత్మ చర్యలలో పాల్గోనవద్దని "ఫత్వా" ఎందుకు జారీ చేయ్యరు? అట్లు చెయ్యక పోతే మనం అంతా 'అల్లా' కు  సమాధానం చెప్పవలసి ఉంటుంది. "ఉగ్రవాది చర్యల కంటే మేధావి మౌనం చాల ప్రమాదకరమైనది". భారత్ ఎందుకు మౌనంగా భరిస్తోందో! ఎందుకు పీ.ఓ.కే. విషయంలో మౌనం వహిస్తోందో మీకు అర్ధం అయ్యే రోజు వస్తుంది. మరి మన ఇస్లామ్ను ఉగ్రవాదులు తమ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటే మతాధికారులు,మత మేధావులు చూస్తూ ఉరకుండటం నేరం కాదా? ఆలోచించుకోరా! కుక్కా! మతం పేరుతో మారణహోమాలు దయచేసి ఆపండి.. అని అరుస్తూ ఉండగా...  అధికారులు లై డిటెక్టర్తో గదిలో ప్రవేశించారు (సశేషం).

No comments:

Post a Comment

Pages