ఋష్యశృంగుడు
ఋషులు - గోత్రములు -7
పూర్వము కశ్యపుడు అను మునివర్యునకు విభాండకుడు అను కుమారుడు ఉండెను, ఆతను అస్కలిత బ్రహ్మచర్య దీక్షతో తపము చేయు చుండెను. ఒకనాడు అతను సరస్సునందు స్నానము చేయుచుండగా ఊర్వశి ఆతని అందమునకు మెచ్చి తన హావభావములను వ్యక్తపరచెను. ఆతనికి అప్రయత్నముగా స్కలనము జరిగి వీర్యము సరస్సునందు కలిసెను. అప్పుడే దప్పికతో అటుగా వచ్చిన ఒక మృగము ఆ అమోఘ వీర్యము కలిసిన నీటిని త్రాగి గర్భము ధరించెను. ఈ మృగము పూర్వము ఇంద్ర సభయందు ఒక నర్తకి, ఇంద్రుని శాపవశమున మృగము గా జనించెను.
కొంత కాలమునకు ఆ మృగము మనిషి రూపము ఉన్న బాలుని కని తన శాప విమోచనము పొంది ఇంద్ర సభకు వెళ్ళిపోయెను.మృగము నాకు పుట్టుట వలన ఆ బాలునకు నెట్టి మీద ఒక కొమ్ము ఉండెను, అందువలన అతనిని ఋష్యశృంగుడు అని పిలువబడు చుండెను. ఒకనాడు విభాండకుడు ఆ బాలుని చూచి దివ్య దృష్టితో చూచి తన కుమారుడే అని తెలుసుకొని పెంచ సాగెను.అప్పటినుండి ఋష్యశృంగుడు బాల్యము నుండి ఆశ్రమము తప్ప ఏమియూ తెలియక ఘోర తపస్సు చేయుచుండెను.అతని తపో నిబ్బరము నాకు మెచ్చి ఇంద్రుడు యీతడు ఎచ్చట ఉన్నచో అక్కడ సస్యశ్యామలమై, ప్రజలు సుఖ శాంతులతో ఉండెదరు అని వరము ఇచ్చెను.
ఇలా ఉండగా వంగ దేశమును పరిపాలించు రోమ పాదుడు అను రాజుకు సంతానము లేదు. దశరధుడు ఈయన మంచి మిత్రులు. ఒక రోజున రోమపాదుడు అయోధ్యకు వచ్చి మిత్రుడు దశరధుని కలిసి వారి కుమార్తె అయిన శాంత ను చూసి ఆమె తెలివి తేటలకు ముచ్చటపడి తనకు పెంపు ఇమ్మని కోరెను. దశరదునకు వేరే బిడ్డలు లేకపోవుట వలన అంగీకరించలేదు.పక్కన ఉన్న వసిష్ఠ మహర్షి చూసి బిడ్డను వారికి ఇచ్చుట వలన ఇరువురికీ పుత్ర సంతానము కలిగి మేలు జరుగును అని చెప్పెను. అందులకు రాజులిద్దరూ ఒప్పుకుని ఆరు నెలలు ఒకరి దగ్గర ఇంకో ఆరు నెలలు మరొకరి దగ్గర ఉండునట్లు అంగీకరించుకొనిరి.
తరువాత రోమపాదుడు పుత్ర సంతానము కొఱకు బ్రాహ్మణులకు విరివిగా దానములు ఇచ్చు చుండెను.ఒకనాడు ఒక బ్రాహ్మణుడు దానము తీసుకుని, పుత్రుని కూడా తీసుకు వచ్చి ఇతనికి ఒక గోవును దానమివ్వమని అడిగెను. అందులకు రోమపాదుడు కోపించి మీ వంటి బ్రాహ్మణులకు ఎంత దానము ఇచ్చినా సంతృప్తి ఉండదు అని తూలనాడెను. అందులకు ఆ బ్రాహ్మణులు కోపించి నీ రాజ్యమున వర్షములు లేక కరవు కాటకములు వచ్చును అని శపించి వెళ్ళిపోయెను. రాజు దిగులుతో ఏమిచేయవలయును అని ఇతర పండితులను అడుగగా వారు ఋష్యశృంగుని మన రాజ్యమునకు తీసుకు రమ్మని చెప్పెను.
రోమపాదుడు అందుకు అంగీకరించి కొందరు వారకాంతలను పంపెను. వారు విభాండకుడు ఆశ్రమమున లేని సమయము చూసి ఋష్యశృంగుని కలిసెను.అప్పటి వరకూ స్త్రీలను చూడని ఋష్యశృంగుడు వారు కూడా తోటి ముని కుమారులని తలచి ఆహ్వానించెను.వారు అతనిని నృత్యగీతములతో ఆనందింప చేసి తమ ఆశ్రమము దగ్గరనే ఉన్నది అక్కడకు వచ్చి తపము చేయుమని కోరెను. ఇంతలో విభాండకుడు వచ్చు సమయము అయినదని వెళ్ళిపోయారు. విభాండకుడు వచ్చిన పిదప ఋష్యశృంగుడు జరిగిన వృత్తాంతము తెలుపగా వచ్చిన వారు రాక్షసులు అయి ఉండవచ్చు జాగ్రత్త అని చెప్పెను, మరుదినము విభాండకుడు బయటకు వెళ్ళిన తరువాత ఆ స్త్రీలు మరల వచ్చి తమతో ఋష్యశృంగుని రమ్మని కోరగా ఆతడు వారితో వెళ్ళెను. వారు రోమపాదుని రాజ్యము చేరగానే ఆతని మహిమ వలన కుంభవృష్టి కురిసెను.
ఋష్యశృంగుడు అచటనే ఉన్న శాంత ను చూసి ఆమె అద్భుత సౌదర్యమునకు మెచ్చి ఆమెను వివాహమాడ వలెనను తన కోరిక తెలిపెను.ఆమెకు బ్రాహ్మణునితో మాత్రమె వివాహము చేయవలెను అను పరశురాముడు ఆజ్ఞా పించుటవలన రోమపాదుడు వారిద్దరికీ వివాహము జరిపించెను.
తదుపరి రోమపాదునిచే పుత్రుల కొఱకు ఋష్యశృంగుడు ఇంద్రుని గూర్చి తపము చేయగా ఇంద్రుడు మెచ్చి వారి కోర్కె నెరవేర్చెను.
ఇంతలో అయోధ్య యందు దశరధుడు పుత్రకామేష్టి యాగము చేయవలెనని వసిస్టుల వారిని కోరగా ఆయన ఋష్యశృంగుని పిలువమని చెప్పెను. అంత దశరధుడు రోమపాదుని ఇంటికి వెళ్లి చూడగా ఋష్యశృంగుడు, శాంత లు అపరిమిత కాంతిచే విరాజిల్లుచుండెను.అంత దశరధుడు వారిని పూజించి తన ఇంటికి ఆహ్వానించెను. అందులకు వారు ఒప్పుకొని అయోధ్యకు వెళ్ళెను.
శాంతా ఋష్యశృంగులు అయోధ్య ప్రవేశించుసరికి అక్కడ ప్రజలు అందరూ అద్భుతముగా స్వాగతము పలికిరి, రాజ ప్రాసాదము చేరుసరికి ముత్తయుదువులు హారతులు పట్టిరి. దశరధుడు ఎదురువచ్చి గౌరవముగా దంపతులు ఇద్దరినీ రాజమందిరమునకు తీసుకొని వెళ్ళెను. పుణ్య స్త్రీలు శాంత ను అంతఃపురము నకు తీసుకుని వెళ్ళగా కౌసల్య,కైకేయి, సుమిత్ర మహదానంద పడి అమ్మా శాంతా ఇప్పుడు నీవు ఋషి భార్యవు, మాకు పూజనీయురాలవు అని సరసములు ఆడగా ఆమె కూడా నవ్వుకొనెను. అంత దశరధుడు తన మనస్సులోని మాట తెలిపి పుత్రాకామేష్టి యాగము చేయవలెను అని ఋష్యశృంగుని కోరెను. అందులకు ఋష్యశృంగుడు అంగీకరించగా, దశరధుడు వసిష్ఠ మహర్షి కి చెప్పి సరయూ నదీ తీరమున యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేసెను.అంత యజ్ఞపు అశ్వమును విడువగా సంవత్సరమునకు అది తిరిగి వచ్చెను. అంత దశరధుడు గురువు గారు అయిన వాసిష్ఠుల వారితో యజ్ఞ భారము మొత్తము ఆయనకు అప్పగించెను.అంత వసిష్టాది మునులు ఋష్యశృంగుని ఆధ్వర్యమున యజ్ఞము పూర్తి చేసిరి.అంత దశరధుడు ఋష్యశృంగుని చేరి తమ ఆధ్వర్యమున యజ్ఞము నిర్విఘ్నముగా జరిగినది, ఇక పుత్రకామేష్టి జరుపవలసినడిగా కోరెను. ఋష్యశృంగుడు అందులకు అంగీకరించి మంత్రములతో ఆహూతులను అగ్నికి ఆహ్వానించు చుండగా ఆ యజ్ఞ పురుషుడు ఒక పవిత్ర పాయస పాత్రను ఇవ్వగా ఋషి ఆ పాత్రను దశరధునకు ఇచ్చి భార్యలకు పంచి ఇవ్వమని చెప్పెను.వారు సంతోషముగా ఆ పాయసము సేవించగా తదుపరి వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించిరి.
తరువాత ఋష్యశృంగుడు సతీ సమేతుడయి తిరిగి విభాండకుని ఆశ్రమమునకు వెళ్ళెను.విభాండకుడు కొడుకు యొక్క గొప్పతనము తెలిసుకొని ఇరువురినీ ఆశీర్వదించెను. తదుపరి వారికి చతురంగుడు అను పుత్రుడు కలిగెను.
ఋష్యశృంగుడు ఒక స్మృతి కర్తగా కనుపడుచున్నాడు. అందు వివిధ శ్రార్ధ కర్మలు, అసౌచ ప్రాయశ్చిత్తములు ఉన్నవి అని తెలియు చున్నది.
ఋష్యశృంగుడు ఉత్తమ తపస్సంపన్నుడయి శ్రీ రామచంద్రుని వంటి మహనీయుడిని లోకమునకు అందించిన మహా ఋషిగా పేరు గాంచెను.
No comments:
Post a Comment