సామ్రాజ్ఞి – 9 - అచ్చంగా తెలుగు
సామ్రాజ్ఞి – 9
భావరాజు పద్మిని
 

(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె  ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మతో మల్లయుద్దంలో గెలిచి, అతని రాజ్యం అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది ప్రమీల. రాజ నియమాల ప్రకారం అతను విలాసపురుషుడిగా మార్చబడతాడు. పరిణామ, వ్యాఘ్ర  సరోవరాలలో మునిగిన యాగాశ్వం పులిగా మారిపోవడంతో, దిక్కుతోచక శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటాడు అర్జునుడు. కృష్ణుడు ప్రత్యక్షమై యాగాశ్వానికి పూర్వపు రూపును తెప్పించి, ఆర్జునుడిని దీవించి, మాయమౌతాడు. పంపా నదీ తీరాన సీమంతినీ నగరాన్ని కావలి కాస్తున్న వారికి దొరుకుతుంది ధర్మరాజు యాగాశ్వం. దాన్ని సామ్రాజ్ఞి తన అశ్వశాలలో కట్టేయించి, యాగాశ్వం కావాలంటే తనతో యుద్ధం చేసి, విడిపించుకోమని, తన దండనాయకి వీరవల్లితో అర్జునుడికి లేఖ పంపుతుంది. తమ రాజ్యంలోని వివిధ బలాబలాలను గురించి అర్జునుడి సర్వసేనానియైన ప్రతాపరుద్రుడితో చెబుతూ ఉంటుంది వీరవల్లి. ఈలోపు విదూషకుడు చతురుడు అక్కడికి వచ్చి, వారికి వినోదాన్ని కల్పిస్తాడు. వీరవల్లి ద్వారా సామ్రాజ్ఞికి ఒక లేఖను పంపుతాడు అర్జునుడు. ఇక చదవండి...)
“జయము జయము సామ్రాజ్ఞి ! మహారాజు అర్జునుల వారు మీకు ఈ లేఖను అందించమని పంపారు. చిత్తగించండి.” అంటూ వంగి నమస్కరిస్తూ లేఖను అందించింది వీరవల్లి.
తమ రాజ్యంలో ఏ కీలకమైన నిర్ణయమైనా తీసుకునేది తన గుర్విణి శక్తిసేనే కనుక ఆమెకు ఆ లేఖను అందించింది సామ్రాజ్ఞి. అందులో ఇలా రాసి ఉంది.
“ స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీలకు వందనం.
యాగాశ్వాన్ని నిర్బంధించడం గురించిన మీ లేఖ అందింది. యుద్ధం చేసి అశ్వాన్ని విడిపించుకోమన్న మీ సందేశమూ అందింది. మాతో తలపడేందుకు తగిన శక్తి యుక్తులు సీమంతినీ సామ్రాజ్ఞికి, సేనకు నిస్సందేహంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము.”
ఈ మాట చదువుతూ, ఒక్క క్షణం ఆపి, గర్వంగా సభికుల వంక చూసింది గుర్విణి శక్తిసేన. అందరి వదనాల్లో ఆనందం ప్రస్ఫుటిస్తోంది.
“అయితే మీకు చిన్న మనవి. కురుపాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన రక్తపాతానికి ఉపశమనంగా మా అన్నగారు, హస్తినాపుర రాజైన ధర్మరాజు ఈ అశ్వమేధ యాగాన్ని తలపెట్టిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. మేము యాగాశ్వ సంరక్షణకు బయలుదేరే ముందే, వీలైనంతవరకు యుద్ధాలను, రక్తపాతాన్ని వర్జించమని, స్త్రీలతో, వృద్ధులతో, పిల్లలతో యుద్ధాలు చేయరాదని మా అన్నగారు మమ్ములను ఆజ్ఞాపించి పంపినారు. పాలకుల విజయ దాహానికి చరిత్రలో ఎన్నో ప్రాణాలు సమిధలుగా మారిన సంగతి మీకు విదితమే ! అందుకే మీరు అనుమతిస్తే, సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోడానికి,  రాయబార చర్చలకుగాను, పరివార సమేతంగా మీ సముఖానికి విచ్చెయ్యాలని, మీ రాజ్యంలోని వింతలను విశేషాలను చూడాలని, మేము కోరుకుంటున్నాము. మీ నుంచి సానుకూలమైన జవాబును ఆశిస్తూ,
హస్తినాపుర పాలకుడు, పాండవ మధ్యముడు
అర్జునుడు.”
లేఖను చదివి, ఒక్క క్షణం ప్రమీల వంక ఆమె అభిప్రాయం కోసం చూసింది గుర్విణి.
“మీరే తగిన విధంగా సూచించండి గుర్విణీ ! మీ ఆజ్ఞ మాకు శిరోధార్యం !” నమస్కరిస్తూ అంది గుర్విణి.
“చరిత్రలో మన స్త్రీ సామ్రాజ్య వైభవం కలకాలం నిలవాలంటే, ఇటువంటి రారాజులు, రాయబారులు మన దేశాన్ని తప్పక దర్శించవలసిందే ! అర్జున పరివారాన్ని చర్చలకు రమ్మని సాదరంగా ఆహ్వానం పంపండి !” అంది సాలోచనగా గుర్విణి.
వెంటనే ఆహ్వాన లేఖ అర్జునిడికి ఒక దూత ద్వారా పంపబడింది.
***
సీమంతిని సామ్రాజ్య పొలిమేరల నుంచి, అర్జున పరివారం వారి రాజధాని దిశగా బయలుదేరింది. పడమటి కనుమల్లో ఎక్కడ చూసినా కొండలు, కొనలు, విరబూసిన వనాలు, సెలయేళ్ళతో మనోజ్ఞంగా ఉంది ప్రకృతి. లేఖతో పాటు వారికి పంపిన రేఖాచిత్ర పటంలో ఆ రాజ్యాన్ని చేరుకునేందుకు తగిన దిశా నిర్దేశాలు సూచించబడి ఉన్నాయి.  త్రోవ మధ్యలో మధ్య మధ్య విశ్రాంతి తీసుకుంటూ, తిరిగి పయనిస్తూ సాగింది వారి ప్రయాణం. సీమంతినీ రాజధాని చేరేందుకు దాటవలసిన చివరి కొండ అదే ! ఆ కొండ చాలా ఎత్తుగా, వాలుగా ఉండడంతో గుర్రాలు దిగి, వాటిని నడిపించుకుంటూ పయనించసాగారు వారు. దూరంగా ఎత్తైన కోట గోడ , పహారా కాస్తున్న స్త్రీ సైనికులు కనిపించారు.
కాస్త ఎగువకి రాగానే కనిపించిన దృశ్యం చూసి, అంతా బొమ్మల్లా నిలబడిపోయారు.
“ఆహా ! ఎంతటి  మేధోసంపత్తి ఈ సామ్రాజ్య నిర్మాతలకి ! “ లోపల అనుకోబోయి బయటికే అనేసాడు అర్జునుడు.
“అవును మహారాజా ! అందని ద్రాక్షా పుల్లన !” అన్నట్టు ఈ ‘పుల్ల సరోజ నేత్రలైన ‘ స్త్రీలు ఎవరికీ అందకుండా తమ రాజ్యాన్ని నిర్మించుకున్నారు. “ వెంటనే అన్నాడు విదూషకుడు చతురుడు.
ఆ మాటలకు నవ్వుతూ, “విషయం అందుబాటు, పుల్లదనం గురించి కాదు చతురా ! మేధోసంపత్తితో రాజ్య నిర్మాణానికి వీరు ఎంచుకున్న ప్రదేశం నాకు అమితాశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ రాజ్యాన్నైనా పటిష్టం చేసేవి ఆ సామ్రాజ్య ప్రహరీలే. సాధారణంగా ఒక రాజధానిని ఎంచుకునేటప్పుడు రాజులు, వాస్తు శిల్పులు కొన్ని అంశాలను పరిశీలిస్తారు. నగరంలో ఉండబోయే ప్రజలకు తాగు నీరు, ఇతర అవసరాల కోసం జీవనది అందుబాటులో ఉండడం, ఆహార అవసరాలకు, వంట చెరుకుకుతగిన  వనరుల లభ్యత, శత్రువులకు దుర్భేద్యంగా ఉండేలా, ఏ ప్రక్క నుంచి చొరబాటుదారులు వచ్చినా పైనుంచి గమనించి తరిమికొట్టేలా పహారా కాసేందుకు తగిన గుప్త స్థానాలు... వాస్తు... ఇలా విజయం దిశగా రాజ్యాన్ని నడిపించే అనేక అంశాలను వారు పరిశీలిస్తారు.
అటు చూడండి. ఆ రాజ్యానికి మూడు వైపులా పెద్ద కందకంలా పంపా నది ఆవరించి ప్రవహిస్తూ రక్షిస్తోంది. అంటే, ఆ రాజాన్ని చేరుకోవాలంటే, ఖచ్చితంగా ఈ నదిని దాటాలి. నదీ తీరం వెంట కాపు కాస్తున్న ఆ పహారా సైనికురాళ్ళ కన్ను గప్పాలి. మరో వైపున ఈ ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ ఎక్కేందుకు మనం ఎంత కష్టపడుతున్నామో చూడండి ! ఆ రాజ్యాన్ని చేరుకోవాలంటే, శత్రువులకు ఎంత కష్టమో ఊహించండి. పైగా దూరం నుంచి కనిపిస్తున్న ఆ స్వర్ణ ప్రాకారాలు శుభ సూచకంగా తూర్పు దిశకు తిరిగి ఉన్నాయి. అంటే రక్షణ పరంగా, వాస్తు పరంగా, అన్ని విధాలుగా అత్యంత యుక్తితో ఈ సీమంతినీ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆసేతు హిమాచలం పర్యటించాము కాని, ఇటువంటి సామ్రాజ్యాన్ని, మేము చూడలేదు...” అని అర్జునుడు చెబుతూ ఉండగానే, దూరంగా స్వాగత దుందుభులు మ్రోగడం వినిపించింది.
“విన్నారా ! అంత దూరం నుంచే వారు మన రాకను గమనించినట్లు ఉన్నారు. మనకు స్వాగతం పలుకుతూ దుందుభులు, కొమ్ము బూరలు ఊదుతున్నారు. భళా ! ఏమి పాలనా దక్షత !” అన్నాడు అర్జునుడు.
వారు నెమ్మదిగా కొండ దిగి వస్తూ ఉండగానే, తమ సైన్యం, అశ్వాలు, గజబలం పంపా నదిని దాటి ప్రయాణించేందుకు అనువైన పెద్ద పెద్ద పడవలు నది దాటి, తమవైపుకే వస్తూ ఉండడం వారికి కనిపించింది.
ఆ పడవలన్నీ రంగురంగుల పూలతో అలంకరించబడి, దూరానికి నీటిపై తేలే రాజ హంసల లాగా కనిపించసాగాయి. పడవల తెరచాపలకు, వారు వీరవల్లి తెచ్చిన లేఖలో చూచిన స్త్రీ సామ్రాజ్య చిహ్నం ముద్రించబడి గాలికి రెపరెపలాడుతూ  ఉండడం కనిపిస్తోంది. ఈలోపల అర్జునుడికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే ఆగి, తన సైన్యానికి ఎలా చెప్పసాగాడు.
“ సేనా నాయకులారా ! సైనికులారా ! ఒక ఫలం బయటకు ఎంతగా పరిపక్వమై కళకళ లాడుతూ కనిపిస్తున్నా, అది విషఫలమని తెలిస్తే మనం వర్జిస్తాము కదా ! తినే ప్రయత్నం చెయ్యము కదా ! అలాగే స్త్రీ సామ్రాజ్య స్త్రీలు కూడా, వారి రాజ్యంలో ఉన్నంతవరకు ఒక విధంగా విష కన్యలే. వారితో సంగమించిన ఏ పురుషుడు నెల రోజులకు మించి బ్రతకడని, పార్వతి దేవి శాపం ఉంది. అందుకని, అక్కడి స్త్రీలు ఎన్ని వగలు చూపినా, ఎంత అందంగా ఉన్నా మనం చలించకూడదు. ప్రాణాలపై ఆశ ఉన్నవారు నా సూచనను గుర్తుంచుకోండి ! మనం వెళ్ళేది వారితో చర్చలు జరిపి, మన యాగాశ్వాన్ని వెనక్కు తెచ్చుకోడానికే అని మర్చిపోకండి !” గంభీరంగా చెప్పాడు అర్జునుడు. వెంటనే ఏదో తెలియని భయం అందరినీ ఆవరించింది. అది గమనించి,
“భయపడాల్సిన పనేమీ లేదు. మనం మార్గంలో ఎన్నో కీకారణ్యాలు దాటాము, ఎన్నో వింతలూ, విశేషాలు, ప్రమాదాలు చూసాము కదా ! వాటిలో ఇదీ ఒకటి అనుకోండి.   ముఖ్యంగా స్త్రీ సామ్రాజ్య స్త్రీలు వారిని వారు బలహీనులుగా భావించరు. ఒక రకంగా వారూ మగవారితో సమానమే ! పొరపాటున కూడా వారికీ సాయం చెయ్యాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళకండి. అలాచేస్తే అనవసరంగా మనం వారి కోపాన్ని రుచి చూడాల్సి ఉంటుంది. స్త్రీలు చూపే ప్రలోభాలకు లొంగకండి, బాగా గుర్తుంచుకోండి. “ అని తిరిగి వారికి ధైర్యం చెప్పాడు పార్ధుడు.
వారంతా తిరిగి పయనం కొనసాగించి, మధ్యాహ్నం అవుతుండగా నెమ్మదిగా ఆ కొండ దిగువన ఉన్న పంపా తీరానికి చేరుకున్నారు. వారికి రకరకాల ఆహారాలతో రాజసమైన భోజనం, పానీయాలు అందించి, తగిన మర్యాదలన్నీ చేసారు స్త్రీ సామ్రాజ్య సిబ్బంది. అప్సరసల్లా అద్భుతంగా అలంకరించుకున్న వారు, మామూలు స్త్రీల కంటే, ఎత్తుగా, ధృడంగా కనిపిస్తున్నారు. వారు వంటికి రాసుకున్న అత్తర్ల పరిమళం అర్జున సేనను వివశుల్ని చేస్తోంది. కళ్ళు చెదిరిపోయే అందంతో ఉన్న వారి సౌష్టవం చూచి కళ్ళు తిప్పుకోలేక అవస్థ పడుతున్న తన సేనను గమనించి, వారికి అర్ధమయ్యేలా తన ఎర్రటి అంగవస్త్రాన్ని తీసి వేసుకుంటూ, ప్రమాద సంజ్ఞ చేసాడు అర్జునుడు.  ఆ తర్వాత వారిని తమ పడవల పైకి ఎక్కించుకుని, స్త్రీ సామ్రాజ్య దిశగా తెడ్లు వేస్తూ వారిని తీసుకుని వెళ్ళసాగారు.
స్వచ్చమైన స్పటికంలా ఉన్న ఆ పంపా జలాలను, లోపల కనిపిస్తున్న జలచరాలను చూస్తూ, కొండ పూల పరిమళాలు నింపుకున్న చల్లటి ఆ సాయంత్రపు గాలికి సేద తీరుతూ, పయనించసాగారు. ఆ తెడ్లు వేసే స్త్రీల జబ్బల సత్తువకు ఆశ్చర్యపోసాగారు అర్జునసేన. అంత చల్లటి గాలిలోనూ శ్రమకు చెమటలు కక్కుతున్నా, ఏ మాత్రం నీరసం కనిపించట్లేదు వారి వదనాల్లో! నది పైన ఆకాశంలో గుంపుగా ఎగురుతున్న తెల్లని కొంగలు, ఆకాశంలో పూసిన కొండమల్లె పూవుల్లా ఉన్నాయి.
(సశేషం)




No comments:

Post a Comment

Pages