శివమ్మ కధ – 2 - అచ్చంగా తెలుగు
శివం- 27 
( శివుడే చెబుతున్న కధలు)
శివమ్మ కధ – 2
రాజ కార్తీక్
 9290523901

ఇదివరకు లాగా శివమ్మ గుడికి రాలేదు. ఆమెకు అంతా నేనె, ఆమెకు తెలుసు కైలాసవాసా!అని పిలిస్తే ఆలస్యంగా వస్తాను ఏమో గాని శివయ్యను నా దగ్గర ఉన్నావు, నాలో ఉన్నావుఅంటే మాత్రం వెంటనే  వస్తా ...
క్రమంగా శివమ్మ భక్తి నన్ను పులకింపచేస్తుంది, తన మనసు నిశ్చలమయ్యింది. అన్ని బంధాలను దాటింది ...ఈ వయసులో కూడా ఆమె ఉన్న కోరిక ఒక్కటే...

కార్తిక పౌర్ణమి .....ఎట్లాగో వేరొకరి సాయంతో గుడికి వచ్చింది ....
అందరి భజనలు విని ఆనందపడింది. అందరు ఉపవాసాలు ఉండి నన్ను స్మరిస్తున్నారు.
శివమ్మ "శివయ్య తండ్రి ! అందరి లాగా నేను నిద్ర కాచి జాగారం చెయ్యలేను ,కనీసం ఉపవాసం  కూడా  ఉండలేను ,నన్ను క్షమించు " అంది.

"అరె శివమ్మత్త ఇక్కడ ఉండలేదు కానీ వెళ్లి ఇంట్లో దించండి "అని పురమాయించారు ఒకరు.

అలాగే శివమ్మ " శివయ్య! నా కోసం ఒక్కసారి భౌతికంగా కనపడు, ఇన్నాళ్ళూ నాలోనే 
ఉన్నావనుకున్నాను. ఈ కళ్ళ తో నిన్ను చూస్తే అప్పుడే  కదా నిజమైన ధన్యత ,శివయ్య నేను ఎప్పుడూ  నిన్ను ఏమి కోరుకోలేదు. నాకోసం ఒక్కసారి రావయ్యా ! మనం మన బిడ్డల నుండి ఏమి కోరుకోము, వారి మీద ప్రేమ మాత్రమే చూపిస్తాము, నాకు స్వార్ధం అంటూ ఏమన్నా ఉంటే అది నిన్ను ప్రేమించటమే, ఎందుకంటే అదొక్కటే నాకోసం నేను చేసుకునేది  "అని ప్రాధేయపడింది . 

శివమ్మను అతగాడు ఒక బండి ఎక్కించుకొని లాక్కుంటూ తీసుకువెళ్తూన్నాడు. అంతలో సుడి గాలి వచ్చింది ..ఉండి ఉండి భోరున వర్షం ..మెరుపులు ...ఊరుములు..ఈదురుగాలులు....

బండి లాగేవాడు "అమ్మగారు, మీరు ఒక్కరే  కదా అని గుర్రాలను కట్టకుండా నేనే లాక్కుంటూ వచ్చాను .ఇప్పుడు మనం ముందుకు పోలేము ,వెనక్కి పోలేము ,తలదాచుకోడానికి కూడా చోటు లేదు,అయ్యో "అని బాధపడ్డాడు.
శివమ్మ "మనల్ని ఇక్కడికి తీసుకువచ్చిన శివుడు మళ్ళీ ఎక్కడికి చేర్చాలో చేరుస్తాడు "అంది నిబ్బరంగా.

కానీ గాలులు మాత్రం ఆగలేదు ..భోరున వర్షం పెద్దది అయ్యింది ...
అతగాడు భయపడిపోతున్నాడు. శివమ్మ మాత్రం నన్ను తలచుకుంటూ ఉంది ...
నమ్మకానికి నేను తప్పక వచ్చి తీరాలి కదా !ఎందుకంటే గుడ్డి నమ్మకమేగా నన్ను కట్టేసేది.


పెద్ద శబ్దం ...కళ్ళు మూసుకుంది శివమ్మ....అంతా చీకటి...

కొన్ని నిమిషాల తర్వాత....
శివమ్మ కళ్ళు తెరచింది .ఆమెకు బండిపడిపోవటం ..బండి లాగేవాడు స్పృహ తప్పడం వరకు గుర్తు ఉంది. తను కింద పడపోయే ముందు, “శివయ్య!అని గట్టిగా కేక వేయటం గుర్తుంది.ఆ తర్వాత అన్నీ క్షణాల్లో  జరిగినాయి.
మరి బండి ఎవరు లాక్కెళ్ళుతున్నారు?” అని ఆశ్చర్యంగా చూస్తుంది ఆమె.
ఆమె కళ్ళు తుడుచుకుంటుంది .తను కుర్చున్న చోటునుండి లాగే వాడికి  త్రిశూలం ఉందని గమనించింది.  
ఇంకా తల పైకి ఎత్తి చూసింది ..కంటికి అన్ని జటాజూటాలు కనపడుతున్నై. అదేంటో ఎంత పెద్ద వర్షమో కానీ శివమ్మ మీద ఏమి పడట్లేదు ..

అందమైన ప్రేమ స్వరం "అమ్మా! నేను వచ్చాగా.  నిన్ను ఇంటికి జాగ్రత్తగా చేరుస్తాగా. రోజూ నీతోనే ఉంటా ఎందుకు భయం నేను ఉండగా .."
శివమ్మ "ఎవరూ? శివయ్య, నువ్వా...నువ్వేనా... వచ్చావా. నా తండ్రి" అని ఏడుస్తుంది. 
నేను "చూడమ్మా వీళ్ళందరూ  ఉపవాసం ఉన్నారు, నాకేం పెట్టలేదు. నువ్వైతే నాకు ఎప్పుడు నైవేద్యం పెడతావ్ . ఏది తిన్నా పెడతావ్. అసలు నువ్వు చేసినట్టు వంట చెయ్యడం ఎవరి వల్లా కాదు "అన్నాను.
నేను అచ్చు ఆమెతో ఆమె  కొడుకు లాగానే  మాట్లాడుతున్నా చనువుగా..
శివమ్మకి ఏమి అర్ధం కావటం లేదు ...
నేను "అమ్మ, నేను మాట్లాడుతున్నా నాతో మాట్లాడవా ..రోజు మాట్లాడతావ్ కదా, నన్ను కొడుకులాగా పెంచుకోవాలి అని అనుకున్నావుగా  " అన్నాను.
శివమ్మ మనసులో తను కోరుకున్న కోరిక నాకెలా తెలిసింది అనుకుంటోంది.
అప్పుడే ఒక మెరుపు మెరిసింది . ఆ వెలుగులో ఫెళ్ళు ఫెళ్ళు న అంధకారం తొలగిపోయింది ..
ఆమె రెండు కళ్ళతో నన్ను తదేకం గా చూసింది..
శివమ్మ "స్వామి ఈ నీ భక్తురాలి కోసం నువ్వే వచ్చావా తండ్రి.. నీ కోసం యుగయుగాలు  తపస్సు చేస్తారు.. నీ విగ్రహాన్ని బంగారు రధంలో ఊరేగిస్తారు .కానీ నువ్వు నా కోసం వచ్చి నన్ను లాక్కెళ్ళుతున్నావా  తండ్రి" అంది కన్నీళ్ళతో.
నేను "అదేంటమ్మా! అమ్మ కోసం బిడ్డ రాడా..అందుకే  వచ్చానమ్మా ! ఏ నిమిషంలో నీకు పేరు పెట్టారో కానీ శివమ్మ అని దాన్ని సార్ధకత చేసుకున్నావ్..."అన్నాను.
బండి ;లాక్కెడుతూ నేను మాట్లాడుతున్నాను.
"భక్తులు ఎలా తలిస్తే అలా కనపడే వాడిని నేనునిరాకారంగా ఐనా ,సాకారంగానైనా ,తండ్రి గా అయినా ,తల్లిగా అయినా కొడుకుగా ఐనా " అన్నాను.
శివమ్మ "శివయ్య, నీ చేత చేయించకూడని పని చేయిస్తున్నాను ,నువ్వు నాకు సపర్యలు చేస్తే ఎలాగా " అని బాధపడింది.
 నేను "నేను నీ నమ్మకం నిలబెట్టాలి కదామ్మ ,అందుకే నిన్ను కాపాడి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తా" అన్నాను.
ఇంతలో శివమ్మ ఇల్లు వచ్చింది ..
ఆ బండి నుండి దిగిబోయింది ..
నేను "అమ్మా, నేను వస్తాను ఉండు, దిగకు  జాగ్రత్త !" అని పరిగెట్టాను.
శివమ్మను జాగ్రత్తగా కిందకు దించాను.
ఇప్పుడు శివమ్మ చేతులతో నా మొహం పట్టుకొని నన్ను తనివి తీర చూసింది.
ఆమె నన్ను చూస్తూ తన్మయత్వంతో నన్ను పట్టుకొని "నన్ను ఎంత కరుణించావు శివయ్యా .."అంటూ వాటేసుకుంది ...
అప్పుడే శివమ్మ నన్నో ప్రశ్న అడిగింది సందేహంగా...
(సశేషం)



No comments:

Post a Comment

Pages