శ్రీధరమాధురి
-38
(పిల్లల
పెంపకం గురించి పూజ్య గురుదేవుల అమృత వాక్కులు )
మీ పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా ఉండండి.
అప్పుడు వారు మీ సాంగత్యాన్ని ఇష్టపడుతూ, తప్పుడు చేతుల్లో పడకుండా ఉంటారు.
***
చాలా సార్లు పిల్లల గురించిన ఒక
భయం తల్లిదండ్రులను తొలుస్తూ ఉంటుంది. వారి అతిగా పిల్లల్ని నియంత్రిస్తూ,
ప్రస్తుతం బయట పరిస్థితులు తమను ఆ విధంగా వ్యవహరించేలా చేస్తున్నాయని చెబుతుంటారు.
నా అనుభవంలో, ఆ విధంగా అతిగా నియంత్రించి పెంచిన పిల్లలు మానవ స్పర్శ లేని డబ్బు సంపాదించే యంత్రాలు అవుతారు, లేక
తల్లిదండ్రులకు తెలియకుండా అనైతికమైన పనులు చేస్తూ కొంత కాలం తర్వాత వారిని
అప్రతిష్ట పాలు చేస్తారు. ఇటువంటి విపరీతాలకి మూల కారణం తల్లిదండ్రుల్లో పాతుకుపోయిన భయమే ! అంతేకాక,
తల్లిదండ్రులు చూపేది సరైన మార్గమేనని నమ్మకంగా చెప్పలేము. వారు కూడా ఇతరులు
పాటించగా సఫలమైన ఏ మార్గాన్నో అనుకరిస్తూ ఉంటారు. ప్రతి బిడ్డా ప్రత్యేకమైనది,
అందరికీ ఒకే విధమైన పెంపకాన్ని, క్రమశిక్షణను అమలు పరచడం వీలుకాదు.
***
మీ పిల్లల్ని చదివించడం...
వాళ్లకు పెళ్లి చెయ్యడం...
అనేవి మీ బాధ్యతలు కావు. వారిపై
ఉన్న అవ్యాజమైన ప్రేమతో మీరివన్నీ చేస్తారు. అటువంటి దైవీకమైన పనులకు మీరు మీ ‘బాధ్యత’
అన్న పదం వాడినప్పుడు మీరు బలవంతంగా అవి చేస్తున్నట్లు అనిపిస్తుంది. నామటుకు ఇది
చాలా అధర్మమైనది, అభ్యంతరకరమైనది. మీ విలువను మీరు తగ్గించుకోకండి. ఈ విధంగా
మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఆలోచించి మాట్లాడండి.
***
మనలో కొంతమందికి మనకు మన పిల్లల
కంటే ఎక్కువ తెలుసనే భావన ఉంటుంది. అందుకే మనం విలువల పేరుతొ మనం అరువు
తెచ్చుకున్న ఈ ఆలోచనలు అన్నింటినీ పిల్లల మీద రుద్దుతాము. మనలో ఈ లక్షణం మటుమాయమయ్యే
దాకా, పిల్లలు ఈ నియమ నిబంధనల వల్ల బాధపడుతుంటారు. ఏదో ఒక సమయంలో కృంగిపోయి,
నిరర్ధకంగా జీవించడం మొదలుపెడతారు. కొన్ని సార్లు వారు తిరగబడి, కుటుంబాన్ని
శాశ్వతంగా వదిలేసి వెళ్తారు.
***
మీ పిల్లలను నిర్ణయాలు
తీసుకోనివ్వండి. ఆ నిర్ణయాలకు తగినట్లుగా వారినే బాధ్యత వహించనివ్వండి. ఇలా
చెయ్యడం వల్ల మున్ముందు వారు మంచి వ్యక్తులుగా తయారవుతారు.
***
నేను వారి ఇంటికి వెళ్లాను...
అతను తన కొడుకును నాకు మోకరిల్లమన్నాడు.
అతను – “గురూజీ కి నమస్కరించు’
కొడుకు తండ్రి చెప్పినట్టే చేసాడు.
అతను – “అభివాదయే “అని చెప్పు.
కొడుకు ‘అభివాదయే’ అన్నాడు.
అతను – ‘నాలుగు మార్లు కాళ్ళకు సాష్టాంగ నమస్కారం
చెయ్యి’
కొడుకు అలాగే చేసాడు.
అతను – ‘ఓ పాట పాడు’
ఆ కుర్రాడు ముత్తుస్వామి
దీక్షితార్ రాసిన ఒక చక్కటి కీర్తన పాడాడు.
అతను – ‘నీకు 6 గం.లకు ఐ.ఐ.టి
కోచింగ్ క్లాసు ఉంది, వెళ్ళు’
కుర్రాడు వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత అతను నన్ను అడిగాడు – ‘గురూజీ,
చూసారా, నేను ఎలా పెంచానో, సరైన నడవడి నేర్పించడం చాలా ముఖ్యం. దీని మీద మీ
ఆలోచనలు ఏమిటి?’
నేను నవ్వి ఇలా అన్నాను – ‘నాకు నీ
కొడుకు ప్రాణంతో ఉన్న రోబోలా అనిపించాడు.’
***
నాకు కొంతమంది పిల్లలు తెలుసు.
వారంతా బాగా చదువుకున్నారు. వారి కుటుంబాల్లో నియమ నిబంధనలతో పెరిగారు. కాని,
దురదృష్టవశాత్తూ చదువు లేక నియమ నిబంధనలు
వారు జీవితంలో నాణ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడలేవు. వారికి వారి
వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని గౌరవించడం తెలీదు. వారు భయంతో అనాసక్తంగా జీవిస్తూ
ఉంటారు.
***
మీ పిల్లలు మిమ్మల్నే పట్టుకు ఎక్కువ సేపు వేళ్ళాడుతూ
ఉండడాన్ని ప్రోత్సహించకండి. వారికి కూడా ఒక జీవితం ఉందని వారు తెలుసుకునేలా
చెయ్యండి. ఎవ్వరి మీద ఆధార పడకుండా జీవించడం నేర్పండి. వారిని స్వతంత్రంగా పెంచితే
మీ కుటుంబానికి దూరమైపోతారేమోనన్న భయాన్ని వీడండి.
***
తల్లి/తండ్రి బిడ్డ ఏ విధంగా
ప్రవర్తించినా కూడా వారిని శపించకూడదు.
***
పిల్లలను కోప్పడేటప్పుడు,
అప్రయత్నంగా కొన్ని మాటలు తల్లిదండ్రుల నోట్లో నుంచి వచ్చేస్తాయి. ఉద్దేశపూర్వకంగా
అనక పోయినా, ఇది పిల్లలకు శాపంగా మారే అవకాశం ఉంది. ఇది కూడా ఒకవిధమైన పితృ శాపమే
!
***
మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు,
ప్రవర్తించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. వారు మీ పిల్లలు. మీ రక్తం పంచుకు
పుట్టినవారు. కాబట్టి వారు చేసే పనుల్లో వారి తప్పు లేదు, వంశపారంపర్యంగా వచ్చిన
జీన్స్ లో ఆ లక్షణాలు ఉన్నాయి. కుటుంబంలో అవి ముందే ఉన్నాయని మీరు తెలుసుకోవాలి.
***
అతిగా పిల్లలను సంరక్షించే
తల్లిదండ్రులు ఆ పిల్లల ఎదుగుదలకు, భవిష్యత్తుకు అవరోధంగా తయారౌతారు.
***
మీ మాట జవదాటకూడదని పిల్లలపై
ఒత్తిడి తీసుకుని రాకండి. వారి స్వేచ్చను గౌరవిస్తూ, అనుభవపూర్వకంగా వారిని
ఎదగనివ్వండి.
***
మీ పిల్లలను నిర్ణయాలు తీసుకుని,
వాటికి బాధ్యతను వహించనివ్వండి. వారిని పూర్తిగా మీ మీదే ఆధారపడేలా చెయ్యకండి. అలా
చేస్తే వాళ్ళు బాధ్యత తీసుకోవడం కాదు కదా, నిర్ణయాలు తీసుకోవడం కూడా నేర్చుకోలేరు.
ఒక్కోసారి వారు తప్పుడు నిర్ణయాలు తీసుకుని, బాధ పడచ్చు. కాని, భవిష్యత్తులో మంచి
నిర్ణయాలు తీసుకునేందుకు అది పిల్లలకు కావలసిన అనుభవంగా మారుతుంది. తప్పుడు నిర్ణయాలు మంచి/మెరుగైన
నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన అనుభవాన్ని ఇస్తాయి. వారు జీవితాంతం ఎవరోఒకరి మీద ఆధారపడుతూ బ్రతకడం
మీకూ నచ్చదు కదా !
***
ఓం శ్రీగురుభ్యోనమః
ReplyDelete